ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 47


కాశ్మీర్ వివాదం పరిష్కారానికి సంబంధించి ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతాసమితి 1948 ఏప్రిల్ 21 న ఆమోదించిన తీర్మానమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 47. భారత, పాకిస్తాన్‌ల వాదనలు విన్న తరువాత భద్రతాసమితి, ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానం 39 ద్వారా ఏర్పాటు చేసిన కమిషను పరిమాణాన్ని ఐదుగురు సభ్యులకు (అర్జెంటీనా, బెల్జియం, కొలంబియా, చెకోస్లోవేకియా, అమెరికా ప్రతినిధులతో [1]) విస్తరించింది. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికీ, కాశ్మీర్ భవితవ్యాన్ని నిర్ణయించడానికీ ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం సిద్ధం చేసేందుకు గాను భారత, పాకిస్తాన్ ప్రభుత్వాలకు సహకరించేందుకు ఉపఖండానికి వెళ్లాలని భద్రతాసమితి ఈ కమిషన్ను ఆదేశించింది.

ఐరాస భద్రతాసమితి
తీర్మానం 47
తేదీఏప్రిల్ 21 1948
సమావేశం సం.286
కోడ్S/726 (Document)
విషయంభారత పాకిస్తాన్ సమస్య
ఫలితంఆమోదం

రెండవది, వివాద పరిష్కారం కోసం ఈ తీర్మానం మూడంచెల ప్రక్రియను సిఫారసు చేసింది. మొదటి అంచెలో, పోరాటం కోసమే కాశ్మీర్‌లోకి ప్రవేశించిన తన పౌరులందరినీ పాకిస్తాన్ ఉపసంహరించుకోవాలి. రెండవ అంచెలో, శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైన కనీస స్థాయికి భారత్, తన బలగాలను క్రమంగా తగ్గించాలి. మూడవ అంచెలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించేందుకు గాను భారత్ ఐక్యరాజ్యసమితి నామినేట్ చేసిన ప్రజాభిప్రాయ నిర్వాహకుడిని నియమించాలి.

తీర్మానం లోని ఒక్కో పేరానూ విడివిడిగా ఆమోదించారు; తీర్మానం మొత్తంపై ఓటింగు పెట్టలేదు.

భారత్, పాకిస్తాన్‌లు రెండూ ఈ తీర్మానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే, వారు ఐరాస కమిషన్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతించారు. కమిషన్ మధ్యవర్తిగా వ్యవహరించి, భద్రతా మండలి తీర్మానాన్ని విస్తరిస్తూ మరో రెండు స్వంత తీర్మానాలను స్వీకరించింది. వీటిని రెండు దేశాలూ అంగీకరించాయి. తదనంతరం, 1949 ప్రారంభంలో కమిషన్ కాల్పుల విరమణ సాధించ గలిగింది. అయితే, సైన్యాలను వెనక్కు తీసుకోవడంలో విభేదాల కారణంగా కమిషను సంధి సాధించలేకపోయింది. అనేక ప్రయత్నాల తరువాత, 1949 డిసెంబరులో కమిషన్ తన వైఫల్యాన్ని అంగీకరించింది.

నేపథ్యం

పూర్వపు జమ్మూ కాశ్మీరు సంస్థానపు మ్యాపు

1947 కి ముందు, జమ్మూ కాశ్మీరు (కాశ్మీరు) బ్రిటిష్ సామ్రాజ్యం లోని సంస్థానం. దీనిని హిందూ మహారాజా పాలించేవాడు. స్వాతంత్ర్యం తరువాత, బ్రిటిషు పాలన ముగుస్తుందని, సంస్థానాధీశులు రెండు కొత్త దేశాలలో ఏదో ఒకదానిలో చేరడానికి గానీ (" విలీనం"), స్వతంత్రంగా ఉండటానికి గానీ అవకాశం ఉందని బ్రిటిష్ వారు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ మహారాజా, తన సంస్థాన జనాభాలో జాతి, మతపరమైన మిశ్రమాన్ని అనుసరించి స్వతంత్రంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. [a]

రాష్ట్రంలోని పశ్చిమ జిల్లాల్లో తలెత్తిన తిరుగుబాటు, పాకిస్తాన్ నుండి పష్తూన్ తెగల సాయుధ దాడిల పర్యవసానంగా, 1947 అక్టోబరు 26 న మహారాజా తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసాడు. మరుసటి రోజే భారతదేశం విమానాల ద్వారా కాశ్మీర్లోకి సైనికులను దింపింది. అప్పటి నుండి, పరిశీలకులు చూపించిన గణనీయమైన సాక్ష్యాలు, ఆక్రమణలను ప్రేరేపించడంలోను, ఆక్రమణ దారులకు మద్దతు ఇవ్వడంలోనూ పాకిస్తాన్ జోక్యం ద్యోతకమైంది. సంస్థానంలో భారత దళాలు, పాకిస్తాన్ ఆక్రమణ దారుల మధ్యా పరిమిత యుద్ధం జరిగింది.

1948 జనవరి 1 న, ఐరాస 35 వ అధికరణం కింద భారతదేశం కాశ్మీరు వ్యవహారాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తీసుకువెళ్ళింది. అంతర్జాతీయ శాంతికి అపాయం కలిగించే విషయాలను సభ్య దేశాలు ఐరాస దృష్టికి తీసుకురావడానికి ఈ అధికరణం వీలు కల్పిస్తుంది. భారత భూభాగమైన జమ్మూ కాశ్మీర్‌పై పాకిస్తాన్ జాతీయులు, గిరిజనులు దాడి చేశారని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ తన చర్యలను కొనసాగించకుండా నిరోధించాలని భద్రతా మండలిని అభ్యర్థించింది. సంస్థానం చట్టబద్దంగా విలీనం అయినప్పటికీ, ప్రజల కోరికను ధ్రువీకరించడానికి ప్రజాబ్జిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) చేసేందుకు, దాని ఫలితాలకు కట్టుబడి ఉండేందుకూ సిద్ధంగా ఉన్నట్లు భారతదేశం పేర్కొంది. దీనికి స్పందనగా పాకిస్తాన్, ఈ సంఘర్షణలో తాను జోక్యం చేసుకుంటున్నానే వాదనను ఖండించింది. భారతదేశం "మోసపూరితంగా, హింస" ద్వారా సంస్థానాన్ని విలీనం చేసుకుందనీ, ముస్లింలపై "మారణహోమం" నిర్వహిస్తోందనీ కూడా ఆరోపించింది. [3]

1948 జనవరి 20 న, భద్రతామండలి తీర్మానం 39 ని ఆమోదించింది. ఇరుదేశాల ఫిర్యాదులపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిషన్ను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఆ కమిషను 1948 మే వరకు కూడా ఏర్పాటు కాలేదు. ఈలోగా, భద్రతా మండలి తన చర్చలను కొనసాగిస్తూ పోయింది. యుద్ధం కూడా కొనసాగింది.

తీర్మానం 47

మార్చి 18 న, రిపబ్లిక్ ఆఫ్ చైనా (ప్రస్తుత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు కాక ముందు ఉన్న దేశం) మూడు భాగాల కొత్త ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. శాంతి పునరుద్ధరణకు సంబంధించిన మొదటి భాగంలో, పాకిస్తాన్ తన జాతీయులను ఉపసంహరించుకోవాలని కోరింది. రెండవ భాగంలో కాశ్మీర్ ప్రజలు భారత, పాకిస్తాన్‌లలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విషయాన్ని చర్చించారు. "ప్లెబిసైట్ అడ్మినిస్ట్రేషన్"ను సృష్టించమని భారతదేశాన్ని కోరింది. దీని డైరెక్టర్లను ఐరాస సెక్రటరీ జనరల్ నామినేట్ చేస్తారు. అయితే వీళ్ళు రాష్ట్రానికి చెందిన అధికారులుగా పనిచేస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ సమూహాలకు ప్రాతినిధ్యం వహించేలా, రాష్ట్రానికి మధ్యంతర ప్రభుత్వాన్ని రూపొందించడం గురించి మూడవ భాగంలో చర్చించారు. [4]

తదుపరి చర్చలో ఈ ముసాయిదాను గణనీయంగా సవరించారు. బ్రిటిష్ ప్రతినిధి బృందపు యొక్క ప్రేరణతో పాకిస్తానుకు అనేక రాయితీలు ఇచ్చారు. ఈ మార్పులపై భారత్ అభ్యంతరం తెలిపింది. [5]

తీర్మానం

తుది తీర్మానంలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో కమిషన్ సభ్యుల సంఖ్యను ఐదుగురికి పెంచింది. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం నెరపేందుకు వెంటనే భారత ఉపఖండానికి వెళ్లమని కోరింది. రెండవ భాగంలో శాంతిని పునరుద్ధరించడానికి, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడానికీ భద్రతా మండలి చేసిన సిఫారసులను వివరించింది. ఇందులో మూడు అంచెలు ఉన్నాయి. [5] [6]

  • మొదటి అంచెలో, గిరిజనులను, పాకిస్తాన్ జాతీయులనూ అందరినీ ఉపసంహరించుకోవటానికి పాకిస్తాన్ "గట్టి ప్రయత్నాలు" చెయ్యాలని కోరింది. ఆ విధంగా రాష్ట్రంలో పోరాటాన్ని ముగించాలి.
  • రెండవ అంచెలో, శాంతిభద్రతలను కాపాడటానికి అవసరమైన కనీస స్థాయికి తన బలగాలను "క్రమంగా తగ్గించాలని" భారతదేశాన్ని కోరింది. సాధ్యమైనంతవరకు స్థానిక సిబ్బందిని ఉపయోగించి, కమిషనుతో సంప్రదిస్తూ శాంతిభద్రతలను నెలకొల్పడంలో భారత్ అనుసరించాల్సిన సూత్రాలను ఇది నిర్దేశించింది.
  • మూడవ అంచెలో, రాష్ట్ర మంత్రివర్గంలో పాల్గొనేందుకు ఆహ్వానించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతదేశాన్ని కోరారు. ఐక్యరాజ్యసమితి నామినేట్ చేసిన ప్లెబిస్సైట్ అధికారిని భారతదేశం నియమించాలి. రెండు దేశాలతో సంప్రదింపులు జరుపుతూ, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు గాను ఈ అధికారికి అధికారాలు ఉంటాయి. శరణార్థులు తిరిగి రావడానికీ, రాజకీయ ఖైదీలందరి విడుదలకూ, రాజకీయ స్వేచ్ఛ కోసమూ చర్యలు తీసుకోవాలి.

తీర్మానం తొమ్మిది అనుకూల ఓట్లతో ఆమోదం పొందింది. వ్యతిరేకంగా వోట్లేమీ పడలేదు. సోవియట్ యూనియన్, ఉక్రెయిన్ వోటింగులో పాల్గొనలేదు. [7]

స్పందన

ఈ తీర్మానంపై భారత, పాకిస్తాన్‌లు రెండూ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. [b]

కాశ్మీర్ భారతదేశంలో చట్టబద్ధంగా విలీనం కావడాన్ని, పాకిస్తాన్ చేసిన దురాక్రమణనూ విస్మరించి, ఈ తీర్మానం భారత, పాకిస్తాన్‌లు రెంటినీ ఒకే గాటన కట్టిందని భారతదేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండవది, భద్రత కోసం రాష్ట్రంలో దళాలను మోహరించడానికి వీలు కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయం అప్పటి కాశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లాను అసాధ్యమైన స్థితిలోకి నెడుతుందని కూడా భారత్ భావించింది. ప్లెబిస్సైట్ నిర్వాహకుడికి ఇచ్చిన అధికారాలు చాలా విస్తృతమైనవని, ఇవి దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీశాయనీ భారత్ తెలిపింది. శరణార్థులందరినీ తిరిగి రావడానికి వీలు కల్పించే నిబంధన వాస్తవ దూరమని కూడా భావించింది. చివరిగా, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహణ నుండి పాకిస్తాన్‌ను మినహాయించాలని భారత్ కోరింది. [8]

తీర్మానం అనుమతించిన కనీస స్థాయిలో భారత బలగాల మోహరింపుపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీరులో ఆధిపత్య పార్టీ అయిన ముస్లిం కాన్ఫరెన్సుకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో సమాన ప్రాతినిధ్యం కావాలని కోరింది. [8] భద్రతా మండలిలో జరిగిన చర్చలు పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయనీ, కాని అమెరికా, బ్రిటన్‌లు భారతదేశాన్ని బుజ్జగించేందుకు తుది ప్రతిపాదనలను సవరించాయనీ పాకిస్తాన్ ప్రభుత్వ వర్గాలు భావించాయి. ముఖ్యంగా బ్రిటన్ ఈ విషయంపై విమర్శకు గురైంది. [9]

మొత్తమ్మీద ఇరువర్గాలూ ఐరాస కమిషన్‌ను స్వాగతించాయి. దానితో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. [8]

ఐరాస కమిషను

ఐదుగురు సభ్యుల యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ (యుఎన్‌సిఐపి) లో చెకోస్లోవేకియా (జోసెఫ్ కోర్బెల్), అర్జెంటీనా (రికార్డో సిరి), బెల్జియం (ఎగ్బర్ట్ గ్రేఫ్), కొలంబియా (అల్ఫ్రెడో లోజానో), అమెరికాలు (జెరోమ్ క్లార్ హడిల్) ఉన్నాయి. దీని సచివాలయానికి యుకెలోని నార్వే రాయబారి ఎరిక్ కోల్బన్ నాయకత్వం వహించాడు. బ్రిటిష్ క్వేకర్ రిచర్డ్ సైమండ్స్ కోల్బన్‌కు కార్యదర్శిగా పనిచేసాడు.

1948 జూలైలో కమిషను ఉపఖండానికి వచ్చినపుడు భారత, పాకిస్తాన్‌లు రెండు చోట్లా రాజకీయ వాతావరణం దానికి వ్యతిరేకంగా ఉందని కమిషను వర్గాలు తెలిపాయి.

కాల్పుల విరమణ (1948)

కరాచీకి చేరుకున్న కమిషనుకు, పాకిస్తాన్ తన సైనిక దళాలకు చెందిన మూడు బ్రిగేడ్లు మే నుండి కాశ్మీర్లో పోరాడుతున్నాయని తెలిపింది. జోసెఫ్ కోర్బెల్ దీనిని "బాంబు"గా అభివర్ణించాడు. [10] పాకిస్తాన్ చేసిన ఈ అపరాధ ప్రకటనకు అత్యధిక ప్రాముఖ్యత ఉందని న్యూ ఢిల్లీలో భారతదేశం నొక్కి చెప్పింది. [11] కాశ్మీర్‌లో పోరాటం అప్రతిహతంగా సాగిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వము, ముజఫరాబాద్‌లోని ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వమూ రాజీలేని పోరాటంలో మునిగిపోయి ఉన్నాయని కమిషన్ గుర్తించింది. [12]

రెండు ప్రభుత్వాలతో చర్చలు జరిపిన తరువాత, 1948 ఆగస్టు 13 న, కమిషన్ ఐరాస తీర్మానం 47 ను సవరిస్తూ, మూడు భాగాల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. [13]

  • మొదటి భాగం కాల్పుల విరమణను ప్రతిపాదించింది. పోరాటాన్ని పూర్తిగా విరమించుకోవాలని పిలుపునిచ్చింది.
  • రెండవ భాగం సంధి ఒప్పందాన్ని ప్రతిపాదించింది. సైన్యం, గిరిజన తెగలు, ఇతర పాకిస్తాన్ పౌరులతో సహా పాకిస్తాన్ పోరాట దళాలన్నిటినీ పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరింది. ఆ విధంగా ఖాళీ చేసిన భూభాగాన్ని కమిషన్ పర్యవేక్షణలో స్థానిక అధికారులు నిర్వహిస్తారని పేర్కొంది. పాకిస్తాన్ ఉపసంహరణ తరువాత, శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైన కనీస స్థాయికి తగ్గిస్తూ "తన బలగాలలో ఎక్కువ భాగాన్ని" భారతదేశం ఉపసంహరించుకోవాలి.
  • మూడవ భాగంలో సంధి ఒప్పందాన్ని అంగీకరించిన తరువాత, ప్రజల అభీష్టానికి అనుగుణంగా రాష్ట్ర భవిష్యత్తును తేల్చడానికి ఇరుదేశాలూ కమిషన్తో సంప్రదింపులు జరుపుతాయని పేర్కొంది. [14]

తీర్మానపు రూపం భారతదేశానికి ప్రాముఖ్యత కలిగినది. మూడు భాగాల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ముందు సంధి కుదరాలని తీర్మానించడం ద్వారా అంతర్లీనంగా పాకిస్తాన్ "ఆక్రమణను" గుర్తించినట్లైంది. అంతేకాకుండా, ప్రజాభిప్రాయ సేకరణను (ప్లెబిసైట్) ప్రస్తావించలేదు. ప్రజాభీష్టాన్ని నిర్ణయించేందుకు రాజ్యాంగ సభను ఎన్నుకోవడం వంటి ఇతర మార్గాలకు వీలు కల్పించింది. ప్రజాభిప్రాయ సేకరణ మతపరమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుందని, "విచ్ఛిన్నకర శక్తులను" రెచ్చగొడుతుందనీ భారతదేశం భయపడింది. [15]

కమిషన్ తీర్మానాన్ని భారత్ అంగీకరించింది. అయితే, పాకిస్తాన్ చాలా అభ్యంతరాలు, మార్పులనూ సూచించింది. ఎంతలా అంటే ఇది "తిరస్కరణకు సమాన" మని కమిషన్ భావించింది.[14] పోరాటం ఆగిపోయిన తరువాత స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ప్రజాభిప్రాయ సేకరణకు హామీ ఇవ్వడమే పాకిస్తాన్ యొక్క ప్రధాన ఆసక్తిగా ఉండాలని కమిషన్ భావించింది. [11] దాంతో అది దాని ఆగస్టు తీర్మానానికి అనుబంధంగా ప్రజాభిప్రాయ సేకరణ విధివిధానాలను ప్రతిపాదించింది. ఇది ప్లెబిస్సైట్ నిర్వాహకుని విధులను నిర్వచించింది. ఈ నిర్వాహకుడు ఇతర విధులతో బాటు, భారత, ఆజాద్ కాశ్మీర్ దళాల తుది స్థితిని నిర్ణయిస్తారు. [16] సంధి ఒప్పందాన్ని పాకిస్తాన్ అంగీకరించకపోగా, తమను మరిన్ని రాయితీలు ఇవ్వమని అడుగుతున్నారంటూ భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆగస్టు తీర్మానం లోని మొదటి రెండు భాగాలను పాకిస్తాన్ అమలు చేయకపోతే, భారత్ ప్రజాభిప్రాయ సేకరణకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదనే ఒప్పందంతో సహా అనేక ఇతర హామీలను భారత్ కోరి, సాధించుకుంది. [17] అలాగే, ప్రజాభిప్రాయ సేకరణకు ముందే ఆజాద్ కాశ్మీర్ దళాలను రద్దు చేస్తారనే హామీని కూడా పొందింది.[18] [19]

అభ్యంతరాలు, సందేహాలు, భిన్నాభిప్రాయాలూ ఎన్ని ఉన్నప్పటికీ, రెండు ప్రభుత్వాలూ చివరకు ఈ ప్రతిపాదనలను అంగీకరించాయి. ఇది1949 జనవరి 1 న కాశ్మీర్‌లో కాల్పుల విరమణకు దారితీసింది.[20] కమిషన్ ఈ అనుబంధాన్ని 1949 జనవరి 5 న ఆమోదించిన కొత్త తీర్మానంలో చేర్చింది. [21]

అందని సంధి (1949)

కాల్పుల విరమణ నిబంధనలను అమలు చేయడానికి, సంధి ఒప్పందాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లు చేయడానికీ కమిషను 1949 ఫిబ్రవరిలో ఉపఖండానికి తిరిగి వచ్చింది. కమిషను "అపారమైన ఇబ్బందులను" ఎదుర్కొందని కోర్బెల్ పేర్కొన్నాడు. [22] [c]

ప్రజాభిప్రాయ సేకరణకు ముందు 'ఆజాద్ దళాలను' రద్దు చేయడం "తప్పనిసరి" అని భారత్ పట్టుబట్టింది. కమిషన్‌కు ఇదొక "కుదుపు" అని కోర్బెల్ చెప్పాడు. [23] వాస్తవానికి ఇది మునుపటి రౌండ్లో అంగీకరించినదే. [18] అయితే భారతదేశం టైమ్‌టేబుల్‌ను కాస్త ముందుకు తోసినట్లు కనిపించింది. [24] 'ఆజాద్ దళాల్లో' పూంచ్, మీర్పూర్ జిల్లాల్లోని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. గిరిజనుల ఆక్రమణకు ముందు జమ్మూ కాశ్మీర్ మహారాజాపై వారు తిరుగుబాటు చేశారు. దాడి తరువాత, పాకిస్తాన్ ఈ సైనికులను 32 బెటాలియన్లుగా, ఒక సైనిక దళంగా ఏర్పాటు చేసి, వారిని భారత బలగాలతో పోరాడటానికి ఉపయోగించింది. సంధి చర్చల సందర్భంగా, పాకిస్తాన్, ఆజాద్ దళాలు, రాష్ట్ర దళాల మధ్య సమతుల్యతను ఉండాలని చెప్పి, పాకిస్తాన్ దళాలు ఖాళీ చేయబోయే స్థానాల్లో ఆజాద్ దళాలకు మోహరించేందుకు గాను, వారికి శిక్షణ ఇవ్వడానికి అనుమతించాలని డిమాండ్ చేసింది. భారత ఉపసంహరణ ప్రారంభమైన వెంటనే పాకిస్తాన్ పోరాటాన్ని తిరిగి ప్రారంభించాలని యోచనగా దీన్ని భారత్ తేల్చింది. అంచేత, సంధి దశలోనే ఆజాద్ దళాల రద్దు జరగాలని భారత్ డిమాండ్ చేసింది. రద్దు డిమాండ్‌ను పాకిస్తాన్ తిరస్కరించింది. ఆజాద్ దళాలు, రాష్ట్ర దళాల మధ్య సమత్వం ఉండాలని పట్టుబట్టింది. పాకిస్తాన్ కూడా భారత ఉపసంహరణకు సంబంధించిన వివరాలను కోరింది. ఈ ఉపసంహరణ పాకిస్తాన్ దళాల ఉపసంహరణతో పాటే జరగాలని పట్టుబట్టింది. [24] [25]

నిస్సైనికీకరణ కోసం చేసిన పలు రౌండ్ల ప్రతిపాదనలను భారతదేశం, పాకిస్తాన్‌లు రెండూ తిరస్కరించడంతో కమిషను మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదించింది. మధ్యవర్తిత్వ ప్రతిపాదనను పాకిస్తాన్ అంగీకరించింది, కాని భారతదేశం తిరస్కరించింది. ఇది మధ్యవర్తిత్వానికి సంబంధించిన విషయం కాదని, అది "నిశ్చయమైన నిర్ణయం, వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం" అనీ పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి, ఆజాద్ దళాలకూ మధ్య తేడా ఏమీ లేదనేది భారతదేశం వాదన. సైనిక తులనాత్మకతను మార్చే స్థాయిలో ఆజాద్ దళాలకు ఇప్పుడు ఉందని కమిషను అంగీకరించింది. దీని వలన ఒరిజినలు తీర్మానంలో ప్రతిపాదించినట్లుగా భారత దళాలను ఉపసంహరించడం కష్టతర మైందని కూడా కమిషను అంగీకరించింది. [24] [25]

"ఉత్తర ప్రాంతాల" (నేటి గిల్గిట్-బాల్టిస్తాన్) విషయంలో మరో ఇబ్బంది ఎదురైంది. పాకిస్తాన్ ఉపసంహరణ తరువాత, ఈ ప్రాంతాలు తిరిగి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి చెందాలని, దాని సరిహద్దులను కాపాడుకోవడానికి తమను అనుమతించాలని భారత్ డిమాండ్ చేసింది. భారత డిమాండు లోని చట్టబద్ధ ప్రాతిపదికను కమిషన్ అంగీకరించింది. అయితే ఇది భారత దళాలకు, స్థానిక దళాలకూ మధ్య కొత్త పోరాటానికి కారణమవుతుందని భయపడింది. ఈ ప్రాంతాలను "స్థానిక అధికారులు" కమిషన్ పర్యవేక్షణలో పరిపాలించాలనీ, ఐరాస పరిశీలకులు అవసరమనై భావిస్తేనే భారత దళాలను పంపాల్సి ఉంటుందనీ కమిషను ప్రతిపాదించింది. ఈ రాజీ ప్రతిపాదనను భారత్, పాకిస్తాన్ రెండూ తిరస్కరించాయి. [26]

కమిషన్ తన వైఫల్యాన్ని ప్రకటించి, దాని తుది నివేదికను 1949 డిసెంబరు 9 న భద్రతా మండలికి సమర్పించింది. కమిషను స్థానంలో ఒకే మధ్యవర్తిని నియమించాలని ఇది సిఫార్సు చేసింది. ఆగస్టు తీర్మానంలో లాగా అంచెలుగా కాకుండా నిస్సైనికీకరణ సమస్యను సంపూర్ణంగా చూడాలనీ సూచించింది. ఐరాస ప్రతినిధులకు మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించే అధికారం ఉండాలని చెప్పింది. చెక్ ప్రతినిధి విడిగా ఒక మైనారిటీ నివేదికను సమర్పించారు. కమిషన్ తన వైఫల్యాన్ని ప్రకటించడం తొందరపాటని, ఆజాద్ దళాల సమస్యను తక్కువగా అంచనా వేసిందని, ఉత్తర ప్రాంతాలపై తగినంత శ్రద్ధ పెట్టలేదని ఆయన తన నివేదికలో చెప్పాడు. [27]

పర్యవసానాలు

భద్రతా మండలి తన కెనడియన్ ప్రతినిధి జనరల్ ఎజిఎల్ మెక్‌నాటన్‌ను నిస్సైనికీకరణ కోసం భారత, పాకిస్థాన్‌లను అనధికారికంగా సంప్రదించమని కోరింది. తన చర్చల సందర్భంగా, 1949 డిసెంబరు 22 న, ఆజాద్ దళాలు, రాష్ట్ర దళాలను రద్దు చెయ్యాలని, ఆ తరువాత పాకిస్తాన్, భారత దళాలను కనీస స్థాయికి తగ్గించాలని మెక్‌నాటన్ ప్రతిపాదించాడు. భారతదేశం మెక్‌నాటన్ ప్రతిపాదనలను తిరస్కరించి, రెండు ప్రభావశీలమైన సవరణలను ప్రతిపాదించింది. మెక్‌నాటన్ ప్రతిపాదనలు యుఎన్‌సిఐపి తీర్మానాలను అతిక్రమించాయి. అవి భారత, పాకిస్తాన్‌ల మధ్య తేడాను చూపలేదు. అటువంటి సమీకరణానికి భారతదేశం విముఖత చూపింది. [28] [29]

భారతదేశం స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, భద్రతా మండలి 80 వ తీర్మానంలో మెక్‌నాటన్ ప్రతిపాదనలను స్వీకరించి, మధ్యవర్తిని నియమించింది. మధ్యవర్తిత్వం కూడా విఫలమైంది.

1972 లో, 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తరువాత, భారత, పాకిస్తాన్‌లు సిమ్లా ఒప్పందంపై సంతకం చేశాయి. ద్వైపాక్షిక చర్చల ద్వారానే తమ విభేదాలన్నింటినీ పరిష్కరించుకోడానికి అంగీకరించాయి. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఇతర పాశ్చాత్య ప్రభుత్వాలు ఈ విధానానికి మద్దతు ప్రకటించాయి. [30]

2001 లో, అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, కోఫీ అన్నన్ తన భారత, పాకిస్తాన్ పర్యటన సందర్భంగా, కాశ్మీర్ తీర్మానాలు సలహాలు మాత్రమే అని, వాటిని తూర్పు తైమూర్, ఇరాక్ దేశాలతో పోల్చకూడదనీ స్పష్టం చేశాడు. [31]

2003 లో, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, ఐక్యరాజ్యసమితి తీర్మానాల డిమాండ్‌ను "పక్కన పెట్టడానికి", వివాద పరిష్కరం కోసం ప్రత్యామ్నాయ ద్వైపాక్షిక పద్ధతులను అన్వేషించడానికీ పాకిస్తాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. [32]

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు

గ్రంథ సూచీ

  • Bose, Sumantra (2003), Kashmir: Roots of Conflict, Paths to Peace, Harvard University Press, ISBN 978-0-674-01173-1
  • Das Gupta, Jyoti Bhusan (2012), Jammu and Kashmir, Springer, ISBN 978-94-011-9231-6
  • Korbel, Josef (May 1949), "The Kashmir Dispute and the United Nations", International Organization, 3 (2) : 278–287, doi:10.1017/s0020818300020610, JSTOR 2703744
  • Korbel, Josef (1953), "The Kashmir dispute after six years", International Organization, 7 (4) : 498–510, doi:10.1017/s0020818300007256, JSTOR 2704850
  • Korbel, Josef (1966) [first published 1954], Danger in Kashmir, Princeton University Press
  • Raghavan, Srinath (2010), War and Peace in Modern India: A Strategic History of the Nehru Years, Palgrave Macmillan, ISBN 978-1-137-00737-7
  • Schaffer, Howard B. (2009), The Limits of Influence: America's Role in Kashmir, Brookings Institution Press, ISBN 978-0-8157-0370-9
  • Subbiah, Sumathi (2004), "Security Council Mediation and the Kashmir Dispute: Reflections on Its Failures and Possibilities for Renewal", Boston College International and Comparative Law Review, 27 (1) : 173–185
  • UNCIP (22 November 1948), First Interim Report of the UNCIP (S/1100) (PDF), United Nations Digital Library, retrieved 10 August 2019
  • UNCIP (10 January 1949), Second Interim Report of the UNCIP (S/1196) (PDF), United Nations Digital Library, retrieved 10 August 2019
  • UNCIP (9 December 1949), Third Interim Report of the UNCIP (S/1430) (PDF), United Nations Digital Library, retrieved 10 August 2019

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు