మల్లి మస్తాన్ బాబు

భారతీయ పర్వతారోహకుడు
(మల్లి మస్తాన్‌ బాబు నుండి దారిమార్పు చెందింది)

మల్లి మస్తాన్‌బాబు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. పర్వతారోహణలో గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్ సాధించిన సాహాసికుడు. మస్తాన్ బాబు 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు పర్వతాలను అధిరోహించి గిన్నిస్‌ బుక్‌ రికార్డులలోకి ఎక్కాడు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి తెలుగు బిడ్డడు మస్తాన్‌బాబు.[2]

మల్లి మస్తాన్‌ బాబు
జననం1974,సెప్టెంబరు 3
మరణం2015 మార్చి 24(2015-03-24) (వయసు 40)[1]
చిలీ సెర్రో ట్రెస్‌, చిలీ
జాతీయతభారతీయత
పౌరసత్వంభారతీయుడు
విద్యB.Tech, M.Tech, MBA
విద్యాసంస్థNIT Jamshedpur, IIT Kharagpur, IIM Calcutta
వృత్తిAdventurer and Motivational Speaker
వెబ్‌సైటు1stindian7summits.com
దస్త్రం:Mastan babu 035.JPG
మస్తాన్ బాబుకో ప్రేమలేఖ

బాల్యము - విద్యాభ్యాసము

మస్తాన్‌బాబు జన్మస్థలం గాంధిజనసంగం.[3] ఈ గ్రామం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సంగం మండలానికి చెందిన ఒక చిన్న కుగ్రామం. తల్లిదండ్రులు సుబ్బమ్మ, మస్తానయ్యలు మత్స్యకార కుటుంబానికి చెందినవారు.[4] మస్తాన్‌బాబు ఈ దంపతులకు 5వ సంతానంగా సా.శ.1974 సెప్టెంబరు, 3లో జన్మించాడు.ఇతనికి ఇద్దరు సోదరులు, ఇద్దరు అక్కలు.[5] ఒకటో తరగతి నుండి మూడో తరగతి వరకు స్వగ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. 4, 5 తరగతులను సంగంలోని ఒక ప్రెవేటు పాఠశాలలో చదివాడు. ఆతరువాత 1985 లో కోరుకొండ సైనిక పాఠశాలలో 6వ తరగతిలో చేరాడు. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు (1985-92) విజయనగరం జిల్లాలోని కొరుకొండ సైనిక పాఠశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. తరువాత తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగు చదువును జంషెడ్‌పూర్ లోని నిట్‌లో (1992-96) లో పూర్తి చేసాడు[6]. పిమ్మట మస్తాన్‌బాబు తన ఎంటెక్‌ విద్యాభాసాన్నిఖరగ్‌పూర్లోని ఐఐటిలో చేసాడు. 1998నుండి 2001 వరకు సత్యం కంప్యూటర్సులో సాప్ట్‌వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసాడు. 2002-2004 వరక్ కలకత్తాలోని ఐఐఎంలో పీజీడీఎం కోర్సు చేసాడు.

ఇతని సోదరి దొరసానమ్మ తిరుపతిలో వైద్యురాలిగా ఉన్నారు.[7] ఇతని పెద్ద సోదరుడు పెద్ద మస్తానయ్య, తెలంగాణ రాష్ట్రంలో ఉపాద్యాయుడుగా పనిచేస్తున్నాడు.[6]

ఉద్యోగం-ఇతర వ్యాపకాలు

పిమ్మట మస్తాన్‌బాబు తన ఎంటెక్‌ విద్యాభాసాన్ని ఖరగ్‌పూర్‌లోని ఐఐటిలో చేసాడు.1998 నుండి 2001 వరకు సత్యం కంప్యూటర్సులో ఉద్యోగం చేసాడు. కోల్‌కత లోని ఐఐఎంలో 2002-2004 వరకు ఉన్నాడు.

ఇండియా, కెన్యా, దుబాయి, అమెరికా దేశాలలోని పలు మేనెజిమేంట్ కోర్సు కళాశాలలోను, సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థలలోను, వృతిపరమైన సంస్థలలో, వ్యాపారసంస్థలలో, నాయకత్వం-నిర్వహణ వంటి విషయాలలో ప్రేరణ, మార్గదర్శక ఉపన్యాసాలు ఇచ్చాడు.[8]

పర్వతారోహణ

6వ తరగతి చదువుటకై కోరుకొండ సైనిక పాఠాశాలలో చేరినప్పటినుండి కొండలను ఎక్కడం పై అభిరుచి పెరిగింది. కోరుకొండ స్కూలు ఆవరణలో ఉన్న ఎవరెస్టు శిఖరాన్నిఅధిరోహించే పయత్నంలో 1985లో ప్రాణం కోల్పోయినపూర్వ విద్యార్థి ఉదయకూమార్ విగ్రహం, మల్లి మస్తాన్‌ బాబుకు ఎత్తైన కొండలను ఎక్కి రికార్డులు సాధించాలనే కోరికను, ప్రేరణను కల్గించింది.[5][9] సెలవుల్లో తన స్వగ్రామం వెళ్లినప్పుడు ఎన్నోసార్లు కాళ్ళు, చేతులు కట్టుకుని కనిగిరి రిజర్వాయరులో ఈదేవాడు. అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్‌మానిఫ్‌ (Mt Vinson Massif) పర్వతాన్ని ఎక్కిన మొదటి భారతీయుడు, మల్లి మసాన్‌బాబు.[6]

2006వ సంవత్సరంలో ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఏడు ఎతైన, దుర్లభమైన పర్వతశిఖరాలను 172 రోజుల అతితక్కువ కాలంలో అధిరోహించిన భారతీయ పర్వతారోహకుడు[1].

172 రోజుల్లో 7 పర్వతాలు అధిరోహించిన వివరాలు

పర్వతం పేరుపర్వతారోహణ చేసినరోజుశిఖరం ఎత్తు, మీటర్లలోరోజు
విన్సన్‌మానిఫ్‌ (అంటార్కిటికా)2006 జనవరి 194897గురువారం
అకోన్‌కగువా (దక్షిణ అమెరికా)2006 ఫిబ్రవరి 176962శుక్రవారం
కిలీమంజరో (ఆఫ్రికా)2006 మార్చి 155895బుధవారం
కోస్‌కుయిజ్‌కో (ఆస్ట్రేలియా)2006 ఏప్రిల్ 12228శనివారం
ఎవరెస్టు (ఆసియా)2006 మే 218850ఆదివారం
ఎల్‌బ్రస్‌ (ఐరోపా)జూన్‌13,20065642మంగళ వారం
డెనాలి (ఉత్తర అమెరికా)జూలై10,20066194సోమవారం

ఏడు శిఖరాలను వారంలోని ఏడు రోజులలో, అనగా ఒకశిఖరం వారంలో ఒకరోజు చొప్పున ఏడురోజులకు ఏడు శిఖరాలు వచ్చేలా అధిరోహించాడు.

చిలీ, అర్జెంటీనా దేశ సరిహద్దుల్లో ఉన్న ఓజోస్‌డెల్‌సాలాడో అనే 6893మీటర్ల ఎత్తువున్న అగ్నిపర్వతాన్ని అతిసులువుగా అధిరోహించారు.ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని ఎనిమిది పర్యాయములు అదిరోహించాడు.రష్యాదేశంలోని ఎల్‌బ్రూన్‌ పర్వతాన్ని మూడు సార్లు ఎక్కినాడు[10].అర్జెంటీనా లోని పర్వతశ్రేణుల్లో 6000 మీటర్లకన్న ఎక్కువ ఎత్తు ఉన్న 14 పర్వత శిఖరాలను అధిరోహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు[8]

పర్వతారోహణ-ప్రత్యేకతలు

  • పర్వతారోహణలో 12 ఏళ్లుగా మల్లిబాబు ఎన్నో సాహసాలు చేశాడు. 14 రోజుల్లో 14 రాష్ట్రాల్లో మారథాన్‌ చేసి రికార్డు సొంతం చేసుకున్నారు[11]
  • ఏడు పర్వతాలను అతి తక్కువ సమయంలో అధిరోయించిన మొదటి భారతీయుడు, ఆంధ్రుడు.
  • ఒసియానాలోని కార్సుటెంజ్ పిరమిడ్‌ను ఎక్కిన మొదటి భారతీయుడు, ఆంధ్రుడు.

పురస్కారాలు

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మానేజిమెంట్, కలకత్తా వారిచే 2011లో 'Distinguished Alumnus (ఉత్తమ పూర్వ విద్యార్థి ఆవార్డ్) ఆవార్డ్ ప్రదానం చెయ్యబడినది.[12]

ఆండీస్ పర్వతారోహణ- మరణం

మస్తాన్ బాబు మరణ వార్త తెలిసి, ఇండియా వచ్చి, కడచూపుకై నెలరోజులుగా అతని ఇంటివద్ద వేచిఉన్న విదేశి స్నేహితురాలు, సహపర్వతారోహిణి నాన్సి[13]

మల్లి మస్తాన్‌ బాబు 2015 మార్చి 24న పర్వాతారోహణ చేయుసమయంలో జరిగిన దుర్ఘటనలో మరణించాడు[1] ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పర్వతాలను అధిరోహించి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన మస్తాన్‌.. మరో రికార్డు నెలకొల్పేందుకు వెళ్లి ప్రాణాలనే వదులుకున్నాడు.

తన స్నేహితులతో కలసి అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యనున్న ఆండీస్ పర్వాతాలను ఎక్కుటకై భారతదేశం నుండి 2014 డిసెంబరు 16 నవెళ్ళాడు. 2015 మార్చి 24న పర్వతారోహణ ప్రాంరంభించాడు. అదేరోజున ఆయన జీపీఎస్ నెట్ వర్క్‌ పనిచెయ్యడం మానేసింది. చిలీ, అర్జెంటినా ప్రభుత్వాలలో ఏరొయల్ సర్వేలో బేసిక్యాంపునకు 500 మీటర్ల ఎత్తులో మృతదేహాని గుర్తించారు. అర్జెంటీనాలోని ‘సెర్రో ట్రెస్‌ క్రూసెస్‌ సుర్‌’ మంచు పర్వత ప్రదేశంలో 5900 అడుగుల ఎత్తున మృతదేహాన్ని గుర్తించినట్టు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్‌ శనివారం (4-4-2015) వెల్ల్లడించారు.[14]

మస్తాన్‌ మార్చి 22వ తేదీన ఆండీస్‌ పర్వతశ్రేణి ఎక్కేందుకు నలుగురు సభ్యుల బృందంతో కలిసి వెళ్లాడు. చిలీలో రెండో అత్యంత పెద్దదైన సెర్రో ట్రెస్‌ (6749 మీటర్లు) ను ఒంటరిగా అధిరోహించేందుకు బేస్‌ క్యాంప్‌ నుంచి బయల్దేరాడు. చివరగా మార్చి 24న మస్తాన్‌ తన స్నేహితుడితో మాట్లాడాడు. వాతావరణం ప్రమాదకరంగా మారడంతో అదే రోజు సాయంత్రానికల్లా బేస్‌ క్యాంప్‌నకు వస్తానని వారితో చెప్పాడు. అతను రాకపోవడంతో మస్తాన్‌ స్నేహితులు 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23వ తేదీ నుంచి మస్తాన్‌ ఫోన్‌ రాకపోవడంతో బంధువుల్లో ఆందోళన నెలకొంది. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ జానకి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబును కలిసి మస్తాన్‌ ఆచూకీ కోసం విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చొరవతో మార్చి 26వ తేదీన అన్వేషణ ప్రారంభమైంది. 31వ తేదీ నుంచి హెలికాప్టర్‌ ద్వారా అన్వేషణ ప్రారంభించడంతో పాటు చిలీ, అర్జెంటీనా వైపుల నుంచి గాలింపు మొదలెట్టారు. ప్రతికూల వాతావరణంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలిగింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకు (శనివారం తెల్లవారు జామున 4-4-2015) మంచులో చిక్కుకుపోయిన మస్తాన్‌ మృతదేహాన్ని గుర్తించారు.[14]

భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడిగారు మస్తాన్‌ బాబు మృతిపట్ల ఆయన కుటుంబసభులకు తన సంతాపాన్ని తెలిపారు[15].ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు కూడా మస్తాన్‌బాబు అకస్మిక మృతికి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపాడు.[16]

అల్పోష్ణస్థితి వలన మల్లి మస్తాన్ బాబు మృతి చెందాడు

మల్లి మసాన్ బాబు యొక్క స్నేహితుడు, పర్వతారోహకుడు హెర్నన్ ఫెస్ బుక్ లో, ఆండిస్‌ పర్వతంపై ఏర్పడిన అల్పోష్ణస్థితి వలన మల్లి మస్తాన్ బాబుకు శ్వాస అందక పోవటం వలన మరణించాడనివెల్లడించాడు.ఆండిస్ పర్వతాల్లో బాబు మృతదేహాన్ని గుర్తించింది మొదలు కొని మసాన్ బాబు పార్థవ శరీరాన్ని భారతదేశానికి పంపేవరకు జరిగిన అన్ని విషయాలను ఆయన ఫెస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందు పరిచాడు. ఈ విషయంలో హెర్నన్ తోపాటు మస్తాన్ బాబు సాటి పర్వతారోహకులు అయిన మారియానో గాల్వమ్, మార్సెలో సోరియా, లిసా సేబుల్ లు కూడా తమ పూర్తి సహకారాన్ని అందించారు.మస్తాన్ బాబు మృతదేహం 5950 కి.మీ ఎత్తులో ఉండటం వలన హెలికాప్టరు కూడా ఉపయోగ పడలేదు.మంచుతో కూడిన తుఫాను వలన హెలికాప్టరు పర్వతం పై చక్కర్లు కొట్టుటకు అవరోధం వచ్చింది.మస్తాన్ బాబు అనుకున్న ప్రకారం 24 మర్చి సాయంత్రం అనుకున్న సమయానికికొద్దిగా ఆలస్యంగా పర్వతశిఖరాన్ని అదిరోహించాడు.అక్కడినుండి క్రిందకు వచ్చే క్రమంలో ఏర్పడిన అల్పోష్ణవాతావరణం పర్వతఅవరోహణకు ఆటంకం కలిగించింది.పర్వతం కుడి ప్రక్కన ఏర్పడిన మంచుతుపాను ఉష్ణోగ్రత స్థాయిని కనిష్ఠ స్థాయికి తగ్గించింది.అప్పటికే పూర్తిగా బలహీన పడిన మస్తాన్ బాబు, శిఖరానికి 800 మీటర్ల ఎత్తులో తాను ఏర్పాటు చేసుకున్న తన గుడారంలో శ్వాస ఆడక, గుండె పనిచేయక అంతిమ శ్వాస వదిలాడు.[17]

అర్జెంటీనాలో మస్తాన్‌బాబుకు ఘననివాళి

మాస్తాన్ బాబు మృతదేహాన్ని అర్జెంటీనానుండి భారతదేశంలోని, ఆయన స్వగృహానికి తరలించుటకుముందు, అర్జెంటినాలోని భారత దౌత్యకార్యాయాలనికి చెందిన అధికారులు22-04-2015 (బుధవారం) ఘనంగా నివాళులు అర్పించారు అని మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ ఫెస్‌బుక్‌లో తెలిపారని 24ఏప్రిల్, నాటి సాక్షి దినపత్రికలో ప్రకటించారు.భారతదేశపు మువ్వన్నల జండా ప్రక్కన, మస్తాన్ బాబు చిత్రాలనుంచి అంజలి ఘటించారు.[18]

అంత్యక్రియలు

మస్తాన్ బాబు అంతిమ సంస్కరణకు హాజరైన అభిమానులు

మల్లిమస్తాన్ బాబు మృతదేహం భారతదేశం లోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి 24.4.2015 (శుక్రవారం), మస్తాన్ బాబు మరణించిన సరిగ్గా నెలరోజుల తరువాత చేరింది. మృతదేహంతో పాటు ఆయన సోదరి మస్తానమ్మ ఉంది. తమిళనాడు పోలీసుల ఆధ్వర్యంలో మస్తాన్‌ పార్థివ శరీరాన్ని ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పట్టణం సూళ్ళూరు పేట వరకు తీసుకువచ్చి, అక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించడం జరిగింది. సూళ్ళూరుపేట నుండి మస్తాన్‌బాబు స్వగ్రామం గాంధీజనసంఘం వరకు మార్గమధ్యంలో ఆయన పార్థివ దేహమున్న వాహనాన్ని నాయుడుపేట, నెల్లూరు, తదితర చోట్ల అభిమానులు, రాజకీయ నాయకులు, విద్యార్థిని విద్యార్థులు ఆపి, శ్రద్ధాంజలి ఘటించారు. సాయంత్రం 5 గంటలకు ఆయన మృతదేహం స్వంత ఇంటికి చేరింది. అక్కడ గ్రామస్థులు, నెల్లూరు జిల్లాకు చెందిన నాయకులు, మంత్రులు తదితరులు వెళ్ళి దర్శించారు.[19]

25-4-2015 (శనివారం) ఉదయం ఆయన మృతదేహాన్ని, ఇంటికి అరకిలోమీటరు దూరంలో ఉన్న ఆయన పొలంలోని ఖనన ప్రాంతానికి చేర్చి,12 గంటలవరకు అభిమానుల సందర్శనార్ధం ఉంచారు, వేలసంఖ్యలో మస్తాన్ బాబు అభిమానులు వచ్చి తుది చూపు చూసుకున్నారు. మధ్యాన్నం 12 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ఆధికార లాంఛనాలలతో మృతదేహాన్ని ఖననం చేసారు. భౌతిక కాయానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి, రాష్ట్రమంత్రులు నారాయణ, కిశోర్‌బాబు, పల్లెరఘునాధరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, ఎమ్మేల్యేలు మేకపాటి గౌతమరెడ్డి, కాకాణి గోవర్ధనరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలిబోయిన అనిల్‌కుమార్ యాదవ్‌, కిలివేటి సంజీవయ్యలు తమ శ్రద్ధాంజలి ఘటించారు.[20]

బయటి లింకులు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ