చిత్రలేఖనం

ఒక ఉపరితలం పై చిత్రాలని గీయటం, ఆ చిత్రాలకి వివిధ రకాలైన రంగులని అద్దటమే చిత్రలేఖనం [1]. దృశ్యపరమైన భాషలో కొలవదగిన ఒక ఉపరితలం పై కొన్ని కళా సౌందర్య ప్రమాణాలను పాటిస్తూ, భావాలను ఆలోచనలను వ్యక్తపరచటమే చిత్రలేఖనం[2]. ఉపరితలం పై రంగుని అద్దటానికి సాధారణంగా కుంచెలని ఉపయోగించిననూ చిత్రలేఖనానికై ప్రత్యేకంగా రూపొందించిన కత్తులు (knives), స్పాంజీ (sponge), రంగుని వెదజల్లే ఎయిర్ బ్రష్ (airbrush) లని కూడా వాడుతారు. ఉపరితలంగా గోడలు, కాగితం, వస్త్రం, కలప, గాజు, బంకమట్టి, పత్రాలు (ఆకులు), రాగి, ఇసుక లేదా కాంక్రీటు మిశ్రమాలని వాడుతారు. చిత్రాలని గీసేవారిని, వాటికి రంగులనద్దేవారిని, చిత్రకారులు అంటారు.

రాజా రవివర్మ తైల వర్ణ చిత్రం

దృశ్యకళ (Visual Arts) లో చిత్రలేఖనానికి తగు ప్రాముఖ్యత ఉంది. చిత్రపటాన్ని గీయటం, కూర్పు లే కాకుండా, సంజ్ఞ, కథనం, నైరూప్యం చిత్రలేఖనంలో కీలక పాత్రలు పోషిస్తాయి. సహజత్వం, ప్రాతినిధ్యం, ఛాయాచిత్రం, నైరూప్యం, కథనం, ప్రతీకాత్మకం, భావోద్రిక్తం లేదా రాజకీయం: చిత్రలేఖనంలో ప్రధాన వర్గాలు.

చిత్రలేఖనం ఊహకి రూపాన్ని ఇచ్చే ఒక చక్కని సాధనం. ఈ కళకు పరిమితులు లేవు. చిత్రలేఖనానికి వివిధ రూపాలు ఉన్నాయి. సహజత్వాన్ని ప్రతిబింబించే చిత్రలేఖనం (painting) ఒక వైపు అయితే కల్పిత లోకాలలో విహరించేది మరొక వైపు. భావ వ్యక్తీకరణ, మానవ చరిత్ర, సంప్రదాయాలు, జీవనశైలి, వ్యవస్థ ఇలా దేనినైనా ఆవిష్కరించగలిగే చిత్రలేఖనం, మానవుని అభివృద్ధిలో కీలకమైన కళ.చిత్రలేఖన చరిత్రలో కొంత భాగాన్ని ఆధ్యాత్మిక భావాలే నడిపించాయని చెప్పవచ్చును. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ ప్రార్థనాలయాల పైకప్పులు క్రీస్తు జీవిత చరిత్రలోని ఘట్టాలతోను, తూర్పు దేశాలలో అనేక చిత్రలేఖనాలు బుద్ధుని చిత్రపటాలతోను చిత్రీకరించారు.

చరిత్ర

2018 నాటికి అతి పురాతనమైన చిత్రలేఖనాలు ఫ్రాన్స్కి చెందిన గ్రట్ షావే ప్రాంతంలో 32,000 సంవత్సరాల క్రితానివి [3]. గుర్రాలు, ఖడ్గమృగాలు, సింహాలు, బర్రె, ఏనుగు, మనుషులు, ఇతర నైరుప్య చిత్రాలను ఈ చిత్రపటంలో చిత్రీకరించారు. ఇండోనేషియా లోని లుబాంగ్ జేర్జి సాలెహ్ గుహలలో 40,000 సంవత్సరాల క్రితం గీయబడిన కేవ్ పెయింటింగ్స్ కనుగొనబడ్డాయి [4] . 2021 నాటికి 45,500 సంవత్సరాల క్రితం వేయబడ్డ చిత్రలేఖనం కూడా ఇండొనేషియా లోనే కనుగొనబడింది.[5]

సిద్ధాంతం

18/19వ శతాబ్దానికి చెందిన తత్వవేత్తలు ఇమ్యానువల్ క్యాంట్, హెగెల్, చిత్రలేఖనంలో సౌందర్యాని పై స్పందించవలసిన, చిత్రలేఖనానికి సిద్ధాంతాలు ఆపాదించవలసిన అవసరం వచ్చింది. ప్లేటో, అరిస్టాటిల్ లు కూడా చిత్రకళ పై సిద్ధాంతాలు తీశారు. చిత్రలేఖనం (, శిల్పకళ) సత్యాన్ని సాక్షాత్కరించలేవని, సత్యం యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే అవిష్కరించగలవని; కావున ఈ రెండు రంగాలు కళల కంటే (పాదరక్షల తయారీ, లేదా ఇనుప పనిముట్ల తయారీ వలె, కేవలం) నైపుణ్యం గానే పరిగణించబడగలవని ప్లాటో తెలిపాడు [6]. కానీ లియొనార్డో డా విన్సీ కాలానికి పురాతన గ్రీసు చిత్రకళకు భిన్నంగా చిత్రకళ వాస్తవానికి దగ్గరగా వచ్చింది. లియొనార్డో ప్రకారం, చిత్రకళ: ఒక మానసిక స్థితి (Painting is a thing of mind).[7]

చిత్రకళ సౌందర్యానికి సార్వత్రికత తేలేకపోవటం ఈ కళ యొక్క లోపంగా హెగెల్ ఎత్తి చూపాడు. కవిత్వం, సంగీతం రంగాలు ప్రతీకాత్మకంగా, మేధస్సును ఉపయోగించేవి కావున చిత్రకళ కూడా వీటి వలె ఒక రొమాంటిక కళగా గుర్తించాడు [8][9].

మాధ్యమాలు

రంగు పెన్సిళ్ళు

పేస్టెల్

కొవ్వొత్తిలా ఉండే పేస్టెళ్ళలో రంగు పొడి, బైండరు ఉంటాయి.

సిరా

కలం, బ్రష్ లేదా ఈకను సిరాలో ముంచి చిత్రలేఖనం చేస్తారు.

జలవర్ణ చిత్రలేఖనం (వాటర్ కలర్ పెయింటింగ్)

కావలసినంత రంగును నీటిలో కరిగించి, దానిని కాగితం, వస్త్రం పై అద్దటంతో చిత్రలేఖనం చేయబడుతుంది. చైనా, జపాన్, కొరియా దేశాలలో ఇదే ప్రధాన మాధ్యమం. చేతి వ్రేళ్ళను కూడా సాధనాలుగా చేసుకొని చిత్రలేఖనం చేయవచ్చు.

ఆక్రిలిక్ పెయింటింగ్

రంగులను నీటితో కలిపి చిత్రీకరించే విధానాన్ని ఆక్రిలిక్ పెయింటింగ్ అంటారు. అయితే చిత్రీకరణ త్వరితగతిన పూర్తిచేయాల్సి వుంటుంది. పెయింటింగ్ పూర్తైన తర్వాత తైల వర్ణచిత్రం లా కనబడుతుంది.

తైలవర్ణ చిత్రలేఖనం

నూనెతో రంగులను కలిపి చిత్రీకరించే విధానాన్ని తైలవర్ణ చిత్రలేఖనం (oil painiing) అంటారు. ఈ పద్ధతిలో రంగులు నిదానంగా స్థిరీకరించబడతాయి. కొన్ని గంటలపాటు చిత్రం వెలుగు నీడల్లో మార్పులు చేసుకోవచ్చు.

డిజిటల్ పెయింటింగ్

కంప్యూటర్ ఆవిష్కరణతో అన్ని రంగాలలోనూ మార్పులొచ్చినట్లే చిత్రకళలోనూ డిజిటల్ పెయింటింగ్ ప్రవేశించబడింది. ఫోటోషాప్ (Photoshop), కొరల్ డ్రా (Corel Draw), ఏఐ (AI) వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించి చిత్రాలను సృష్టించవచ్చు.

చిత్రలేఖనం లో ప్రధానాంశాలు

వర్ణం , లక్షణం

స్వరం, తీవ్రత, లయ ఎలా అయితే సంగీతంలో ప్రధానాంశాలు అవుతాయో; రంగు, సంతృప్తత,, విలువ రంగుని నిర్ధారిస్తాయి. వర్ణం ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కొక రకమైన అనుభూతి కలిగించినను, మానసికంగా కచ్చితమైన ప్రభావం చూపుతుంది. ఉదాహరణకి పాశ్చాత్య దేశాలలో నలుపు దు:ఖాన్ని సూచించగా, తూర్పు దేశాలలో తెలుపు దు:ఖాన్ని సూచిస్తుంది. జొహాన్నె వుల్ఫ్ గ్యాంగ్ గొయ్థె, వస్సిలి క్యాండిన్స్కీ,, న్యూటన్ వంటి కొందరు చిత్రకారులు, సిద్ధాంతకర్తలు, రచయితలు, శాస్త్రవేత్తలు, వారి వారి వర్ణ సిద్ధాంతాలని ప్రతిపాదించారు.

భాష వర్ణానికి కొంత మేరకే భాష్యాన్ని చెప్పగలుగుతుంది. ఉదాహరణకి "ఎరుపు"అనే పదం కంటికి కనిపించే కాంతిలో ఆ రంగు యొక్క విస్తృత శ్రేణి వైవిధ్యాలను మనకి స్ఫురింప జేయగలదు. ఒక చిత్రకారునికి వర్ణం కేవలం ప్రాథమికమో లేక ఉత్పన్నమో లేక పరిపూరకమో కాకపోవచ్చును.

సాంప్రదాయేతర అంశాలు

లయ

తీవ్రత

వ్యంగ్య చిత్రం

చిత్రీకరించవలసినదాన్ని అవగతం చేసుకొనటం, దాని తీవ్రతకి ప్రాతినిధ్యం వహించటం చిత్రలేఖనాన్ని సశక్తపరుస్తాయి. విశ్వంలో ప్రతి బిందువుకి ఒక తీవ్రత ఉంటుంది. ఈ తీవ్రతని నలుపుగా గానీ, తెలుపుగా గానీ, ఈ రెంటి మధ్య వివిధ స్థాయిలలో ఉన్నా బూడిద రంగులలో వ్యక్తీకరించవచ్చును. సాధనలో చిత్రకారులు ఆకారాలని వ్యక్తీకరించటానికి వివిధ తీవ్రతలలో గల ఉపరితలాలని ఒకదాని ప్రక్కన మరొకటి చేరుస్తారు. అనగా చిత్రలేఖనం భావజాలం యొక్క మూలాల (జ్యామితీయా ఆకారాల, వివిధ దృక్కోణాల, చిహ్నాల వంటి వాటి) కి అతీతమైనది. ఉధాహరణకి, ఒక తెల్లని గోడ, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వస్తువులని బట్టి ఒక్కో బిందువు వద్ద వివిధ తీవ్రతలు ఉన్నట్లుగా ఒక చిత్రకారుడు గమనించగలుగుతాడు, కానీ సైద్ధాంతికంగా తెల్లని గోడ ఎక్కడైనా తెల్లగానే ఉంటుంది. సాంకేతిక పరంగా చూచినట్లయితే గీత యొక్క మందం కూడా గమనార్హం.

మతం

పాశ్చాత్య దేశాలు

పాశ్చాత్య దేశాలలో ప్రాచీన చిత్రలేఖనం మతపరమైందిగా ఉండేది. రినైజెన్స్, మ్యానరిజం, వంటి కళా ఉద్యమాలు క్రైస్తవసంబంధ చిత్రలేఖనాలను చిత్రీకరించటం జరిగింది.[10]

భారత దేశం

రాజా రవి వర్మ

కేరళకు చెందిన రాజా రవి వర్మ, రామాయణ, మహాభారతం లోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఇతను మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికంగా తిరువనంతపురంలోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.[11]

అక్బర్

పర్షియన్ చిత్రకళను అధ్యయనం చేసి, దానిని భారతీయులకు నేర్పి, తద్వారా మొఘల్ చిత్రకళను సృష్టించిన అక్భర్

1555 లో పర్షియా బీహ్జాద్ శైలి చిత్రకారులను హుమయూన్ భారతదేశానికి రప్పించాడు. స్వయంగా తానే కాకుండా, యుక్త వయసులో ఉన్న అక్బర్ కు, సమకాలీన చిత్రకళాకారులకు వారి చే శిక్షణ ఇప్పించాడు.[10] ఫలితంగా మొఘల్ శైలి ఉద్భవించింది. పర్షియన్ శైలిలో ఊహాజనితం, అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండగా, మొఘల్ శైలిలో వాస్తవికత పాళ్ళు ఎక్కువగా కనబడేవి. 1570 లో ఫతేపుర్ సిక్రీలో అక్భర్ వీటిని విస్తృతంగా అధ్యయనం చేశాడు.

సభా సన్నివేశాలు, ఉద్యాన వనాలు, వేటకు వదిలివేయబడ్డ చిరుతపులులు, దాడి చేయబడ్డ కోటలు, అంతులేని యుద్ధాలు అక్భర్ కు నచ్చిన కొన్ని చిత్రపటాలు. తనకు నచ్చినట్లు వేసిన చిత్రకారులను అక్బర్ సన్మానించి తగు పారితోషికాలను ఏర్పాటు చేసేవాడు.

అక్భర్ కుమారుడు జహంగీర్ తండ్రి నుండి ఈ కళను పుణికిపుచ్చుకొన్నా, అభిరుచిలో మాత్రం తేడా ఉండేది. తనకు నచ్చిన ఒక పక్షి యొక్క, లేదా తను రాజకీయంలో పాల్గొన్న ఏదో ఒక సన్నివేశాన్ని యథాతథంగా చిత్రీకరించబడటం ఇష్టపడేవాడు. స్పష్టత, స్థాపన, వివరణాత్మక వాస్తవికతకు పెద్దపీట వేశాడు.

బాపు

తెలుగువారు గర్వంగా చెప్పుకోగల చిత్రలేఖకులలో బాపు ఒకరు. బహుముఖ ప్రజ్ఙాశైలి అయిన బాపు, పలు అంశాలపై చిత్రలేఖనం చేశాడు.

నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - వంటి రంగాలలో ప్రత్యేక ముద్ర వేశాడు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.

  • పొదుపుగా గీతలు వాడటం.
  • ప్రవహించినట్లుండే ఒరవడి
  • సందర్భానికి తగిన భావము
  • తెలుగుదనము

ఎం ఎఫ్ హుసేన్

రామాయణము, మహాభారతం వంటి హైందవ పురాణేతిహాసాలను క్షుణ్ణంగా తెలుసుకొని, వాటిలో ఘట్టాలను అద్భుతంగా ఆవిష్కరించిన, గంగా నది, యమునా నది లను తన చిత్రీకరణతో మానవ రూపంలో సగటు మనిషికి చూపించిన, బ్రిటీషు రాజ్యంలో భారతీయ పౌరులకు కలిగిన అసౌకర్యాలను తెలివిగా చిత్రీకరించిన, భారతీయ సంస్కృతి-సంప్రదాయలను ఇక్కడి పవిత్ర ఆధ్యాత్మికతను, కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించిన ఎం.ఎఫ్. హుసేన్ భరత మాతను వివస్త్రగా చిత్రీకరించడంతో మతపరమైన వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. బెదిరింపులు, ప్రాణభీతితో దేశం విడిచి పారిపోయాడు. చివరి రోజుల్లో భారతదేశానికి తిరిగి రావాలనే కోరిక బలంగా ఉన్ననూ, పరిస్థితులు సహకరించక, విదేశాలలోనే కన్ను మూశాడు.[12]

జస్న సలీం

కేరళకు చెందిన జస్న అనే ముస్లిం వనిత హఠాత్తుగా కృష్ణుడి బొమ్మలను వేయటం ప్రారంభించింది. విచిత్రం ఏమిటంటే ఈమె కృష్ణుడి బొమ్మలు చక్కగా వేయగలదు. కానీ వేరే ఏ ఇతర బొమ్మ వేయలేదు. జస్న కళను గానీ, చిత్రకళను గానీ అభ్యసించకపోవటం గమనార్హం. ఒక పాత వార్తా పత్రికలో వెన్న కుండతో ఉన్న బాల మురళిని చూచి జస్న ముగ్ధురాలైంది. అప్పటి నుండి కృష్ణుడి బొమ్మలను వేయటం ప్రారంభించింది. వివాహిత, ఇద్దరు పిల్లల తల్లి అయిన జస్న యొక్క ఈ కళ, ఆమె అత్తగారింట నచ్చలేదు. తన భర్త సైతం మొదట ఆమె బొమ్మలను నాశనం చేయమని చెప్పినను, జస్నకు అది నచ్చలేదు. తాను వేసిన కృష్ణుడి బొమ్మలలో ఒక దానిని తమ మిత్రులైన నంబూద్రి కుటుంబానికి బహుమతిగా ఇవ్వటం, అది ఇచ్చిన తర్వాత వారి ఇంట అంతా శుభమే జరగటంతో జస్న గురించి పలువురికి తెలిసింది. భర్త కూడా శాంతించి ఆమెకు బాసటగా నిలువడంతో జస్న కృష్ణుడి గురించి పలువురికి తెలిసింది. గురువాయూర్ లో కృష్ణుడి గుడి వారు ఆమె వేసిన చిత్రపటాన్ని కోరటం, ఆమెకు ఆలయ ప్రవేశం కలిగించటం, ఆమె కృష్ణుడి చిత్రలేఖనాలు హిందువులచే పూజలందుకోవటం ఆమెకు గర్వాన్ని కలిగించాయి. గౌరవాన్ని మిగిల్చాయి. తన తల్లిదండ్రులకు కలిగిన ముగ్గురి సంతానంలో జస్న చివరిది కావటం, ఆమెను వారు ముద్దుగా "కన్నా"అని సంబోధించటం యాదృచ్ఛికం.[13][14][15]

చిత్ర కళలో రకాలు

చిత్రలేఖనం పలు రకాలు. ఎవరైనా వేయగలిగే డూడుల్స్ ఒక రకం అయితే, చేయి తిరిగిన వారు మాత్రమే వేయగలిగే తైలవర్ణ చిత్రలేఖనం మరొక రకం. నవ్వు పుట్టించే వ్యంగ్య చిత్రాలు కొన్ని అయితే ఆలోచింప జేసే చిత్రలేఖనాలు మరి కొన్ని. కొన్ని కాగితం పై వేసేవి అయితే మరి కొన్ని కాన్వాస్ పై వేసేవి. అడోబీ ఇల్లస్ట్రేటర్, ఇంక్‌స్కేప్ వంటి సాఫ్టువేరు లతో కంప్యూటర్ లను ఉపయోగించి డిజిటల్ పెయింటింగ్ లను సృష్టించవచ్చు.

డూడుల్స్

డూడుల్ ఉదాహరణ. డూడుల్ కార్టూను కావలసిన అవసరం లేదు
డూడుల్స్ చిత్రాలే కావలసిన అవసరం లేదు

డూడుల్ (ఆంగ్లం: Doodle) అనగా అన్యథా ఇతర ముఖ్య కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నా, వేరే వాటి/దాని గురించి ఆలోచిస్తూ, లక్ష్యం లేకుండా, కాలక్షేపం కోసం, సరదాగా వేసిన ఒక బొమ్మ.[16][17][18][19] డూడుల్ కేవలం బొమ్మలకే పరిమితం కాదు. ఫ్యాన్సీగా రాయబడే అక్షరాలు, సంతకాలు, కార్టూనులు, రేఖాగణిత అంశాలు లేక మరే పిచ్చిగీతలైన కావచ్చు.[20][21] డూడుల్స్ కోసం ప్రత్యేకంగా పెద్ద సరంజామా అవసరం లేదు. కేవలం కలం-కాగితం లతో ఎక్కడైనా, ఎప్పుడైనా డూడుల్స్ మొదలుపెట్టవచ్చు. సరైన కాగితం లేకపోతే ప్రత్యామ్నాయాలుగా పేపరు న్యాప్కిన్, టిష్యూ పేపరు, నోటు పుస్తకంలో మార్జిన్ కు అటువైపు లేక వేరే ఏ చిత్తు కాగితమైనా ఉపయోగించవచ్చు.

వ్యంగ్య చిత్రాలు

స్కెచ్

రేఖాచిత్రం (డ్రాయింగ్)

వాటర్ కలర్ పెయింటింగ్

ఆయిల్ పెయింటింగ్

డిజిటల్ పెయింటింగ్

సమగ్ర చిత్రలేఖనం

ప్రధాన వ్యాసం సమగ్ర చిత్రలేఖనం

Raevsky Battery at Borodino, a fragment of Roubaud's panoramic painting.

చిత్రలేఖనం ద్వారా చిత్రించిన చిత్రంలో పొందుపరచాలనుకున్న సమగ్ర విషయాన్ని లేక చూపించాలనుకున్న సమస్త సమాచారాన్ని ఒకే చిత్రంలో అగుపరచడాన్ని లేక చూపించడాన్ని సమగ్ర చిత్రలేఖనం అంటారు. సమగ్ర చిత్రలేఖనాన్ని ఆంగ్లంలో పనోరమ పెయింటింగ్ అంటారు. సమగ్ర చిత్రాలు విశాలమైన ప్రాంతంలో ఆవరించి ఉన్న విశేషాన్ని సమూలంగా వీక్షించేందుకు తయారు చేసిన భారీ కళాఖండాలు.

ఒక ప్రత్యేకమైన విషయాన్ని తరచుగా ప్రకృతి దృశ్యం, సైనిక యుద్ధం, లేక చారిత్రక సంఘటనలను వంటి చిత్రాలను ఈ సమగ్ర చిత్రాల ద్వారా చిత్రిస్తుంటారు. 19 వ శతాబ్దం నుండి ఐరోపా, అమెరికా రాష్ట్రాలలో ఈ సమగ్ర చిత్రలేఖనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత లభించింది. ఈ చిత్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని శృంగారభరిత కవిత్వ రచయితల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. కొన్ని సమగ్ర చిత్రలేఖనాలు 21 వ శతాబ్దంలో మనుగడ సాగించాయి, ప్రజా ప్రదర్శనలో ఉన్నాయి.

చిత్ర రచన

ప్రధాన వ్యాసం చిత్ర రచన

శ్రీనివాసుని చిత్రాన్ని శ్రీ అక్షర రూపంలో అక్షర శైలిలో కొద్దిగా మార్పు చేస్తూ చిత్రించిన చిత్రం. ఒక్క అక్షరంతోనే కొంత సమాచారం ఇవ్వగల చిత్రం ఇది.

ఒక వస్తువు యొక్క చరిత్రను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా అక్షరాలను కూర్చుతూ వ్రాసే రచనను చిత్రరచన లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన విద్యా విధానం గురించి ప్రభుత్వం పరిశీలిస్తుంది.

చిత్రాలను చిత్రించే వ్యక్తిని చిత్రకారుడు అంటారు. ఇతను రకరకాల రంగులను ఉపయోగించి తన కళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తాడు. చిత్రకారుడు చిత్రాన్ని చూసి లేదా ఊహించి తన ప్రతిభతో చిత్రాన్ని రూపొందిస్తాడు. చిత్రకారుడు చిత్రకళపై ఉన్న అభిలాషతో లేదా సంపదపై మక్కువతో ఈ కళను ఎంచుకుంటాడు. తాను చిత్రించిన చిత్రాలను ప్రదర్శనకు పెట్టి ప్రదర్శకులను సమ్మోహితులను చేయటం తద్వారా వాటికి ఆకర్షితులైన చిత్రకళా ప్రియుల నుండి మంచి విలువను పొందుతాడు. చిత్రకారుల వలన నాటి సంస్కృతిని, దుస్తులను, ఆచార వ్యవహారాలను, జీవన శైలిని చిత్రాల రూపంలో నేటి మానవుడు తెలుసుకోనగలుగుతున్నాడు.

స్టాంపుల పై చిత్రలేఖనం

స్టాంపుల పై ప్రముఖుల, ప్రముఖప్రదేశాల చిత్రాలను ముద్రించటం ఆనవాయితీగా వస్తోంది. పలు విదేశీ/స్వదేశీ స్టాంపులపై చిత్రలేఖనానికి సంబంధించిన బొమ్మలు ముద్రించబడతాయి.

విదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం

విదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం

స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం

స్వదేశీ స్టాంపుల పై చిత్రలేఖనం

ప్రఖ్యాత చిత్ర కారులు

Panorama of a half section of Night Revels of Han Xizai, 12th century Song Dynasty painting.

ఇవి కూడ చూడండి

ఎరిక్ రవిలియస్

మూలాలు

బయటి లింకులు