స్వతంత్ర పార్టీ

భారతదేశంలో 1959 నుండి 1974 వరకు ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీ

స్వతంత్ర పార్టీ 1959 నుండి 1974 వరకు భారతదేశంలో ఉనికిలో ఉన్న సాంప్రదాయిక ఉదారవాద రాజకీయ పార్టీ. జవహర్‌లాల్ నెహ్రూ ఆధిపత్యంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సామ్యవాద, స్టాటిస్టు దృక్పథానికి ప్రతిస్పందనగా సి. రాజగోపాలాచారి [11] దీనిని స్థాపించాడు.[1]

స్వతంత్ర పార్టీ
స్థాపకులురాజగోపాలాచారి
స్థాపన తేదీ1959 జూన్ 4
రద్దైన తేదీ1974
రాజకీయ విధానంసాంప్రదాయ వాదం[1]
సాంప్రదాయిక ఉదారవాదం[2]
ఉదారవాద సాంప్రదాయికవాదం[3]
లౌకికవాదం[4]
వ్యావసాయిక వాదం[5]
రాజకీయ వర్ణపటంమధ్య-మిత వాదం[6][7][note 1]
రంగు(లు)Blue
Election symbol

స్వతంత్ర పార్టీలో అనేక మంది ప్రముఖ నాయకులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పాత కాంగ్రెస్ సభ్యులైన సి. రాజగోపాలాచారి, మినూ మసాని, NG రంగా, దర్శన్ సింగ్ ఫెరుమాన్, [12] [13] ఉధమ్ సింగ్ నాగోకే [14] KM మున్షీ వంటి వారే. ఆవడి,[15] నాగపూర్ సమావేశాల్లో కాంగ్రెస్ వామపక్ష విధానల వైపు మలుపు తీసుకోవడం ఈ పార్టీ ఏర్పాటుకు మూల కారణమైంది.

లెయిసె ఫెయిర్[note 2] విధానాలను వ్యతిరేకించినప్పటికీ స్వతంత్ర పార్టీ, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, " లైసెన్స్ రాజ్ "ను నిర్వీర్యం చేయాలనే సిద్ధాంతానికి కట్టుబడింది. భారతీయ రాజకీయ వర్ణపటంలో ఆర్థిక విధానాల పరంగా మితవాదిగా (దక్షిణ పక్ష వాదిగా) పరిగణించబడినప్పటికీ స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్ వంటి హిందూ జాతీయవాది లాగా మతాధారిత పార్టీ కాదు. రాజగోపాలాచారి, అతని సహచరులు స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూకు సహచరులుగా ఉన్నప్పటికీ తాము స్వతంత్ర పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ 1960 లో 21 అంశాల మేనిఫెస్టోను రూపొందించారు.[16] ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వతంత్ర పార్టీని తీవ్రంగా విమర్శించాడు. దానిని "ప్రభువులు, కోటలు, జమీందార్లూ ఉండే మధ్య యుగాలకు" చెందినదిగా వర్ణించాడు.[17]

చరిత్ర

ఎన్నికల చరిత్ర

స్వతంత్ర పార్టీ స్థాపన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో -1962 సార్వత్రిక ఎన్నికలలో - 7.89 శాతం ఓట్లు పొంది, మూడవ లోక్‌సభ (1962-67)లో 18 సీట్లు సాధించింది. బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఆధిపత్య కాంగ్రెస్‌కు ఇది ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 1967లో తదుపరి సాధారణ ఎన్నికల నాటికి, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర పార్టీ ఒక ముఖ్యమైన శక్తిగా మారింది; ఇది 8.7 శాతం ఓట్లను గెలుచుకుని, 44 సీట్లతో నాల్గవ లోక్‌సభ (1967–71)లో ఏకైక అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 1971 లో, స్వతంత్ర పార్టీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఓడించే లక్ష్యంతో రాజకీయ స్పెక్ట్రం అంతటా ఉన్న పార్టీల "మహా కూటమి"లో చేరింది. ఆ పార్టీ 3% ఓట్లతో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. మరుసటి సంవత్సరం, 1972లో, దాని వ్యవస్థాపకుడు, రాజగోపాలాచారి మరణించడంతో స్వతంత్ర పార్టీ వేగంగా క్షీణించింది. 1974 నాటికి, దాన్ని రద్దు చేసారు. దానిలోని చాలా మంది సభ్యులు చరణ్ సింగ్ నేతృత్వంలోని భారతీయ లోక్ దళ్‌లో చేరారు.

సంవత్సరంఎన్నికలుపొందిన వోట్ల శాతంసాధించిన సీట్లు
19621962 భారత సాధారణ ఎన్నికలు7.9 %
18 / 494
[18]
19671967 భారత సాధారణ ఎన్నికలు8.7 %
44 / 520
19711971 భారత సాధారణ ఎన్నికలు3.1 %
8 / 518

భావజాలం

స్వతంత్ర పార్టీ స్వభావం పట్ల దాని ప్రత్యర్థులకు, ఇతర పరిశీలకులకు భిన్నాభిప్రాయాలున్నాయి. ఇది "దక్షిణాదికి చెందిన సంప్రదాయవాద ధనిక రైతులు, పశ్చిమాన ఉన్న కొంతమంది ఆర్థిక పెట్టుబడిదారులు, కొంతమంది బీహార్, యుపి భూస్వాములు, ఉత్తరాదిలో మతవాద పెద్దలకూ" చెందిన పార్టీగా వర్ణించబడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దీనిని "మితవాద, అంధకార ప్రతిచర్య శక్తుల"లో ఒకటిగా అభివర్ణించింది. నెహ్రూ ఈ పార్టీని "ప్రభువులు, కోటలు. జమీందార్లూ ఉండే మధ్య యుగాలకు" చెందినదనీ, అది "దృక్పథంలో మరింత ఫాసిస్టు" అవుతుందనీ భావించాడు. స్వతంత్ర పార్టీ మద్దతుదారులు పార్టీని "ఒక ప్రగతిశీల ఉదారవాద పార్టీ"గా చూశారు. ఒక అమెరికన్ పండితుడు పార్టీని "ఒక మతపరమైన సంప్రదాయవాద పార్టీ"గా చూశాడు. [19]

ప్రాథమిక సూత్రాలు

మొట్టమొదటగా, స్వతంత్ర పార్టీ "మతం, కులం, వృత్తి లేదా రాజకీయ అనుబంధం లేకుండా" ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఉండాలనేదానికి కట్టుబడి ఉంది.[20]

అతి తాకువ ప్రభుత్వ జోక్యంతో, వ్యక్తులకు గరిష్ట స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా ప్రజల పురోగతి, సంక్షేమం, సంతోషాలను సాధించవచ్చని పార్టీ భావించింది. ఇతర వ్యక్తులకు నేరుగా సహాయం చేసే భారతీయ సంప్రదాయాన్ని పెంపొందించడం ద్వారా ప్రభుత్వం తన జోక్యాన్ని తగ్గించుకోవాలి.[20]

ప్రత్యేకించి, భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులకు రాజ్యం కట్టుబడి ఉండాలనీ, ప్రత్యేకించి ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తుల ఆస్తులను సంపాదించవలసి వస్తే వారికి తగిన పరిహారం ఇవ్వాలని పార్టీ విశ్వసించింది. పౌరులకు తాము కోరుకున్నట్లుగా తమ పిల్లలను చదివించడానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కూడా ఇది విశ్వసించింది.[20] ఆహార ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి, రైతులకు పూర్తి భూమి హక్కులు, వ్యవసాయంలో ఉత్పత్తిని పెంచడానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా అది సాధించాలని కోరింది.[20] భారతీయ రైల్వేల వంటి జాతీయ సేవల్లోను, పరిశ్రమల్లో ప్రైవేట్ సంస్థలకు అవసక్వ్రమైనంత మేరకూ మాత్రమే ప్రభుత్వ ఉనికి ఉండేలా దాన్ని కనీస స్థాయికి తగ్గించాలని భావించింది. ఇది వాణిజ్య, వ్యాపారాలపై నియంత్రణలను తొలగించాలని కోరింది. అయితే, ఇది అసమంజసమైన లాభాలు, ధరలు, డివిడెండ్‌లకు వ్యతిరేకంగా కట్టుబడి ఉంది. ఇది క్యాపిటల్ గూడ్స్ పరిశ్రమలు, వినియోగ వస్తువుల పరిశ్రమలు, గ్రామీణ, చిన్న పరిశ్రమల అభివృద్ధికి సమానమైన ప్రాధాన్యతనిస్తుందని పార్టీ విశ్వసించింది. [20] పన్నులు, ప్రభుత్వ వ్యయం రంగాలలో పొదుపుగా ఉండాలని పార్టీ విశ్వసించింది. రాష్ట్రం తీసుకున్న పరిపాలన, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడానికి మాత్రం సరిపోతాయేలా పన్నులు ఉండాలని పిలుపునిచ్చింది. అయితే మూలధన నిర్మాణం, ప్రైవేట్ పెట్టుబడులను తగ్గించకూడదని భావించింది. ప్రభుత్వం అసాధారణంగా పెద్ద లోటులను ఎదుర్కోవడం లేదా దేశం తిరిగి చెల్లించే సామర్థ్యానికి మించిన విదేశీ రుణాలు తీసుకోవడం మానుకోవాలి. ప్రత్యేకించి, అనవసరమైన బ్యూరోక్రసీ విస్తరణను వ్యతిరేకించింది. [20]

ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడం కోసం మద్దతిస్తూనే స్వతంత్ర పార్టీ, కార్మికులకు న్యాయమైన ప్రతిఫలం, పెరిగిన ఉత్పాదకతకు తగిన వేతనాలు, సామూహిక బేరసారాల హక్కుల పట్ల కట్టుబడి ఉంది.[21] పార్టీ ప్రాథమిక సూత్రాలలో చేర్చని ఏ అంశాన్ని ప్రశ్నించడానికి, విమర్శించడానికైనా దాని సభ్యులకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చింది. [20]

ఇతరులు

పార్టీ ప్రాథమిక సూత్రాలు విదేశాంగ విధానం, జాతీయ భాష, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ, మత, సామాజిక సంస్కరణ వంటి అనేక అంశాలను కవర్ చేయలేదు.[22]

పార్టీ సాధారణంగా కమ్యూనిజానికి వ్యతిరేకి. 1969లో, సాయుధ పోరాటాలకు బహిరంగంగా లేదా నిశ్శబ్దంగా మద్దతు ఇస్తున్నందున, ఆ సమయంలో భారతదేశంలోని మూడు ప్రధాన కమ్యూనిస్ట్ పార్టీలైన CPI, CPI(M), నక్సలైట్లను నిషేధించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇవి దేశానికి ప్రధాన భద్రతా ముప్పుగా స్వతంత్ర పార్టీ భావించింది. [23]

విదేశీ వ్యవహారాలలో ఇది, అలీనోద్యమాన్ని, సోవియట్ యూనియన్‌తో సన్నిహిత సంబంధాన్నీ వ్యతిరేకించింది. యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ ఐరోపాతో సన్నిహిత సంబంధాలు నెరపాలని సూచించింది. [23]

క్షీణత, వారసత్వం

భారత రాజకీయాల్లో మధ్యేవాద/మితవాద పార్టీలకు ఇంకా చోటు కలగనందున స్వతంత్ర పార్టీ విఫలమైంది. అలాగే, ధనిక, మధ్యతరగతి రైతులు కాంగ్రెస్ నుండి పూర్తిగా దూరం కాలేదు. ప్రత్యేకించి సహకార వ్యవసాయాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచడం, భూ పరిమితి చట్టాలు వాస్తవంలో అప్పటికే ఉన్న ఆస్తులకు పెద్దగా ముప్పు కలిగించలేదు. పైగా భూ ఆదాయాన్ని తగ్గించడం, గ్రామీణ రుణాల సదుపాయం, మెరుగైన రవాణా, నీటిపారుదల, విద్యుదీకరణ వంటి ప్రభుత్వ విధానాలు, చర్యల వల్ల వాళ్ళే ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు. వ్యాపార వర్గం కూడా ప్రణాళికలు, ప్రభుత్వ రంగం, ప్రభుత్వ నిబంధనలు తమ వృద్ధిని నిరోధించలేదనీ, బదులుగా అనేక అంశాలలో తాము అభివృద్ధి చెందడానికి అవి సహాయపడ్డాయనీ గుర్తించింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కూడా దాని విస్తరణకు తగినంత అవకాశాలను మిగిల్చింది. అన్నింటికీ మించి, నెహ్రూ ప్రభుత్వం తన అభివృద్ధి, సంస్కరణవాద ఎజెండాను కొనసాగించడంలో దృఢంగా ఉన్నప్పటికీ, ఆస్తులు కలిగిన తరగతుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించింది. రాజులు, భూస్వాములు తుడిచిపెట్టుకుపోలేదు. పరిహారాలు, ఇతర ఆర్థిక రాయితీలతో వారికి ఊరట లభించింది. చివరగా, నెహ్రూ జీవించి ఉన్నంత కాలం దేశంలో ఆయన స్థానం అజేయం అని గ్రహించిన కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీని వీడే ఆలోచన చెయ్యలేదు.

మరోవైపు, 1969 లో కాంగ్రెస్ చీలిపోయి, కాంగ్రెస్ (O) ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించినప్పుడు, మితవాద పార్టీగా అది చాలా శక్తివంతమైనదవడంతో ఒక ప్రత్యేక పార్టీగా స్వతంత్ర పార్టీ ఉనికికి హేతువు లేకుండా పోయింది.

లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక నాయకుడైన నాగభైరవ జయ ప్రకాష్ నారాయణను 2014 లో తన పార్టీని "స్వతంత్ర పార్టీ ఆధునిక అవతారంగా" చూస్తున్నారా అని అడిగినప్పుడు అతను, "అవును.. .. స్వతంత్ర పార్టీ స్థాపకులు దూరదృష్టి గలవారు. భారతదేశం వారి నాయకత్వాన్ని అనుసరించి ఉంటే, ఆర్థికంగా ఈ రోజు చైనా ఎక్కడ ఉందో మనమూ అక్కడ ఉండేవాళ్లం" అన్నాడు. [24]

గమనికలు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు