అయోధ్య వివాదం

అయోధ్య లోని మతపరమైన స్థలం కేంద్రంగా జరిగిన రాజకీయ, సామాజిక, మత వివాదం

అయోధ్య వివాదం భారతదేశంలో రాజకీయ, చారిత్రక, సామాజిక, మతపరమైన వివాదం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరంలోని ఒక స్థలంపై కేంద్రీకృతమై ఉంది. కనీసం 18వ శతాబ్దం నుండి హిందువులు తమ ఆరాధ్య దైవం రాముని జన్మస్థలంగా పరిగణిస్తున్న స్థలం ఇది.[1] ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదు చరిత్ర, దాని స్థానం, అక్కడ హిందూ దేవాలయం ఉండేదా, మసీదును నిర్మించేందుకు దాన్ని కూల్చేసారా అనే దాని చుట్టూ సమస్య తిరిగింది.

అయోధ్యలో వివాదాస్పద స్థలం మ్యాప్

బాబ్రీ మసీదు ఉన్న ప్రదేశం రామ జన్మస్థలంగా చెప్పబడుతోందనేందుకు ఆధారాలు కనీసం 1822 నుండి ఉన్నాయి. ఫైజాబాద్ కోర్టులో సూపరింటెండెంట్ అయిన హఫీజుల్లా 1822లో కోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో అతను, "బాబరు చక్రవర్తి స్థాపించిన మసీదు, రాముడి జన్మస్థలం వద్ద ఉంది" అని పేర్కొన్నాడు. [2] 1855లో స్థానిక ముస్లింలు సమీపంలోని హనుమాన్ గఢీ దేవాలయం పూర్వపు మసీదు స్థలంలో నిర్మించబడిందని భావించారు. ఆ ఆలయాన్ని కూల్చివేయాలని నిర్ణయించుకున్నారు, ఫలితంగా హింసాత్మక ఘర్షణలు జరిగి అనేక మంది ముస్లింల మరణానికి దారితీశాయి. [3] 1857 లో, బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలం అనుకునే స్థలంలో ఒక చబుత్రాను (వేదిక) నిర్మించారు. ఈ వివాదం పర్యవసానంగా 1885 లో బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామ జన్మస్థలానికి గుర్తుగా భావించే చబుత్ర చుట్టూ ఆలయాన్ని నిర్మించనీయాలని అభ్యర్థిస్తూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ స్థలంపై హిందూ పక్షానికి యాజమాన్య హక్కులు లేవని పేర్కొంటూ తిరస్కరించబడింది. ఈ నిర్ణయంపై ఒక సంవత్సరం తర్వాత అప్పీల్ చేసారు. ఫైజాబాద్ జిల్లా కోర్టు, "చాలా సమయం గడిచిందని ప్రస్తావిస్తూ" మరోసారి తిరస్కరించింది. అయితే "హిందువులు ప్రత్యేకంగా పవిత్రంగా భావించే భూమిలో మసీదు చాలా దురదృష్టకరం. కానీ ఆ సంఘటన 356 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ ఫిర్యాదును పరిష్కరించడానికి చాలా ఆలస్యమై పోయింది." అంటూ హిందూ పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించింది, [4] [5] [6] [7] దీని తర్వాత 1934 లో జరిగిన గోహత్య తర్వాత అల్లర్లు జరిగి బాబ్రీ మసీదును దెబ్బతింది. 1949లో రామ భక్తులు మసీదులో విగ్రహాలను ఉంచారు, ఆ తర్వాత ఈ నిర్మాణం లోకి ముస్లింల ప్రవేశం నిషేధించబడింది.

1992 డిసెంబరు 6న జరిగిన రాజకీయ ర్యాలీలో బాబ్రీ మసీదు ధ్వంసం చేయబడింది. భారత ఉపఖండం అంతటా అల్లర్లు చెలరేగాయి. [8] [9] [10] [11] గతంలో జరిగిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటిలో ఒకటి 1990 లో అయోధ్య కాల్పుల ఘటనకు దారితీసింది. [12] అలహాబాద్ హైకోర్టులో భూమి హక్కు కేసు దాఖలు చేయబడింది. దాని తీర్పు 2010 సెప్టెంబరు 30 న వెలువడింది. ఆ తీర్పులో, అలహాబాద్ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులు అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని తీర్పు ఇచ్చారు, విశ్వహిందూ పరిషత్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లా లేదా బాల రామునికి మూడవ వంతు, [13] మూడవ వంతు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, మిగిలిన మూడవది హిందూ మత శాఖ అయిన నిర్మోహి అఖారాకు వెళుతుంది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు, అయితే అదే స్థలంలో మసీదు కంటే ముందు ఆలయ నిర్మాణం ఉండేదని అంగీకరించింది. [14] [15] [16]

ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం టైటిల్ వివాద కేసులను 2019 ఆగస్టు నుండి అక్టోబరు వరకు విచారించింది.[14][17] 2019 నవంబరు 9 న, ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కోర్టు తమ తీర్పును ప్రకటించింది; ఇది మునుపటి నిర్ణయాన్ని రద్దు చేసి, పన్ను రికార్డుల ఆధారంగా ఈ భూమి ప్రభుత్వానికి చెందుతుందని తీర్పు చెప్పింది. [18] హిందూ దేవాలయాన్ని నిర్మించేందుకు భూమిని ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. మసీదును నిర్మించేందుకు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. [19]

2020 ఫిబ్రవరి 5న, భారత ప్రభుత్వం అక్కడ రామ మందిరాన్ని పునర్నిర్మించడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటన చేసింది. [20] మసీదును నిర్మించేందుకు అయోధ్యలోని ధన్నిపూర్‌లో ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది.[19][21] [22]

2024 జనవరి 22 న భారత ప్రభుత్వం, రామమందిరాన్ని అధికారికంగా ప్రారంభించింది.[23] కొత్త శకానికి నాందిగా పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విగ్రహ ప్రతిష్ఠ చేసాడు. [23] 2024 డిసెంబరు నాటికి ఆలయం పూర్తిగా పూర్తవుతుందని భావిస్తున్నారు [24]

సుల్తాన్‌పూర్‌లోని పండిట్ దేవి దీన్ పాండే మెమోరియల్

మతపరమైన నేపథ్యం

మధ్యయుగపు మసీదు, బాబ్రీ మసీదు ఉన్న భూమిని హిందువులు తమ ఆరాధ్య దైవమైన రాముని జన్మస్థలంగా పరిగణిస్తారు. ఇదే అయోధ్య వివాదానికి కేంద్రం. [25]

రామ జన్మభూమి (రామ జన్మస్థలం)

రాముడు అత్యంత విస్తృతంగా పూజించబడే హిందూ దేవుడు. ఇక్ష్వాకు వంశపు రాజుల రాజధాని నగరం అయోధ్యలో, త్రేతాయుగంలో కౌసల్య, దశరథులకు రాముడు జన్మించాడు.[26]

అయోధ్య "తీర్థయాత్ర మాన్యువల్"గా వర్ణించబడిన అయోధ్య మహాత్మ్యం, [27] [28] రెండవ సహస్రాబ్దిలో శాఖ పెరుగుదలను గుర్తించింది. 11వ, 14వ శతాబ్దాల మధ్య కాలానికి చెందిన ఈ గ్రంథపు అసలు ప్రచురణ, [29] జన్మస్థానాన్ని తీర్థయాత్రా స్థలంగా పేర్కొంది. [29] తరువాత జరిగిన పునఃప్రచురణలో అయోధ్యలోని రామదుర్గ ("రాముని కోట") అని పేర్కొన్న కోటతో కూడిన పట్టణం మొత్తాన్ని తీర్థయాత్ర స్థలాలుగా ప్రకటించింది.[29][note 1]

బాబ్రీ మసీదు (బాబరు మసీదు)

బాబరు భారతదేశపు మొదటి మొఘల్ చక్రవర్తి, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. అతని ఆదేశాల మేరకు, అతని సేనాధిపతులలో ఒకడైన మీర్ బాకీ, 1528లో బాబ్రీ మసీదును నిర్మించాడని భావిస్తారు. [32] ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సర్వేయరు ఫ్రాన్సిస్ బుకానన్ మసీదు గోడలపై ఈ వాస్తవాన్ని ధృవీకరించే శాసనాన్ని కనుగొన్నట్లు నివేదించినప్పుడు, ఈ నమ్మకం 1813-14 నుండి వ్యాప్తిలోకి వచ్చింది. ఔరంగజేబ్ ( r. 1658 – 1707 ) ఇక్కడి రామాలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడనే స్థానికంగా ఉన్న నమ్మకాన్ని కూడా అతను పేర్కొన్నాడు. [33] [2] 1528, 1668 మధ్య, ఆ ప్రదేశంలో మసీదు ఉన్నట్లు ఏ గ్రంథం లోనూ పేర్కొనలేదు. [2] 1717లో మసీదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కొనుగోలు చేసిన మొఘల్ ఆస్థానంలో రాజపుత్ర రాజు అయిన జై సింగ్ II నుండి మసీదుకు సంబంధించిన తొలి చారిత్రక రికార్డు లభించింది. అతని పత్రాలు మసీదును పోలి ఉండే మూడు గోపురాల నిర్మాణాన్ని చూపుతాయి. అయితే ఇది "జన్మస్థలం" ( ఛతీ ) అని అది పేర్కొంది. ప్రాంగణంలో ఒక వేదిక ( చబుత్ర ) ను చూడవచ్చు, దానికి హిందూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేస్తున్నారు. [34] ఈ వివరాలన్నీ అర్ధ శతాబ్దం తర్వాత జెస్యూట్ పూజారి జోసెఫ్ టిఫెంథాలర్ ధృవీకరించాడు. [34] "దీనికి కారణం ఒకప్పుడు ఇక్కడ బెస్చన్ [విష్ణు] రాముని రూపంలో జన్మించిన ఇల్లు ఉండటమే" అని టిఫెంతలర్ కూడా చెప్పాడు. [2]

బాబర్‌నామాలో, బాబరు తన జీవితాన్ని వివరంగా రాసాడు. అయోధ్యలో మసీదు నిర్మాణం గురించి లేదా దాని కోసం ఒక ఆలయాన్ని ధ్వంసం చేయడం గురించి అతను ప్రస్తావించలేదు (1528 ఏప్రిల్ 3 - సెప్టెంబరు 17 మధ్య అతని డైరీలో ఒక లోపం ఉంది - సరిగ్గా ఆ కాలం లోనే బాబరు అయోధ్యను సందర్శించాడు.[35] ); అతని మనవడైన అక్బరు కోర్టు పత్రాలు, ఐన్-ఇ-అక్బరీ గానీ, అక్బరుకు సమకాలికుడైన కవి-సన్యాసి తులసీదాస్ రాసిన రామచరితమానస్ కావ్యంలో గానీ ఈ ప్రస్తావన లేదు. [36]

హిందువులు, ముస్లింలు ఇద్దరూ "మసీదు-ఆలయం" వద్ద పూజించారని చెబుతారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చెయ్యగా, హిందువులు మసీదు వెలుపల కానీ కాంపౌండు లోపల పూజలు చేసేవారు. 1857లో ఒక బ్రిటిషు అధికారి, వివాదాలను నివారించడానికి రెండు ప్రాంతాల మధ్య రెయిలింగ్‌ను ఏర్పాటు చేశాడు.[37][38][19]1949 లో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాముడి విగ్రహాన్ని మసీదు లోపల ఉంచారు. ఇది వివాదానికి దారితీసింది. [38]

వివాదం ప్రారంభం

అయోధ్యలో మొదటిసారిగా 1855 లో మతపరమైన హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. కొంతమంది "హనుమాన్‌గఢీకి చెందిన బైరాగులు దాని పైన ఉన్న మసీదును ధ్వంసం చేశారని సున్నీలు పేర్కొన్నారు. ముస్లింలు హనుమాన్‌గఢీపై దాడి చేశారు. కానీ హిందువులు వారిని తరిమికొట్టారు. వారు హనుమాన్‌గఢీ నుండి ఒక కిలోమీటరు లోపు దూరంలో ఉన్న బాబరు మసీదు లోపల దాక్కున్నారు." [39] ఈ క్రమంలో బాబ్రీ మసీదుపై హిందువులు దాడి చేశారు. అప్పటి నుండి, స్థానిక హిందూ సంఘాలు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలనీ, ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించడానికి అనుమతించాలనీ అప్పుడప్పుడు డిమాండ్లు చేస్తూ వచ్చారు. వాటన్నింటినీ వలస ప్రభుత్వం తిరస్కరించింది.

1946 లో, అఖిల భారతీయ రామాయణ మహాసభ (ABRM) అని పిలువబడే హిందూ మహాసభ శాఖ ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక ఆందోళనను ప్రారంభించింది. 1949 లో, గోరఖ్‌నాథ్ మఠానికి చెందిన సంత్ దిగ్విజయ్ నాథ్ ABRM లో చేరాడు. 9-రోజుల రామచరిత్ మానస్ నిరంతర పారాయణాన్ని నిర్వహించాడు. దాని ముగింపులో హిందూ కార్యకర్తలు మసీదులోకి చొరబడి రాముడు, సీత విగ్రహాలను లోపల ఉంచారు. డిసెంబరు 22-23 తేదీలలో, మసీదు లోపల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. విగ్రహాలు ఆ కట్టడంలో స్వయంభువుగా ప్రత్యక్షమయ్యాయని ప్రజలు నమ్మారు. [25] [40]

జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభ్‌భాయ్ పటేల్ లు విగ్రహాలను తొలగించాలని పట్టుబట్టారు. కానీ, గోవింద్ బల్లభ్ పంత్ విగ్రహాలను తొలగించడానికి ఇష్టపడలేదు. "విజయానికి తగిన అవకాశం ఉంది, కానీ పరిస్థితులు ఇప్పటికీ సందిగ్ధంగానే ఉన్నాయి. ఈ దశలో ఇంతకంటే ఎక్కువ చెప్పడం మంచిది కాదు" అని అతను అన్నాడు. [41] [42] 1950 నాటికి, ప్రభుత్వం CrPC సెక్షన్ 145 కింద కట్టడాన్ని అధీనం లోకి తీసుకుంది. ఈ స్థలంలో పూజలు చేయడానికి ముస్లిములను కాకుండా, హిందువులను అనుమతించింది.[43] మసీదు దేవాలయంగా మార్చబడింది. ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, ABRM రెండూ స్థానిక కోర్టులో సివిల్ దావాలు దాఖలు చేశాయి.[37]

క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ హిందూ జాతీయవాదాన్ని గోరఖ్‌నాథ్ విభాగాన్ని 'మరొక కాషాయం' అని అన్నాడు. ఇది సంఘ్ పరివార్ కు చెందిన ప్రధాన స్రవంతి హిందూ జాతీయవాదం నుండి వేరుగా తన ఉనికిని కొనసాగించింది. 1964 లో విశ్వహిందూ పరిషత్ (VHP) ఏర్పడి బాబ్రీ మసీదు స్థలం కోసం ఆందోళనలు ప్రారంభించిన తర్వాత, రెండు 'కాషాయ రాజకీయాల' శాఖలు ఒక్కటయ్యాయి. [44] 1950 లు, 1960లలో వ్యాజ్యాలు కొనసాగుతుండగా, 1984 లో VHP మసీదు నుండి "విముక్తి" కోరుతూ అయోధ్యలో ఊరేగింపు నిర్వహించినపుడు, అయోధ్య వివాదం కొత్త రూపాన్ని సంతరించుకుంది.[45][46]

బాబ్రీ మసీదు కూల్చివేత

1980 వ దశకంలో, ప్రధాన స్రవంతి హిందూ జాతీయవాద కుటుంబమైన సంఘ్ పరివార్‌కు చెందిన విశ్వ హిందూ పరిషత్ (VHP), హిందువుల కోసం ఈ స్థలాన్ని "పునరుద్ధరించడానికి", ఈ ప్రదేశంలో బాలరాముడి (రామ్‌లాలా) ఆలయాన్ని నిర్మించడానికీ ఒక కొత్త ఉద్యమాన్ని ప్రారంభించింది. జనసంఘ్ అవశేషాల నుండి 1980 లో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ (భాజపా) ఈ ప్రచారానికి రాజకీయ ముఖంగా మారింది. 1986 లో, కట్టడం ద్వారాలు తిరిగి తెరవాలని, హిందువులు లోపల పూజలు చేయడానికి అనుమతించాలనీ ఒక జిల్లా జడ్జి తీర్పునిచ్చాడు. ఇది ఉద్యమానికి పెద్ద ఊపునిచ్చింది. [25]1990 సెప్టెంబరులో బిజెపి నాయకుడు ఎల్‌కె అద్వానీ ఈ ఉద్యమానికి మద్దతునిచ్చేందుకు అయోధ్యకు " రథయాత్ర " ప్రారంభించాడు. ఆ తరువాత అద్వానీ, తన జ్ఞాపకాలలో ఇలా పేర్కొన్నాడు, "ముస్లింలు మక్కాలో ఇస్లామిక్ వాతావరణానికి అర్హులైతే, వాటికన్‌లో క్రైస్తవులు క్రైస్తవ వాతావరణానికి అర్హులైతే, హిందువులు అయోధ్యలో హిందూ వాతావరణాన్ని ఆశించడంలో తప్పు ఏముంది?" యాత్ర ఫలితంగా అనేక నగరాల్లో మతపరమైన అల్లర్లు జరిగాయి. బీహార్ ప్రభుత్వం అద్వానీని అరెస్టు చేసింది. ఇదిలావుండగా, పెద్ద సంఖ్యలో ' కర్ సేవకులు ' లేదా సంఘ్ పరివార్ కార్యకర్తలు అయోధ్యకు చేరుకుని మసీదుపై దాడికి ప్రయత్నించారు. వారిని ఉత్తరప్రదేశ్ పోలీసులు, పారామిలటరీ బలగాలు అడ్డుకున్నాయి, దీని ఫలితంగా అనేక మంది కరసేవకులు మరణించారు. విపి సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బలహీనంగా ఉందని ఆరోపిస్తూ, బిజెపి తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో తాజా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో, ఉత్తరప్రదేశ్ శాసనసభలో బిజెపి మెజారిటీ సాధించింది., లోక్‌సభలో తన సీట్ల వాటాను పెంచుకుంది. [47]

1992 డిసెంబరు 6 న, విశ్వహిందూ పరిషత్తు, దాని సహచరులు, భాజపాతో సహా, మసీదు స్థలంలో 1,50,000 కరసేవక్‌లు పాల్గొన్న ర్యాలీని నిర్వహించారు. ఈ వేడుకల్లో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ నేతలు ప్రసంగించారు.[48] ప్రసంగాల సమయంలో జనసమూహంలో ఉద్వేగాలు పెరిగి. మధ్యాహ్నం తర్వాత మసీదుపై దాడి చేసారు. మసీదును రక్షించడానికి అక్కడ ఉంచిన పోలీసుల సంఖ్య భారీగా ఉంది. అనేక అధునాతన సాధనాలతో మసీదుపై దాడి చేసారు. కొన్ని గంటల్లో దాన్ని నేలమట్టం చేసారు.[9][49] మసీదుకు హాని జరగనివ్వమని రాష్ట్ర ప్రభుత్వం భారత సుప్రీంకోర్టుకు మాట ఇచ్చినప్పటికీ ఇది జరిగింది.[48][50] కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లలో 2000 మందికి పైగా మరణించారు.[25] ముంబై, భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్ సహా అనేక ప్రధాన భారతీయ నగరాల్లో అల్లర్లు చెలరేగాయి . [51]

1992 డిసెంబరు 16 న, బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం లిబర్‌హాన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. [52] వివిధ ప్రభుత్వాలు మంజూరు చేసిన అనేక పొడిగింపులతో భారతదేశ చరిత్రలో ఇది సుదీర్ఘకాలం నడిచిన విచారణ కమిషన్. అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమాభారతి, విజయరాజే సింధియా, బిజెపి నాయకులతో సహా పలువురు కూల్చివేతలో దోషులుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గిరిరాజ్ కిషోర్, అశోక్ సింఘాల్ వంటి విహింప నాయకులు కూడా అందులో ఉన్నారు. కమిషన్ అభియోగాలు మోపిన ఇతర ప్రముఖ రాజకీయ నాయకులలో దివంగత శివసేన చీఫ్ బాల్ థాకరే, మాజీ RSS నాయకుడు KN గోవిందాచార్య ఉన్నారు. పలువురు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను ఆధారం చేసుకొని, ర్యాలీలో చాలా మంది నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని నివేదిక పేర్కొంది. అలాగే, వారు కావాలనుకుంటే కూల్చివేతలను ఆపగలిగేవారని కూడా అది పేర్కొంది. [53]

వివాదాస్పద కట్టడాన్ని ధ్వంసం చేయడంపై పలు ముస్లిం సంస్థలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. 2005 జూలైలో, ధ్వంసమైన మసీదు స్థలంలో ఉన్న తాత్కాలిక ఆలయంపై ఉగ్రవాదులు దాడి చేశారు. 2007 లో అప్పటి రామాలయ అధిపతి ఎంఎన్ గోపాల్ దాస్‌కు ప్రాణహాని చేస్తూ బెదిరింపులకు ఫోన్లు వచ్చాయి. [54] ఇండియన్ ముజాహిదీన్ వంటి నిషేధిత జిహాదీ సంస్థలు దేశంలో చేసిన అనేక ఉగ్రవాద దాడులకు సాకుగా బాబ్రీ మసీదు కూల్చివేతను చూపాయి. [55] [56] [57] [58]

సుప్రీంకోర్టు తీర్పు

సుప్రీంకోర్టు (SC) ఈ కేసుపై తుది విచారణను 2019 ఆగస్టు 6 [59] నుండి 2019 అక్టోబరు 16 వరకు నిర్వహించింది.[17] బెంచ్ తుది తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయస్థానం తీర్పు చెప్పాల్సిన అంశాలపై వ్రాతపూర్వక గమనికలను దాఖలు చేయడానికి ఇరు పక్షాలకు మూడు రోజుల సమయం ఇచ్చింది. [60]

సుప్రీంకోర్టు తుది తీర్పును 2019 నవంబరు 9న ప్రకటించింది.[61] హిందూ దేవాలయం నిర్మించేందుకు భూమిని ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. [19] నిర్మోహి అఖారా షెబైట్ గానీ, రామ్ లల్లా భక్తుడు గానీ కాదని కోర్టు తన తీర్పులో పేర్కొంది, అఖారా వేసిన దావాను నిరోధించింది. [62]

ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన మొత్తం 18 పిటిషన్లను సుప్రీంకోర్టు 2019 డిసెంబరు 12 న కొట్టివేసింది [63]

కాలక్రమం

సంవత్సరం.తేదీసంఘటన [64][65]
1528దాని గోడలపై ఉన్న శాసనం ప్రకారం, బాబరు చక్రవర్తి ఆదేశాల మేరకు బాబ్రీ మసీదును నిర్మించారు. రాముని జన్మస్థలంలో ఉన్న ఒక ఆలయ శిధిలాలను కూల్చివేసిన తరువాత దీనిని నిర్మించినట్లు స్థానిక సంప్రదాయం చెబుతోంది.[66][25]
1611ఆంగ్ల వ్యాపారి విలియం ఫించ్ రాముని కోటను, యాత్రికులు సందర్శించే ఇళ్ళను నమోదు చేశారు.[67]
1717రాజపుత్ర కులీనుడైన రెండవ జై సింగ్ మసీదు భూమిని కొనుగోలు చేసి దేవాలయానికి రాసి ఇచ్చాడు. మసీదు వెలుపల హిందువులు రామ విగ్రహాలను పూజిస్తారు.[34]
1768జెస్యూట్ పూజారి జోసెఫ్ టిఫెంథాలర్ ఈ మసీదును చూసి, దీనిని ఔరంగజేబు నిర్మించాడని స్థానిక సంప్రదాయాన్ని నమోదు చేయగా, బాబరు దీనిని నిర్మించాడని కొందరు చెప్పారు.[1]
1853ఈ ప్రదేశంపై నమోదు చేయబడిన మొదటి మత ఘర్షణలు ఈ సంవత్సరంలో జరిగాయి
1857 (లేదా 1859)
బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రదేశం చుట్టూ కంచె వేసి, హిందువులు, ముస్లింలకు ప్రత్యేక ప్రార్థనా స్థలాలుగా విభజించింది. ఈ విధంగా ఇది సుమారు 90 సంవత్సరాలు కొనసాగింది.[19][68]
1858నవంబరు 30మసీదు జన్మస్థానకు చెందిన ముయిజిన్మ్ ఖాతిబ్ గా తనను తాను గుర్తించుకున్న సయ్యద్ ముహమ్మద్ పంజాబ్కు చెందిన నిహాంగ్ సిక్కు మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.[2] బ్రిటిష్ కాలంలో, ఈ సంఘటన అయోధ్య వివాదానికి సంబంధించిన నమోదైన మొదటి సమాచార నివేదిక[69]
1885బాబ్రీ మసీదు బయటి ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించడానికి హనుమాన్ చాబుత్రా ప్రధాన పూజారి ఫైజాబాద్ సివిల్ కోర్టును అనుమతి కోరాడు. పిటిషనర్కు సరైన అర్హత లేదని పేర్కొంటూ కోర్టు పిటిషన్ను తిరస్కరించింది.[70]
18861885 తీర్పుకు వ్యతిరేకంగా ఫైజాబాద్ జిల్లా కోర్టులో అప్పీల్ దాఖలు చేయబడింది. బ్రిటిష్ న్యాయమూర్తి, కల్నల్ ఎఫ్. ఈ. ఏ. చామియర్ ఈ పిటిషన్ను తిరస్కరిస్తూ, "హిందువులు ప్రత్యేకంగా పవిత్రంగా భావించే భూమిపై మసీదును నిర్మించడం చాలా దురదృష్టకరం. కానీ ఆ సంఘటన 356 సంవత్సరాల క్రితం జరిగినందున, ఫిర్యాదును పరిష్కరించడానికి చాలా ఆలస్యం అయింది"...[71][72]
1949డిసెంబరుమసీదు లోపల విగ్రహాలను ఉంచారు. ఈ వివాదానికి ఇరుపక్షాలు సివిల్ దావాలు దాఖలు చేశాయి. ఈ విషయం విచారణలో ఉందని చెప్పి ప్రభుత్వం గేట్లను మూసివేసి, ఆ ప్రాంతాన్ని వివాదాస్పదంగా ప్రకటించింది. ఈ ప్రాంతంలోని 583వ ప్లాట్ యాజమాన్యం కోసం సివిల్ దావాలు దాఖలు చేయబడ్డాయి.
1961బాబ్రీ మసీదును బలవంతంగా ఆక్రమించడాన్ని, దానిలో విగ్రహాలను ఉంచడాన్ని వ్యతిరేకిస్తూ భారత న్యాయస్థానాలలో కేసు దాఖలు చేయబడింది.
1984రామజన్మభూమి స్థలంలో ఆలయ నిర్మాణానికి నాయకత్వం వహించడానికి హిందూ సమూహాలు ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు, రాముడి జన్మస్థలం అని హిందువులు పేర్కొన్న ప్రదేశంలో ఆలయ నిర్మాణ ఉద్యమం ఊపందుకుంది.
198637 సంవత్సరాల తరువాత, ఒక జిల్లా న్యాయమూర్తి మసీదు ద్వారాలను తెరవాలని ఆదేశించాడు (పైన 1949 చూడండి). "వివాదాస్పద నిర్మాణం" లోపల హిందువులను ఆరాధించడానికి అనుమతించాడు. ఆ స్థలంలో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న చర్యను ముస్లింలు నిరసించడంతో బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు వెలువడిన ఒక గంటలోపు గేట్లు తెరిచారు.
1989రామ మందిర నిర్మాణానికి డిమాండ్ పెరిగింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఆలయ నిర్మాణం కోసం ఒక శిలా లేదా ఒక రాయిని ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరిలో విహెచ్పి ప్రకటించింది. నవంబరులో, విశ్వ హిందూ పరిషత్ హోంమంత్రి బూటా సింగ్, అప్పటి ముఖ్యమంత్రి ఎన్. డి. తివారీ సమక్షంలో "వివాదాస్పద నిర్మాణం" ప్రక్కనే ఉన్న భూమిపై ఆలయానికి పునాదులు వేసింది. బీహార్లోని భగల్పూర్ వంటి దేశంలో చెదురుమదురు ఘర్షణలు జరిగాయి.
1990ఆ ఎన్నికల్లో 58 స్థానాలను గెలుచుకున్న బిజెపి మద్దతుతో వి. పి. సింగ్ భారత ప్రధానమంత్రి అయ్యాడు. అప్పటి బిజెపి అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ ఆ స్థలంలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పొందడానికి దేశవ్యాప్త రథయాత్ర చేపట్టాడు. అక్టోబరు 23న, యాత్ర సందర్భంగా బీహార్లో ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత బిజెపి, ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అక్టోబరు 30న, అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు రథ యాత్రలో పాల్గొనేవార్అ యోధ్యలో సమావేశమైనప్పుడు వారిపై కాల్పులు జరిపి, మృతదేహాలను సరయూ నదిలో పడేశారు.[73][74][75][76]
19911991 ఎన్నికల తరువాత కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, అయితే బిజెపి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. కల్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో 1.27 హెక్టార్ల భూమిని స్వాధీనం చేసుకుని, దానిని రామజన్మభూమి న్యాస్ ట్రస్టుకు లీజుకు ఇచ్చింది. అల్లాబాద్ హైకోర్టు ఈ ప్రాంతంలో ఎటువంటి శాశ్వత నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేసింది. పెరుగుతున్న ఉద్రిక్తతలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోయినా, కల్యాణ్ సింగ్ ఈ ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, వివాదాస్పద ప్రాంతాన్ని చదును చేశారు.
1992ఈ ప్రాంతంలోకి ప్రవేశాన్ని సులభతరం చేయడం, కారసేవకులపై కాల్పులు జరపబోమని వాగ్దానం చేయడం, ఈ ప్రాంతంలో కేంద్ర పోలీసు బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం మొదలైన ఉద్యమానికి మద్దతుగా కల్యాణ్ సింగ్ చర్యలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి జోక్యం తరువాత ఈ కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. హోంమంత్రి సమక్షంలో బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ, విహెచ్పి నాయకుల మధ్య సమావేశాలు ప్రారంభమయ్యాయి. అక్టోబరు 30న, విహెచ్పికి చెందిన ధరమ్ సంసద్, ఢిల్లీలో చర్చలు విఫలమయ్యాయని, డిసెంబరు 6 నుండి కరసేవ చేస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో కేంద్ర పోలీసు బలగాలను మోహరించి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ చివరికి దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. కేబినెట్ కమిటీ, రాష్ట్రీయ ఏక్తా పరిషత్ సమావేశంలో ప్రభుత్వం దీనిపై చర్చించింది. బీజేపీ సభను బహిష్కరించింది. 1989లో ఏర్పాటు చేసిన పునాది నిర్మాణం యొక్క చట్టబద్ధత అంశాన్ని అల్లాబాద్ హైకోర్టు విచారిస్తోంది.
1992డిసెంబరు 6దాదాపు 2,00,000 మంది కర్సేవకులతో కలిసి బాబ్రీ మసీదును కూల్చివేశారు. భారత ఉపఖండం అంతటా మతపరమైన అల్లర్లు జరిగాయి.
1992డిసెంబరు 16కూల్చివేత జరిగిన పది రోజుల తరువాత, పి. వి. నరసింహారావు నేతృత్వంలోని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ లిబర్హాన్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది.
1993ఏర్పాటు చేసిన మూడు నెలల తరువాత, లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతకు బాధ్యులెవరు, ఎలా దారితీసింది అనే దానిపై దర్యాప్తు ప్రారంభించింది.
2001మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని విహెచ్పి తన సంకల్పాన్ని పునరుద్ఘాటించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.
2002ఫిబ్రవరి 27అయోధ్య నుండి హిందూ వాలంటీర్లను తీసుకువెళుతున్నట్లు భావిస్తున్న రైలుపై జరిగిన దాడిలో గుజరాత్లోని గోధ్రాలో కనీసం 58 మంది మరణించారు. రాష్ట్రంలో అల్లర్లు జరిగాయి, వీటిలో 2000 మందికి పైగా మరణించినట్లు అనధికారికంగా నివేదించబడింది.
2003ఆ స్థలంలో రాముడి ఆలయం ఉందా అని తెలుసుకోవడానికి సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. ఆగస్టులో, సర్వే మసీదు కింద ఒక ఆలయానికి సంబంధించిన ఆధారాలను సమర్పించింది. ముస్లిం సమూహాలు ఈ ఫలితాలను వ్యతిరేకించాయి.
2003సెప్టెంబరుబాబ్రీ మసీదు ధ్వంసానికి ప్రేరేపణ చేసినందుకు కొంతమంది ప్రముఖ బిజెపి నాయకులతో సహా ఏడుగురు హిందూ నాయకులపై విచారణ జరపాలని కోర్టు తీర్పునిచ్చింది.
2004నవంబరుమసీదు ధ్వంసంలో ఎల్. కె. అద్వానీ పాత్రను నిర్దోషిగా ప్రకటించిన మునుపటి ఉత్తర్వులను సమీక్షించాలని ఉత్తరప్రదేశ్ కోర్టు తీర్పునిచ్చింది.
2007అయోధ్య వివాదంపై దాఖలైన రివ్యూ పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
20091992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన పది రోజుల తర్వాత ఏర్పాటు చేసిన లిబర్హాన్ కమిషన్, తన విచారణ ప్రారంభించిన దాదాపు 17 సంవత్సరాల తరువాత జూన్ 30న తన నివేదికను సమర్పించింది. దాని కంటెంట్లను బహిరంగపరచలేదు.
2010సెప్టెంబరు 30అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబరు 30న అయోధ్య వివాదానికి సంబంధించిన నాలుగు హక్కుల దావాలపై తన తీర్పును వెలువరించింది. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజిస్తారు. 1 ⁄ 3 వంతు హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, 1 ⁄ 3 వంతు ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు, 1 ⁄ 3 వంతు నిర్మోహి అఖారాకు చెందుతుంది.[77]
2010డిసెంబరుఅఖిల భారతీయ హిందూ మహాసభ, ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు అలహాబాద్ హైకోర్టు తీర్పులో కొంత భాగాన్ని సవాలు చేస్తూ భారత సుప్రీంకోర్టు వెళ్లాయి.[78][79]
2011మే 9వివాదాస్పద స్థలాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది.
2019ఆగస్టు 6ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసుపై తుది విచారణ ప్రారంభించింది.[59]
2019అక్టోబరు 16సుప్రీంకోర్టులో తుది విచారణ ముగిసింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పు ఇవ్వాల్సిన సమస్యలను తగ్గించడంపై వ్రాతపూర్వక గమనికలను దాఖలు చేయడానికి పోటీ చేసే పార్టీలకు బెంచ్ మూడు రోజుల సమయం ఇచ్చింది.[60]
2019నవంబరు 9తుది తీర్పు వెలువడింది. .[61] రామ మందిర నిర్మాణానికి భూమిని ట్రస్ట్ కు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మసీదు నిర్మాణం కోసం అయోధ్య నగర పరిధిలో 2 హెక్టార్ల (5 ఎకరాల) భూమిని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.[7][19]
2019డిసెంబరు 12తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.[63]
2020ఫిబ్రవరి 5అక్కడ రామాలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్ట్ కోసం భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.[20] కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థానంలో మసీదును నిర్మించడానికి అయోధ్యలోని ధన్నీపూర్ ప్రత్యామ్నాయ స్థలాన్ని కూడా కేటాయించింది.
2024జనవరి 22రామ మందిరాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించాడు.[80] "రాముడు భారతదేశానికి విశ్వాసం, రాముడు భారతదేశ పునాది, రాముడు భారతదేశపు ఆలోచన, రాముడు భారత చట్టం, రాముడు భారతదేశానికి ప్రతిష్ట, రాముడు భారతదేశ వైభవం. రాముడే నాయకుడు, రాముడే విధానం." అని మోడీ ప్రకటించాడు.[23]

ఇవి కూడా చూడండి

  • మతతత్వం (దక్షిణాసియా)
  • ఇస్లామేతర ప్రార్థనా స్థలాలను మసీదులుగా మార్చడం
  • రామ్ కే నామ్ - అయోధ్య వివాదంపై ఆనంద్ పట్వర్ధన్ రూపొందించిన డాక్యుమెంటరీ
  • టెంపుల్ మౌంట్ - జెరూసలేంలో ఇదే వివాదాస్పద ప్రదేశం

గమనికలు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు