ఉపగ్రహ విధ్వంసక ఆయుధం

కక్ష్యలో పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహాలను ఛేదించే ఆయుధం

ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలు (అసాట్), వ్యూహాత్మక సైనిక ప్రయోజనాల కోసం ఉపగ్రహాలను నిర్వీర్యం చేసేందుకు లేదా నాశనం చేసేందుకు రూపొందించిన అంతరిక్ష ఆయుధాలు. అనేక దేశాలకు అసాట్ వ్యవస్థ లున్నాయి. యుద్ధాల్లో ఈ ఆయుధాలను ఇప్పటి వరకూ ఉపయోగించనప్పటికీ, కొన్ని దేశాలు తమ అసాట్ సామర్థ్యాలు ప్రదర్శించేందుకు తమ పనిచేయని ఉపగ్రహాలను పేల్చి తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఇప్పటికి అమెరికా, రష్యా, చైనా, భారతదేశాలు మాత్రమే ఈ సామర్ధ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించాయి.

USS <i id="mwDQ">లేక్ ఎరీ</i> నుండి 2005 లో ప్రయోగించిన RIM-161 స్టాండర్డ్ మిస్సైల్ 3

ఇటీవలి పరీక్షలు

చైనా

2007 జనవరి 11 న 22:28 UTC కు చైనాకు చెందిన SC-19 క్షిపణి, వారి వాతావరణ ఉపగ్రహం, FY-1C ను విజయవంతంగా ఛేదించింది. వార్‌హెడ్‌లో బాంబు ఏమీ పెట్టలేదు. వార్‌హెడ్‌ యొక్క గతిశక్తితోనే ఛేదన జరిగింది. [1] FY-1C, 865 km (537 mi) ఎత్తున ధ్రువ కక్ష్యలో పరిభ్రమిస్తున్న వాతావరణ ఉపగ్రహం. 750 kg (1,650 lb) బరువున్న FY-1C క్షిపణిని షిచాంగ్ ( 28°14′49″N 102°01′30″E / 28.247°N 102.025°E / 28.247; 102.025 (Xichang Satellite Launch Center) ) వద్ద ఒక మొబైల్ ట్రాన్స్పోర్టర్-ఎరెక్టర్-లాంచర్ (TEL) వాహనం నుండి ప్రయోగించారు. వార్‌హెడ్ విపరీతమైన వేగంతో ఉపగ్రహాన్ని నేరుగా ఢీకొని దాన్ని నాశనం చేసింది. 2005, 2006, 2010, 2013 [2] లలో కూడా ఈ SC-19 వ్యవస్థను పరీక్షించారని ఆధారాలున్నాయి. అయితే ఏ సంఘటనలో కూడా కక్ష్యలో దీర్ఘకాలం ఉండే శిథిలాలు ఏర్పడలేదు.

2013 మే లో, చైనా ఎగువ అయనావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్ళే ఒక సబ్ ఆర్బిటాల్ ప్రయోగం చేసినట్లు ప్రకటించింది.[3] అయితే, అమెరికా దీన్ని గ్రౌండ్ ఆధారిత అసాట్ వ్యవస్థ యొక్క మొదటి పరీక్షగా వర్ణించింది.[4] 2018 ఫిబ్రవరి 5 న, డాంగ్ నెంగ్ -3 అనే ఒక ఎగ్జిట్మోస్పెరిక్ బాలిస్టిక్ క్షిపణిని చైనా పరీక్షించింది. అసాట్ ఆయుధంగా ఉపయోగించుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఈ పరీక్షలు పూర్తిగా రక్షణాత్మకమని, అవి వాటి లక్ష్యాలను సాధించాయనీ చైనా జాతీయ మీడియా చెప్పింది.[5]

అమెరికా

2006 డిసెంబరు 14 న USA-193 అనే నిఘా ఉపగ్రహాన్ని అంతరిక్షం లోకి పంపింది. ఒక నెల తరువాత ఉపగ్రహం పనిచెయ్యడం మానేసిందని ప్రకటించారు. అది రోజుకు 500 మీ. చొప్పున కక్ష్య నుండి భూమి వైపుకు పడిపోతోందని 2008 జనవరిలో గమనించారు.[6] 2008 ఫిబ్రవరి 14 న, RIM-161 స్టాండర్డ్ మిస్సైల్ 3 అనే బాలిస్టిక్ క్షిపణి ఛేదక క్షిపణిని ప్రయోగించి దాన్ని నాశనం చెయ్యమని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు.[7]

ఆ ఉపగ్రహంలో 450 కిలోల విషపూరితమైన హైడ్రజీన్ అనే ఇంధనం ఉందని, భూమ్మీద పడిన చోటికి దగ్గరలో ఉన్న వారికి ప్రమాదమనీ ఈ ఉపగ్రహాన్ని కూల్చేసేందుకు అదే ప్రధాన కారణమనీ అమెరికా ప్రభుత్వం చెప్పింది..[8] ఈ ఛేదన విజయవంతమైందని, హైడ్రజీన్ ఇంధన ట్యాంకు ధ్వంసమైనపుడు వచ్చే పేలుడు కనిపించిందనీ ప్రకటించారు.[9]

రష్యా

2019 మార్చి 27 న అసాట్ పరీక్ష కోసం ఉపయోగించిన భారతీయ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ వారి క్షిపణి ఛేదక క్షిపణి

2015 నవంబరు 18 న రష్యా PL-19 నుడోల్ అనే క్షిపణిని ప్రయోగించిందని దాన్ని పరిశీలించిన నిపుణులు చెప్పారు.[10] 2016 మే లో, రెండోసారి నుడోల్‌ను పరీక్షించారు.[11] మరో మూడు పరీక్షలు - 2016 డిసెంబరులో, 2018 మార్చి 26 న, 2018 డిసెంబరు 23 న - జరిపారు..[12][13]

2018 సెప్టెంబరులో మిగ్-31 యుద్ధ విమానంలో అమర్చిన ఓ కొత్త రకం అసాట్ క్షిపణిని గమనించారు..[14][15]

భారతదేశం

2019 మార్చి 27 న తమ మొదటి ఉపగ్రహ ఛేదక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు భారత దేశం ప్రకటించింది. 300 కిలోమీటర్ల ఎత్తున భూ నిమ్న కక్ష్యలో ఉన్న ఒక పరీక్షాత్మక ఉపగ్రహాన్ని ఈ క్షిపణి జయప్రదంగా ఛేదించింది. ఈ మొత్తం ఆపరేషనుకు కేవలం మూడు నిమిషాలు పట్టింది. ఈ పరీక్ష ఒడిశాలోని చాందీపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుండి 05:40 UTC కి జరిగింది. [16] ఈ ఆపరేషనుకు శక్తి అని పేరు పెట్టారు. ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) - అభివృద్ధి చేసింది. [17] ఈ పరీక్షతో, ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి సామర్థ్యాలు కలిగిన నాల్గవ దేశంగా భారత్ ఉద్భవించింది. ఈ సామర్ధ్యం ఒక నిరోధకమేనని, ఏ దేశానికీ వ్యతిరేకంగా చేసింది కాదనీ భారత దేశం ప్రకటించింది.[18][19]

ఇవి కూడా చూడండి

క్షిపణి

మూలాలు