బ్రాబోర్న్ స్టేడియం

బ్రాబోర్న్ స్టేడియం ముంబైలో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. దీనిని బ్రిటిష్ వారి కాలంలో నిర్మించారు. ఇది ముంబై పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు హోమ్ గ్రౌండ్. దీనికి 20,000 మంది కూచోగలిగే సామర్థ్యం ఉంది. ఈ మైదానం క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI) ఆధీనంలో ఉంది. బ్రాబోర్న్ నార్త్ స్టాండులో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రధాన కార్యాలయం ఉంది. 2006 వరకు ఇక్కడే 1983 క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ కూడా ఉండేది. ఆ తర్వాత రెంటినీ సమీపంలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా నిర్మించిన క్రికెట్ సెంటర్‌కు మార్చారు.

బ్రాబోర్న్ స్టేడియం
స్టేడియం విహంగ దృశ్యం
పటం
Locationచర్చ్‌గేట్, ముంబై
Coordinates18°55′56″N 72°49′29″E / 18.93222°N 72.82472°E / 18.93222; 72.82472
Ownerక్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా
Capacity20,000[1]
మైదాన సమాచారం
స్థాపితం1937; 87 సంవత్సరాల క్రితం (1937)
వాడుతున్నవారుక్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా
ముంబై క్రికెట్ జట్టు
ముంబై మహిళా క్రికెట్ జట్టు
ఎండ్‌ల పేర్లు
పెవిలియన్ ఎండ్
చర్చ్‌గేట్ ఎండ్
అంతర్జాతీయ సమాచారం
మొదటి టెస్టు1948 డిసెంబరు 9–13:
 India v  వెస్ట్ ఇండీస్
చివరి టెస్టు2009 డిసెంబరు 2–6:
 India v  శ్రీలంక
మొదటి ODI1989 అక్టోబరు 23:
 పాకిస్తాన్ v  ఆస్ట్రేలియా
చివరి ODI2018అక్టోబరు 29:
 India v  వెస్ట్ ఇండీస్
ఏకైక T20I2007 అక్టోబరు 20:
 India v  ఆస్ట్రేలియా
మొదటి WODI2003 డిసెంబరు 4:
 India v  న్యూజీలాండ్
చివరి WODI2013 ఫిబ్రవరి 17:
 ఆస్ట్రేలియా v  వెస్ట్ ఇండీస్
మొదటి WT20I2018 మార్చి 22:
 India v  ఆస్ట్రేలియా
చివరి WT20I2022 డిసెంబరు 20:
 India v  ఆస్ట్రేలియా
2022 డిసెంబరు 20 నాటికి
Source: ESPNcricinfo

బ్రాబోర్న్ స్టేడియం 1948 నుండి 1972 వరకు టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 1937 నుండి 1946 వరకు బాంబే పెంటాంగ్యులర్ మ్యాచ్‌లకు వేదికగా ఉండేది. CCIతో టిక్కెట్ల ఏర్పాట్లపై రేగిన వివాదాల తర్వాత, బాంబే క్రికెట్ అసోసియేషన్ (BCA), బ్రాబోర్న్ స్టేడియానికి ఉత్తరాన సరిగ్గా 700 మీటర్ల దూరంలో వాంఖెడే స్టేడియంను నిర్మించుకుంది. వాంఖడే స్టేడియం నిర్మించిన తర్వాత, బ్రాబోర్న్‌ను టెస్టులకు ఉపయోగించలేదు, అయితే సందర్శించే జట్లు ఈ మైదానంలో కొన్ని ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాయి. క్రికెట్‌తో పాటు, మైదానం టెన్నిస్, అసోసియేషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లతో పాటు సంగీత ప్రదర్శనలు, కచేరీలకు ఆతిథ్యం ఇచ్చింది.

ఇటీవలి కాలంలో బ్రాబోర్న్‌లో అంతర్జాతీయ క్రికెట్ మళ్ళీ ప్రవేశించింది. 2006 లో ICC ఛాంపియన్స్ ట్రోఫీకి బ్రాబోర్న్ ఆతిథ్యమిచ్చింది. 2007లో భారతదేశంలో ఆడిన మొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్‌కు వేదికగా నిలిచింది. బ్రాబోర్న్ 36 సంవత్సరాల తర్వాత 2009 డిసెంబరులో ఒక టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. తద్వారా ఓ మైదానంలో రెండు టెస్టుల మధ్య వచ్చిన అతిపెద్ద గ్యాప్‌గా ఇది రికార్డు సృష్టించింది. ఈ మైదానం ముంబై ఇండియన్స్‌కు నిలయం. ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2013లో ప్రారంభ, సూపర్ సిక్స్, చివరి మ్యాచ్‌లు ఇక్కడే జరిగాయి. 2013 సెప్టెంబరులో జరిగిన BCCI AGMలో రొటేషను విధానం ప్రకారం ఈ స్టేడియానికి కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లను కేటాయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తద్వారా మైదానాన్ని సాధారణ అంతర్జాతీయ వేదికగా తిరిగి వస్తుంది. BCCI ఈ స్టేడియాన్ని 2014 మే 29 న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య IPL ప్లేఆఫ్ మ్యాచ్ కోసం ఉపయోగించింది. 2015 IPL సీజన్‌లో, రాజస్థాన్ రాయల్స్కు ఇది సెకండరీ హోమ్ గ్రౌండ్ వేదికగా ఉంది.

స్థాపన

1933–34 లో ఎమ్‌సిసి జరిపిన భారత పర్యటన సందర్భంగా, CCI ని 1933 నవంబరు 8 న ఒక కంపెనీగా ఏర్పరచారు. దాని రిజిస్టర్డ్ కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. BCCI ప్రెసిడెంట్ అయిన RE గ్రాంట్ గోవన్ క్లబ్‌కు మొదటి అధ్యక్షుడయ్యాడు.[2] ఆంథోనీ డి మెల్లో, 1928లో BCCI ప్రారంభమైనప్పటి నుండి 1937 వరకు కార్యదర్శిగా ఉన్నాడు. 1933 నుండి 1937 వరకు CCI కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[3] సర్ నౌరోజీ సక్లత్వాలా క్లబ్‌కు మొదటి ఛైర్మన్. అతను 1938లో మరణించే వరకు ఛైర్మన్‌గా పనిచేశాడు. అతను స్టేడియంలో పెవిలియన్ నిర్మాణానికి పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు.[4] CCI వాస్తవానికి న్యూ ఢిల్లీలో ఉన్నప్పటికీ, బొంబాయి భారతదేశంలో క్రికెట్‌కు నిలయంగా పరిగణించబడుతున్నందున కొత్తగా నిర్మించ తలపెట్టిన తమ మైదానానికి ప్రదేశంగా బొంబాయిని ఎంపిక చేసుకున్నారు.[5] బ్రాబోర్న్ స్టేడియం దక్షిణ బొంబాయిలోని చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో [6] మెరైన్ డ్రైవ్ [7] వెంబడి 90,000 చదరపు గజాల స్థలంలో నిర్మించారు.[8] ఇది భారతదేశపు మొట్టమొదటి శాశ్వత క్రీడా వేదిక.[9][10]

కొత్త క్రికెట్ మైదానానికి భూమి కోసం డి మెల్లో, అప్పటి బొంబాయి గవర్నర్ లార్డ్ బ్రాబోర్న్‌ల మధ్య చర్చలు జరిగాయి. ఆ సమయంలో లార్డ్ బ్రాబోర్న్ చిత్రాన్ని గీస్తున్న గోవా కళాకారుడు ఆంటోనియో పియాడే డా క్రూజ్ పేరును వాడుకుని డి మెల్లో, బ్రాబోర్న్‌తో సమావేశ అవకాశాన్ని పొందాడు. సమావేశం ముగిసాక, వెనక్కి వచ్చే ముందు డి మెల్లో, లార్డ్ బ్రాబోర్న్‌ని ఇలా అడిగాడు: 'యువర్ ఎక్సలెన్సీ, క్రీడాకారుల నుండి మీరు ఏం ఆశిస్తున్నారు, మీ ప్రభుత్వం కోసం డబ్బా లేక మీ కోసం అమరత్వమా?' .[11] బ్రాబోర్న్ అమరత్వాన్ని ఎంచుకున్నాడు. బ్యాక్‌బే పునరుద్ధరణ పథకంలో రిక్లెయిమ్ చేసిన భూమి నుండి చదరపు గజం 13.50 చొప్పున 90,000 చదరపు గజాలు సిసిఐకి కేటాయించారు. మెసర్లు గ్రెగ్సన్, బాట్లీ, కింగ్ లను దీనికి వాస్తుశిల్పులుగా నియమించారు. షాపూర్జీ పల్లోంజీ & కో.కి నిర్మాణ కాంట్రాక్టు ఇచ్చారు.[12] అది లార్డ్స్ ఆఫ్ ఇండియా అనే భావనతో మైదానాన్ని రూపొందించారు.[13]

1936 మే 22న లార్డ్ బ్రాబోర్న్ పునాది రాయి వేశాడు. మైదానంలో 35,000 మంది ప్రేక్షకులకు వసతి కల్పించడానికి ఉద్దేశించారు. అందులో పెవిలియన్లు, టెన్నిస్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్‌లు ఉన్నాయి. ఫ్రాంక్ టారెంట్ మొదటి గ్రౌండ్స్‌మన్.[12] నిర్మాణం ఇంకా అసంపూర్తిగా ఉండగానే 1937 అక్టోబరులో CCI, స్పెన్సర్ కప్ XI మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మైదానాన్ని 1937 డిసెంబరు 7న అప్పటి బొంబాయి గవర్నర్ రోజర్ లుమ్లీ ప్రారంభించాడు. లార్డ్ బ్రాబోర్న్ అప్పుడు బెంగాల్ గవర్నర్‌గా ఉన్నాడు. పాటియాలా మహారాజు సూచన మేరకు ఈ మైదానానికి బ్రాబోర్న్ పేరు పెట్టారు.[14] అదే రోజు, ఈ మైదానంలో జరిగిన తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో సందర్శించే లార్డ్ టెన్నిసన్స్ XIతో సిసిఐ XI జట్టు ఆడింది.

నిర్మాణ అంచనా వ్యయం 18 లక్షలు కాగా, వాస్తవ ఖర్చులు దీని కంటే మూడింట ఒక వంతు కంటే ఎక్కువ అయ్యాయి. 1937లో డిమెల్లో తరువాత సెక్రటరీగా వచ్చిన అబూభాయ్ జస్డెన్‌వాలా కృషితో, అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ సర్ నౌరోజీ సక్లత్‌వాలా, మరికొందరు CCI కోసం ఈ అదనపు ఖర్చులను భరించారు.[15] ఇదార్ మహారాజా గవర్నర్ పెవిలియన్ ఖర్చును పెట్టుకున్నారు. పాటియాలా మహారాజు తన పేరు మీద ఉన్న పెవిలియన్ కోసం అయిన ఖర్చును చెల్లించాడు. మిగిలిన లోటును డిబెంచర్ల విక్రయం నుండి, బాంబే పెంటాంగ్యులర్ మ్యాచ్‌ల నుండి వచ్చిన ఆదాయం నుండి చెల్లించారు.[9]

ఆర్కిటెక్చర్

స్టేడియం లోపలి దృశ్యం

బ్రాబోర్న్‌ను హెరిటేజ్ గ్రేడ్ IIB నిర్మాణంగా గుర్తించారు.[16] స్టేడియంలో ఒక పెవిలియన్, వెస్ట్ స్టాండ్, నార్త్ స్టాండ్, ఈస్ట్ స్టాండ్ అనే మూడు పబ్లిక్ స్టాండ్‌లు ఉన్నాయి..మూడు పబ్లిక్ స్టాండ్‌లు మైదానానికి మూడు వేర్వేరు వైపులా క్లబ్‌హౌస్‌కు ఎదురుగా ఉంటాయి. వీటికి, ఓవర్‌హాంగు ఉన్న పైకప్పులున్నాయి.[17]

బ్రాబోర్న్ స్టేడియానికి వివిధ వర్గాల నుండి ప్రశంసలు వచ్చాయి. ఆస్ట్రేలియన్ క్రికెటర్ కీత్ మిల్లర్ ఈ మైదానాన్ని "ప్రపంచంలోని అత్యంత సంపూర్ణమైన మైదానం" అని పేర్కొన్నాడు.[17] వెస్ట్ ఇండియన్ లెజెండ్ ఫ్రాంక్ వోరెల్, ప్యాడ్లు కట్టుకునేంత వరకు డ్రెస్సింగ్ గౌనులోనే ఉండగల అవకాశం ఉన్న ఏకైక మైదానం ఇది అని పేర్కొన్నాడు. అందుకే అతను ఇక్కడ ఆడడానికి ఇష్టపడ్డాడు.[18] బ్రియాన్ లారా, "ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన వేదికలలో ఒకటి. మంచి క్రికెట్ మ్యాచ్‌ ఆడడానికి పర్ఫెక్ట్ మైదానం." అని అన్నాడు [19] భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ 2009లో భారత్-శ్రీలంక టెస్టు సందర్భంగా ఇలా వ్యాఖ్యానించాడు, "లార్డ్స్‌లో ఆడటం ఏ క్రికెటర్‌కైనా అంతిమ కల; అలాగే, CCIలో ఆడాలనేది ప్రతి భారతీయ క్రికెటరు కోరిక. మనోహరమైన వాతావరణంతో అది భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. పైగా ప్రేక్షకులు క్రికెట్‌ పరిజ్ఞానం ఉన్నవారు." [20] "...CCIలో ఆడటం ప్రత్యేకమైనది. . . . ఇక్కడ వాతావరణం బాగుంటుంది." అని భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పేర్కొన్నాడు.[21] ప్రఖ్యాత జర్నలిస్టు, మిడ్-డే గ్రూప్ ఛైర్మన్ ఖలీద్ AH అన్సారీ తన వార్తాపత్రికలో ఇలా వ్రాశాడు: "ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ను చూసిన నేను, బ్రాబోర్న్ స్టేడియంలో చూడడానికి సమానమైన అనుభవం మరొకటి లేదు అని నమ్మకంగా చెప్పగలను." [22]

క్రికెట్ మ్యాచ్‌లు

మొదటి మ్యాచ్, పెంటాంగులర్

[23]లో లార్డ్ టెన్నిసన్స్ XI, CCI XI ల మధ్య జరిగిన మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఈ మైదానంలో జరిగింది.

1937లో మైదానం పూర్తికావడంతో, బొంబాయి పెంటాంగ్యులర్ టోర్నమెంటును బొంబాయి జింఖానా నుండి బ్రాబోర్న్‌కు మార్చారు.[24] ఈ సంవత్సరంలోనే రెస్ట్ ఐదవ జట్టుగా పోటీలోకి ప్రవేశించింది;[25] అయితే హిందువులు సీటింగ్ కేటాయింపుపై వివాదం తర్వాత తమ బృందాన్ని ఉపసంహరించుకున్నారు.[26] పెంటాంగ్యులర్ మ్యాచ్‌ల సమయంలో స్టేడియం పూర్తి సామర్థ్యానికి నిండిపోయింది.[27] 1943–44లో విజయ్ మర్చంట్, విజయ్ హజారే ల మధ్య జరిగిన పోరులో డిసెంబరు మొదటి వారంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు మూడు సార్లు మెరుగైంది. ఫైనల్‌లో రెస్ట్ చేసిన మొత్తం 387 పరుగులలో హజారే 309 పరుగులు చేసాడు. సంవత్సరం చివరి రోజున మహారాష్ట్రతో ప్రారంభమైన రంజీ మ్యాచ్‌లో, మర్చంట్ 359 నాటౌట్ ఇన్నింగ్స్‌తో దానిని తిరగరాసాడు. ఇది ఇప్పటికీ ఈ మైదానంలో చేసిన అత్యధిక స్కోరుగా నిలిచింది. 1944-45 పెంటాంగులర్ ఫైనల్‌లో, ముస్లింలు 298 పరుగులతో హిందువులను ఒక వికెట్ తేడాతో ఓడించారు. పెంటాంగ్యులర్ టోర్నమెంటును 1946-47 సీజన్ తర్వాత నిలిపివేసారు.[24]

టెస్ట్ క్రికెట్

1948, 1973 మధ్య బ్రాబోర్న్ 17 టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.[28] 1948-49లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి స్వదేశీ సిరీస్‌ వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లతో ప్రారంభమైంది. 1952లో భారత్‌ పాకిస్థాన్‌ను ఓడించినప్పుడు బ్రాబోర్న్‌లో తొలి టెస్టు ఫలితం నమోదైంది. ఈ విజయంతో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్ తమ మొట్టమొదటి టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది.[29][30][31] విజయ్ హజారే ఈ గ్రౌండ్‌లో ఆడిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ప్రతీదానిలో శతకం సాధించాడు.[32] 1960లో బ్రాబోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టులో క్రికెట్ మైదానంలో ముద్దుపెట్టుకున్న తొలి భారతీయ క్రికెటర్ అబ్బాస్ అలీ బేగ్. బేగ్ యాభై పరుగుల మార్కును చేరుకున్నప్పుడు ఒక యువతి నార్త్ స్టాండ్ నుండి మైదానంలోకి పరిగెత్తి, క్రిక్కిరిసిన ప్రేక్షకులు చూస్తూండగా, అతని చెంపపై ముద్దు పెట్టుకుంది.[33][34] 1964లో ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా, సందర్శించిన ఇంగ్లండ్ జట్టులోని పలువురు సభ్యులు ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొన్నారు, దీంతో ఇంగ్లాండ్‌, తమకు ప్రత్యామ్నాయ ఫీల్డర్‌ను ఇవ్వమని భారత్‌ను అభ్యర్థించాల్సి వచ్చింది. AG కృపాల్ సింగ్, హనుమంత్ సింగ్ మిక్కీ స్టీవర్ట్‌కు ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగారు.[35]

1969లో భారత ఆస్ట్రేలియాల మధ్య [36] జరిగిన టెస్ట్ మ్యాచ్ నాల్గవ రోజు చివరి సెషన్‌లో మైదానంలో ప్రేక్షకుల ఇబ్బందికి సంబంధించిన ఒక తీవ్రమైన ఉదాహరణ జరిగింది. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో తీరని కష్టాల్లో కూరుకుపోవడంతో, అజిత్ వాడేకర్, శ్రీనివాస్ వెంకటరాఘవన్ ఎనిమిదో వికెట్‌కి 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు, ఆ తర్వాత అలాన్ కొన్నోలీ బౌలింగ్‌లో వెంకటరాఘవన్ క్యాచ్ అవుట్‌ అయినట్లు ప్రకటించారు.[37] ఈ నిర్ణయాన్ని రేడియో వ్యాఖ్యాతలు విమర్శించారు. కొంత తడబాటు తర్వాత వెంకట్ వెళ్ళిపోవడంతో, ఈస్ట్ స్టాండ్‌లో ఇబ్బందులు మొదలయ్యాయి. నార్త్ స్టాండ్‌లో నిప్పంటించగా, సీసాలు నేలపై విసిరి కుర్చీలను తగులబెట్టారు. ఈ పరిస్థితుల్లోనే గంటపాటు ఆటను కొనసాగించారు.[38]

1960ల వరకు, బ్రాబోర్న్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగినప్పుడు, జట్లు CCIలోనే ఉండేవి.[39] ఒక అసాధారణమైన సంఘటనలో, గుండప్ప విశ్వనాథ్ 1973లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారతదేశం తరపున వంద పరుగులు పూర్తి చేసినప్పుడు, అతన్ని ప్రత్యర్థి ఫీల్డర్ టోనీ గ్రెగ్ చేతులలోకి ఎత్తుకున్నాడు.[40]

దేశీయ క్రికెట్

1938, 2008 మధ్య మైదానంలో పదహారు రంజీ ట్రోఫీ ఫైనల్‌లు, ఒక ప్లేట్ ఫైనల్‌ జరిగాయి. వీటిలో పద్నాలుగింటిలో బొంబాయి ఆడింది. ప్రతి సందర్భంలోనూ అదే గెలిచింది.[41] మైదానంలో ఆడిన ముఖ్యమైన ఇన్నింగ్స్‌లలో 1944–45 ఫైనల్‌లో హోల్కర్‌కు డెనిస్ కాంప్టన్ 249 నాటౌట్ [42] మైసూర్‌పై 1966–67లో అజిత్ వాడేకర్ ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి.[43] CCI భారతదేశంలో మొదటిసారిగా సింగిల్ వికెట్ క్రికెట్‌ను ప్రవేశపెట్టింది. 1965లో జరిగిన ఈ పోటీలో వినూ మన్కడ్ గెలుపొందాడు. పెంటాంగ్యులర్ ముగిసిన తర్వాత మూడు సంవత్సరాల పాటు, బ్రాబోర్న్ ఇంటర్-జోనల్ టోర్నమెంట్‌ను నిర్వహించింది.[24]

క్షీణత

బ్రాబోర్న్ స్టేడియం నిర్మించినప్పటి నుండి, CCI కి అక్కడ అద్దెకున్న బాంబే క్రికెట్ అసోసియేషన్ (BCA) తో సంబంధాలు దురుసుగానే ఉండేవి. సీట్ల కేటాయింపు విషయంలో వివాదాలే దీనికి ప్రధాన కారణం. ఒక సందర్భంలో BCA, తాత్కాలిక స్టాండ్‌లతో శివాజీ పార్క్‌లో ఒక టెస్టును నిర్వహిస్తానని బెదిరించింది.[44]

1971లో BCA ప్రెసిడెంట్ SK వాంఖడేకి అప్పటి CCI ప్రెసిడెంట్ విజయ్ మర్చంట్ 1972లో ఇంగ్లాండ్ పర్యటన కోసం BCAకి అదనపు సీట్లు కేటాయించబోమని చెప్పాడు. గ్రౌండ్‌ను నిర్వహించడానికి తాము పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామనీ, ఏదైనా తదుపరి రాయితీలు ఇస్తే క్లబ్‌, గణనీయంగా ఆదాయాన్ని కోల్పోతుందనీ సిసిఐ పేర్కొంది. BCA మరింత ముందుకు పోయి తన స్వంత మైదానాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకుంది. కొత్తగా నిర్మించుకున్న వాంఖడే స్టేడియం 1975 ప్రారంభంలో వెస్టిండీస్ పర్యటన సందర్భంగా మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది.[45][46] వాంఖడే, నగరంలో అంతర్జాతీయ క్రికెట్ వేదికగా బ్రాబోర్న్‌ స్థానాన్ని తీసుకుంది.[5] అప్పటి నుండి, కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మినహా, 2006 వరకు బ్రాబోర్న్‌లో చాలా కొద్ది ప్రధాన గేమ్‌లను నిర్వహించారు,[47] 1989లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లు వన్డే మ్యాచ్ ఆడినప్పుడు ఈ మైదానం క్లుప్తంగా వెలుగులోకి వచ్చింది.[48][49]

గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్

1987–88లో CCI స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని మైదానంలో ఫెస్టివల్ మ్యాచ్‌లు జరిగాయి. రోజర్ బిన్నీ, మహ్మద్ అజారుద్దీన్ వంటి ఆటగాళ్ళు CCI XI కోసం ఆడారు, వసీం అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, రమీజ్ రాజా, ముదస్సర్ నాజర్ వంటి వారు పాకిస్తాన్ తరపున ఆడారు. పాకిస్తాన్‌కు ఆటగాళ్ల కొరత కారణంగా, సచిన్ టెండూల్కర్, అప్పుడు కేవలం 14 సంవత్సరాల వయస్సులో, పాకిస్తాన్‌ తరపున ఫీల్డింగ్ చేశాడు.[50][51] అంతర్జాతీయ క్రికెట్‌పై టెండూల్కర్‌కు ఇదే తొలిసారి పరిచయం.[52] 14 ఏళ్ల సచిన్ టెండూల్కర్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లోకి అనుమతించేందుకు సీసీఐ నిబంధనలను సవరించాల్సి వచ్చింది. ఈ నిబంధనను మార్చాలనే నిర్ణయంలో చాలా సంవత్సరాల పాటు క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న రాజ్ సింగ్ దుంగార్పూర్ కీలక పాత్ర పోషించారు.[53]

అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనం

వన్ డే ఇంటర్నేషనల్స్

జవహర్‌లాల్ నెహ్రూ కప్ కోసం MRF వరల్డ్ సిరీస్ సందర్భంగా 1989లో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌తో వన్డే ఇంటర్నేషనల్ (ODI) ఆడినప్పుడు బ్రాబోర్న్‌లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచి జరిగింది.[54] 1993 హీరో కప్ ODI గేమ్‌లో దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌తో తలపడింది. ఇందులో జాంటీ రోడ్స్ ఐదు క్యాచ్‌లను పట్టి, ప్రపంచ రికార్డు సాధించాడు.[55] ఈ మ్యాచ్‌లో 20,000 మందికి పైగా ప్రజలు తనను ఉత్సాహపరిచారని రోడ్స్ తర్వాత గుర్తు చేసుకున్నాడు. విదేశంలో అతనికి చాలా అరుదుగా లభించిన గౌరవం అది.[56]

1995లో భారత్, న్యూజిలాండ్ ల మధ్య జరిగిన నిర్ణయాత్మక ఆరవ ODIకి ముందు రోజు రాత్రి క్రిస్ కెయిర్న్స్, తాగిన మత్తులో CCI స్విమ్మింగ్ పూల్‌లోకి దూకాడు. కోచ్ గ్లెన్ టర్నర్ ఈ మ్యాచ్‌లో అతడిని తొలగించాడు.[57] భారత్‌పై న్యూజిలాండ్ తమ అత్యల్ప ODI స్కోరు 126తో స్కోర్ చేయడంతో భారత్ ఆ గేమ్‌ను దానితో పాటు సిరీస్‌నూ గెలుచుకుంది [58][59]

టూర్ గేమ్స్

కొన్ని సంవత్సరాలుగా భారతదేశాన్ని సందర్శించే జట్లు బ్రాబోర్న్‌లో వార్మప్ మ్యాచ్‌తో తమ పర్యటనను ప్రారంభించేవి. 1997-98లో ఆస్ట్రేలియా, ముంబై ల మధ్య జరిగిన మ్యాచ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ మొదటి డబుల్ సెంచరీ చేసాడు. ఈ గేమ్‌లో ముంబై గెలిచింది.[60][61] 2000లో, పర్యాటక దక్షిణాఫ్రికాకు వ్యతిరేకంగా జరిగిన మూడు-రోజుల వార్మప్ గేమ్‌లో అనేక మంది టెస్టు స్థాయి భారతీయ ఆటగాళ్ళు బోర్డు ప్రెసిడెంట్స్ XI కోసం ఆడారు. ప్రెస్ బాక్స్‌లో సచిన్ టెండూల్కర్ భారత జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆవిధంగా ఈ మ్యాచ్ గుర్తుండిపోతుంది.[62][63] 2006లో, CCI ప్రెసిడెంట్స్ XI సందర్శక ఇంగ్లండ్ జట్టుతో అనధికారిక మూడు రోజుల గేమ్ ఆడింది.[64][65] 2014లో ఇక్కడ రెండు వన్డే మ్యాచ్‌లు జరిగాయి, ఒకటి ఇండియా ఎ, వెస్టిండీస్ ల మధ్య, మరొకటి శ్రీలంకతో. ఈ స్టేడియంలో 2015లో బోర్డ్ ప్రెసిడెంట్స్ XI, పర్యాటక దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌ని కూడా నిర్వహించారు. బ్రాబోర్న్ స్టేడియం 2017 ప్రారంభంలో ఇండియా A, ఇంగ్లండ్ మధ్య రెండు వన్డే మ్యాచ్‌లకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. MS ధోనీ ఇండియా A జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతను కెప్టెన్‌గా చేయడం అదే చివరిసారి. అది సన్నాహక ఆట అయినప్పటికీ, స్టేడియం పూర్తిగా నిండిపోయింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో గేమ్‌లో భారత్‌ ఎ విజయం సాధించింది.

2006 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, మొదటి T20I

మైదానంలో లైట్ల వెలుగులో 2006 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌. దీనికి వర్షం అంతరాయం కలిగించింది

2006లో 11 సంవత్సరాల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ బ్రాబోర్న్ లోకి తిరిగి వచ్చింది. దీని కోసం మైదానాన్ని నవీకరించారు. బ్రాబోర్న్ స్టేడియం 2006 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌తో సహా ఐదు ODI మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.[19][66] ఈ టోర్నీ కోసం మైదానంలో ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు.[67] అప్పటి CCI అధ్యక్షుడు రాజ్ సింగ్ దుంగార్‌పూర్, "ఇది కొత్త మలుపు. ఎప్పుడో జరగాల్సినది ఇది. ఇది మళ్లీ పెళ్లి చేసుకోవడాం లాంటిది’’ అన్నాడు.[68] గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ జెరోమ్ టేలర్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ సాధించాడు. వన్డేల్లో వెస్టిండీస్‌కు ఇది మొదటిది, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇదే మొదటిది.[69][70] ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. వర్షం కారణంగా ఆటకు ఆటంకం ఏర్పడడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో నిర్ణయించారు.[71] మ్యాచ్‌ల కోసం ఉపయోగించిన పిచ్ వన్డే క్రికెట్‌కు చాలా నెమ్మదిగా ఉందనే విమర్శలను ఎదుర్కొంది.[72]

ప్లాటినం జూబ్లీ టెస్ట్

2008 మధ్య వాంఖెడే స్టేడియాన్ని నవీకరించారు. ఆ కాలంలో ముంబైలో బ్రాబోర్న్ అంతర్జాతీయ, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.[73] ఇది 2008 డిసెంబరులో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ (BCCI, CCI ల ప్లాటినం జూబ్లీ టెస్ట్ అది)కి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే 2008 ముంబై దాడుల తర్వాత ఆ మ్యాచ్‌ను మొహాలీలోని PCA స్టేడియానికి మార్చారు. మొహాలీ వేదికగా టెస్టు మ్యాచ్ జరిగినా, ప్లాటినం జూబ్లీ వేడుకలను మాత్రం జరపలేదు.[23][74][75][76]

ఈ మైదానం చివరకు 2009లో మరో టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 36 సంవత్సరాల, 9 నెలల, 21 రోజుల విరామం తర్వాత బ్రాబోర్న్ స్టేడియం భారత-శ్రీలంకల టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఏదైనా అంతర్జాతీయ మైదానంలో రెండు వరుస టెస్టుల మధ్య ఇంత సుదీర్ఘమైన గ్యాప్ మరెక్కడా రాలేదు. అందులో వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ (293) సాధించాడు. అయితే టెస్ట్ క్రికెట్‌లో మూడు ట్రిపుల్ సెంచరీలు చేసిన మొదటి వ్యక్తిగా అవతరించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. భారత్ తమ అత్యధిక టెస్టు స్కోరు 9 వికెట్లకు 726 పరుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ తొలిసారిగా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.[77] టెస్టు తొలి రోజున అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ 75 ఏళ్ల క్రికెట్‌ను స్మరించుకుంటూ CCIలో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.[78]

T20 లీగ్‌లు

CCI 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మొదటి సీజన్‌కు ఆతిథ్యం ఇవ్వకూడదని నిర్ణయించుకుంది. IPL అధికారులు మ్యాచ్ రోజులలో క్లబ్‌కు పెవిలియన్‌ను అప్పగించాలని అడిగారు. క్లబ్ రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కుల ప్రకారం క్లబ్‌హౌస్ నుండి అన్ని మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే హక్కు సభ్యులకు ఉంటుంది. క్లబ్ దానిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే IPL మ్యాచ్‌లను నిర్వహించకూడదని నిర్ణయించుకుంది.[79][80]

ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మునుపటి పోటీలో విజేత ఫైనల్స్‌కు వేదికను నిర్ణయిస్తారు.[81] 2009 లో అప్పటి ఛాంపియన్స్, రాజస్థాన్ రాయల్స్ రెండవ సీజన్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బ్రాబోర్న్ స్టేడియాన్ని ఎంచుకుంది.[81] అయితే, పెవిలియన్ వినియోగానికి సంబంధించిన వివాదం కారణంగా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగలేదు. సభ్యులకు స్టాండ్స్‌లో ఉచిత సీట్లు ఇస్తామని చెప్పారు. అయితే క్లబ్ ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, తమ సభ్యులను పెవిలియన్ నుండి బయటకు తరలించలేమని పేర్కొంది.[82] చివరికి, భద్రతా కారణాల దృష్ట్యా రెండవ సీజన్‌ను భారతదేశం నుండి తరలించి దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.[83]

2010లో ఈ సమస్యలను పరిష్కరించారు. మూడవ సీజన్‌లో ముంబై ఇండియన్స్ యొక్క ఏడు హోమ్ మ్యాచ్‌లకు బ్రాబోర్న్ స్టేడియం ఆతిథ్యమిచ్చింది.[84] ముంబై పోలీసులు ఈ మ్యాచ్‌లకు భద్రత కల్పించినందుకు రికార్డు స్థాయిలో 98 లక్షలు వసూలు చేశారు.[85]

ఈ మైదానం 2008 లో ఛాంపియన్స్ లీగ్‌లో మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది,[86] అయితే, 2008 ముంబై దాడుల కారణంగా ఆ టోర్నమెంటు రద్దైంది.[87]

ఈ స్టేడియం IPL 7 లో ఎలిమినేటర్‌ పోటీని విజయవంతంగా నిర్వహించింది. ఇది 2014 మే 28 న అప్పటి IPL ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రెండు సార్లు IPL విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. దీనిలో CSK విజేతగా నిలిచింది.

అర్హత కలిగిన యూనిట్

2013 సెప్టెంబరులో జరిగిన AGMలో BCCI, తన రొటేషన్ విధానం ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లను స్టేడియానికి కేటాయించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. తద్వారా మైదానాన్ని సాధారణ అంతర్జాతీయ వేదికగా తిరిగి వస్తుంది. అయితే, ఆ నిర్ణయం వెలువడిన వెంటనే, ముంబై క్రికెట్ అసోసియేషన్ వాణిజ్య కారణాలను చూపుతూ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.[88][89]

ఇవి కూడా చూడండి

  • టెస్ట్ క్రికెట్ మైదానాల జాబితా
  • వాంఖెడే స్టేడియం
  • బ్రాబోర్న్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా
  • బ్రాబోర్న్ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్ ఐదు వికెట్ల హాల్‌ల జాబితా

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు