శ్రీకాళహస్తి

ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండల పట్టణం
(శ్రీ కాళహస్తి నుండి దారిమార్పు చెందింది)

శ్రీకాళహస్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, శ్రీకాళహస్తి మండల కేంద్రం. ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇక్కడ గల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వలన ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. కళంకారీ కళకు పుట్టినిల్లు.

శ్రీకాళహస్తి
పట్టణం
భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము
భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము
శ్రీకాళహస్తి is located in Andhra Pradesh
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి
Location in Andhra Pradesh, India
Coordinates: 13°46′N 79°42′E / 13.76°N 79.70°E / 13.76; 79.70
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మండలంశ్రీకాళహస్తి
Government
 • Typeపురపాలకసంఘం
 • Bodyశ్రీకాళహస్తి పురపాలక సంఘం
 • శాసనసభ్యుడుబియ్యపు మధుసూధనరెడ్డి
Area
 • Total24.50 km2 (9.46 sq mi)
Population
 (2011)[2]
 • Total80,056
 • Density3,300/km2 (8,500/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30 (IST)

పేరు వ్యుత్పత్తి

శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ఇక్కడ శివలింగాన్ని పూజించినందున, వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది.

చరిత్ర

దస్త్రం:APtown Kalahasti 4.JPG
దక్షిణ గోపురం

సా.శ.పూ. మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రంను గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు.[3]

ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.[4] ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.[5]

సాశ. 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.[6]

భౌగోళికం

Map

పట్టణ విస్తీర్ణం: 24.50 చ.కి.మీ. [1] శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి 38 కి.మీ.ల దూరంలో, నెల్లూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనగణన వివరాలు

2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా80,056.[2]

ప్రయాణ సౌకర్యాలు

మదనపల్లె - నాయుడుపేట పట్టణాలను కలిపే జాతీయ రహదారి 71 పై ఈ పట్టణం వుంది. సమీప నగరమైన తిరుపతి నుండి బస్సు సౌకర్యముంది.గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో ఈ పట్టణం వుంది. సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం.

విద్యా సౌకర్యాలు

శ్రీకాళహస్తీశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

శ్రీకాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాల శ్రీకాళస్తీశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్నది. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల , మునిసిపల్ ప్రాథమికోన్నత పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, సంక్షేమ పాఠశాలలు కూడా ఉన్నాయి.

వైద్య సౌకర్యాలు

బస్ స్టాండుకు సమీపంలోనున్న అయ్యలనాయుడు చెరువులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.

ఆదాయ వనరులు

ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ మార్గాలు వ్యవసాయం, వ్యాపారం , పర్యాటకం. ప్రధాన పంటలు వరి, వేరుశనగ, , చెరకు. వందల కొద్దీ కలంకారీ కళాకారులు కూడా ఆదాయాన్ని చేకూరుస్తున్నారు. ఇంకా చేనేత కళాకారులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉన్నారు. వీరు ప్రధానంగా పట్టణంలోగల "సాలిపేట" అనే ప్రాంతమందు కేంద్రీకృతమై ఉన్నారు. పట్టణంలో జరిగే నిర్మాణాల పనులకు, ఇతర కూలిపనులకు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తారు. బీడీ కార్మికులు కూడా ఎక్కువే.

పరిపాలన

శ్రీకాళహస్తి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

ఆచారాలు, సంస్కృతి , నాగరికత

ఇక్కడి ప్రజలు ప్రధానం తెలుగు మాట్లాడుతారు. కానీ తమిళనాడుకు దగ్గరలో ఉండటం వలన చాలామంది తమిళం కూడా మాట్లాడుతారు. విద్యా రంగంలో మంచి అభివృద్ధిని సాధించడం వలన చాలామంది ఆంగ్లమును కూడా అర్థం చేసుకోగలరు. వస్త్రధారణలో పంచె, చీరలు, లుంగీలు, ధోతీలే కాకుండా ఆధునిక వస్త్రధారణలైన ప్యాంటు, చొక్కా, చుడీదార్ వంటివి కూడా సాధారణమే.

ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ పట్టణం యొక్క సంస్కృతిని ప్రతిబింబజేస్తుంది. కర్ణాటక సంగీత మొట్టమొదటి స్వరకర్తలలో ఒకడైన ముత్తుస్వామి దీక్షితార్ "శ్రీకాళహస్తీశ" అనే భజనల్లో ఈ ఆలయాన్ని కీర్తించాడు.

క్రీడలు

క్రికెట్ ఇక్కడి ప్రజలు బాగా ఆడే, అభిమానించే క్రీడ. అంతేకాక కొన్ని ప్రాంతీయ క్లబ్బులు టెన్నిస్ ను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది 1916లో స్థాపించబడిన రిపబ్లిక్ క్లబ్. ఈ క్లబ్ 2004లో 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంటును కూడా నిర్వహించింది. ఇంకా గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో మొదలైనవి కూడా ఒక మాదిరి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

మాధ్యమాలు

తెలుగులో ప్రధాన పత్రికలైన తమ కార్యాలయాలను కలిగి ఉన్నాయి. ఇంతేకాక ప్రాంతీయంగా వెలువడే చైతన్య, ఆదర్శిని వంటి కొన్ని చిన్న వార్తాపత్రికలు కూడా ఉన్నాయి.

పండుగలు

దస్త్రం:APtown Kalahasti 1.JPG
పట్టణం ప్రవేశం రోడ్

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు: వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.

మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.

నవరాత్రి ఉత్సవాలు: ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు: ఇవి ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.

ఏడు గంగల జాతర: ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.

పర్యాటక ఆకర్షణలు

శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రవేశ ద్వారం
స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

ఇతరాలు

దస్త్రం:APtown Kalahasti 3.JPG
చూడదగ్గ ప్రదేశాల గురించి దేవాలయం వారు ఏర్పాటు చేసిన ఒక బోర్డు
నందనవనంలో కల అందమైన కోనేరు
  • గుడికి దక్షిణాన ఒక కిలోమీటరు దూరంలో శుకబ్రహ్మాశ్రమం ఉంది. దీనిని విద్యా ప్రకాశానందగిరి స్వామి స్థాపించాడు.ఇక్కడ ఏర్పాటు చేసిన భక్త కన్నప్ప కంటి ఆసుపత్రి ద్వారా పేదరోగులకు ఉచితంగా కంటి వైద్యం, ఆపరేషన్లు నిర్వహిస్తారు.
  • గుడికి దగ్గర్లోనే కల "నందనవనం" ("లోబావి") భరధ్వాజ మహర్షి తపస్సు నాచరించిన పుణ్య స్థలం. ఈ సరస్సులో ఒక నాలుగు పలకల మండపం ఉంది.
  • ఇక్కడికి కొద్ది దూరంలో ఉండే వేయిలింగాల కోన కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక కొండ ఎక్కి దిగి మరల ఒక కొండ ఎక్కితే కనిపించే ఒక చిన్న ఆలయంలో ఒకే లింగం పై చెక్కిన వేయి శివ లింగాలను (యక్షేశ్వర లింగము) సందర్శించవచ్చు. దీనికి దగ్గర్లోనే ఒక చిన్న జలపాతం కూడా ఉంటుంది. ప్రత యేటా జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి ఎక్కవగా భక్తులు సందర్శనార్థం విచ్చేస్తుంటారు. జ్ఞాన ప్రసూనాంబ ఇక్కడ దేవతలకు జ్ఞానోపదేశం చేస్తుందట.
  • శ్రీకృష్ణదేవరాయల మంటపం, జలకోటి మంటపం పాలగర్ మంటపం
  • తొండమనాడు ఆలయం: తొండమాను చక్రవర్తి నిర్మించిన ప్రాచీనా వేంకటేశ్వరాలయం.
  • దక్షిణ కాళీమాత దేవాలయం (వేడాం) (2005 లో విగ్రహ పునస్థాపన జరిగింది).
  • దుర్గాంబ కొండ. ఇక్కడ వీర శృంగార మూర్తియైన కనకదుర్గ ఉంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి.
  • సుబ్రహ్మణ్య స్వామి కొండ
  • చక్రేశ్వర స్వామి ఆలయం, జెట్టిపాళెం
  • శ్రీ నింబజాదేవి ఆలయం, జెట్టిపాళెం
  • ద్రౌపదీ సమేత ధర్మరాజులు స్వామి గుడి
  • సూర్య పుష్కరిణి, చంద్ర పుష్కరిణి
  • మణికర్ణిక దేవాలయం

ఇతర విశేషాలు

విజయలక్షి సినిమా హాలు అన్నింటికన్నా ప్రాచీనమైనది.దీనిని సుమారు 80 సంవత్సరాలకు మునుపు నిర్మించి ఉన్నారు.

ప్రముఖులు

ధూర్జటి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, మాజీ శాసన సభ్యులు ఎస్సీవీ నాయుడు, శాంతారాం పవార్, మాజీ శాసన సభ్యులు తాటిపర్తి చెంచురెడ్డి, ప్రముఖ విద్వాంసులు పూడి వెంకటరామయ్య గారు. ప్రముఖ కళాకారులు మోహన్ భార్గవ్, గురప్ప చెట్టి (పద్మశ్రీ). ప్రముఖ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఒక సంవత్సరం పాటు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చదవడం విశేషం.

ఇవి కూడా చూడండి

మూలాలు

వనరులు

  • శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం వారి సమాచార పత్ర పుస్తకం (2000)

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు