ప్రసాదరాయ కులపతి

శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారు కుర్తాళం ప్రస్తుత పీఠాధిపతులు.[1] ఆయన డాక్టర్ ప్రసాద రాయ కులపతి (వెంకట లక్ష్మి వర ప్రసాద్ రావు) గా సుపరిచితులు. అవధాన సరస్వతి, చక్రవర్తి సాహితి సార్వభౌమ, సారస్వతాహి కంఠాభరణ, రూపక సామ్రాట్, కవితా సుధాకర వంటి అనేక గొప్ప బిరుదులను ఆయనకు వివిధ సాహిత్య సంఘాలు అందజేశాయి.

sree siddheswarananda bharati swamy
జననంపోతరాజు వెంకట లక్ష్మీవరప్రసాదరావు
(1937-01-23)1937 జనవరి 23
India ఏల్చూరు గ్రామం,సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఇతర పేర్లుశ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామిజి,
భార్గవ విద్యాదేవ కులపతి
వృత్తిధర్మ రక్షకులు
ప్రసిద్ధిఅవధాని శేఖర,
ఆశుకవి కేసరి,
కవితా సుధాకర,
సరస్వతీ కంఠాభరణ,
సాహితీసార్వభౌమ,
రూపక సమ్రాట్
మతంహిందూ
తండ్రిపోతరాజు పురుషోత్తమరావు
తల్లిస్వరాజ్యలక్ష్మి

జీవిత విశేషాలు

స్వామి వారి అసలు పేరు పోతరాజు వెంకట లక్ష్మీవరప్రసాదరావు.[2] వారు అసలు పేరుతోను, భార్గవ విద్యాదేవ కులపతిగా, ప్రసాదరాయ కులపతిగా విశేషమైన ఖ్యాతి పొందారు. తరువాత కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిగా వెలుగొందుతున్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకాలోని ఏల్చూరు గ్రామంలో 1937 జనవరి 23 న పోతరాజు పురుషోత్తమరావు, స్వరాజ్యలక్ష్మీ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గొప్ప కవి. ఆయన 2002 డిసెంబరు 19న దత్త జయంతి రోజున కుర్తాళం శ్రీ సిద్దేశ్వరి పీఠం సింహాసనాన్ని అధిష్టించారు. అతని ముత్తాత శ్రీరామకవి, కొప్పరవు కవులకు గురువు. అతని ముత్తాత రామకవి నుండి కుస్తీ పద్ధతులతో పాటు అన్ని కవితా ప్రతిభను వారసత్వంగా పొందారు. ఆయన తెలుగు సాహిత్యంలో అవధాని, ఆసుకవి, వక్త, భువనవిజయం వంటి సాహిత్య నాటకాల నిర్వాహకుడిగా ప్రత్యేకమైన సేవలను అందించారు.

విద్యాభ్యాసం

స్వామి వారు గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలు లో 8వ తరగతిలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలో సర్వప్రథముడిగా ఉత్తీర్ణులై స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. తరువాత హిందూ కాలేజీలో ఎం.పి.సి. గ్రూపులో ఇంటర్మీడియట్ చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనారు. ఇంటర్మీడియట్ చదివే సమయంలోనే వారు ఆశువుగా పద్యాలు చెప్పడం అభ్యాసం చేశారు. గణితశాస్త్రంపై విముఖతతో బి.ఎ.లో తెలుగు ప్రధాన అంశంగా స్వీకరించి బి.ఎ. యూనివర్సిటీ ఫస్ట్‌గా ఉత్తీర్ణుడయ్యారు. తరువాత 1962-64 సంవత్సరాల మధ్య శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో ఎం.ఎ. చదివారు. తరువాత అదే విశ్వవిద్యాలయంలో ఆంధ్రభాగవత విమర్శ అనే విషయంపై పరిశోధన చేసి 1967లో పి.హెచ్.డి. పట్టా పుచ్చుకున్నారు.

గురువులు

సాహిత్యంలో వారి తండ్రి పోతరాజు పురుషోత్తమరావుగారు, మిన్నికంటి గురునాథశర్మ, పింగళి లక్ష్మీకాంతం ఇతనికి గురువులు. మంత్రశాస్త్రాన్ని వారు పసుమర్తి సుబ్బరాయశర్మ వద్ద అభ్యసించారు. మల్లయుద్ధాన్ని, ముష్టి యుద్ధాన్ని మోచర్ల శ్రీహరిరావు వద్ద నేర్చుకున్నారు.

ఉద్యోగం

స్వామి వారు గుంటూరు హిందూ కాలేజీ తెలుగు శాఖలో చాలా కాలం ఉపన్యాసకులుగా పనిచేసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొంది అక్కడనే పదవీ విరమణ చేశారు.

ఆధ్యాత్మిక జీవితం

బాల్యంలో వీరు హనుమదుపాసకులు. హనుమాన్ మంత్రాన్ని కొన్ని కోట్లసార్లు జపించారు. కొన్నిసార్లు వారు పారలౌకిక విషయాలలో చాలా లోతుగా వెళ్లేవాడు. ఇతడు రాజయోగ మార్గంలో ధ్యానాన్ని, మంత్రసాధనను కొనసాగించారు. చాలా త్వరగా సిద్ధులను పొందారు. తంత్రవిద్యలో ప్రావీణ్యం సంపాదించ దలచి ఒక గురువు ద్వారా సాధన చేశారు. ఆ కఠోర దీక్షఫలితంగా వారు దివ్యత్వాన్ని సంపాదించగలిగారు. జిల్లెళ్ళమూడి అమ్మకు అత్యంత ప్రియశిష్యుడిగా అనుగ్రహం పొందారు. ఆమెపై అంబికాసాహస్రి అనే స్తుతికావ్యాన్ని రచించారు.పిమ్మట వారు రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ మార్గదర్శకంలో బృందావనం లోని రాధాదేవిని ఉపాసించారు. రాధాదేవి, వారికి దివ్యదర్శనాన్ని అనుగ్రహించడమేకాక షడాక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది. ఇతడు ఈ దేవతను వజ్రవైరోచనీ రూపంలో ఆరాధించసాగాడు. ఈ దేవతను స్తుతిస్తూ ఐంద్రీ సాహస్రి అనే స్తుతికావ్యాన్ని రచించారు.[3] స్వామి వారు గుంటూరులో స్వయంసిద్ధ కాళీపీఠాన్ని స్థాపించి ఆధ్యాత్మిక ప్రచారానికి దోహదం చేశారు.

సన్యాసాశ్రమం

తమిళనాడుకు చెందిన కుర్తాళంలోని సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ శివ చిదానంద సరస్వతీ స్వామి. (వీరు 28/12/1943 నాడు సిద్ధి పొందారు). నాలుగవ పీఠాధిపతి శివచిదానంద భారతి స్వామి వారు వీరికి సన్యాసదీక్షను ఇచ్చి సిద్ధేశ్వరానంద భారతి స్వామి అని నామకరణం చేశారు. అంతే కాకుండా తన తదనంతరం స్వామి వారిని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠానికి అధిపతిగా ప్రకటించారు. శివచిదానంద భారతి స్వామి వారు సిద్ధి పొందిన తర్వాత 2002, డిసెంబరు 19న దత్తజయంతి నాడు కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు.

తన బాల్యంలో ఒక మల్లయోధుడు నుండి పవిత్ర ప్రదేశాలలో తపస్సుతో ఆధ్యాత్మికత అలవర్చుకున్నారు. యోగా, ప్రాణాయామం నేర్చుకున్నారు. తన నాలుక దిగువ భాగాన్ని కత్తిరించి లంబికా సాధన చేశారు.ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఆవు పాలు, చాలా తక్కువ ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. దత్తాత్రేయ మంత్రం ఉపసాకులు పసుమముల సుబ్బరాయ శాస్త్రి నుండి నాగ మంత్రం సిద్ధిని పొందారు. అప్పుడు అతను ఛిన్నమస్త (వజ్రవైరోచని) మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. కోటి జపం పూర్తిచేసి దేవీ ప్రచండచండీ అనుగ్రహాన్నిపొందారు. అతను గొప్ప యోగి అయిన శ్రీ రాధిక ప్రసాద్ మహారాజ్ (శ్రీ రాళ్ళభండి వీరభద్ర రావు) ప్రభావంతో రాధా మంత్ర సాధనను ప్రారంభించారు. తత్ఫలితంగా, అతను “వ్రజా భాగవతం” రాశారు. అతను దేవీ ప్రచండచండీ దేవతను స్తుతిస్తూ ఆమె పాదాల వద్ద “ఐంద్రీ సహస్రి”ను వెయ్యి కవితలతో సమర్పించారు.

శ్రీ స్వామివారు ఆధ్యాత్మిక గురువే కాక అనేక వ్యాధులను కూడా నయం చేయగలరు. 2002 సెప్టెంబరు 8 న కుర్తాళం నకు చెందిన శ్రీ శివ చిదానంద భారతి స్వామి వారు సన్యాసా దీక్ష ఇచ్చారు. అతనికి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి అని కొత్త పేరు పెట్టి తన వారసులుగా ప్రకటించారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు 2002 డిసెంబరు 19 న దత్త జయంతి రోజున కుర్తాళం పీఠం సింహాసనాన్ని అధిష్టించారు. సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడానికి భారతదేశంలో, విదేశాలలో హిందూ ధర్మ రక్షణా యజ్ఞాలను ప్రారంభించారు[4]. కుర్తాళం పీఠం ఆవరణలో స్వర్గీయ వాసిరెడ్డి అప్పారావు స్మారక ధ్యానమందిరాన్ని ప్రారంభించాడు[5].

వీరు తమ 16 సంవత్సరాల ప్రాయంలో 1952లో మొట్టమొదటి అష్టావధానాన్ని గుంటూరు జిల్లా కొప్పరం గ్రామంలో నిర్వహించారు. అప్పటినుండి సుమారు 12 సంవత్సరాలు అనగా 1964 వరకు 200కు పైగా అవధానాలను ఆంధ్రదేశంలోను, ఆంధ్రేతర ప్రాంతాలలోను విజయవంతంగా చేశారు. ఇతని అవధానాలలో సమస్య, వర్ణన, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, ఆశువు, ఆకాశపురాణము, అప్రస్తుత ప్రసంగము, న్యస్తాక్షరి అనే అంశాలు ఉండేవి. వీరి అవధానాలలోని పూరణలు కొన్ని మచ్చుకు క్రింద చదవండి.

  • సమస్య: అర్చన చేసె రాత్రి సమయమ్ముల భక్తుడు భాను బింబమున్

పూరణ:

తేర్చిన తేనెయంచుఁ బ్రియదేవిని ముద్దిడ సిగ్గుదొంతరల్
పేర్చిన ఆమె మోమరుణబింబము పోలికనయ్యె నంత నా
నేర్చినవాఁడు భక్తిసరణిన్ పలుగాటుల కింశుకంబులన్
అర్చన చేసె రాత్రిసమయమ్ముల భక్తుడు భానుబింబమున్

  • సమస్య: దివ్వె వెలుంగుచుండినగదిన్ నలువంకల నిండె చీకటుల్

పూరణ:

ఇవ్విధి మోముద్రిప్పి హృదయేశ్వరి! కోపము చేపెదేల? యే
పువ్వులు తాల్పబోక విరబోసితివేల వినీలకైశికన్
నువ్వు వెలుంగు వెన్నెలవు నా ప్రియ నీ ముఖచంద్రబింబమన్
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీఁకటుల్

  • సమస్య:రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముడై

పూరణ:

ద్రావిడులంచు కాదు మరి తానొక ఆర్యుఁడనంచుఁగాదు లో
కావళి హింసపెట్టిన మహాకలుషాత్ములఁటంచు నంగనా
జీవితముల్ వినాశనము చేసిన దుష్టులఁటంచు మృత్యువై
రావణ కుంభకర్ణులకు, రాముఁడుపుట్టె గుణాభిరాముఁడై

  • దత్తపది : ధర్మరాజు - భీముడు - అర్జునుడు - నకులుడు - సహదేవుడు అనే పేర్లతో రామాయణార్థంలో పద్యం.

పూరణ:

దాశరథి శాంతనిధి దయాధర్మరాజు
భీముఁ డాహవస్ఫూర్తి గంభీరమూర్తి
ఘనతరయశోర్జునుండు నయ్యినకులుండు
కపటదుస్సహదేవాది గర్వహారి

  • వర్ణన: శరత్కాలము - ఆకాశము

పూరణ:

శారద నీరదాంబరము చక్కఁగఁ దెల్లఁగ నారదేందు క
ర్పూర సుధా ప్రపూర హిమ పూర తుషార పటీర హీర దిం
డీర మనోజ్ఞకాంతి ప్రకటీకృతమై యలరారుచున్న ఆ
కారముతో వెలుంగు ననఁగాఁ బలుకం దగు పృచ్ఛకాగ్రణీ!

సాహితీరూపకాలు

స్వామి వారు 30కి పైగా వివిధరకాలైన సాహితీరూపకాలకు రూపకల్పన చేయడమేగాక వాటిలో ప్రముఖ పాత్రలను నిర్వహించేవారు. భువనవిజయములో తిమ్మరుసు పాత్రను, త్రైలోక్యవిజయము, త్రిభువన విజయములలో శ్రీనాథుని పాత్రను అనేక పర్యాయాలు పోషించారు. ఇంద్రసభలో దేవగురువు బృహస్పతి పాత్రను పోషించారు. వీరు అమెరికా సందర్శించినప్పుడు అక్కడ న్యూయార్క్, పిట్స్‌బర్గ్, న్యూజెర్సీ, డెట్రాయిట్, డెన్వర్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ మొదలైన చోట్ల భువనవిజయం, ఇంద్రసభ మొదలైన సాహిత్యరూపకాలను ప్రదర్శించారు.

రచనలు

స్వామివారి ఈ క్రింది రచనలు ప్రచురితమయ్యాయి. వీటిలో కొన్ని శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి గా మారిన తరువాత వ్రాసినవి.

  1. ఆంధ్రభాగవత విమర్శ[6] (సిద్ధాంతగ్రంథము)
  2. శివసాహస్రి
  3. హరసహస్రము
  4. గంధర్వగీతి
  5. రమణీప్రియదూతిక
  6. రసవాహిని
  7. రసగంగ
  8. అంబికా సాహస్రి
  9. ఐంద్రీ సాహస్రి
  10. కవిబ్రహ్మ
  11. ఆనందయోగిని
  12. కావ్యకంఠ జీవితచరిత్ర
  13. వందేమాతరం
  14. సంస్కృతి
  15. ఒక విద్యార్థి ఉద్యమం
  16. తాంత్రిక ప్రపంచం
  17. దేవీశక్తి
  18. హనుమంతుడు
  19. కవితామహేంద్రజాలం[7]
  20. నాగ సాధన
  21. భైరవ సాధన
  22. ప్రత్యంగిర సాధన
  23. శ్రీ లలితాదేవి చరిత్ర
  24. కుర్తాళ యోగులు
  25. వజ్ర భాగవతం
  26. బృందావన భాగవతం
  27. బృందావన యోగులు
  28. హిమాలయ యోగులతో మౌనస్వామి మొదలైనవి.

సారస్వతసేవ

వీరు గుంటూరులో శ్రీనాథపీఠాన్ని స్థాపించి ఆ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. శ్రీనాథపీఠం ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను చేపట్టారు. అనేక గ్రంథాలను ప్రచురించారు.

బిరుదులు, పురస్కారాలు

వీరికి అవధాని శేఖర, ఆశుకవి కేసరి, కవితా సుధాకర, సరస్వతీ కంఠాభరణ, సాహితీసార్వభౌమ, రూపక సమ్రాట్ మొదలైన బిరుదులు ఉన్నాయి. స్వామి వారు కనకాభిషేకము, సువర్ణ ఘంటా కంకణము, కవి గండపెండేరము మొదలైన సత్కారాలను ఎన్నో పొందారు.

మూలాలు

బాహ్య లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు