కోమగట మారు సంఘటన

భారతీయ సిక్కు వలసదారులను కెనడాలో అడుగుపెట్టనీయని ఘటన

కోమగట మారు అనే జపాను ఓడలో భారతీయులు కెనడాకు వలసపోగా వారిని కెనడాలో అడుగుపెట్టనీయకుండా వెనక్కి పంపేసిన ఘటనను కోమగట మారు సంఘటన అంటారు. ఈ ఓడలో బ్రిటిషు భారతదేశం నుండి ఒక సమూహం 1914 ఏప్రిల్‌లో కెనడాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే కెనడా, వారిలో చాలామందికి ప్రవేశం నిరాకరించి, వెనక్కి తిప్పి కోల్‌కతా (ప్రస్తుత కోల్‌కతా) కి పంపేసింది. కోల్‌కతాలో, ఇండియన్ ఇంపీరియల్ పోలీసులు ఆ గ్రూపు లీడర్లను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అల్లర్లు చెలరేగాయి, వారిపై పోలీసులు కాల్పులు జరిపారు, ఫలితంగా 20 మంది మరణించారు.

కోమగట మారు సంఘటన
కోమగట మారు ఓడపై సిక్కులు, ముస్లిములు, హిందువులు
తేదీ1914 మే 23
ప్రదేశంవాంకూవర్
ఫలితంఓడను బలవంతంగా కోల్‌కతా పంపేసారు
మరణాలుప్రభుత్వ లెక్కల ప్రకారం 20. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం 75

బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ నుండి 376 మంది ప్రయాణీకులను తీసుకుని కోమగట మారు బ్రిటిష్ హాంకాంగ్ నుండి షాంఘై, చైనా, జపాన్ లోని యోకోహామా మీదుగా కెనడాలోని వాంకోవర్‌కు 376 మంది ప్రయాణికులను తీసుకువెళ్ళింది. ప్రయాణీకులలో 337 మంది సిక్కులు, 27 మంది ముస్లింలు, 12 మంది హిందువులూ ఉన్నారు, వీరందరూ పంజాబీలే. [1] ఈ 376 మంది ప్రయాణీకులలో 24 మందిని కెనడాలోకి రానిచ్చారు. మిగిలిన 352 మందిని కెనడా గడ్డపై దిగడానికి అనుమతించలేదు. ఓడ కెనడా జలాలను విడిచిపెట్టవలసి వచ్చింది. కెనడాకు చెందిన మొదటి రెండు నావికాదళ నౌకలలో ఒకటైన HMCS రెయిన్‌బోను ఈ ఓడకు కాపలాగా ఉంచారు. [2] 20 వ శతాబ్దం ప్రారంభంలో కెనడా, అమెరికాల్లోని మినహాయింపు చట్టాలను వాడి, ఆసియా మూలానికి చెందిన వలసదారులను అడ్డుకున్న అనేక సంఘటనలలో ఇది ఒకటి.

కెనడాలో వలస నియంత్రణలు

కెనడియన్ ప్రభుత్వం 1908 జనవరి 8 న ఒక ఆర్డర్ ఇన్ కౌన్సిల్‌ను ఆమోదించింది. బ్రిటిష్ భారతదేశం నుండి కెనడాకు వలసలను నిరోధించేందుకు కెనడా ప్రభుత్వం చేసిన మొదటి ప్రయత్నం అది. "నేరుగా తాము పుట్టిన దేశం నుండి గాని, పౌరసత్వమున్న దేశం నుండి గానీ ఎక్కడా ఆగకుండా రానివారికి, తాము పుట్టిన లేదా జాతీయత పొందిన దేశం నుండి బయలుదేరే ముందే కొనుగోలు చేసిన టిక్కెట్ల ద్వారా రాని వారికీ కెనడా లోకి ప్రవేశం లేకుండా ఈ చట్టం నిషేధించింది. నిజానికి బయలుదేరిన దగ్గర నుండి కెనడా వరకూ ఎక్కడా ఆగకుండా ప్రయాణం చెయ్యాలనే నిబంధన భారతదేశం నుండి వచ్చేవారిని మాత్రమే అడ్డుకుంటుంది. ఎందుకంటే అంత దూరం ప్రయాణించే ఓడలు ఎక్కడా ఆగకుండా రాలేవు, సాధారణంగా జపాన్ లోనో, హవాయి లోనో ఆగడం తప్పనిసరి. కెనడాకు భారీ సంఖ్యలో వలసలు వస్తున్న సమయంలో - ఈ వలసలు దాదాపు అన్నీ యూరప్ నుండి వస్తున్నవే - ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. 1913 లో 4,00,000 కంటే ఎక్కువ మంది వలస వచ్చారు. ఆ తరువాత ఏ సంవత్సరంలోనూ అంత మంది రాలేదు. వాంకోవర్‌లో వివిధ జాతుల మధ్య సంబంధాలు కోమగట మారు సంఘటన జరగటానికి ముందు సంవత్సరాలలో దెబ్బతిన్నాయి. చివరికి ఇవి 1907 నాటి ప్రాచ్య వ్యతిరేక అల్లర్లతో పరాకాష్ఠకు చేరాయి.

గుర్దిత్ సింగ్ తొలి ఆలోచన

బాబా గుర్దిత్ సింగ్, కోమగట మారు మెమోరియల్, బడ్జ్ బడ్జ్

గుర్దిత్ సింగ్ సంధు సింగపూర్ వ్యాపారవేత్త. భారతదేశం లోని సర్హాలీకి చెందిన వాడు. పంజాబీలు కెనడా వలస వెళ్ళకుండా అక్కడి చట్టాలు అడ్డుకుంటున్నాయని అతనికి తెలుసు. కలకత్తా నుండి వాంకోవర్‌కు ప్రయాణించడానికి ఓడను అద్దెకు తీసుకుని అతను ఈ చట్టాలను అధిగమించాలనుకున్నాడు. గతంలో కెనడాకు వెళ్లకుండా నిరోధించబడిన తన స్వదేశీయులకు సహాయం చేయడమే అతని లక్ష్యం.

గుర్దిత్ సింగ్ 1914 జనవరిలో కొమగట మారు అనే ఓడను అద్దెకు తీసుకున్నప్పుడు నిబంధనల గురించి అతనికి స్పష్టంగా తెలిసినప్పటికీ [3] భారతదేశం నుండి కెనడాకు వలసలకు తలుపులు తెరవాలనే ఆశయంతో, నిరంతర ప్రయాణ నిబంధనను సవాలు చేయడానికి తన కృషిని కొనసాగించాడు.

1914 జనవరిలో, అతను హాంకాంగ్‌లో ఉన్న కాలంలో గదర్ పార్టీ ఆలోచనలను అతడు బహిరంగంగా సమర్ధించాడు. [4] గదర్ ఉద్యమం అనేది బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం పొందాలనే లక్ష్యంతో 1913 జూన్ లో అమెరికా, కెనడా ల్లోని పంజాబీలు స్థాపించిన సంస్థ. దీనిని పసిఫిక్ తీర ఖల్సా సంఘం (ఖల్సా అసోసియేషన్ ఆఫ్ ది పసిఫిక్ కోస్ట్) అని కూడా అంటారు.

ప్రయాణీకులు

ప్రయాణీకులలో 340 మంది సిక్కులు, 24 మంది ముస్లింలు, 12 మంది హిందువులూ ఉన్నారు. వీరంతా బ్రిటిషు భారతదేశ పౌరులే. సిక్కు ప్రయాణీకులలో ఒకడైన జగత్ సింగ్ థిండ్, భగత్ సింగ్ థిండ్ తమ్ముడు. భగత్ సింగ్ థిండ్ భారతీయ-అమెరికన్ సిక్కు రచయిత, "ఆధ్యాత్మిక శాస్త్రం" పై లెక్చరర్, అతను అమెరికా పౌరసత్వం పొందే భారతీయుల హక్కులపై ముఖ్యమైన న్యాయ పోరాటంలో పాల్గొన్నాడు. [5]

భారతదేశంలో బ్రిటిష్ పాలనను పడగొట్టే ప్రయత్నాలకు మద్దతుగా గొడవలు సృష్టించాలనే ఆలోచనలున్న అనేక మంది భారతీయ జాతీయవాదులు ఆ ప్రయాణికులలో ఉన్నారని కెనడియన్ ప్రభుత్వానికి తెలుసు. [6] భద్రతా కారణాలతో పాటు, భారతీయులను కెనడాకు వలస రాకుండా నిరోధించాలనే లక్ష్యం కూడా వారికి ఉంది. [7] 

ప్రయాణం

హాంకాంగ్ నుండి బయలుదేరడం

ఓడ, ప్రయాణం మొదలయ్యే చోటైన హాంకాంగ్‌లో మార్చిలో బయలుదేరాల్సి ఉంది. కానీ, అక్రమ ప్రయాణం కోసం టిక్కెట్లను విక్రయించాడనే ఆరోపణతో సింగ్‌ను అరెస్టు చేశారు. చాలా నెలల తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. సముద్రయానం చేయడానికి హాంకాంగ్ గవర్నర్ ఫ్రాన్సిస్ హెన్రీ మే అనుమతి ఇచ్చాడు. దాంతో ఈ నౌక ఏప్రిల్ 4 న 165 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఏప్రిల్ 8 న షాంఘైలో మరింత మంది ప్రయాణికులు ఎక్కారు. ఏప్రిల్ 14 న ఓడ జపాను లోని యోకోహామాకు చేరుకుంది. మే 3 న 376 మంది ప్రయాణికులతో యోకోహామా నుండి బయలుదేరి, మే 23 న వాంకోవర్ సమీపంలోని బురార్డ్ ఇన్లెట్‌లోకి ప్రయాణించింది. భారతీయ జాతీయవాద విప్లవకారులు బర్కతుల్లా, భగవాన్ సింగ్ జియానిలు మార్గమధ్యంలో ఓడ ఎక్కారు. భగవాన్ సింగ్ జియాని వాంకోవర్‌లోని గురుద్వారాలో ప్రధాన పూజారి. కెనడాలోని భారతీయుల కేసును వాదించడానికి లండన్‌కు, భారతదేశానికీ పంపిన ముగ్గురు ప్రతినిధులలో అతను ఒకడు. వాళ్ళు గదర్ పార్టీ సాహిత్యాన్ని ఓడలో పంచిపెట్టారు. రాజకీయ సమావేశాలు జరిపారు. ఒక ప్రయాణీకుడు ఓ బ్రిటిషు అధికారికి ఇలా చెప్పాడు: "ఈ నౌక మొత్తం భారతదేశానికి చెందినది, ఇది భారతదేశ గౌరవానికి చిహ్నం. దీనిని నిర్బంధించినట్లయితే, సైన్యంలో తిరుగుబాటు చెలరేగుతుంది". 

వాంకోవర్‌లో రాక

కోమగట మారు (ఎడమ వైపున దూరంగా ఉన్న ఓడ) కాపలాగా ఉన్న HMCS రెయిన్‌బోతొ పాటు చిన్న పడవల సమూహం

కోమగట మారు, మొదట బురార్డ్ ఇన్లెట్‌లోని కోల్ హార్బర్ వద్ద CPR పైర్ A కి 200 మీటర్లు (200 గజాలు) దూరంలో కెనడియన్ జలాల్లోకి వచ్చినప్పుడు, వాంకోవర్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారి ఫ్రెడ్ "సైక్లోన్" టేలర్ లంగరు వేయడానికి దాన్ని అనుమతించలేదు. [8] కెనడా ప్రధాన మంత్రి రాబర్ట్ బోర్డెన్ ఓడను ఏమి చేయాలనేది నిర్ణయించగా, ప్రయాణీకులను దిగడానికి అనుమతించమని బ్రిటిష్ కొలంబియా రాష్ట్ర కన్జర్వేటివ్ ప్రీమియర్ రిచర్డ్ మెక్‌బ్రైడ్ స్పష్టమైన ప్రకటన ఇచ్చాడు. కన్జర్వేటివ్ MP HH స్టీవెన్స్ ఓడ ప్రయాణీకులను దిగడానికి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఓడను అక్కడ ఉండడానికి అనుమతించకూడదని అతడు ప్రభుత్వాన్ని కోరాడు. ప్రయాణీకులను ఒడ్డు నుండి దూరంగా ఉంచడానికి అతడు ఇమ్మిగ్రేషన్ అధికారి మాల్కం RJ రీడ్‌తో కలిసి పనిచేశాడు. రీడ్ మొండితనం, స్టీవెన్స్ మద్దతుతో కలిసి, ఓడలోని ప్రయాణీకుల పట్ల అనుచిత ప్రవర్తనకు దారితీసింది. అది రేవును వదలి వెనక్కి వెళ్ళాసిన తేదీ ముందుకు పొడిగించబడింది. దేశ వ్యవసాయ మంత్రి, మార్టిన్ బురెల్ జోక్యం చేసుకునే వరకు అది కొనసాగింది.

ఇదిలా ఉండగా, హుస్సేన్ రహీమ్, సోహన్ లాల్ పాఠక్ లతో "తీర కమిటీ" ఏర్పాటు చేసారు. కెనడా, అమెరికాల్లో నిరసన సమావేశాలు జరిగాయి. వాంకోవర్‌లోని డొమినియన్ హాల్‌లో జరిగిన ఒక సమావేశంలో, ప్రయాణీకులను అనుమతించకపోతే, వారితో పాటు ఇండో-కెనడియన్లు కూడా తిరిగి భారతదేశానికి వెళ్ళి, అక్కడ తిరుగుబాటు లేవదీయాలని తీర్మానించారు. సమావేశం లోకి చాటుగా చొరబడిన ఒక బ్రిటిషు ప్రభుత్వ ఏజెంటు, ఓడలో గదర్ పార్టీ మద్దతుదారు లున్నారని లండన్, ఒట్టావాలోని ప్రభుత్వ అధికారులకు తంతి సందేశం పంపాడు.

షిప్ ఛార్టర్ కోసం తీర కమిటీ మొదటి విడతగా $ 22,000 సేకరించింది. వారు ప్రయాణీకులలో ఒకరైన మున్షీ సింగ్ తరపున జె. ఎడ్వర్డ్ బర్డ్ అనే న్యాయవాదితో ఒక వ్యాజ్యాన్ని కూడా ప్రారంభించారు. జూలై 6 న, బ్రిటిష్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్ యొక్క పూర్తి బెంచ్ - కొత్త ఆదేశాల ప్రకారం వలస, కాలనీకరణ శాఖ నిర్ణయాలలో జోక్యం చేసుకునే అధికారం కోర్టుకు లేదు అని ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. [9] కోపగించిన ప్రయాణీకులు ఓడను నియంత్రిస్తున్న జపనీస్ కెప్టెన్‌ను ఓడనుండి పంపించేసారు. కానీ కెనడియన్ ప్రభుత్వం ఓడను సముద్రంలోకి నెట్టమని హార్బర్ టగ్ సీ లయన్‌ను ఆదేశించింది. కోపంగా ఉన్న ప్రయాణీకులు జూలై 19 న దాడికి దిగారు. మరుసటి రోజు వాంకోవర్ వార్తాపత్రిక ది సన్ ఇలా నివేదించింది: "హిందువులు పెద్ద సంఖ్యలో పోలీసులపై బొగ్గు, ఇటుకలూ విసిరారు. ... వాళ్ళు బొగ్గు చూట్ కింద నిలబడినట్లు ఉంది ". 

వాంకోవర్ నుండి నిష్క్రమణ

కోమగట మారు లో ఇన్‌స్పెక్టర్ రీడ్, HH స్టీవెన్స్, వాల్టర్ హోస్.

ప్రభుత్వం HMCS రెయిన్‌బో అనే నావికా దళ నౌకను కూడా మోహరించింది. చివరికి, కేవలం ఇరవై మంది ప్రయాణీకులను మాత్రమే కెనడాలోకి రానిచ్చారు. ఓడ మినహాయింపు చట్టాలను ఉల్లంఘించినందున, ప్రయాణీకుల వద్ద అవసరమైన నిధులు లేనందున, వారు భారతదేశం నుండి నేరుగా ప్రయాణించనందున, ఓడను వెనక్కితిప్పి జూలై 23 న ఆసియాకు బయలుదేరదీసారు.

వివాదం సమయంలో, కెనడాలోని పంజాబీలు కొందరు బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ అధికారి డబ్ల్యుసి హాప్‌కిన్సన్‌కు సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. వీరిలో ఇద్దరు 1914 ఆగస్టులో హత్య చేయబడ్డారు. 1914 అక్టోబరులో విచారణలకు హాజరైనప్పుడు హాప్‌కిన్సన్‌ను వాంకోవర్ కోర్టులో కాల్చి చంపారు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత హార్బర్ వద్ద కాల్పులు

కోమగట మారు సెప్టెంబర్ 27 న కలకత్తా చేరుకుంది. నౌకాశ్రయంలోకి ప్రవేశించిన తరువాత, ఓడను బ్రిటిష్ గన్‌బోట్ నిలిపివేసి, ప్రయాణీకులకు కాపలా పెట్టారు. బ్రిటిష్ రాజ్ ప్రభుత్వం కోమగట మారు ప్రయాణీకులను చట్టాన్ని ఉల్లంఘించినట్లు స్వయంగా ఒప్పుకున్న వారిగా మాత్రమే కాకుండా, ప్రమాదకరమైన రాజకీయ ఆందోళనకారులుగా కూడా చూసింది. పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోని దక్షిణ ఆసియన్ల మధ్య తిరుగుబాటు సృష్టించడానికి శ్వేత జాతీయుల్లోని, దక్షిణ ఆసియన్ల లోని విప్లవశక్తులు కలిసి ఈ సంఘటనను ఉపయోగించుకుంటున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం అనుమానించింది. ఓడ బడ్జ్ బడ్జ్ వద్ద దిగినప్పుడు, బాబా గుర్దిత్ సింగ్‌ను, వారి నాయకులుగా భావించిన మరో ఇరవై మంది ఇతర వ్యక్తులనూ అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్లారు. అతను అరెస్టును ప్రతిఘటించాడు, అతని స్నేహితుడు పోలీసుపై దాడి చేశాడు. ఓడలో అల్లర్లు రేగాయి. పోలీసులు కాల్పులు జరిపగ, పంతొమ్మిది మంది ప్రయాణికులు మరణించారు. కొందరు తప్పించుకున్నారు. మిగిలిన వారిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కొందరిని వారి గ్రామాలకు పంపేసారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నంత కాలం వారిని గ్రామ నిర్బంధంలోనే ఉంచారు. ఈ సంఘటన బడ్జ్ బడ్జ్ అల్లర్లుగా ప్రసిద్ధి చెందింది.

గుర్దిత్ సింగ్ సాంధు పోలీసుల నుండి తప్పించుకుని 1922 వరకు అజ్ఞాతంలో ఉన్నాడు. మహాత్మా గాంధీ అతన్ని "నిజమైన దేశభక్తుడి" లాగా లొంగిపోవాలని కోరగా అతను లొంగిపోయాడు. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. [10]

ప్రాముఖ్యత

కెనడియన్ ఇమ్మిగ్రేషన్ చట్టాలలో వ్యత్యాసాలను హైలైట్ చేయడానికి కోమగట మారు సంఘటనను ఆ సమయంలో భారతీయ సమూహాలు విస్తృతంగా ఉదహరించాయి. భారత విప్లవ సంస్థ, గదర్ పార్టీ, దాని లక్ష్యాల కోసం మద్దతు కూడగట్టడానికి ఈ సంఘటనను విస్తృతంగా వాడుకుంది. 1914 లో కాలిఫోర్నియా నుండి భారతీయ ప్రవాసుల వరకు జరిగిన అనేక సమావేశాలలో, బర్కతుల్లా, తారక్ నాథ్ దాస్, సోహన్ సింగ్‌తో సహా ప్రముఖ నాయకులు ఈ సంఘటనను గదర్ ఉద్యమానికి సభ్యులను నియమించడానికి ఒక ర్యాలీ పాయింట్‌గా ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా భారతదేశంలో భారీ తిరుగుబాటు లేవదీసే ప్రణాళికలను సమన్వయం చేసేందుకు మద్దతు కోసం ఈ సంఘటన వారికి పనికొచ్చింది. అయితే సాధారణ ప్రజల నుండి మద్దతు లేకపోవడం వల్ల వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.

వారసత్వం

భారతదేశం

కోమగట మారు షహీద్ గంజ్, బడ్జ్ బడ్జ్

1952 లో భారత ప్రభుత్వం బడ్జ్ బడ్జ్ దగ్గర కోమగట మారు అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేసింది. దీనిని భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. స్మారక చిహ్నాన్ని స్థానికంగా పంజాబీ స్మారక చిహ్నం అని పిలుస్తారు. దీన్ని ఆకాశం వైపు చూస్తున్న కృపాణం లాగా రూపొందించారు. [11]

ప్రస్తుతం ఉన్న స్మారక చిహ్నం వెనుక G + 2 భవనాన్ని నిర్మించేందుకు కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కోమగట మారు ట్రస్ట్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లైబ్రరీ, మొదటి అంతస్తులో మ్యూజియం, రెండో దానిలో ఆడిటోరియం ఉంటాయి. [12]

కోమగట మారు సంఘటన శతాబ్దిని పురస్కరించుకుని 2014 లో భారత ప్రభుత్వం రెండు ప్రత్యేక నాణేలను విడుదల చేసింది, INR 5, INR 100. [13]

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు