డాన్ క్విక్సోట్

పాశ్చాత్య సాహిత్యపు శ్రేష్ఠ రచనగా పేరొందిన స్పెనిష్ నవల

డాన్ క్విక్సోట్ (అమెరిక ఆంగ్ల మాండలికంలో కీహొవ్టెయ్) ఒక గాథరూప స్పెనిష్ నవల. దీని రచయిత మి'''ఘె'''ల్ డె '''థె'''ర్‌'''భ'''న్టెస్ (Miguel de Cervantes). 1605లో మొదటి భాగం, 1615లో రెండో భాగంతో రెండు భాగాలుగా వచ్చిన ఈ నవల పూర్తి పేరు ది ఇన్‌జీన్యస్ జెన్‌టిల్మన్[గమనిక 1] డాన్ క్విక్సోట్ ఆఫ్ ల మన్చ (ఆంగ్లం)/ఎల్ ఇంహెన్యొసొ ఇల్ఘొ (రెండో భాగంలో ఈ పదం బదులు యెరొ (caballero) అనే పదం వాడబడింది) డొఙ్ కిఖొటె డె ల మంచ (El ingenioso hidalgo don Quixote de la Mancha). పాశ్చాత్య సాహిత్యపు మౌలిక రచనల్లో ఒకటిగా, ప్రపంచంలోని అత్యుత్తమ రచనల్లో ఒకటిగా పరిగణింపబడే దీనిని, మొదటి ఆధునిక నవలగా భావిస్తారు.[1][2][3][4] అత్యధికంగా అనువదించబడ్డ రచనల్లో ఇది ఒకటి.[5]

డొన్ కీహొవ్టి
1605లో ముద్రితమైన మొదటి భాగపు శిర్షిక
కృతికర్త: మిఘెల్ డె థెర్‌భన్టెస్
అసలు పేరు (తెలుగులో లేకపోతే): ఎల్ ఇంయినియొసొ ఇల్ఘొ డొఙ్ కిఖొటె డె ల మంచ
దేశం: అభ్ౙభర్ఘొ స్పెయిన్
భాష: ఆధునిక స్పెనిష్
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: ఫ్రన్సిస్కొ డె రొబ్లెస్
విడుదల: 1605 (మొదటి భాగం)
1615 (రెండవ భాగం)
ఆంగ్ల ప్రచురణ: 1612 (మొదటి భాగం)
1620 (రెండవ భాగం)
ప్రచురణ మాధ్యమం: ముద్రణ


ల మంచలో అలొన్సొ కీహనొ(ఆంగ్లం)/అలొన్సొ కినొ (స్పెనిష్)—(Alonso Quijano) అనే ఒక ఇడెల్గొవ్ (ఆంగ్లం)/ఇల్ఘొ (స్పెనిష్)—(Hidalgo)[గమనిక 2] ఎన్నో వీరగాథలు చదివి పిచ్చోడయ్యాడో, లేక అలా నటిస్తున్నాడో తెలియదు కానీ, తన పేరు డొఙ్[గమనిక 3] కీహొవ్టి డె ల మన్చ గా మార్చుకుని, ఒక సాహసవీరుడిగా[గమనిక 4] మారి, వీరత్వానికి మళ్ళీ ఊపిరులూదాలని నిర్ణయించుకుంటాడు. ఈ కథ మొత్తం ఇతని "సాహస యాత్రల" చుట్టూ తిరుగుతుంది. ఇతను తన డాలుగాడిగా ఒక మామూలు రైతు ఐన సెన్చౌ పెన్ౙ (ఆంగ్లం)/సంచొ పం(స్పెనిష్)ను నియమించుకుంటాడు. అప్పటికే కాలం చెల్లిన అంశాలుగా చూడబడుతున్న వీరపరాక్రమాల పై కీహొవ్టి గంభీరమైన ప్రసంగాలను సెన్చౌ తన వ్యవహారిక జ్ఞానంతో ఎదుర్కొంటుంటాడు. ఇలా సెన్చౌ వాస్తవికతకూ, కీహొవ్టి ఆదర్శాలకూ మధ్య వ్యత్యాసం కథలో కనిపిస్తూ ఉంటుంది. మొదటి భాగంలో కీహొవ్టి ప్రపంచాన్ని వాస్తవిక ధోరణితో చూడకుండా, తాను చరిత్రలో నిలిచిపోయే వీరగాథలో బతుకుతున్నానని అనుకుంటూ ఉంటాడు.

అలెక్సఁడ్ర్ డ్యిమ వ్రాసిన ద థ్రి మస్కిటియర్స్(1844)లో, మార్క్ ట్వెయ్న్[గమనిక 5] రచన ఎడ్‌వెంచర్స్ ఆఫ్ హకుల్‌బెరి[గమనిక 6] ఫిన్(1884)లో, ఎడ్మొఁ రొస్టఁ వ్రాసిన సిరనొ డ బెర్ౙరక్ (1897)లో ఉన్న దీని ప్రస్తావనలూ, అలాగే ఆంగ్లంలో ఉన్న క్విక్సొటిక్[గమనిక 7], థారియౌ వంటి పదాలూ, ఆ కాలపు పాశ్చాత్య సాహిత్య రంగం పై ఈ నవల ప్రభావాన్ని చెబుతున్నాయి. లథారియౌ మొదటి భాగంలో "ది ఇంపర్టినెన్ట్లి క్యుర్యస్ మ్యాన్[గమనిక 8]"(ఆంగ్లం) ("ఎల్ కురియొసొ ఇంపర్టినెన్టె"(స్పెనిష్)— అర్థం: అనుచిత ఆసక్తి కలవాడు) అనే ఉపకథలో ఒక పాత్ర.

ఈ నవల వచ్చిన నాళ్ళలో దీన్ని ఒక హాస్య నవలగా చూసేవారు. ఫ్రెంచ్ విప్లవం తరువాత ఈ కథలో కొంత మంది మేధావులు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని వాస్తవిక ధోరణితో చూడకుండా ఊహాలోకంలో మునిగిపోవడమనే కోణం బాగా ప్రాచూర్యం పొందింది.[ఆధారం చూపాలి] ఈ కోణం వలన దీన్ని ఒక ఆసక్తికరమైన, చిత్రమైన ప్రత్యేక పుస్తకంగా చూసేవారు. 19వ శతాబ్దంలో ఈ కథ నాటి సామాజిక పరిస్థితులపై ఒక వ్యాఖ్యానంగా చూసారు[ఆధారం చూపాలి] కానీ థెర్‌న్టెస్ ఎవరి వైపున ఉన్నాడన్నది ఎవరూ చెప్పలేకపోయారు. చాలా మంది విమర్శకులు దీన్నొక విషాద నవలగా చూసేవారు.[ఆధారం చూపాలి] కీహొవ్టీ ఆదర్శాలూ, ఔన్నత్యం వర్తమాన సమాజంలో కాలం చెల్లిన పనికిరాని భావాలుగా చూడబడటమే విషాదం అని వీరి అభిప్రాయం. 20వ శతాబ్ది నాటికి ఇది ఒక శ్రేష్ఠ సాహిత్యంగా గుర్తింపు తెచ్చుకుంది.

కథ

నవలలోని ప్రముఖ ఘట్టమైన గాలిమరల ఘట్టాన్ని చూపిస్తున్న గుస్టవ్ డొరె గీసిన బొమ్మ.

నవలలో మొదటి అంకాలు కొన్ని 'ల మన్చ పుటల్లో నుండి సేకరింపబడ్డ వివరాలనీ, మిగతావి అరబ్ భాషలో ఉన్న ఒక గ్రంథం నుండి అరబ్ చరిత్రకారుడు సిడె హమెటె బెనెంగెలి అనువదించిన వివరాలనీ థెర్‌న్టెస్ వ్రాసారు. ఇలా వ్రాయడం వల్ల ఇది కథ అని తెలిసినప్పటికీ, పాఠకుడికి చాలా కాలం క్రితం జరిగిన ఒక గాథను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఇలా అభూత కల్పనలను చరిత్రలాగా చెప్పడం ఆ నాటి రచనల్లో మామూలు విషయమే. ఎన్నో కథల్ని "అనగనగా ఒకనాడు సుదూర ప్రాంతంలో" వంటి వాక్యాలతో మొదలు పెట్టడం మామూలే.

వీరి సంచారంలో కీహొవ్టి, సెన్చౌలు వేశ్యలనూ, మేకల కాపరులనూ, సైనికులనూ, పూజారులనూ, తప్పించుకు పారిపోయిన ఖైదీలనూ, భగ్న ప్రేమికులనూ కలుసుకుంటారు. ఇలా కలిసిన వారు వీరికి చెప్పే కథల్లో కొన్ని సార్లు వర్తమాన సమాజంలోని వాస్తవ సంఘటనలు కూడా ఉండేవి. ఇలా కొత్త వాళ్ళని కలిసినప్పుడు కీహొవ్టి అక్కడ తాను నెరవేర్చవలసిన ఒక సాహస కర్తవ్యమును ఊహించుకుంటుండెడివాడు. ఈ ఊహల వల్ల తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుట, బసలలో నుండి పైకము చెల్లించక నిష్క్రమించుట వంటి వాటి వలన వీరిద్దరూ అనేక ఇక్కట్లకూ, అవమానాలకూ, గాయాలకూ గురవుతారు (ఎక్కువగా సెన్చౌ వీటికి దొరికిపోతాడు). అంతిమముగా కీహొవ్టి తన స్వపురమునకు మరలక తప్పదు. నవల చివరలో వీరు మూడో యాత్ర కూడా చేసారనీ, దాని వివరాల సేకరణ ఇంకా జరుగుతోందనీ, అలాగే శిధిలావస్థలోనున్న ఒక కుటీరమును పునర్నిర్మిస్తుండగా, అక్కడ ఒక ముసలి వైద్యునికి దొరికిన ఒక సీసపు పెట్టెలోని పత్రములలో వివిధ స్మరణములూ, కీర్తనములతో సహా ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారం లభించిందనీ, వాటి పరిష్కరణ పండితుల సహాయంతో కొనసాగుతోందనీ, త్వరలోనే తృతీయ యాత్ర వివరాలు ప్రచురితమవ్వొచ్చనీ చెప్పి కథ ముగిస్తాడు.

మొదటి భాగం (1605)

మొదటి భాగం నాలుగు అంకాలుగా విభజించబడింది. ఒక్కొక్క అంకంలో అనేక ప్రకరణాలున్నాయి. నవల వచ్చిన నాటికి, దీనికి రెండో భాగం వ్రాయాలన్న ఆలోచన లేదు. మరిన్ని సాహసాల గురించి ఇంకో పుస్తకంలో వ్రాస్తానని ఈ భాగం చివర్లో వ్రాయడం ఆనాటి రచనా శైలే కానీ రెండో భాగం ఉన్నదనే ఉద్దేశంలో వ్రాసినది కాదు.[8]

ఆంగ్ల అనువాదంలో వీరి యాత్రలు 'సలి'లు గా పేర్కొనబడ్డాయి.

మొదటి సలి (1–5 ప్రకరణాలు)

ల మన్చలో ఒకానొక మూలన అలొన్సొ కీహనొ అనే పేరు గల (ఈ పేరు నవల మధ్యలో గానీ చెప్పబడదు), సుమారు 50 ఏళ్ళ ఇడెల్గొవ్ తన మేనకోడలూ, పనిమనిషీ, గుర్రాల కాపరి కుర్రవాడులతో (ఈ కుర్రాడి ప్రస్తావన నవలలో మళ్ళీ రాదు) కలిసి ఉంటున్నాడు. ఈయన తెలివైన వాడేనైనప్పటికీ, వేళకి పడుకోకుండా పుస్తకాలు చదువుతూ కూర్చోవడంతో, బుర్ర ఎండిపోయి, కొలెరిక్[గమనిక 9][గమనిక 10] స్వభావం అబ్బినది. అందుచేత ఇతనికి ముక్కు మీద కోపం. ఈయన చదివిన వీర గాథలలోనిదంతయూ నిజముననీ, వాటి అంతరార్థములను తాను సంపూర్తిగ గ్రహించినాననీ, ఆ కార్యము తలపెట్టుటకు స్వయముగా ఆ అరిస్టాటిల్‌‌ఏ మరి యొక జన్మ ఎత్తి వచ్చిననూ అతనూ ఇంత కూలంకషముగ గ్రహించబోడనీ కీహనో నమ్మేవాడు.

ఇంకను మరిన్ని సాహసములు మన్ముందు రానున్నవి యనే భరోసాతో ఈ వీరకథలను ముగించు శైలిని ప్రశంసించిన ఆయన, అనేక మార్లు స్వయముగా కలము పూని తదుపరి అంకములను తెనిగించబోయినారు. వారు ఆ రచనలకు దీటైన కొనసాగింపులే తెనింగించగలరన్న విషయము నిస్సందేహమే. ఇలా ఈ ఆలోచనల్లో మునిగిపోయి, ఆ కథానాయకులను అనుకరించే దాకా వచ్చి, చివరకు సాహసాలను వెతుక్కుంటూ దేశ సంచారం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఒక పాతబడ్డ కవచం తొడుక్కుని, తన పేరును "డాన్ క్విక్సోట్"గా మార్చుకుని, తన బక్కచిక్కిన గుర్రానికి "రొసినన్టె (ఆంగ్లం)/రొథినన్టె (స్పెనిష్)" అనే పేరు తగిలించి,అల్డొన్ౙ లొరెన్ౙొ అను యువతిని తన ప్రియసఖిగా గుర్తించి, ఆమెకు డల్సినియ ఎల్ టొబొసొ (ఆంగ్లం)/డుల్సినెయ ఎల్ టొబొసొ అనే పేరును ఇస్తాడు. అనేక వ్యయప్రయాసలకోర్చి సేకరించిన వివరమ్ములను బట్టి యామె పశువధ్యశాలనందు కసాయిది యని తెలిసినది. ఆమెకు ఇంకనూ తాను కీహొవ్టి ప్రేయసినవ్వు అదృష్టముకు నోచుకొంటినని తెలియదు.[గమనిక 11] తక్కువ కాలములోనే యశోధనుడను కాగలనను విశ్వాసముతో ఒక సత్రానికి వస్తాడు. ఆ సత్రాన్ని కోట అనీ, అక్కడ ఉన్న వేశ్యలను దాసీజనమనీ, సత్రపు యజమానిని కోటకు అధిపతియనీ అనుకుని, తనను పాలెగాడిగా గుర్తించవలెనని ఆ యజమానిని ఆజ్ఞాపిస్తాడు. ఆ యజమాని కీహొవ్టికు వంతపాడి, అతని లాంటి సాహసికి డాలుగాడూ, చేతిలో కొంత ధనమూ, గాయములను మాన్పు దివ్యౌషధమూ ఉండుట ముఖ్యమని నమ్మిస్తాడు. రాత్రి కీహొవ్టి తన కవచమును సంరక్షిస్తుండగా అటుగా వెళుతున్న కంచరగాడిదలవాళ్ళు, తమ (కంచర)గాడిదలకు నీళ్ళు పెట్టటానికి, నీటి తొట్టెలో ఉన్న అతని కవచమును తీసి పక్కకి పెట్టబోగా, ఇతను వారితో గొడవపడతాడు. ఒక ఉత్సవం జరిపినట్టు నాటకమాడి, కీహొవ్టిను నైట్‌గా ప్రకటించి, వెనువెంటనే అతన్ని అతని దారిన సాగనంపి వదిలించుకుంటాడు.

తరువాత జీతభత్యాల గొడవలో ఎన్డ్రెస్ అనే పనివాణ్ణి అతని యజమాని చెట్టుకు కట్టేసి కొడుతుంటే, కీహొవ్టి పనివానికి "సహాయము చేస్తాడు". కానీ అత్త మీద కోపము దుత్త మీద చూపించినట్టు, కీహొవ్టీ వెళ్ళిపోగానే ఆ యజమాని అతన్ని రెట్టించి తంతాడు (అని తరువాత ఎన్డ్రెస్ కీహొవ్టికి చెబుతాడు). తరువాత కీహొవ్టి టొలెధొ (స్పెనిష్)/టొలెయ్డొ (ఆంగ్లం) నుండి వచ్చిన కొందరు వ్యాపారులను కలుస్తాడు. వారు తన ఊహాసుందరి డల్సినియను 'పరిహాసమాడగా', కీహొవ్టి వారిని ఎదుర్కొంటాడు. వాళ్ళు ఇతన్ని మెత్తగా తన్ని పక్కన పడేసి పోతే, అటుగా వెళ్ళే రైతుకూలీ ఒకడు చూసి ఇతన్ని ఇంటికి చేరుస్తాడు.

కీహొవ్టి గ్రంథాలయ విధ్వంసం (ప్రకరణాలు 6–7)

కీహొవ్టికి స్పృహ రాకమునుపే ఆయన మేనకోడలూ, పనిమనిషీ, ఒక పూజారీ, ఆ చుట్టుపక్కలి మంగలి వాడొకడూ కలిసి అతని సాహస గాథలనూ, ఇతర పుస్తకాలనూ తగలబెట్టేస్తారు. ఈ అంకంలో ఎక్కువగా ఏ పుస్తకాలను తగలబెట్టాలీ, వేటిని ఉంచాలీ అనే చర్చే ఉంటుంది. ఇది ఒక హాస్య ఘట్టం. ఎందుకంటే ఫలానా పుస్తకాలు అశ్లీలమైనవైతే, వాటిలో ఉన్న చిలిపి విశేషాలు అంత వివరంగా పూజారికెట్ల తెలుసు ? ఈ హాస్యమే కాక పుస్తకాల విషయంలో థెర్‌భన్టెస్ ఇష్టాయిష్టాలు కూడా మనకి ఈ అంకంలో తెలుస్తాయి. మచ్చుకు తన నవల లటియ ను వదిలేయగా, వాస్తవికతకు దూరంగా ఉన్న (వేరొక రచయిత నవల) ఫెలిక్స్‌మర్టె డె హిర్కెనియ తగులబెట్టబడుతుంది. మొత్తం పూర్తయ్యాక గ్రంథాలయాన్ని మూసేసి, కీహొవ్టి స్పృహలోకి వచ్చాక ఇదంతా ఒక మాయావి (స్పెనిష్‌లో ఎంకన్‌టధొర్) పని అని చెబుతారు.

రెండో సలి (ప్రకరణాలు 8–10)

కొన్నాళ్ళు తనకీ పిచ్చి వదిలిపోయిందనట్టు మిన్నకున్న కీహొవ్టీ, ఒకనాడు తన పొరుగు వాడైన సెన్చౌ పెన్ౙను తన డాలుగాడిగా ఉండమని కోరాడు. బదులుగా తనకొక చిన్న నిర్వహణాధికారి పదవి (ఒక ఇన్‌సులకు అధికారిని చేస్తానంటాడు. ఇన్‌సుల అంటే ఒక పట్టణంలో చిన్న ముక్క) ఆశగా పెడతాడు. సెన్చౌ ఒక పేద రైతు కానీ కీహొవ్టీ లాగా కాకుండా వాస్తవిక ధోరణి ఉన్నవాడు. ఇతని ప్రతిపాదనకు సెన్చౌ ఒప్పుకోగా, ఒకనాడు పొద్దు పొడుపునే ఇద్దరూ ఇళ్ళ నుండి జారుకుంటారు. ఇక్కడి నుండి పేరొచ్చిన వాళ్ళ సాహసాలు మొదలవుతాయి‌. వీటిలో మొదటిది గాలిమరలను రాక్షసులుగా అనుకుని కీహొవ్టి వాటిపై దాడి చేయడం.

తరువాత వీళ్ళిద్దరూ తన పరివారముతో పల్లకిలో వెళుతున్న ఒకామెనూ, ఆ పరివారానికి కాస్త ముందు వెళుతున్న ఇద్దరు బెనిడిక్టిన్ ఫ్రయర్‌లనూ[గమనిక 12] చూస్తారు. ఆ పరివారానికీ, ఫ్రయర్లకూ ఏ సంబంధం లేదు కానీ వాళ్ళిద్దరూ ఒకే దారిన వెళుతున్నారు. కీహొవ్టి మాత్రం వాళ్ళను ఆ మహిళను బంధించిన మాయావులనుకుని, ఒక ఫ్రయర్‌ను తన్ని గుర్రం మీద నుండి పడేస్తాడు. దీనితో ఆ పరివారంతోనున్న సాయుధుడైన బాస్క్[గమనిక 13] కీహొవ్టిని ఎదుర్కొంటాడు. బాస్క్ దగ్గర డాలు లేక ఒక దిండును డాలుగా పట్టుకుని రాగా ఇద్దరూ కొట్టుకుంటారు. సరిగ్గా కొట్లాట మధ్యలో రచయిత తన మూలప్రతిలో (ల మన్చ పుటలు) ఇంతవరకే ఉందని చెప్పి కథకు విరామాన్నిస్తాడు. మళ్ళీ అరబీ మూలాల నుండి అనువదించిన రచనలో మిగతా కథ ఉందంటూ మొదలుపెడతాడు. ఆ మహిళ పల్లకిలో నుండి దిగి, తన పరివారాన్ని కీహొవ్టీకి "లొంగిపోవాలని" ఆజ్ఞాపించడంతో గొడవ ముగుస్తుంది.

రెండు భాగాలవీ మొదటి సంచికలు

గొర్రెల కాపరులతో ప్రయాణాలు (ప్రకరణాలు 11–15)

కీహొవ్టీ, సెన్చౌలు దారిలో కొందరు గొర్రెల కాపరులను కలుస్తారు. సెన్చౌకీ, వారికీ కీహొవ్టీ ఆస్తిపాస్తులను బంధనములు లేక మనుష్యులందరునూ సుఖశాంతములతో నుండే మానవాళి యొక్క "స్వర్ణయుగము"ను గూర్చి చెబుతాడు. ఆ కాపరులు వారిద్దరినీ గొల్లనవలలు[గమనిక 14] చదివి, గొర్రెల కాపరి అయ్యేందుకు తన చదువు మానేసి వచ్చి, మర్సెల అనే కాపరిదానితో[గమనిక 15]ప్రేమలో పడ్డ గ్రిసొస్టొమొ అనే అతని అంత్యక్రియలకు రావాలని పిలుస్తారు. అంత్యక్రియలకు వచ్చిన మర్సెల గ్రిసొస్టొమొ వ్రాసిన విరహ కావ్యాలతో తనకు సంబంధం లేదని చెప్పి, సంప్రదాయాల పేరుతో తనకు బంధనాలు వేసారనీ, తనకు స్వేచ్ఛ కావాలనీ అంటూ, అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆమెను అనుసరిస్తూ కీహొవ్టీ, సెన్చౌలు వెళతారు గానీ, కొంత దూరం వెళ్ళాక అలసిపోయి, ఒక కాలువ దగ్గర ఆగి సేద తీరుతారు. ఇంతలో అక్కడ మేయడానికి ఒక తట్టుల (పొట్టి గుర్రాలు) మంద రాగా వాటిలో ఒక దానితో రొసినన్టె కూడబోతుంది. మంద కాపరులు రొసినన్టెను కర్రలతో కొట్టి ఆపబోతే కీహొవ్టీ వారితో పోరాడతాడు. కీహొవ్టీ, సెన్చౌలను వాళ్ళు తన్ని పక్కన పడేస్తారు.

సత్రం (ప్రకరణాలు 16–17)

మొత్తానికీ ఎలాగో అక్కడ నుండి బయటపడ్డాక, వారిద్దరూ దగ్గర్లోని సత్రానికి చేరుకుంటారు. ఇంకొకసారి కీహొవ్టీ సత్రాన్ని కోట అనుకుంటాడు కానీ, సెన్చౌ అనుమానాలు సెన్చౌకి ఉన్నాయి. మొత్తానికీ వారిద్దరికీ, ఇంకో బాటసారితో కలిపి వసతి గదిగా మార్చిన ఒక కొట్టిడిని ఇస్తారు. కీహొటె మంచం మీద పడుకోగా, సెన్చౌ పక్కన బొంత మీద పడుకున్నాడు. ఆ నిశీధి సమయాన తన సచ్ఛీలతకు జరుగబోవు పరీక్షను గూర్చి కీహొటె మదనపడుతుంటాడు. తనతో నాకోటలోని అందమైన రాజకుమార్తె ప్రేమలోనున్నదనీ, రాత్రికి తన పక్కలోకి రాబోవుచున్నదనీ కీహొటె అనుకుంటున్నాడు. ఇంతలో అతని పక్కలోకి ఆ సత్రపు పనిమనిషి మెరిటొర్నెస్ వస్తుంది. ఆమెను కీహొటె రాకుమారి అనుకుని తన పక్కలోకి తీసుకోబోతాడు. ఐతే ఆమె వచ్చినది అదే గదిలోనున్న ఇంకో ప్రయాణికుడి కోసం. ఈ గడబిడతో ప్రయాణికుడితో వీరిద్దరికీ గొడవ అవుతుంది. కీహొటె, సెన్చౌలకు ఒళ్ళు హూనం అవుతుంది. తరువాత కీహొటె తాము ఒక అరబు మాంత్రికునితో తలపడ్డామనీ, అందుకే పరాజితులమైతిమనీ యని, తమ గాయములను మాన్పుటకు "ఫియర్ ఎ బ్రాస్ (ఫ్రెంచ్)/ఫియరబ్రస్ (ఆంగ్లం)[గమనిక 16] లేపనము" యను ఒకదానిని ఉపయోగిస్తాడు. కీహొవ్టికి కొంత ఇబ్బంది తగ్గుతుంది కానీ సెన్చౌకు మాత్రం ఆ మందు వేసుకోగానే ఉన్న ఆరోగ్యం చెడి, దాదాపు చావు తప్పి కన్నులొట్టపోయినంత పని అవుతుంది. ఏదేమైననూ వీరిద్దరూ సత్రం నుండి బయలుదేరతారు. తాను చదివిన కథలలోని సాహసవీరులకు మల్లే కీహొవ్టి తమ వసతి కల్పనకు పైకం చెల్లింపక నిష్క్రమించెదడు. వెనుక మిగిలిన సెన్చౌను సత్రంలో బసకున్న వారంతా కలిసి ఒక బొంతలో లుంగచుట్టి ఎగరేస్తూ కాసేపు ఆడుకుంటారు. ఈ సన్నివేశాన్ని నవల్లో చాలాచోట్ల రచయిత గుర్తుచేస్తుంటాడు. ఎలాగొలాగ అక్కణ్ణుండి బయటపడి, మళ్ళీ బయలుదేరతారు.

బానిసలూ, కర్డెన్యొ (ప్రకరణాలు 19–24)

1863లో గ్యుస్టవ్ డొరె (ఫ్రెంచ్)/డోరెయ్ (ఆంగ్లం) గీసిన చిత్రంలో కీహొవ్టి, సెన్చౌలు

ఒక శవంతో ఒక సాహసం, శిరస్త్రాణానికి సంబంధించిన సాహసం, బానిసలను విడిపించడం వంటి కొన్ని విశేషాల తరువాత, వీళ్ళిద్దరూ సియెర మొరెన అనే చోటుకి చేరుకుంటారు. అక్కడ వీళ్ళు మానసిక నిస్పృహతో పిచ్చివాడైపోయిన కర్డెన్యొను కలుస్తారు. కర్డెన్యొ వీరికి తన కథ చెబుతాడు. అతను తన చిన్ననాటి నేస్తం లుసిన్డతో ప్రేమలో ఉంటాడు. ఇంతలో తను డ్యూక్[గమనిక 17]కొడుకుకి పరిచారకునిగా నియమింపబడతాడు. తనతో స్నేహంగా ఉంటున్న డ్యూక్ చిన్నకొడుకు డొన్ ఫెర్నెన్డొకి తన ప్రేమ విషయం చెప్పి, సంప్రదాయబద్దమైన నిశ్చితార్థమునకై ఆగుతున్నానని చెబుతాడు. కర్డెన్యొ లుసిన్డపై వ్రాసిన కవితలు చదివి, ఫెర్నెన్డొ కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఇలా చెబుతూ మధ్యలో ఒక సాహస గాథ ప్రస్తావన రాగా అందులోని రాణి తన భర్తను మోసం చేసిందని కర్డెన్యొ, ఆమె పతివ్రత యేనని కీహొవ్టీ వాదించుకుంటారు. చివరకి కర్డెన్యొ కీహొవ్టీని తన్ని, కొండల్లోకి వెళ్ళిపోతాడు.

పూజారీ, మంగళాడూ, డొరొతియ (ప్రకరణాలు 25–31)

డల్సినియపై విరహ వేదనతోనే కాక అనుమానముతో గూడ రగలిపోతున్న కీహొటె, ఈ అనుమానమునకు పాయశ్చిత్తముగ తపము నాచరింపవలెనని నిర్ణయించుకుంటాడు. అంతలో సెన్చౌకు ఒక లేఖ యిచ్చి, దానిని డల్సినియకు ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. ఆ ఉత్తరంతో బయలుదేరిన సెన్చౌకి దారిలో ల మన్చ పూజారీ, మంగళోడూ కనిపిస్తారు. ముగ్గురూ కలిసి కీహొటెను ఇంటికి తీసుకుపోవాలని నిర్ణయించుకుంటారు. దారిలో వీరికి డొరొతియ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఫెర్నెన్డొ ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని, ఇప్పుడు కర్డెన్యొ ప్రియురాలిని చేసుకున్నాడు. దానితో ఈమె పరువు పోయి, తన ఊరు వదిలి ఇలా తిరుగుతోంది. అలాగే దారిలో వీరికి కర్డెన్యొ కనిపిస్తాడు. డొరొతియ కథ విని, అతనూ తన కథ చెబుతాడు. ఈ ఐదుగురూ కీహొవ్టి దగ్గరకు బయలుదేరతారు.

ఈమెను వీరు ముగ్గురూ కీహొవ్టిను ఇంటికి తీసుకువెళ్ళేందుకు సహాయం కోరుతారు. ఈమె తననుతాను రాజకుమార్తె మికొమికొనగా చెప్పుకుని కీహొవ్టిను కలుస్తుంది. తమ రాజ్యమును ఒక రాక్షసుడు వశపరుచుకొనినాడనీ, కీహొవ్టి తనను రక్షించాలనీ అర్థిస్తుంది. మికొమికొనను పట్టాభిషిక్తురాలిని చేయడానికి కీహొవ్టి బయలుదేరతాడు.

దారి మధ్యలో కథ మొదట్లో అతను కాపాడిని పనివాడు ఎన్డ్రెస్‌ను కలుస్తాడు‌. కీహొవ్టి యజమానికి మంచి చెప్పి తన దారిన తాను పోయాడనీ, ఆ యజమానేమో కీహొవ్టి పోగానే తనను రెట్టించి కొట్టాడనీ ఎన్డ్రెస్ వాపోతాడు. ఎన్డ్రెస్‌కు జరిగిన అన్యాయానికి ప్రతీకారము తీర్చుకొనెదనని కీహొవ్టి శపథము చేయగా, దయచేసి తన విషయాల్లో తలదూర్చొద్దని కీహొవ్టి ప్రాధేయపడతాడు.

మళ్ళీ సత్రానికి (ప్రకరణాలు 32–42)

మొత్తానికీ రాకుమారి మికొమికొన కష్టం గట్టెక్కించడానికి కీహొటె, మికొమికొన, మిగతా ముగ్గురూ బయలుదేరి, ఆ రాత్రి సత్రంలో ఆగుతారు. అక్కడ రాత్రి పూజారి అందరికీ "ది ఇంపర్టినెన్ట్లి క్యుర్యస్ మ్యాన్[గమనిక 18]"(ఆంగ్లం) ("ఎల్ కురియొసొ ఇంపర్టినెన్టె"(స్పెనిష్)— అర్థం: అనుచిత ఆసక్తి కలవాడు) అనే కథ చెబుతాడు.

అందరూ ఇలా కథ వింటుండగా కీహొవ్టి నిద్రలో నడుస్తూ, సత్రంలో వేలాడదీసి ఉన్న గొర్రె తోళ్ళను చీల్చి చెండాడి, రాక్షసుడను తుదముట్టించితిని ననుకుంటాడు.

ఇంతలో అక్కడికి ఇంకో ఇద్దరు ప్రయాణికులు వస్తారు. వాళ్ళు మారువేషంలో ఉన్న ఫెర్నెన్డొ, లుసిన్డాలని తెలుస్తుంది. కొన్ని నాటకీయ పరిణామాల తరువాత ఫెర్నెన్డొ-డొరొట్య, కర్డెన్యొ-లుసిన్డలు ఒకటవుతారు.

తరువాత ఆ సత్రానికి ఒక జంట వస్తుంది- స్పెనిష్ అబ్బాయి, అరబీ అమ్మాయి. వారికి ఈ గుంపు పరిచయమయ్యాక, ఆ అబ్బాయి తన కథ చెబుతాడు. అతను ఒక సైనికుడు. అరబులోని యుద్ధంలో శత్రువులకు దొరికి ఖైదీగా అయ్యాడు. ఈమె సహాయంతో కారాగారం నుండి బయటపడగా, ఈమె క్రైస్తవ ధర్మం పుచ్చుకుని (జ్ఞానస్నానం) ఇతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటోంది. అంచేత తిరిగి స్పెయ్న్‌కు వచ్చారు.

ఇంతలో ఆ సత్రానికి ఒక న్యాయమూర్తీ, ఆయన కూతురూ వస్తారు. ఈమె పేరు డొన క్లారా. అప్పుడు తెలుస్తుంది, ఈ న్యాయమూర్తీ, ఆ ఖైదీ సోదరులని. వారిద్దరూ కలుసుకుంటారు.

ఎన్నో నాటకీయ పరిణామాల తరువాత అందరూ నిద్రించగా, దూరం నుండి ఒక ప్రణయ గీతం వినబడుతుంది. డొరొత్య, కర్డెన్యొలు ఆ పాటకి మైమరచిపోగా, ఆ పాటగాడుతన పొరుగు వాడైన గొప్పింటి అబ్బాయనీ, వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమనీ, కానీ ఇంకా మనసులో మాట చెప్పుకోలేదనీ క్లారా డొరొత్యతో చెబుతుంది.

తరువాత న్యాయమూర్తి ఆ కుర్రాడిని చూసి ఏంటి విషయమని అడుగగా అతను తన మనసులోని మాట చెబుతాడు. తాను ఆలోచించి చెబుతానని న్యాయమూర్తి అంటాడు.

ది ఇంపర్టినెన్ట్లి క్యుర్యస్ మ్యాన్

థారియౌను బాకుతో దూరం పెడుతున్న కమిల. స్పెయ్న్ చిత్రకారుడు అపెల్లెస్ మెస్ట్రెస్ గీసిన ఈ బొమ్మకి ఫ్రన్సిస్కొ ఫస్టె అచ్చు వేసారు.

ది ఇంపర్టినెన్ట్లి క్యుర్యస్ మ్యాన్ లేదా (The Impertinently Curious Man, అర్థం: అనుచిత ఆసక్తి కలవాడు) లేదా ది ఇల్ అడ్వైస్డ్ క్యూర్సొసిటి (The Ill-Advised Curiosity, అర్థం: తగని ఆసక్తి) అనే పేర్లతో ఆంగ్లంలో ఉన్న ఈ కథ యొక్క స్పెనిష్ పేరు ఎల్ కురియొసొ ఇంపర్టినెన్టె (El Curioso Impertinente).

ఇటలిలో అన్సెల్మొ అనే పెద్దమనిషి ఉండేవాడు. అతను పనీపాటూ లేక తన భార్య కమిల పాతివ్రత్యాన్ని పరిక్షించాలనుకుంటాడు. అందుకు గానూ తన మిత్రుడు లథారియౌని కమిలనూ ముగ్గులోకి దించవలసిందిగా కోరతాడు. ఇతనికి పిచ్చెక్కిందని అనుకున్న లథారియౌ ఒప్పుకున్నట్లే ఒప్పుకుని, వెంటనే కమిల పతివ్రతయేనని అన్సెల్మోకు తెలియజేస్తాడు. ఐతే లథారియౌ కమిలా పాతివ్రత్యానికి ఏ పరిక్షా పెట్టలేదనీ, తనతో అబద్దమాడాడనీ అన్సెల్మొ తెలుసుకుంటాడు. ఇలా కాదని, ఈసారి కచ్చితంగా ప్రయత్నించి తీరాలని లథారియౌ దగ్గర మాట తీసుకుని, అతనికి అవకాశమిచ్చేందుకు అన్సెల్మో వేరే ఊరుకు పని పేరున వెళ్ళిపోతాడు. లథారియౌ కమిల వెంట పడగా, తను వెంటనే రావాలంటూ ఆమె భర్తకు ఉత్తరాలు వ్రాస్తుంది. అన్సెల్మొ మాత్రం ప్రత్యుత్తరం ఇవ్వడం కానీ తిరిగి రావడం కానీ చేయడు. చివరికి లథారియౌ, కమిలాలు ప్రేమలో పడతారు. వారి మధ్య లైంగిక బంధం మొదలవుతుంది. అన్సెల్మొ వచ్చాక కూడా అతనికి తెలియకుండా వీరు సుఖపడుతుంటారు.

ఒకనాడు లథారియౌ, అన్సెల్మొ ఇంటి నుండి ఇంకొకడు బయటికి వెళ్ళడాన్ని చూస్తాడు. కమిల కానీ మరియొక ప్రియుడిని చేరదీస్తోందా అని లథారియౌ అసూయ పడతాడు. వెంటనే అన్సెల్మొను కలిసి, తాను చివరికి అతని భార్య మెప్పు దొరకబుచ్చుకున్నాననీ, ఆమె గీత దాటుటుండగా పట్టుకోవాలంటే ఫలానా చోట, ఫలానా సమయానికి రావాలనీ, అన్సెల్మొకు చెబుతాడు. ఐతే ఈ నాటకం మొదలయ్యే లోపులో తాను చూసిన ఆ మగవాడు, కమిల పని అమ్మాయి ప్రియుడనీ, కమిలకు అతనితో ఏ సంబంధం లేదనీ తెలుసుకుంటాడు. వెంటనే కమిలాకు విషయం చెప్పగా, ఇద్దరూ కలిసి, అన్సెల్మొను మళ్ళీ మోసం చేయాలని నిర్ణయించుకుంటారు. తరువాత అన్సెల్మొ రాగానే, కమిలా లథారియౌను దూరం పెడుతూ, తన భర్త పట్ల తనుకున్న ఇష్టాన్ని చెప్పి, బాకును తన రొమ్ములోకి పైపైన దించుకుంటుంది. కమిలా పాతివ్రత్యం రూఢీ అయ్యిందనుకుని అన్సెల్మొ వెళ్ళిపోతాడు. కమిలా, లథారియౌలు తమ ముచ్చట్లు కొనసాగిస్తారు.

ఒకనాడు పనిమనిషి ప్రియుడు అన్సెల్మొ కంట పడతాడు. అన్సెల్మొ తనను చంపేస్తాడనే భయంతో ఆమె మరునాడు అతనికొక రహస్యం చెబుతానని అంటుంది. ఈ విషయం అన్సెల్మొ కమిలతో చెప్పగా, ఆ రహస్యం తన వ్యవహారమేనేమోనని భయపడి, ఆమె లథారియౌతో లేచిపోతుంది. మరునాటికి ఆ పనిమనిషి కూడా ఉడాయిస్తుంది. వీరందరి కోసం అన్సెల్మొ ఫలితం లేకుండా వెదుకుతుండగా, ఒక అపరిచితుడు అతనికి అసలు విషయం చెబుతాడు. అన్సెల్మొ ఈ ఋథ మొత్తాన్నీ వ్రాయడం మొదలుపెడతాడు కానీ పూర్తిచేసేలోపే బాధతో గుండె పగిలి చస్తాడు.

ముగింపు (ప్రకరణాలు 45–52)

సన్ట ఎర్మన్‌డధ్ (అర్థం: పవిత్ర సోదరులు) [గమనిక 19] అధికారి ఒకరు, బానిసలను విడుదల చేసిన నేరానికై కీహొవ్టిను చెరబట్ట రాగా, అతని మతి స్థిమితములో లేనందున అతన్ని వదిలేయమని పూజారి ఆ అధికారిని ఒప్పిస్తారు.

చివరికి ఆ పూజారీ, మంగళివాడూ కలసి కీహొవ్టిను ఒక బోనులో బంధిస్తారు. మంగళోడు ఒక సాధువు వేషంలో వచ్చి, ఈ బోను అంతయూ మాయాజాల ప్రభావమనీ, కానీ కీహొవ్టి యీ బోనులో తన స్వపురమునకే చేరెదడనీ, అక్కడ డల్సినియను వివాహమాడెదడనీ చెబుతాడు. ఈ బోనును ఒక ఎడ్లబండిలో ఎక్కించి, పూజారీ, మంగళోడూ, సెన్చౌ ల మన్చకు బయలుదేరతారు. దారిలో టొలెయ్డొవ్ (ఆంగ్లం)[గమనిక 20]/టొలెధొ నగరములోని చర్చిలో మతాధికారి ఐన అతడు వీళ్ళని కలుస్తాడు. అతను వీరగాథలను తక్కువ చేసి మాట్లాడగా కీహొవ్టికూ, అతనికీ మధ్య చిన్న చర్చ జరుగుతుంది.

అన్నపానాలకు కీహొవ్టిను వదలగా అతను ఒక మేకల కాపరివానితో, ఒక భక్త బృందంతో తగువులు పెట్టుకుని దెబ్బలు తింటాడు. ఆ తరువాత సెన్చౌ సూచన మేరకు వాళ్ళతో కలిసి ఈంటికి వస్తాడు. ఇక్కడ రచయిత అతనికి మరిన్ని సాహసాలున్న చారిత్రక వివరాలు దొరికాయని చెప్పి కథ ముగిస్తాడు.

రెండో భాగం

రెండో సంపుటికి చార్ల్స్ జార్విస్ ఆంగ్ల అనువాదంలో ఒక బొమ్మ.

ఆధునిక ముద్రణల్లో రెండు భాగాలూ ఒకే సంచికగా ముద్రింపబడతాయి కానీ నిజానికి రెండో భాగం మొదటిది వచ్చిన పదేళ్ళకు వచ్చింది. మొదటి భాగం ప్రహసనాత్మకమైనది కాగా రెండో భాగం తాత్వికంగా ఉంటుంది. ఇది కుతర్కం, వంచన వంటి విషయాలపై చర్చిస్తుంది. మూడో సలికి కొంచెము ముందు ఈ రెండో భాగం మొదలవుతుంది.

తన గురించి జనాలు చదువుతున్నారు అని ఎరిగిన ఒక పాత్రగా ఇందులో కీహొవ్టి చూపించబడతాడు. "తన గురించి జనాలు చదువుతున్నారు అని ఎరిగిన ఒక పాత్ర" అనేది 20వ శతాబ్ది నాటి పాశ్చాత్య సాహిత్యంలో ఎక్కువగా కనిపించే పరిభావనే. అలాగే రెండో భాగంలోని పాత్రలకు కూడా మొదటి భాగం, ఒక నకిలీ రెండో భాగం కూడా అచ్చయ్యాయని తెలుసు.

మూడో సలి

మూడో సలి హమెట్ బెనెంగెలి రచనలోనిదిగా రచయిత చెబుతాడు. బెనెంగెలి కీహొటె, సెన్చౌలు మళ్ళీ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టినందుకు అల్లాకు కృతజ్ఞతలు చెబుతాడు. ఎల్ టొబొసొకు చేరటానికి ఒక రాత్రి ప్రయాణం చేస్తారు. దారిలో కీర్తి ప్రతిష్ఠల గురించి చర్చించుకోగా, కీహొవ్టి వారి వీరత్వము చరిత్రలో నిలిచిపోవాలని ఆశపడగా, సెన్చౌ ఋష్యత్వము సంపాదించి కీర్తి గడించాలని అభిప్రాయ పడతాడు. పొద్దుపొడుపుకు వారు పట్టణానికి చేరుకోగా, తాను డల్సినియ గురించి చెప్పినది ఒక కట్టుకథ అని సెన్చౌకు తెలుసుగనుక, ఊళ్ళోకి వెళ్ళి ఏ గందరగోళం చేస్తాడోనని భయపడి, పొద్దు గుంకాక లోపలికి దూరదామని కీహొవ్టిని ఒప్పిస్తాడు. చివరికి పొద్దు పోయాక పట్టణమంతా నిద్రపోతూ వీరు దూరడానికి అనువుగా ఉంది కానీ ఒక అపశకునం ఎదురవ్వడముతో యిది ఉచిత సమయం కాదని గ్రహించిన కీహొవ్టి, సెన్చౌతో బాటుగా ఆ పురము నుండి ఆ రాత్రియే నిష్క్రమిస్తాడు.

పట్టు విడువని కీహొవ్టి, మరొకమారు సెన్చౌను పురములోనికి పంపి డల్సినియతో రావలసినదిగా ఆజ్ఞాపించుతాడు. ఇక దిక్కు తోచని సెన్చౌ ఎవరో ఒకరిని డల్సినియగా చూపించి ఈ గొడవ వదిలించుకోవాలనుకోగా, తనకి ముగ్గురు కూలి అమ్మాయిలు కనబడతారు. వారిని డల్సినియా, ఆమె చెలికత్తెలుగా కీహొవ్టికు చూపించడమే కాక, ఆమె అందాన్ని వర్ణిస్తాడు. కీహొవ్టి తనకు వారు దాసీ జనము వలెనున్నారనగా, అతని పిచ్చి తెలిసిన సెన్చౌ, ఇది కూడా మాయావి పని అని అతన్ని నమ్మిస్తాడు.

అలా తిరుగుతూ ఎనెన్నో సాహసాల్లో "దూరిన" తరువాత, వీరి ద్వయం ఒక డ్యూక్, అతని సతీమణుల ఆతిథ్యం పొందుతుంది. అప్పటికే మొదటి భాగాన్ని చదివిన వీరు, వీరికి ఆతిథ్యమివ్వడమే కాక, సెన్చౌను గవర్నర్ గా నియమిస్తారు. ఐతే డల్సినియ ఒక మాయావి వేసిన మాయాబంధనంలో ఉందని సెన్చౌ కీహొటెని నమ్మించిన వైనం తెలుసుకున్న వీరు, ఒక మాయాలోకం నుండి కొందరు మాయగాళ్ళు వచ్చినట్టుగా నాటకమాడిస్తారు. ఆ నాటకం లోని మాయగాళ్ళు కీహొటెతో డల్సినియను విడిపించుటకు సెన్చౌ ముప్పదుమూడు వందల కొరడా దెబ్బలు తాళవలెనని చెబుతారు. మొదట దీనికి ఒప్పుకోని సెన్చౌ చివరకు సరేనంటాడు.

తరువాత డ్యూక్ సెన్చౌను ఒక రాజ్యానికి పరిపాలకునిగా నియమిస్తాడు. తన పరిపాలనా దక్షతతో ప్రజల మన్ననలు పొందినప్పటికీ, డ్యూక్ ఆ రాజ్యంపైన దాడి చేయించినప్పుడు సెన్చౌ దుండగులను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతాడు. దాంతో తాను పదవులకు తగ్గ వాణ్ణి కాదని, అతను వైదొలగుతాడు.

కీహొవ్టి, సెన్చౌలు తమ ప్రయాణం కొనసాగిస్తారు. మళ్ళీ చాలా సాహసాలు ఎదుర్కొన్నాక, నైట్ ఆఫ్[గమనిక 21]వైట్‌మూన్ అనేవాడు కీహొవ్టితో తనతో పోరాడాలని సవాల్ చేస్తాడు. పోరాడి ఓడిన కీహొవ్టి వైట్‌మూన్ షరతుకు తలవంచగా, అతను కీహొవ్టి ఒక ఏడాది పాటు ప్రయాణం ఆపేసి ఇంట్లో కూర్చోవాలని చెబుతాడు. దీనితో వీరి సాహసయాత్ర ముగుస్తుంది. ఐతే ఈ నైట్ నిజమైన వాడు కాదనీ, కీహొటె పొరుగు వాడని తరువాత తెలుస్తుంది.

చివరికి వారిద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఐతే ఇంటికి చేరుకోగానే కీహొటెకు ఆరోగ్యం పాడవుతుంది. తెలివి లేకుండా పడి ఉంటాడు. తెలివి వచ్చాక వీరత్వం మీదున్న పైత్యం వీడిపోతుంది. తాను అందరినీ పెట్టిన ఇబ్బందులకు క్షమాపణలు కోరి, తన వీలునామా వ్రాస్తాడు. తన ఆస్తిని తన మేనకోడలుకిచ్చి, వీరగాథలు చదివిన వాడిని చేసుకుంటే ఆమెకి ఈ ఆస్తి రాదని ఒక షరతు వ్రాస్తాడు. తరువాత అతను చనిపోతాడు. ఇక మీదట కీహొవ్టి మీద ఏమైనా పుస్తకాలు వస్తే అవి నకిలీవేనని చెబుతూ రచయిత ముగిస్తాడు.

అంతరార్థం

అమెరిక సాహిత్య విమర్శకుడు హెరల్డ్[గమనిక 22] బ్లూమ్ ప్రకారం కీహొవ్టి ఫ్రొయ్ట్ రియలిటి ప్రిన్సిపుల్[గమనిక 23][గమనిక 24]నీ, చావు ప్రతి జీవికీ తప్పదనే విషయాన్నీ ఒప్పుకోలేని పాత్ర. నవలలో ఎన్నో అంతరార్థాలున్నప్పటికీ, మనిషన్నాక జీవితంలో కష్టాలను చవిచూసి, తట్టుకుని ముందుకెళ్ళక తప్పదనే అంశం ఎక్కువగా కనిపిస్తుందని బ్లూమ్ అన్నారు.[11]

2003లో ప్రశంసలందుకున్న ఒక ఆంగ్ల అనువాదాన్ని[12] వ్రాసిన అమెరిక ఆంగ్ల-స్పెనిష్ అనువాదకురాలు ఈడిథ్ గ్రౌస్‌మన్ ప్రకారం విషాదం, హాస్యం అంచులన కథను నడిపించడం ద్వారా పాఠకులలో భావోద్వేగాలను రేకెత్తించడమే నవల ఉద్దేశమని అన్నారు. ఆవిడ మాట్లాడుతూ:

ప్రశ్న ఏంటంటే కీహొవ్టికి చాలా అర్థాలుంటాయి [...] వాటన్నిటితో నేనెలా నెగ్గుకొస్తానని. నేనీ ప్రశ్నను దాటవేయడం ద్వారా దానికి జవాబివ్వబోతున్నాను. [...] మొదటిసారి కీహొవ్టి చదువుతున్నప్పుడు, ఇది ఈ లోకంలోనే అత్యంత విషాద పుస్తకమనిపించి దాన్ని చదువుతూ ఏడ్చేదాన్ని [...] పెద్దయ్యేకొద్దీ [...] నేను కొంచెం మొద్దుబారాను [...] అనువాదం పని మీద ఉన్నప్పుడైతే నేను నా కంప్యూటర్[గమనిక 25] ముందు కూర్చుని పకపకా నవ్వుతున్నాను. ఇది జరగాలంటే [...] థెర్‌న్టెస్ చేసినట్టు [...] పాఠకునికి తెరపి నివ్వకూడదు. మీకిది పూర్తిగా అర్థమైందని మీరెప్పటికీ అనుకోలేరు. ఎందుకంటే మీకొకటి అర్థమైందనుకోగానే అది సరికాదనిపించేలా థెర్‌న్టెస్ ఇంకో అంశాన్ని చొప్పిస్తాడు.[13]

అంశాలు

1868లో ఫ్రెంచ్ చిత్రకారుడు ఒనొరె డొమ్యె గీసిన "డాన్ క్విక్సోట్" బొమ్మ

ఇది ఉత్ప్రేక్ష నవల[గమనిక 26] ఐనప్పటికీ ఈ నవలలో, ముఖ్యంగా రెండో భాగంలోని తాత్వికత, దీని తరువాతి సాహిత్యాన్నే కాక కళలనూ, సంగీతాన్నీ కూడా ప్రభావితం చేసింది. ప్రముఖ స్పెయ్న్ చిత్రకారుడు భ్లొ పికసొ, జర్మన్ వాద్యకారుడు రిశర్ట్ శ్ట్రౌస్‌ల పనిపై ఈ రచన ప్రభావం కనిపిస్తోంది. సన్నగా, పొడుగ్గా, వీరత్వపు మాయలో, ఆదర్శాల చట్రంలో చిక్కుకున్న కీహొవ్టి, పొట్టిగా, లావుగా, వ్యవహారంలో తలపండిన సెన్చౌల వ్యత్యాసం—ఈ కథాంశం ఆ తరువాత చాలా రచనల్లో కనబడింది.

తన అవాస్తవిక ఊహలతో కీహొవ్టి దారుణంగా బోల్తా పడతాడు. విశ్వాసపాత్రుడైన సెన్చౌ కూడా కొన్నిసార్లు అతన్ని మోసం చేయక తప్పేది కాదు. ఈ నవలను ఛాందసం, పుక్కిటి కథల కచ్చితత్వం, చివరికి జాతీయవాదముల పైన ఒక వ్యంగ్య ప్రయోగంగా చూస్తారు. తన నవలలోని పాత్రల వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం ద్వారా థెర్న్టెస్ వీరగాథలకు పరిమితమైపోయిన నాటి మూస నుంచి పాశ్చాత్య సాహిత్యాన్ని బయటపడేసాడు. ఒక వీరుని లక్షణాలు అనదగ్గ వాటిని వాస్తవిక ప్రపంచంలో జరుగుతున్నట్లుగా కథ చెప్పటం ద్వారా వీరత్వం అనే దాన్ని వెక్కిరించాడు. నాటి సమాజంపై ఈ నవల ఎంత ప్రభావం చూపిందంటే క్విక్‌సొటిక్ అనే పదం చాలా భాషల్లోకి దూరింది. సెన్చౌ, రొసినన్టెలు పాశ్చాత్య సాహిత్య సంస్కృతికి చిహ్నాలయ్యాయి. "టిల్టింగ్ ఎట్ ద విన్డ్‌మిల్స్[గమనిక 27]" (అర్థం= గాలిమరలపై (కత్తి) దూయటం) అనే నానుడి ఊహాజనిత శత్రువులతో తలపడటం లేదా విపరీతపు ఆదర్శాలకు పోవడం అనే అర్థంతో వాడతారు. ఇది ఈ నవలలోని ఒక ఘట్టం నుండి వచ్చింది.

మధ్యయుగపు వీరగాథలకూ, ఆధునిక నవలలకూ మధ్యన వంతెనగా ఈ నవల ఒక విశిష్ఠ స్థానం సంపాదించుకుంది. వీరగాథల్లో ఒకే రకమైన పరిసరాలూ, పాత్రలూ మళ్ళీ మళ్ళీ రాగా, గాథ మొత్తం సంబంధం లేని అనేక చిన్న చిన్న కథల సమాహారంగా కూర్చబడుతుంది. పాత్రల వ్యక్తిగత జీవితం, స్వభావం వంటి వాటిలోకి పెద్దగా వెళ్ళరు. ఆధునిక నవలల్లో పాత్రల ఆలోచనలూ, మనసిక స్థితిలో మార్పులూ వంటివి ముఖ్యాంశాలు. మొదటి భాగంలో కీహొవ్టి తన "గొప్పతనాన్ని" చాటుకోవలసి ఉంటుంది. రెండో భాగానికొచ్చేసరికీ తన "సాహసాలు" అందరూ చదివిన కారణంగా ఆ అవసరం పెద్ద ఉండదు. చివరికి చావు దగ్గరికి వచ్చాక మళ్ళీ తన మతిస్థిమితాన్ని పొందుతాడు.

నేపథ్యం

కీహొవ్టి పై మునుపటి సాహిత్యపు ప్రభావం

16వ శతాబ్దపు ప్రముఖ స్పెనిష్ నవల అమధిస్ ధె వ్ల, వీరగాథ టిరన్డ్ లొ బ్లంక్/బ్లఙ్ ల ప్రభావం కీహొవ్టి నవలపై నున్నది. టిరన్డ్ లొ బ్లంక్/బ్లఙ్పై థెర్న్టెస్‌కు చాల మంచి అభిప్రాయం ఉండేది. ఆరో ప్రకరణంలో గ్రంథాలయాన్ని నాశనం చేసేటప్పుడు పూజారి దాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ పుస్తకంగా పేర్కొంటాడు. (ఐతే అత్యుత్తమం అనడంలో రచయిత ఉద్దేశ్యం ఏమిటి అనే దానిపై పండితుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. 19వ శతాబ్ది నుండి ఆ వాక్యాలు పుస్తకంలో అత్యంత కష్టమైన వాక్యాలు (అర్థం చేసుకోవడానికి)గా చెప్పబడ్డాయి). పుస్తకాలను కాల్చేసే సన్నివేశము సాహిత్యంలో థెర్న్టెస్ ఇష్టాయిష్టాలను అర్థం చేసుకోవడానికి బాగా పనికొస్తుంది.

ఇటలి భాష కావ్యం ఒర్‌లన్డొ ఫుర్యోసొ (అర్థం: (కోపంతో) రగిలిపోతున్న ఒర్‌లన్డ్) ప్రస్తావన నవల్లో చాలా సార్లు కనిపిస్తుంటుంది. మొదటి భాగం 10వ ప్రకరణంలో తాను మంబ్రినొ[గమనిక 28] నుండి మాయా శిరస్త్రాణాన్ని తీసుకోవాలని కీహొవ్టి అంటాడు. ఇది ఒర్‌లన్డొ ఫుర్యోసొ ప్రస్తావనే. ఆ కావ్యంలో కూడా ఈ మంబ్రినొ కథ మట్‌టేయొ మరీయ బొయర్డొ అనే ఇటలీ కవి వ్రాసిన ఒర్లన్డొ ఇనమొరాటొ అనే కావ్యన్ని ప్రస్తావించే క్రమంలో ఈ సన్నివేశం వస్తుంది. కీహొవ్టి మొదటి భాగం, నాలుగో అంకం, 33వ ప్రకరణంలోని ఒక ఉపకథ, ఒర్‌లన్డొ కావ్యంలో 43వ ప్రకరణంలో తన భార్య పాతివ్రత్యాన్ని పరిక్షించే వాడి కథ ఆధారంగా తయారు చేసినది.[14]

ఈ నవలపై ప్రభావం చూపిన ఇంకొక ముఖ్య రచన లటీను నవల మెటమొర్‌ఫొసెస్. మొదటి భాగం 35వ ప్రకరణంలో గొర్రె తోళ్ళను చీల్చిచెండాడే వైనం దీనికి ఉదాహరణ. నవల యొక్క నైతిక తత్వం కానీ, మౌలిక కథనం కానీ మెటమొర్‌ఫొసెస్ ఆధారంగా తయారైనవేనని ఆధునిక పండితుల అభిప్రాయం.[15]

రెండో భాగంలోని సెన్చౌ సాహసాలూ, సామెతలూ నాటి స్పెనిష్ జాపపదాల నుండి తీసుకున్నవే.

థెర్న్టెస్ ఎల్జియర్స్‌లో బానిసగా బతికిన నాటి అనుభవాలు కూడా రచనను ప్రభావితం చేసాయి.

రచనపై నాటి వైద్యశాస్త్ర సిద్ధాంతాల ప్రభావం కూడా ఉంది. అతని చుట్టాలూ, మిత్రులలో చాలా మంది వైద్యనిపుణులు ఉన్నారు. అతని తండ్రి రొడ్రిగొ డె థెర్న్టెస్, ముత్తాత జువన్ డియజ్ డె టొరెబ్లంక లు శస్త్రచికిత్స నిపుణులు. తన సోదరి ఎన్డ్రియ డె థెర్న్టెస్ నర్సు.[16] అంతే కాక యురొలజిస్ట్, ప్రముఖ రచయితా ఐన ఫ్రన్సిస్కో డియజ్, స్పెయ్న్ రాజులు మూడూ, నాలుగో ఫిలిప్[గమనిక 29] లకు వ్యక్తిగత వైద్యుడైన రాజ వైద్యుడు ఎన్టొన్యొ పొన్సె డె సన్ట లు ఇతని మిత్రులు.[18]

ఆపైన థెర్న్టెస్‌‌కు వైద్యశాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని కూడా తెలుస్తోంది. స్పెయ్న్‌లోని సెభిలలో హొస్పిటల్ డె ఇనొసెన్టెస్‌లోని రోగులను తనకి వీలున్నప్పుడు కలిసేవారు.[16] 200 పైచిలుకు పుస్తకాలున్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలో నాటి వైద్యశాస్త్రాన్ని నిర్వచించిన గ్రంథాలైన జువన్ హువర్టె వ్రాసిన ఎక్‌సమెన్ డె ఇంయినియస్, డియొనిస్యొ డ చకొన్ వ్రాసిన ప్రక్టిక వై టియొరిక డె సిరుజ్య కూడా ఉండేవి.[18]

నకిలీ రెండో భాగం

1614 సెప్టెంబరులో టొర్ధెసిరస్‌కు చెందిన లిసెంస్యడొ (డొక్టొరెట్) అలొన్సొ ఫెర్నన్డెజ్ డె అవెలనెడగా చెప్పుకొనే ఒక అరఘున్[గమనిక 30] రచయిత సెకన్డ్ వొల్యూమ్ ఒఫ్ ది ఇన్‌జీన్యస్ జెన్‌టిల్మన్[గమనిక 31] డాన్ క్విక్సోట్ ఆఫ్ ల మన్చ (ఆంగ్లం) అనే పేరుతో ఒక నకిలీ రెండో భాగాన్ని ముద్రించాడు. ఇతను నాటి మరో మేటి స్పెనిష్ రచయితా, థెర్న్టెస్ సమకాలీకుడూ ఐన లొపె ధె భెఘ అభిమాని యని తెలుస్తోంది.[19] ఈ నకిలీ భాగాన్ని విల్యమ్ ఓగస్టస్ యర్డ్లి గారు 1784లో రెండు సంపుటాలుగా ఆంగ్లంలోకి అనువదించారు.

రెండో భాగంలో 59వ ప్రకరణంలో కీహొవ్టి అవెలనెడను కలిసినట్టు థెర్‌న్టెస్ వ్రాసాడు. ఐతే ఈ ప్రకరణం వ్రాసిన సమయానికే అతనికి నకిలీ పుస్తకం గురించి తెలిసిందనుకోవడానికి లేదనీ, అతనికి ఇంకా ముందే తెలిసుంటుందనీ ఆధునిక పండితుల అభిప్రాయం.

ఈ అవెలనెడ ఎవరు అనే దానిపై ఎన్నో అంచనాలున్నప్పటికీ, కచ్చితంగా తెలియలేదు. ఈయన తన నకిలీ కొనసాగింపు యొక్క అకారణంగా థెర్‌న్టెస్‌‌నుతక్కువ చేసి మాట్లాడారు. ప్రతిగా థెర్‌న్టెస్ కూడా తన రెండో భాగంలో 59వ ప్రకరణంతో మొదలు అవెలనెడ రచనను చాలాసార్లు చెణికారు. ముందుమాటలోనైతే దాదాపు నేరుగా విమర్శించేదాకా వచ్చారు.

కీహొవ్టి ఆంగ్ల అనువాదకుల్లో ఒకరైన సెమ్యుల్ పట్నమ్[గమనిక 32] తన పుస్తకం "ద పోర్టబుల్ సర్వెన్టీస్"[గమనిక 33] లో ఈ నకిలీ పుస్తకాన్ని చరిత్రలోనే అత్యంత అవమానకరమైన పనుల్లో ఒకటిగా పేర్కొన్నారు.[20] అసలైన రెండో భాగంలో కీహొవ్టి ఒక ముద్రణాశాలకు వెళ్ళగా అక్కడ నకిలీ రెండో భాగం అచ్చవుతుండడాన్ని చూస్తాడు. మెట-ఫిక్షన్[గమనిక 34][గమనిక 35] పాశ్చాత్య సాహిత్యంలో కనిపించిన తొలి ఉదంతాల్లో ఇది ఒకటి.[21]

ఉపకథలు

గాలిమరలపైన దాడి చేసి విఫలమయ్యాక తరువాత కీహొవ్టి, అతని గుర్రం రొసినన్టె,‌ డాలుగాడు సెన్చౌ. గుస్టవ్ డొరె గీసిన బొమ్మ.

మొదటి భాగంలో రెండు ముఖ్యపాత్రలతో సంబంధం లేని ఎన్నో ఉపకథలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది "ది ఇంపర్టినెన్ట్లి క్యుర్యస్ మ్యాన్[గమనిక 36]"(ఆంగ్లం) ("ఎల్ కురియొసొ ఇంపర్టినెన్టె"(స్పెనిష్)— అర్థం: అనుచిత ఆసక్తి కలవాడు). మొదటి భాగం నాలుగో అంకంలో వచ్చే ఈ కథలో ఇటలీలోని అన్సెల్మొ అనే పేరు గల ఒక పెద్దమనిషి తన భార్య పాతివ్రత్యాన్ని పరిక్షించడానికి, తన మిత్రుడు లథారియౌ ఆమె పైకి ప్రయోగించగా వచ్చు పరిణామాలు అందరికీ బాధను మిగులుస్తాయి.

పక్కదారి పట్టటాలు ఎక్కువయ్యాయని వచ్చిన విమర్శలను పరిగణించిన థెర్న్టెస్, రెండో భాగంలో కథ ముఖ్య పాత్రల చుట్టూ తిరిగేలా ఉంటుందని అన్నారు. ఐతే దీని వల్ల తన భావ వ్యక్తీకరణ పరిమితమైందని అతను వాపోయారు. ఐననూ రెండో భాగంలో కొన్ని ఉపకథలున్నవి. వీటిని తీసేసి ముఖ్య కథ మాత్రమే ఉండేలా అనేక సంగ్రహ సంచికలు కూడా వచ్చాయి (ఉదాహరణకు "ద పోర్టబుల్ సర్వెన్టీస్"[గమనిక 37] పుస్తకం).[గమనిక 38]

భాషావిశేషాలు

స్పెనిష్

స్పెనిష్ రెండు రకాలు: ప్రాచీన స్పెనిష్, ఆధునిక స్పెనిష్. ఈ నవలలో వీరగాథలు చదివి పైత్యమెక్కిన కీహొవ్టి, ఆ కథల్లోని వీరుల వలె ప్రాచీన స్పెనిష్‌ను మాట్లాడుతుంటాడు. కథలోని మిగతా పాత్రలన్నీ నాటి సమకాలిక స్థాయి ఆధునిక స్పెనిష్‌ను మాట్లాడతాయి. అందుచేత మిగతా పాత్రలకు అతని భాష అర్థం కాక, అది హాస్యాన్ని పండిస్తుంది. ఐతే నాటి (16వ శతాబ్ది ద్వితియార్ధం) ఆధునిక స్పెనిష్‌కూ, నేటి ఆధునిక స్పెనిష్‌కూ ఉన్న తేడా వల్ల నేటి పాఠకులకు ఆ హాస్యభావన కలుగకపోవచ్చు కానీ పుస్తకం వచ్చిన నాళ్ళలో ఈ శైలికి చాలా పేరు వచ్చింది. ఆంగ్లంలో ఈ తేడాను చూపించడానికి కీహొవ్టి పాత్ర సంభాషణలను షెయిక్‌స్పియర్[గమనిక 39] కాలపు ఆంగ్లం లోనో, కింగ్ జేమ్స్ బైబిల్[గమనిక 40] ఆంగ్లంలోనో, లేదంటే మిడిల్[గమనిక 41] ఇంగ్లిష్ లోనో వ్రాస్తారు.

కీహొవ్టిను స్పెనిష్‌లో quixote/ quijote అని వ్రాస్తారు. రోమను లిపిలోని 'x' అక్షరం ప్రాచీన స్పెనిష్‌లో శ్వాస తాలవ్య-దంత్యమూలీయ ఊష్మాన్ని (అనగా ఆంగ్లంలో 'sh' సూచించే శబ్దాన్ని[గమనిక 42]) సూచిస్తుంది. భాషలోని పరిణామాల వల్ల ఆధునిక స్పెనిష్‌లో /x/ మాండలికాన్ని బట్టి శ్వాస కంఠ్య ఊష్మము[గమనిక 43] గానో లేక నాద కంఠ్యమూలీయ ఊష్మము (అంటే తెలుగు అక్షరము 'హ') గానో పలకబడుతుంది. కనుక కీహొవ్టి తన పేరును కిశొటె/కిషొటె అని చెప్పుకోగా, మిగతా పాత్రలన్నీ కిఖొటె/కిహొటె అని పిలుస్తాయి.

ఇతర పాశ్చాత్య భాషలు

ఆంగ్లం

"కిహొటె" అనే ఆధునిక స్పెనిష్ ఉచ్చారణకు దగ్గరగా ఆంగ్లంలో కీహొవ్టి (బ్రిటిష్)/కీహొవ్టెయ్ (అమెరిక) అని పలుకుతారు. ఐతే స్పెనిష్ అక్షరక్రమాన్ని ఉన్నదున్నట్టుగా తీసుకోవడం వల్ల quixote అని వ్రాస్తారు. దీని వలన క్విక్‌సొట్ అని పలకడం కూడా ఉన్నది. ముఖ్యంగా ఇంగ్లన్డ్‌లో.[25] అలాగే 1970ల వరకు ఆస్ట్లేలియ[గమనిక 44] ఉన్నత వర్గాల్లో అన్యదేశ్యాలను విపరీతంగా ఆంగ్లీకరించే పోకడ ఉండేది. కనుక ఆ రోజుల్లో క్విక్‌సొట్ అని ఎక్కువగా పలికేవారు. ఈ పదాన్ని విశేషణంగా వాడినప్పుడు, ఆంగ్లంలో ఈ పలుకుబడే ఉన్నది. క్విక్‌సొటిక్ (Quixotic) అంటే "వాస్తవికతను పరిగణలోకి తీసుకోని, అసాధ్యపు ఆదర్శాలు గల" అని అర్థం.

ఇతర పదాల్లో కూడా స్పెనిష్‌లో ఉండి, ఆంగ్లంలో లేని ఊష్మాలు వేరే ధ్వనులతో ఆంగ్లీకరించబడ్డాయి.

మిగతా భాషలు

స్పెనిష్ రొమేన్స్ భాష. అంటే లాటిన్ నుండి వచ్చినది. ఇతర రొమేన్స్ భాషల్లో /x/ అక్షర శబ్దానికి స్పెనిష్‌లో వచ్చిన మార్పులు రాలేదు. కనుక ఆ భాషను బట్టి కీహొవ్టిను ఆ భాషల్లో కిశొ(షొ)టె అనో లేదా 'శ' వర్గపు స్పర్శము ఐన 'చ'తో కిచొటె అనో పలుకుతారు. ఇలా పలికే ముఖ్యమైన భాషలు:

  1. అస్టుర్యను- స్పెయ్న్ వాయువ్య భాగంలోని అస్‌టుర్యెస్ ప్రాంతంలో మాట్లాడే భాష.
  2. లియొనెస్- స్పెయ్న్, పోర్చుగల్[గమనిక 45] సరిహద్దుల్లోని లియొనెస్ ప్రాంతంలో మాట్లాడే భాష.
  3. గలెగొ- స్పెయ్న్‌లోని గలి ప్రాంతంలో మాట్లాడే భాష.
  4. కటల- ఐరోపాలోని బలెయర్ సముద్ర తీరప్రాంతాలు (స్పెయ్న్, ఫ్రన్స్, అండొర దేశ భాగాలు)లో మాట్లాడే భాష.
  5. ఇటెల్యన్
  6. పోర్చుగీస్
  7. ఫ్రెన్చ్

డొన్ కిచొటె అనే ఫ్రెన్చ్ ఒపెర [గమనిక 46] వీటిలో బాగా ప్రసిద్ధి చెందినది.

తెలుగు

భారతీయులకు కీహొవ్టి నవల ఆంగ్లం ద్వారా పరిచయం. కనుక తెలుగూ, ఇతర భారతీయ భాషల్లో ఉచ్చారణ పై ఆంగ్ల ప్రభావం ఎక్కువ. ఆ విషయాన్ని గౌరవించి ఈ వ్యాసంలో కథలోని పేర్లకూ, పదాలకూ రెండు ఉచ్చారణలూ (ఆంగ్లం, స్పెనిష్) ఇవ్వడమైనది.

తెలుగులో ఈ నవల ప్రస్తావనల్లోనూ, అనువాదాల్లోనూ సదరు రచయితలకు ఆంగ్లంతో ఉన్న పరిచయం, వారి ఇష్టాయిష్టాలూ, వారి పాఠకుల పై వారి అంచానాలను బట్టి క్విగ్జట్, క్విక్సట్, కీహోటె ఇలా రకరకాలగా వ్రాసారు.

అదనపు వర్ణాలకై వెసులుబాట్లు

స్పెనిష్‌లో తెలుగు కంటే ఊష్మాలు[గమనిక 47]ఎక్కువ. సదరు అదనపు ఊష్మాలను సూచించేందుకు ఈ వ్యాసంలో ఆ వర్గపు మహాప్రాణ స్పర్శమును ముదురు రంగులో వ్రాయడమైనది. శ్వాస ఊష్మానికి శ్వాస మహాప్రాణ స్పర్శమూ, నాద ఊష్మానికి నాద మహాప్రాణ స్పర్శమూ వాడబడ్డాయి. సదరు స్పర్శాన్ని పలికేటప్పుడు నాలుకని నోటి పై భాగానికి పూర్తిగా తాకించకుండా 'స' పలికినట్టు, నాలుకకీ నోటి పైభాగానికీ మధ్యలో సన్నని ఖాళీ ఉంచితే ఊష్మాన్ని పలుకవచ్చు.

అదనపు వర్ణాలను సూచించు అక్షరాలు
శబ్దంఅంతర్జాతీయ ధ్వన్యాత్మక లిపి చిహ్నంబదులుగా వాడబడ్డ అక్షరంవ్యాఖ్య
శ్వాస కంఠ్య ఊష్మం/x/ఉర్దూ పదాలైన ఖాన్ వంటి వాటిల్లో 'ఖ' ఉచ్చారణ ఇదే. దేవనాగరి లిపిలో 'ఖ' కింద నుక్తం (చుక్క) పెట్టి సూచింపబడుతుంది—ख़।
నాద కంఠ్య ఊష్మం/ɣ/దేవనాగరి లిపిలో గ కింద చుక్క పెట్టి సూచింపబడుతుంది—ग़।
నాద దంత్యమూలీయ ఊష్మం/z/జ/ౙతెలుగులో రోజు వంటి పదాల్లో ఇది ఉంది. ఆంగ్ల అక్షరం 'z' ఉచ్చారణ. దేవనాగరి లిపిలో జ కింద చుక్క పెట్టి సూచింపబడుతుంది—ज़।శ్వాస దంత్య ఊష్మం/θ/ఆంగ్లంలో 'th' ఉచ్చారణ—Thin, with
నాద దంత్య ఊష్మం/ð/
నాద ఓష్ఠ్య ఊష్మం/β/

ఆంగ్లం, స్పెనిష్‌లలో 'd', 't'లు దంత్యమూలీయాలు. అనగా పై చిగురు లోపలి భాగానికి నాలుక తాకించి పలికేవి (దాదాపు తెలుగు 'న' లాగా). తెలుగులో 'డ', 'ట' లు మూర్ధన్యములు. అంటే నాలుక కొనను పై చిగురుకు పైన ఉన్న అంగిటికి అంటించి పలికేవి. వ్యాసంలో స్పష్టత కోసం వీటిని 'డ', 'ట' లుగా వదిలేయడమైనది‌. ఐతే మూర్ధన్యాలకు ముందు అనుస్వారం వస్తే, అది 'ణ'గా పలుకబడుతుంది. దంతమూలీయాలలో అది 'న'గా మారుతుంది. కనుక అనుస్వారం బదులు నేరుగా 'న' వాడడమైది. ఆంగ్లంలో 'ఞ' శబ్దం లేనందున, తాలవ్యములు (అనగా 'చ' వర్గం) ముందు అనునాసికం 'న' అవుతుంది. అందుచేత తాలవ్య అక్షరాల ముందు అనుస్వారం బదులు ఈ వ్యాసంలో 'న' వాడడమైంది.

రచనా శైలి

పరిసరాలు

ఈ కథ ల మన్చ మైదానాల్లోని కంపొ డె మొన్టియెల్ అనే కొమర్క[గమనిక 48]లో జరుగుతుంది‌.

En un lugar de La Mancha, de cuyo nombre no quiero acordarme, no ha mucho tiempo que vivía un hidalgo de los de lanza en astillero, adarga antigua, rocín flaco y galgo corredor.
(Somewhere in La Mancha, in a place whose name I do not care to remember, a gentleman lived not long ago, one of those who has a lance and ancient shield on a shelf and keeps a skinny nag and a greyhound for racing.)

— మిఘెల్ డె థెర్‌న్టెస్, డొన్ కీహొవ్టి, మొదటి భాగం, మొదటి ప్రకరణం (ఈడిథ్ గ్రౌస్‌మన్ ఆంగ్ల అనువాదం నుండి)

[గమనిక 49]

డల్సినియ ఊరు ఐన ఎల్ టొబొసొలో కూడా కథలో కొంత భాగం నడుస్తుంది. మొత్తానికీ నవల మొదట్లో రచయిత చెప్పిన ఆ పల్లె ఏమిటనే దానిపై ఈ పుస్తకం వచ్చిన 4 శతాబ్దాల తరువాత; అంటే ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పుస్తకం చివర్లో రచయిత కావాలనే ఆ పల్లె పేరు చెప్పట్లేదని చెప్తూ ఇలా వ్రాసాడు.

Such was the end of the Ingenious Gentleman of La Mancha, whose village Cide Hamete would not indicate precisely, in order to leave all the towns and villages of La Mancha to contend among themselves for the right to adopt him and claim him as a son, as the seven cities of Greece contended for Homer.

— మిఘెల్ డె థెర్‌న్టెస్, డొన్ కీహొవ్టి, రెండో భాగం, 74వ ప్రకరణం

[గమనిక 50]

సిద్ధాంతాలు

2004లో ఫ్రన్సిస్కొ పర లున, మన్యువెల్ ఫెర్నన్డెస్ నియెటొ, సన్ట్యగొ పెచెన్ వెర్డగువెర్ ల నేతృత్వంలో కంప్లుటెన్సె విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పరిశోధనా బృందం ఆ పల్లె విలన్యెవ డె లొస్ ఇన్ఫన్టెస్ అని అనుమేయించారు. వీరి పరిశోధనని 'ఎల్ కిహొటె' కొమొ ఉన్ సిస్టెమ డె డిస్టెన్శ్యస్/టియెంపొస్: హశ్య ల లొకలిషియొన్ డెల్ లుగర్ డె ల మన్చ అనే వ్యాసంలో ప్రచురించారు. తరువాత వీటినే ఎల్ ఎనిగ్మ రెసుయెల్టొ డెల్ కిహొటె అనే పుస్తకంగా తెచ్చారు. తరువాత జరిగిన ఇంకో రెండు పరిశోధనల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి:

  1. ల డెటెర్మినషియొన్ డెల్ లుగర్ డె ల మంచ కొమొ ప్రొబ్లెమ ఎస్టడిస్టికొ
  2. కైనిమటిక్స్ ఒఫ్ ద కీహొవ్టి అన్డ్ ది ఐడెన్టిటి ఒఫ్ ద 'ప్లెస్ ఇన్ ల మన్చ'[గమనిక 51][26][27]

ఇసబెల్ సంచెజ్ డ్యుకె, ఫ్రన్‌సిస్కొ ఖభ్యర్ ఎస్కుడెరొ అనే ఇద్దరు పరిశోధకులు, కీహొవ్టి నవలకు ప్రేరణ కలిగించే అవకాశమున్న కొన్ని వాస్తవ సంఘటనలను కనుగొన్నారు. థెర్న్టెస్‌కు విలసెఞర్ కుటుంబంతో స్నేహముండేది. వీరు ఫ్రన్సిస్కొ డె అకుఞ అనే అతని మనుషులూ, ఇద్దరూ 1581లో మధ్యయుగపు నైట్ వేషాలలో ఎల్ టొబొసొ నుండి మిఘొల్ ఎస్టెబన్‌కు వెళ్ళే దారిలో మధ్యయుగపు నైట్ వేషాలేసుకుని అంకము (వింతయుద్ధము) చేసేవారు. రొడ్రిగొ కిహడ అని ఇంకొకతను ఇల్ఘొ గౌరవాన్ని కొనుక్కుని తన డాలుగాడితో రకరకాల పుల్లలు పెట్టించేవాడని కూడా వీరు కనుగొన్నారు.[28][29]

డొన్ కీహొవ్టిలో ఒక్కసారి కూడా వర్షం పడదు అనుకుంటున్నాను. థెర్న్టెస్ వర్ణించిన పరిసరాలకీ, స్పెయ్న్‌లోని వాటితో ఏ పోలికా ఉండదు. పచ్చిక బయళ్ళతో, పొదలతో, వాగులతో ఒక ఇటలీ నవలలోని వాటిలా ఉంటాయి.

— జొర్జ్ లుయిస్ బొర్హెస్ (అర్జెన్టైన్ రచయిత)[30]

భాష

ఈ నవల ఆధునిక స్పెనిష్ భాషను చాలా ప్రభావితం చేసింది. ఈ పుస్తకంలోని మొదటి వాక్యం ఒక పడికట్టు పదం అయ్యింది: డె కుయొ నొంబ్రె నొ క్యెరొ అకొర్డర్మె (de cuyo nombre no quiero acordarme, అర్థం: "దేని పేరైతే నేను గుర్తు చేసుకోవాలనుకోవట్లేదో"). పూర్తి కలము: "ఎన్ ఉన్ లుగర్ డె ల మంచ, డె కుయొ నొంబ్రె నొ క్యెరొ అకొర్డర్మె, నొ హసె ముచొ ట్యెంపొ క్వె వివ్య ఉన్ ఇల్ఘొ డె లొస్ డె లన్ౙ ఎన్ అస్టిలెరొ, అడర్గ అన్టిగ్వ, రొసిన్ ఫ్లకొ వై గల్గొ కొరెడొర్" (En un lugar de la Mancha, de cuyo nombre no quiero acordarme, no hace mucho tiempo que vivía un hidalgo de los de lanza en astillero, adarga antigua, rocín flaco y galgo corredor. అర్థం:ల మన్చలో నేను గుర్తుచేసుకోదలుచుకోని ఒక పల్లెలో కొంత కాలం క్రితం ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకి ఒక చట్రంలో బల్లెమూ, పాత కవచం ఉండగా, ఒక బక్కచిక్కిన గుర్రాన్నీ, పందేలకై ఒక వేటకుక్కనీ ఉంచుకునేవాడు.)

హాస్యాన్ని పుట్టించడానికి శ్లేషాలూ, ఇతర చమత్కార పద ప్రయోగాలూ ఈ నవల్లో వాడబడ్డాయి. ఈ నవల్లోని పేర్లలో కూడా అంతర్లీనంగా హాస్యం దాగి ఉంది‌. రొసినన్టె అనే పేరు రొసిన్ అనే పదం నుండి వచ్చింది. రొసిన్ అంటే రేసుగుర్రం అని అర్థం. కానీ ఈ కథలో గుర్రం బక్కచిక్కి శల్యమై ఉంటుంది. లటీనులో భ్రాంతిని ఇల్లూసియొ (illusio) అంటారు. స్పెనిష్, ఆంగ్లం, ఇతర రొమెన్స్ భాషల్లో దీని మూలధాతువు మీదే భ్రాంతిని సూచించే పదాలు ఏర్పడినవి. స్పెనిష్ లో భ్రాంతి అనే పదానికి ప్రాస కుదిరేలా డల్సినియ పేరు ఉంటుంది. కీహొవ్టి పదం కిహడ (Quijada, అర్థం: దవడ)కు శ్లేష అయ్యుండొచ్చు కానీ, కచ్చితంగా కిహొట్ (cuixot, అర్థం: గుర్రపు ముడ్డిపూస) అనే పదంతో శ్లేష ఉన్న ప్రయోగమే.[31]

కిహొటె అంటే తొడలకు వేసుకునే కవచపు జత అనే అర్థం ఉంది. 'ఒటె' అంటే గొప్పదనాన్ని లేదా పెద్ద పరిమాణాన్ని సూచించే ప్రత్యయము (తెలుగులో 'మహా', 'పెను' లాగా). కనుక కిహొటె అనే పేరు పాత్ర తన వైభవాన్ని ఊహించుకుంటున్న విధానాన్ని అశ్లీలంగా సూచిస్తుండి ఉండవచ్చు.[32]

ల మంచ స్పెయ్న్‌లో ఒక ప్రదేశమే కానీ 'మంచ'కి 'మరక' అనే అర్థం కూడా ఉంది. నవల యొక్క ఆంగ్ల అనువాదకుల్లో ఒక్కడైన జొన్ ఒర్మ్స్‌బి, ల మంచ ఒక ఎడారిలాంటి సాదాసీదా ప్రదేశమనీ, ఒక సాహస వీరుడి సొంతూరు అనే ఆలోచన కూడా రాదనీ అభిప్రాయపడ్డారు.

కీహొవ్టి ఆంగ్లనికి తెచ్చిన కొత్త నానుళ్ళలో ఎన్‌వికి వ్యాసాలు ఉన్నవి:

  1. " పొట్ కోలింగ్ కెటిల్ బ్లాక్[గమనిక 52](The pot calling the kettle black, అర్థం: కుండ కెటిల్ (తేనీరు గ్లాసులో పోసుకోవడానికి వాడే పాత్ర)ని నల్లగా ఉన్నావని ఎత్తిచూపినట్టు.[గమనిక 53]
  2. క్విక్‌సొటిమ్/కీహొవ్టిమ్ (Quixotism, ఇది ఒక విశేషణం. వాస్తవిక పరిస్థితులు పరిగణలోకి తీసుకోకుండా, అసాధ్యపు ఆదర్శాలకు పోయే ప్రవర్తన)

ప్రచురణ

చార్ల్స్ జెర్వస్[గమనిక 54] అనువాదంలోని ఒక బొమ్మ
పై బొమ్మే దగ్గరి నుంచి.
కీహొవ్టి, సెన్చౌల కంచు విగ్రహాలు. మధ్రిధ్లోని ప్లౙ డె ఎస్పఞలోవి
గ్యుస్టవ్ డొరె గీసిన కీహొవ్టి బొమ్మల అచ్చుల యొక్క మాలిక.

1604 జులైలో (అప్పటికి రెండో భాగం వ్రాయలనే ఆలోచన లేని) మొదటి భాగపు హక్కులని ముద్రణాదారుడు ఫ్రన్సిస్కొ డె రొబ్లెస్‌కు థెర్న్టెస్ అమ్మాడు. ఎంత మొత్తానికి అన్నది తెలియరాలేదు.[34] ఆ ఏడు సెప్టెంబర్‌లో అనుమతులు రాగా, డిసెంబరుకు ముద్రణ పూర్తిచేసుకుని, 1605 జనవరికి పుస్తకం బయటికి వచ్చింది.[35][36]

నవల విడుదల అయ్యిన వెంటనే గొప్ప స్పందన వచ్చింది. మొదట ముద్రితమైన 400 ప్రతులలో చాలా వాటిని, మంచి వెల ఆశించి, అమెరికా ఉభయ ఖండాలకు పంపగా, క్యు రాజధాని అనలో జరిగిన ఓడ ప్రమాదంలో చాలా వరకు పోయాయి. సుమారు 70 ప్రతులు పెరు రాజధాని లిమకు చేరాయి. తరువాత అవన్నీ పెరు ముఖ్య పట్టణం కొస్కొలో అమ్మబడ్డాయి.[37]

థెర్న్టెస్ పేరు స్పెయ్న్, ఫ్రన్స్‌లను దాటి పాశ్చాత్య దేశాలన్నిటిలో చిరపరిచితమైనది. నవలకు పేరు రాగానే సహజంగానే దొంగ ప్రతులు (చౌర్య ప్రతులు) ముద్రితమయ్యాయి. అగస్టు 1605కల్లా మధ్రిధ్లో రెండూ, పోర్చుగల్ రాజధాని లిఝ్బొవ లో రెండూ, స్పెయ్న్ ముఖ్య పట్టణాల్లో ఒకటైన వలెన్సియలో ఒకటి; మొత్తం కనీసం 5 చౌర్య సంచికలు తయారయ్యాయి.

పునర్ముద్రణలూ-సంచికలూ:

దీని గిరాకీని గ్రహించిన ప్రచురణకర్త 1605 ఫిబ్రవరి కల్లా పోర్చుగల్, అరఘున్‌ల హక్కులు సంపాదించారు.[38]

  1. 1607- బెల్ఘియ రాజధాని బ్ఱసల్
  2. 1608- మధ్రిధ్లో గిరాకీ చూసి మూడో సంచిక (ప్రపంచవ్యాప్తంగా ఏడవ సంచిక) విడుదల చేయబడ్డది.
  3. 1610- ఇటలీలో గిరాకి తట్టుకోవడానికి మిలాన్ బుక్‌సెసర్ ఇటలి సంచిక ముద్రించారు.
  4. 1611- ఇంకో బ్ఱసలు సంచిక విడుదల.[36]

ఐతే స్పెయ్న్ బయటి ముద్రణా హక్కులను పూర్తిగా అమ్మేయడంతో థెర్న్టెస్‌కు వీటి వల్ల కొత్తగా డబ్బేమీ చేతికి రాలేదు.

1613లో తనతో సహా చాలా మంది రచయితలను పోషిస్తున్న నాటి స్థానిక పాలకుడు కొన్డె డె లెమొస్‌కు అంకితమిస్తూ, థెర్న్టెస్ "నొవెలస్ ఎయెంప్లరెస్" (Novelas Ejemplares) అనే పుస్తకం వ్రాసాడు. అందులో "తొందర్లోనే కీహొవ్టి తదుపరి ప్రస్థానం, సెన్చౌ హాస్యములను చూడనున్నారు" అని వ్రాసాడు. ఐతే 1614లో అవలెనెడ అనే పేరుతో ఒక అజ్ఞాత రచయిత నకిలీ రెండో భాగాన్ని విడుదల చేసాడు. దీంతో ఉలిక్కి పడ్డ థెర్న్టెస్ త్వరత్వరగా రెండో భాగాన్ని ముగించి, 1615లో ప్రచురించాడు. దీని ప్రచురణకర్త కూడా మొదటి భాగపు ప్రచురణకర్తే. ఈ రచన వచ్చిన ఒక ఏడుకు థెర్న్టెస్ చనిపోయాడు.[21]

1615 ఆఖర్లో వచ్చిన రెండో భాగంబ్ఱసలూ, వలెన్సియలలో (1616), ఇంకా లిఝ్బొవ (1617)లో పునర్ముద్రణలకు నోచుకుంది. 1617లో స్పెయ్న్‌లోని బర్సలొనలో రెండు భాగాలు కలిపి ఒకే సంచికగా వచ్చాయి.

ఈ రచన వలనే స్పెయ్న్‌లో వీర లక్షణాలు అనే పోకడ పోయిందనీ, స్పెయ్న్ వీర ధర్మాలను ఈ రచన "వెటకారపు నవ్వుతో తోలేసింద"నీ కొందరి అభిప్రాయం.[39]ఇక ఇప్పటివరకు ఈ నవలవి ఎన్నో సంచికలు వచ్చాయి. మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు (2018 వరకు) 50 కోట్ల ప్రతులు అమ్ముడయ్యాయని అంచనా.[40] ఎన్నో భాషల్లో, ఎన్నో సంచికలుగా ఈ నవల రాగా, సంచికలన్నిటినీ, డా॥ బెన్ హనెమన్ అనే సేకర్త 30 ఏళ్ళ పాటు సేకరించారు. 1997లో వీరి సేకరణ మొత్తాన్నీ ఆస్ట్రేలియాలోని స్టేట్ లైబ్రరి ఆఫ్ న్యు సౌత్ వేల్స్‌కు[గమనిక 55] (State Library of New South Wales) ఇచ్చేసారు.[41]

తెలుగు సాహిత్యంలో ప్రస్తావనలు

తెలుగు సాహిత్యంలో కూడా కీహొవ్టి ప్రస్తావనలు ఉన్నవి. ఈ రచయితలు ఎక్కువగా ఆంగ్ల అనువాదాల వలన కీహొవ్టి గురించి వినియున్నవారు. రచయితకు ఆంగ్లంతోనున్న పరిచయం, తాను గురి పెట్టిన పాఠకులూ, వారు తెనిగీకరణ శైలిని బట్టి క్విగ్జొట్, క్విక్సొట్ ఇలా రకరకాలుగా పేరుని వ్రాసారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి 'గణపతి'కి వెలగల వీర్రెడ్డి గారి "మనవి"లో (1966),[42][43] రాయసం వెంకట శివుడు గారి ఆత్మకథ ఐన "ఆత్మచరిత్రము" ద్వితీయభాగంలో (1933),[44][45] మొక్కపాటి నరసింహశాస్త్రిగారి బారిష్టర్ పార్వతీశం- ప్రథమ భాగములో (1925)[46][47] ఈ నవల ప్రస్తావనలున్నవి.

కళాపూర్ణోదయాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వెల్చేరు నారాయణరావూ, డేవిడ్ షూల్మన్‌లు ఈ రచనను "డోన్ కీహొవ్టి"తో పోల్చారు.[48]

అనువాదాలు

ఎన్నో పూర్తి స్థాయి అనువాదాలతో పాటు, ఈ నవలకు సంగ్రహ అనువాదాలు కూడా చాలా ఉన్నాయి. మొదటి భాగం వచ్చిన ఏడేళ్ళకు ఫ్రెన్చ్, జర్మన్, ఇటాలియన్, ఆంగ్ల అనువాదాలు వచ్చాయి. 1618లో రెండో భాగానికి ఫ్రెన్చ్ అనువాదం రాగా, ఆంగ్ల అనువాదం 1620లో వచ్చింది. సంగ్రహ అనువాదాల్లో అగస్టిన్ సెన్చెౙ్ అనువాదం దాదాపు 150 పేజీలు ఉంటుంది. అంటే అసలు నవల కంటే 750 పేజీలు తక్కువ.[49]

ఆంగ్ల అనువాదాలు

మొదటి భాగానిది మొట్టమొదటి ఆంగ్ల అనువాదం 1612లో ఆంగ్లేయ రచయిత థామస్ షె/శెల్టన్[గమనిక 56]చే చేయబడినది. ఇతను థెర్న్టెస్ సమకాలీకుడైనప్పటికీ, వీరిద్దరూ కలుసుకున్నారు అనడానికి ఆధారాలు లేవు. ఈ అనువాదానికి నేటికీ కొందరు మద్దతుదారులున్నప్పటికీ, ఇదంత సంతృప్తికరమైన అనువాదము కాదని నేటి మేటి అనువాదకులు జొన్ ఒర్మ్స్‌బి, సెమ్యుల్ పట్నమ్‌ల అభిప్రాయం.[38] 1620లో షెల్టన్ రెండో భాగాన్ని అనువదించారు.

17వ శతాబ్ది చివర్లో ప్రముఖ ఆంగ్ల కవి జొన్ మిల్టన్[గమనిక 57] మేనల్లుడు జొన్ ఫిలిప్స్[గమనిక 58] ఒక అనువాదాన్ని వ్రాసారు. ఇది ఉన్నవాటన్నిటిలోకంటే అధమమైనదని పట్నమ్‌ అభిప్రాయపడ్డారు. ఇది థెర్న్టెస్ రచనకు నేరుగా చేసిన అనువాదం కాదనీ, ఫిలౌ డె సెయ్న్ట్ మర్టిన్ వ్రాసిన ఫ్రెన్చ్ అనువాదాన్నీ, షెల్టన్ వ్రాయసాలనీ ఆధారంగా చేసుకుని వ్రాసినది అనీ చాలా మంది విమర్శకుల ఉవాచ.

సుమారు 1700 నాటికి మరో ఆంగ్లేయ రచయిత ప్యెర్ అఁట్వన్ మొటు ఇంకో అనువాదాన్ని వ్రాసారు. ఈ అనువాదానికి మంచి ఆదరణ లభించింది. నిరుటి వరకు కూడా ఇది మొడర్న్ లైబ్రరి సియరీస్ ఇడిషన్ గా పునర్ముద్రణకు నోచుకుంది.[50] ఐననూ నేటి అనువాదకులు దీని పై కూడా అభ్యంతరాలు తెలిపారు. పట్నం దీన్ని విమర్శిస్తూ, సెన్చౌ ఉన్న హాస్య సన్నివేశాలు మరీ స్లెప్‌స్టిక్ తరహాలో వ్రాసారనీ, అనువాదంలో సమస్య వచ్చిన చోట ఆ అంకాల్ని వదిలేసో లేకపోతే అనవసరంగా నిడివి పెంచో వాటిని దాటవేసారనీ విమర్శించాడు. ఒర్మ్స్‌బి కూడా ఈ అనువాదం చాలా అధమమైనదనీ, కొక్ని తరహా నిర్లక్ష్యపు ధోరణిని[గమనిక 59] రచనలో ఆవిష్కరించడం ద్వారా హాస్య సన్నివేశాలు మరింత రక్తి కట్టించబోయారుగానీ, ఆ క్రమంలో కథ యొక్క ఆత్మను దెబ్బతీసారని విమర్శించాడు.[51]

"ద ప్రూఫ్ ఒఫ్ పుడింగ్ ఈస్ ఇన్ ది ఈటింగ్"(The proof of pudding is in the eating, అర్థం: అంత్యఖాద్యం (రుచి) యొక్క నిరూపణ తినడంలో ఉంది.[గమనిక 60]) అనే నానుడి థెర్‌భన్టెస్‌కు ఆపాదించబడుతుంది. స్పెనిష్‌లో పుడింగ్‌ను బుడింగ్ (budin) అంటారు. ఐతే ఈ పదం ఇది స్పెనిష్ నవలలో లేదు. మొటు అనువాదంలోనే మనకి ఈ నానుడి కనిపిస్తుంది.[52] స్మొలెట్ తన అనువాదంలో ఈ విషయం గురించి వ్రాస్తూ స్పెనిష్‌లో ఈ వాక్యం "గుడ్లు వేగాక చూస్తావు కదా" అనే అర్థం వచ్చేలా ఉంటుందనీ, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందనీ దాని అర్థం అనీ వ్రాసాడు.[53]

సుమారు 1700ల్లోనే మరో ఆంగ్లేయ రచయిత జొన్ స్టీవన్స్, షెల్టన్ అనువాదం యొక్క పునర్వీక్షణని విడుదల చేసారు. ఐతే మొటు అనువాదం వలన ఈ రచనకి అంత గుర్తింపు రాలేదు.[50]

తరువాత 1742లో ఐరిష్ రచయిత చార్ల్స్ జెర్వస్ అనువాదం, ఆయన మరణానంతరం ప్రచూరితమైనది. ముద్రణలో దొర్లిన దోషం వలన ఇది "జార్విస్ అనువాదం"గా ప్రసిద్ధికెక్కింది. ఇది వచ్చిన నాటికి ఇదే అత్యంత ఉత్తమ ఆంగ్ల అనువాదం. ఐతే తరువాతి కాలంలో ఒర్మ్స్‌బి ఈ అనువాదం మరీ తు.చ తప్పకుండా, చాదస్తంగా ఉందని, అతని అనువాదానికి వ్రాసిన పరిచయంలో అభిప్రాయ పడ్డాడు. 1885 వరకు అత్యధికంగా పునర్ముద్రితమైన ఆంగ్ల అనువాదం ఇదే. 18వ శతాబ్దంలో వచ్చిన మరో అనువాదం, 1755లో స్కొటిష్ రచయిత టొబ్యస్ స్మొలెట్ వ్రాసినది. జార్విస్ అనువాదం లాగే అది కూడా నేటికీ పునర్ముద్రణలకు లోనవుతూ ఉంది.

1881లో ఆంగ్లేయ రచయిత ఎలిగ్‌సాన్డర్ జెయ్మ్స్ డఫీల్డ్ అనువాదం వచ్చింది. జొన్ ఒర్మ్స్‌బి అనువాదం 1885లో రాగా, 1888లో హెన్రి ఎడ్వర్డ్ వొట్స్ అనువాదం వచ్చాయి. నేడు చాలా మంది ఆధునిక అనువాదకులు తమ అనువాదాలను ఒర్మ్స్‌బి రచన తరహాలో చేస్తుంటారు.[54]

అభ్యంతరకరమైన భాగాలనీ, పిల్లలకు అనాసక్తికరంగా ఉండే అవకాశమున్న భాగాలని, తీసేసి పిల్లలు చదువుకునేందుకై చేసిన అనువాదం, 1922లో స్టొరి ఒఫ్ డాన్ క్విక్సోట్ (The Story of Don Quixote, అర్థం: డాన్ క్విక్సోట్ కథ) అనే పేరుతో ప్రచురితమైంది. ఇది ప్రొజెక్ట్ గుటెన్‌బర్గ్‌లో దొరుకుతోంది. మూల నవలకి ఇందులో ఎన్నో మెరుగులు దిద్దారు. దీని శిర్షికలో థెర్న్టెస్‌ ప్రస్తావన లేకుండా, కేవలం సంపాదకుల పేర్లు మాత్రమే ఉన్నాయి.[55]

20వ శతాబ్దంలో ముఖ్యమైన అనువాదాలు చేసినవారు:

  • సెమ్యుల్ పట్నమ్ (1949)
  • ఆంగ్లేయ రచయిత జె.ఎం కొహెన్ (1950; పెంగ్విన్ క్లాసిక్స్)
  • వోల్టర్ స్టార్కి (1957)

20వ శతాబ్దంలో ఆఖరి అనువాదం అమెరిక రచయిత బర్టన్ రఫెల్ (1996)ది.

21వ శతాబ్దంలో ఇప్పటివరకు (2022) 5 అనువాదాలు వచ్చాయి:

  • మొదటిది ఆంగ్లేయ రచయిత జొన్. డి. రుర్‌ఫొర్డ్‌ది
  • రెండవది అమెరిక రచయిత ఈడిత్ గ్రొస్మన్‌‌ది. దీన్ని న్యూ యార్క్ టైమ్స్ పత్రికలో సమీక్షిస్తూ, మెక్సికొ రచయిత కర్లొస్ ఫ్వెన్టెస్, ఇది ఒక గొప్ప సాహిత్యం అని పేర్కొన్నాడు.[56]ఇంకొక విమర్శకుడు ఇది అత్యంత స్పష్టమైన అనువాదాల్లో ఒకటి అని పేర్కొన్నాడు.[57]
  • మూడవది అమెరికా రచయిత టొమ్ లెథ్రొప్‌ది. నవల యొక్క 400వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, నవలా, దాని యొక్క చరిత్రపై ఆయన చేసిన జీవితకాల ప్రత్యేక అధ్యయనం ఆధారంగా దీన్ని వ్రాసారు.[58]
  • నాలుగవది అమెరిక రచయిత జెమ్స్ మొన్ట్‌గొమెరిది (2006). థెర్న్టెస్ రచనా శైలిని ప్రతిబింబిస్తూనే, స్పెనిష్ రచనకు వీలైనంత దగ్గరగా వ్రాయాలనే లక్ష్యంతో 26 ఏళ్ళ క్రితం ఆయన దీన్ని మొదలుపెట్టారు.[59]
  • ఐదవది జెరల్డ్.జె.డేవిస్‌ది (2011). ఇప్పటికి (2022) ఇదే చివరిది.[60]

ఆంగ్ల అనువాదాల చిట్టా

అవి వచ్చిన సంవత్సరం ఆధారంగా వరుస క్రమంలో ఇవ్వబడ్డాయి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనువాదాలు ముదురు రంగులో ఉన్నాయి. ఒక అనువాదము కింద ఉన్న చిన్న వెరసులు ఆ పుస్తకం యొక్క పునర్వీక్షణలను సూచిస్తాయి.

  1. థొమస్ షెల్టన్ (1612 & 1620)
    1. జొన్ స్టీవెన్స్ (1700)
  2. జొన్ ఫిలిప్స్ (1687)
  3. ప్యెర్ అఁట్వన్ మొటు (1700)
    1. జొన్ ఒజెల్ (1719)
    2. జోర్జ్ కెలి (1769)
  4. నెడ్ వోర్డ్ (1700), ద లైఫ్ అన్డ్ నొటబుల్ అడ్‌వెన్చర్స్ ఒఫ్ డాన్ క్విక్సోట్ మెరలి ట్రాన్స్‌లెయ్టెడ్ ఇన్‌టు హ్యూడిబ్రస్టిక్ వర్స్ (The Life & Notable Adventures of Don Quixote merrily translated into Hudibrastic Verse)
  5. చార్ల్స్ జెర్వస్ (1742)
    1. టొబ్యస్ స్మొలెట్ (1755)
    2. ఒ.ఎం బ్రెక్ జూన్యర్ (2003) (ఇది స్మొలెట్ పునర్వీక్షణకు పునర్వీక్షణ)
    3. ఇ.సి రైలి (2008)
  6. చార్ల్స్ హెన్రి విల్మొట్ (1774)
  7. మేరి స్మర్క్— రొబర్ట్ స్మర్క్ అచ్చులతో (1818)
  8. ఎలిగ్‌జాన్డర్ జేమ్స్ డఫిల్డ్ (1881)
  9. జొన్ ఒర్మ్స్‌బి (1885)
    1. జొసఫ్ రమొన్ జోన్స్, కెనిథ్ డగ్లస్ (1981)
  10. హెన్రి ఎడ్వర్డ్ వొట్స్ (1888)
  11. రొబిన్సన్ స్మిత్ (1910)
  12. సెమ్యుల్ పట్నమ్ (1949)
  13. జె.ఎం కొహెన్ (1950)
  14. వోల్టర్ స్టార్కి (1964)
  15. బర్టన్ రఫెల్ (1996)
    1. డయాన డె అర్మస్ విల్సన్ (2020)
  16. జొన్ రూథర్‌ఫోర్డ్ (2000)
  17. ఈడిత్ గ్రొస్మన్ (2003)
  18. థామస్ లథ్రొప్ (2005)
  19. జెమ్స్. ఎచ్. మొన్ట్‌గొమెరి (2006)
  20. జెరల్డ్.జె.డేవిస్ (2011)

2006 వరకు వచ్చిన అనువాదాలన్నిటినీ ఒక పెట్టున సమీక్షిస్తూ, ఏ ఒక్కటీ పూర్తిస్థాయి అనువాదం కాదనీ, ఐతే పట్నం అనువాదం ఒకటీ, రమొన్, డగ్లస్‌ల ఒర్మ్స్‌బి పునర్వీక్షణ ఒకటీ ఉన్న వాటిలో ఉత్తమమైనవనీ అమెరిక రచయిత డెన్యెల్ ఐసెన్‌బర్గ్ అన్నారు.[61]

నకిలీ డాన్ క్విక్సోట్ ఆంగ్ల అనువాదాలు

  1. జొన్ స్టీవెన్స్ (1705)
  2. విల్యం అగస్టస్ యర్డ్లె (1784)

భారతీయ భాషల్లోకి అనువాదాలు

భారతదేశానికి సంబంధించినంత వరకు కీహొవ్టి నవల మొదటి ప్రస్తావన మనకి భారతీయ భాషలపై అధ్యయనం చేసిన ఆంగ్లేయుడు విల్యం జొన్స్ గురించిన వివరాల్లో కనబడుతుంది. ఆయన దగ్గరున్న పుస్తకాల్లో ఈ నవల (స్పెనిష్ పుస్తకం) ఒకటి ఉండేదని అతని జీవిత చరిత్ర లైఫ్ & మైన్డ్ ఒఫ్ ఓరియెన్టౢ జౌన్స్ పుస్తకంలో దాని రచయిత గలర్డ్ కెనన్ పేర్కొన్నాడు.[62] ఐతే ఈ నవలను ఆయన భాషాశాస్త్ర అధ్యయనానికై వాడి ఉండకపోవచ్చు.[62][63] ఈయన భారతదేశంలో 1784–94 వరకు ఉన్నారు.

భారతీయ అనువాదాల్లో నేరుగా స్పెనిష్ నుండి అనువదించిన వాటికంటే ఆంగ్ల అనువాదాన్ని అనువదించినదే ఎక్కువ.[62] వీటిలో చాలా వరకు మొదటి భాగపు అనువాదాలే. ఎన్నో సంగ్రహ అనువాదాలు ఉన్నాయి. ఐతే భారతదేశంలో ఈ రచన పేరు గానీ కథగానీ సామాన్య జనాలకు తెలియడంలో మేలు అనువాదాల కంటే సంగ్రహ అనువాదాల పాత్రే ఎక్కువున్నది.[62]

భారతీయ భాషల్లోని అనువాదాల్లో రెండు భాగాలనీ సంపూర్ణంగా అనువదించిన అనువాదాలు రెండే. ఒకటి బెంగాలీ భాషలో తరుణ్ ఘటక్ అనువాదం, రెండవది హిందిలోకి విభా మోర్య అనువాదం. అలాగే స్పెనిష్ మూల గ్రంథం నుండి చేసిన అనువాదాలు కూడా ఈ రెండే. మిగతావన్నీ ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా చేసుకుని చేసిన అనువాదాలు.

బెంగాలి

డాన్ క్విక్సోట్ మొట్టమొదటి అనువాదం బెంగాలీలోకి జరిగింది. 1887లో బిపిన్ బెహారి చక్రబొర్తి మొదటి బెంగాలీ అనువాదాన్ని వ్రాసారు. ఆ అనువాదం పేరు "అద్భుత్ దిగ్విజయ్" (অদ্ভুত দিগ্বিজয়).[62] ఇందులో స్పెనిష్ మొదటి భాగంలో నాలుగింట మూడొంతులు అనువదించారు కానీ, పూర్తిగా అనువదించలేదు. దీని ఆంగ్ల మూలం తెలియలేదు గానీ 19వ శతాబ్ది చివర్లో వచ్చిన వాటిలో ఒకటయ్యి ఉండాలి. బహుశా మొటు అనువాదం అయ్యుండొచ్చు. ఇది కాక సంగ్రహ అనువాదాలు చాలానే వచ్చాయి.

తరుణ్ ఘటక్ అనే రచయిత స్పెనిష్ మూలం నుండి అనువదించారు.[64][63] ఈ రచన పేరు లా మానచార డాన కిహోటే (লা মানচার দন কিহোতে).[65] రెండు భాగాలుగా అనువదించబడింది.[66]

బెంగాలీలు స్వతహాగా సాహిత్యప్రియులైనప్పటికీ, కీహొవ్టి అనువాదాలకు ఎప్పుడూ పెద్ద పేరు రాలేదు. వీరత్వం, జాతీయవాదముల పైన పరిహాసమైన ఆ నవల, స్వాతంత్య ఉద్యమ వేడిలో ఉన్న నాటి బెంగాలీలకు రుచించలేదని డా॥ కవిత పంజాబి అభిప్రాయపడ్డారు.[63]

అద్భుత్ దిగ్విజయ్ తరువాత 1912లో డాన్ క్రిక్సట్ అనే అనువాదం వచ్చింది. అనువాదకుడు ఎవరన్నది తెలియలేదు. 1931లో డొన్ కుస్తి అనే పేరుతో జమినీ కాంత్ సోమ్ ఒక అనువాదాన్ని ప్రచురించారు. ఇది కాక ఇంకో 6 సంగ్రహ అనువాదాల దాకా వచ్చాయి.[62]

ఉర్దు

నస్తలీక్ లిపిలో ఉన్న ఖుదా-ఈ-ఫౌజదారు శిర్షిక

1894లో పండిత్.రతన్ నాథ్ సరశార్ అనే కాశ్మీరీ రచయిత ఖుదా-ఈ-ఫౌౙదారు (ख़ुदा-ई-फौज़दार, అర్థం: దేవుని సైనికుడు[62][గమనిక 61]) అనే పేరుతో అనువాదాన్ని వ్రాసాడు. ఈ పుస్తకానికి మంచి స్పందన వచ్చింది.[63] ఇది నేటికీ దొరుకుతోంది. ఈయన పుస్తకం ఆంగ్ల అనువాదం యొక్క ఉర్దూ అనువాదం. ఐతే ఏ ఆంగ్ల అనువాదాన్ని ఈయన మూల పుస్తకంగా వాడారన్నది తెలియరాలేదు.

హింది

1964లో పండిత్.ఛవినాథ్ పాండేయ్ ఈ నవలను (మొదటి భాగాన్ని) డోన్ క్విగ్జోట్ (डान क्विग्जोट)గా హిందీలోకి అనువదించారు (ఆంగ్ల మూలం నుండి). సాహిత్య అకాడమీ ప్రచురించిన ఈ నవలలో మూల నవలలోని మొదటి భాగం మొత్తం ఉంది. తరువాత దీనివి 1971లో ఒకటీ, 1983లో ఇంకొకటీ— రెండు సంచికలు వచ్చాయి. ఇవి కాక ఎన్నో పునర్ముద్రణలు జరిగాయి.[62]

స్పెనిష్ మూల నవల కూడా హిందిలోకి అనువదించబడింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో హిస్పెనిౙం[గమనిక 62] ఆచార్యులు ఐన విభా మోర్య[64] 2005లో మొదటి భాగాన్నీ, 2015లో రెండో భాగాన్నీ దోన్ కిఖోతే (दोन किखोते)గా[67]అనువదించారు. ప్రస్తుతం రెండు భాగాలూ కలిపి ఒకే పుస్తకంగా దొరుకుతున్నాయి. వివరణాత్మక విశ్లేషణలూ, ప్రస్తావనలతో ఉండే ఈ అనువాదాలు ఈ నవల యొక్క అధ్యయనానికి వాడేందుకు ఉద్దేశించబడినవి.[63]

మరాఠి

డాన్ క్విక్సోట్కి దా.న శిఖరే వ్రాసిన మరాఠీ అనువాదం 'డోన్ క్విక్ఝోట్' ముఖచిత్రం

1896లో మొదటి మరాఠీ అనువాదం వచ్చినది. దా.న.శిఖరే దీని అనువాదకుడు. "డోన్ క్విక్ఝోట్" (डॉन क्विक्झेट) అనే పేరు గల ఈ అనువాదాన్ని మహారాష్ట్ర సాహిత్య సంస్కృతి మండల్[గమనిక 63] ప్రచురించింది.[63] 1925లో కృష్ణజీ నారాయణ్ అఠల్యిది ఫంకడే తార్వర్ బహదర్ అనే పేరుతో సంగ్రహ అనువాదం వచ్చింది. దీన్ని ప్రచురించిన వారు విశ్వనాథ్ గణేశ్ అని మండలి.[62]

సంస్కృతం

1935–36లో జార్వెస్ ఆంగ్ల అనువాదాన్ని కాశ్మీరీ పండితులు పండిత. జగద్ధర్ జాడూ, పండిత. నిత్యానంద శాస్త్రిలు సంస్కృతంలోకి అనువదించారు. ఈ అనువాదం పేరు డాన్ క్విక్షోటః (डान् क्विक्षोटः).[68]

2019లో సంస్కృత పరిశోధకుడు ఐన డ్రగొమిర్ డిమిట్రొఫ్ సంపాదకత్వంలో, సావిత్రీబాయి ఫులే పూణే విశ్వవిద్యాలయంలోని పాలీ విభాగం రెండో సంచికను ప్రచురించింది. పుస్తకంతో పాటు సంస్కృత ఆచార్యులు శ్రీకాంత్ బహులకర్ గాత్రం ఇచ్చిన శ్రవణ పుస్తకాన్ని కూడా విశ్వవిద్యాలయం విడుదల చేసింది.[69]

తెలుగు

1952లో తెలుగులో 190 పేజీల సంగ్రహ అనువాదం వచ్చినట్లుగా భారతీయ భాషల్లో కీహొవ్టి అనువాదాలపై అధ్యయనం చేసిన హిస్పెనిౙం నిపుణులు పేర్కొన్నారు.[62] ఇది కాక 1954లో విశ్వాత్ముల నరసింహమూర్తి అనే రచయిత వ్రాసిన డాన్ క్విక్జోట్ అనే పుస్తకం ఉంది.[70] జి.సి కొండయ్య అనువాదమైన డాన్ క్విగ్జోట్ తెలుగులో దొరుకుతున్న ఇంకొక రచన.[71]

ఇతర భారతీయ భాషలు

కీహొవ్టి అనువాదాన్ని చవిచూసిన ఇతర భారతీయ భాషలు— గుజరాతీ, అస్సామీస్, ఒడియా, తెలుగు, మలయాళం, తమిఴం/తమిళం, కన్నడలు. ఈ అనువాదాలు చాలావరకు 1952–64 మధ్యలో జరిగాయి.[62] దాదాపు అన్నీ సంగ్రహ అనువాదాలే. కొన్ని నేడు అలభ్యంగా ఉన్నవి.

1906లో బ కెకొ దనరియర్ అద్భుత్ వీరత్వ అనే పేరుతో ప్రతిభా దేవి అస్సామీస్ సంగ్రహ అనువాదాన్ని వ్రాసారు. 1926లో దీని రెండో సంచిక వచ్చింది.[62]

1978లో గోవింద్ త్రిపాఠి ఒడియా భాషలో ఒక సంగ్రహ అనువాదాన్ని వ్రాసారు. ఇది ఢిల్లీలోని సాహిత్య అకాడమీ గ్రంథాలయంలో దొరుకుతున్నది.[62]

1954లో ఎం.నారాయణన్ అనే రచయిత 150 పేజీల నిడివి గల సంగ్రహ అనువాదాన్ని వ్రాసారు. దీన్ని కన్నూరులో అహ్మద్ కున్నీ సోదరులు ప్రచురించారు.[62]

1952లో తెలుగులో 190 పేజీలదీ, కన్నడలో 196 పేజీలదీ సంగ్రహ అనువాదాలు వచ్చాయి.[62]

2005లో ఫాదర్.థొమస్ నడక్కల్ వ్రాసిన మలయాళ అనువాదం డాన్ క్విక్సొట్ (ഡോൺ ക്വിക്സോട്ടിന)కి, 2007లో మలయాళ అనువాద రచనల విభాగంలో సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఈ పుస్తకం కార్మెల్ ఇన్టర్నేషనల్ పబ్లిషింగ్ హౌస్‌చే ప్రచురించబడ్డది.[63]

సాహిత్య అకాడమీ పాత్ర

కీహొవ్టి అనువాదాల్లో కొన్నింటిని సాహిత్య అకాడమీ ముద్రించింది.[63] అవి:

  1. 1964లో పండిత్.ఛవినాథ్ పాండేయ్ హిందీ అనువాదం
  2. పాండేయ్ హింది అనువాదానికి గుజరాతి అనువాదం. ఈ అనువాదం పేరు "డోన్ కిహోటే". దీనికి యునెస్కొ చేయూతనిచ్చింది.[62]

భారతీయ భాషల అనువాదాల జాబితా

మొదటి భాగపు అనువాదాలు లేదా సంగ్రహ అనువాదాలు:
వీటన్నిటినీ ఆంగ్ల మూల గ్రంథాల నుండి అనువదించారు.

  1. బిపిన్ బిహారి చక్రబొర్తి, అద్భుత్ దిగ్విజయ్. కలకత్తా: జోగేంద్రనాథ్ రక్షిత్, 1887. (బెంగాలీ). ప్రస్తుతం మొదటి సంచిక కొనుగోలుకు దొరుకుట లేదు.
    1. రెండో సంచిక, కోల్‌కతా: ఇబంగ్ ముషయెర పబ్లిషర్స్, 2009. దీనిని ముద్రణా సంస్థ యొక్క అధికారిక లంకె నుండి కొనవచ్చు.
  2. పండిత్.రతన్ నాథ్ సరశార్, ఖుదా-ఈ-ఫౌౙదారు. లఖ్నౌ: ముంశీ నవల్ కిశోర్, 1894. (ఉర్దూ). అంతర్జాల ఉర్దూ సాహిత్య వేదిక రేఖ్తాలో దీని ప్రతి ఉన్నది.
  3. దా.న.శిఖరే, డోన్ క్విక్ఝోట్. ముంబయి: మహారాష్ట్ర రాజ్య సాహిత్య-సంస్కృతి మండళ్, 1896. (మరాఠి). ఈ నవల రెండు భాగాలుగా ఉన్నది. దీని ప్రతులు ఆర్కైవ్‌లో దొరుకుతున్నవి‌. మొదటి భాగం, రెండో భాగం.
  4. ప్రతిభా దేవి. బ కెకొ డనరియర్ అద్భుత్ బీరత్వ. జోర్హట్: శరత్ చంద్ర గోస్వామి, 1906 (అస్సామీస్)
  5. అనామక రచయిత, డొన్ క్రిక్సట, కలకత్తా: అనామక ముద్రణా సంస్థ, 1912 (బెంగాలీ)
  6. కృష్ణజీ నారాయణ్ అఠల్యె, ఫమ్కడె తరవర్ బహద్దర్. పూన: విశ్వనాథ్ గణేశ్ అని మండలి, 1925. (మరాఠి)
  7. జమినికాంత సోమ్. డొన్ కుస్తీ. కలకత్తా: గుప్తా ఫ్రెన్డ్స్ & కొ., 1931 (బెంగాలీ)
  8. నిత్యానంద శాస్త్రీ, జగద్ధర్ జాడూ. డొన్ క్విక్షోటః. హార్వర్డ్‌లో ప్రతులు ఉన్నాయి, 1937 (సంస్కృతం). ప్రస్తుతం ఈ సంచిక కొనుగోలుకు దొరకడం లేదు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో దీని ప్రతులు ఉన్నాయి.
    1. రెండో సంచిక: సంపాదకులు: ,పూణే: పాలీ విభాగం, సావిత్రీబాయి ఫులే విశ్వవిద్యాలయం. రెండో సంచిక ముద్రణాదారుల అధికారిక లంకె నుండి కొనుగోలుకు దొరుకుతున్నది.
  9. నిత్యానంద శాస్త్రీ, జగద్ధర్ జాడూ. డొన్ క్విక్షోటః. హార్వర్డ్‌లో ప్రతులు ఉన్నాయి, 1937 (కాశ్మీరీ). ఇది కూడా కొనుగోలుకు దొరుకుట లేదు. పాక్షిక అనువాదమైన దీన్ని సంస్కృత అనువాదపు రెండో సంచికలో ఒక భాగంగా ప్రచురించారు.[69]
  10. అనామక రచయిత, డొన్ క్విక్సొట్, మంగళూరు: బలిగ & సన్స్, 1952 (కన్నడ)
  11. నానిగోపాల్ చక్రబొర్తి. డొన్ క్విక్సొట్. కలకత్తా: శ్రీభూమీ పబ్లిషింగ్ కంపెనీ, 1954 (బెంగాలీ)
  12. విశ్వాత్ముల నరసింహమూర్తి, డొన్ క్విక్జోట్. హైదరాబాద్: మద్రాస్ ఆంధ్ర గ్రంథమాల, 1954 (తెలుగు). భారతీయ భాషల్లో డాన్ క్విక్సోట్ అనువాదాలపై అధ్యయనం చేసిన హిస్పెనిౙం నిపుణులు మద్రాస్ ఆంధ్ర గ్రంథమాలను ప్రచురణదారుగా పేర్కొన్నప్పటికీ,[70] నేడు ఈ పుస్తకం ప్రియదర్శినీ ప్రచురణలు అనే సంస్థ ముద్రణతో దొరుకుతోంది‌‌. నవోదయ బుక్‌హౌస్ వారి తెలుగుబుక్స్.inలో కొనుగోలుకు దొరుకుతోంది.
  13. ఎం. నారాయణన్. డొన్ క్విక్సొట్. కన్ననోర్: అహ్మద్ కున్నీ బ్రదర్స్, 1954 (మలయాళం).
  14. ఛవినాథ్ పాండేయ్. డొన్ క్విక్సొట్. న్యూ ఢిల్లీ: సాహిత్య అకాడమీ, 1964. (హింది). పునర్ముద్రణలు: 1967, 1971, 2005. అంతర్జాలంలో భారతీయ సాహిత్యాస్ సంస్థ నుండి కొనుగోలుకు దొరుకుతుంది.
  15. సి.సి మెహత. డొన్ కిహొటె. న్యూ ఢిల్లీ: యునెస్కొ ప్రొజెక్ట్, 1964 (గుజరాతీ). ఇది ఛవినాథ్ పాండేయ్ హిందీ అనువాదానికి గుజరాతీ అనువాదం.
  16. గోవింద్ త్రిపాఠి. డొన్ క్విక్సొట్. న్యూ ఢిల్లీ: సాహిత్య అకాడమీ, 1978. (ఒడియా).
  17. ఫా. థామస్ నటైక్కల్, డాన్ క్విక్సాట్. తిరువనంతపురం: కార్మెల్ పబ్లిషింగ్ సెన్టర్, 2005. (మలయాళం). ఇది కూడా అంతర్జాలంలో కొనుగోలుకు దొరుకుతోంది.
  18. జి.సి కొండయ్య. డాన్ క్విగ్జోట్. విజయవాడ: పల్లవి పబ్లికేషన్స్, 2020 (తెలుగు). నవోదయ బుక్‌హౌస్ వారి తెలుగుబుక్స్.inలోనూ, మరొక పుస్తక విక్రయ సంస్థ 'లోగిలి'లోనూ కొనుగోలుకు దొరుకుతోంది.

సంపూర్ణ అనువాదాలు:
సంపూర్ణ అనువాదాలలో మూల నవలలోని రెండు భాగాలూ పూర్తిగా అనువదించబడ్డాయి. సంపూర్ణ అనువాదాలు చేసిన రచయితలు స్పెనిష్ నవలను మూలగ్రంథంగా వాడుకున్నారు.

  1. విభా మోర్య, డొన్ కిహొటె: ల మంచ కె సుఖవీర్ కి గాథ.
    1. మొదటి భాగం: న్యూ ఢిల్లి: కన్‌ఫ్లుయెన్స్ ఇన్టర్నేష్నల్, 2006 (హింది)
    2. రెండో భాగం: రెండు భాగాలూ కలిపి ఒకే పుస్తకంగా[72]— న్యూ ఢిల్లి: పెరబౢ ఇన్టర్నేష్నల్, 2015. ప్రచురణా సంస్థ అధికారిక లంకె Archived 2022-11-25 at the Wayback Machine నుండి ఇది కొనుగోలుకు దొరుకుతున్నది
  2. తరుణ్ కుమార్ ఘటక్, లా మానచార డాన కిహోటే. కొల్‌కతా: ఇబంగ్ ముషయెర పబ్లిషర్స్, 2008 (బెంగాలీ). ఈ అనువాదం రెండు సంపుటాలుగా ఉంది. ముద్రణా సంస్థ అధికారిక లంకె నుండి ఇది కొనుగోలు చేయవచ్చు. మొదటి సంపుటి, రెండో సంపుటి.

ప్రభావం

పాశ్చాత్య కళలు

పాశ్చాత్య కళలపై డాన్ క్విక్సోట్ ప్రభావం

భారతీయ కళలు

రచనలు

పండిత్.రతన నాథ సరశార్ యొక్క ఫసన-ఇ-ఆజాద్ అనే నవల 1880లో ప్రచూరితమైనది. కీహొవ్టి తరహా కథనం ఉండడం, తరువాతి నవల ఖుదా-ఇ-ఫౌజుదారు కీహొవ్టి యొక్క అనువాదం కావడాన్ని బట్టి, ఈ నవలపై కీహొవ్టి ప్రభావముందని చాలా మంది పండితుల అభిప్రాయం.[62][63] ఈ నవలని ముంశీ ప్రేమచంద్ ఆజాద్ కథా (आज़ाद कथा)గా 1925లో హిందీలోకి అనువదించారు.[63][73]

తెలుగులో మోచెర్ల హనుమంతరావు వ్రాసిన పరమానంద చరిత్రకు కీహొవ్టి ఆధారం.[74]

ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, తమిఴ(ళ) భాషల్లో వచ్చిన కొన్ని రచనలపై కీహొవ్టి ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.[70] బంకిం చంద్ర, ఠాగూర్, శరత్ చంద్ర, ప్రమథ చౌదరి వంటి ప్రముఖ బెంగాలీ రచయితలకు ఈ రచనతో పరిచయమున్నట్లు తెలుస్తోంది. మొదటి తమిఴ నవలగా పేరొందిన, వేదనాయగం పిళ్ళై వ్రాసిన, ప్రతాప ముదళయార్ చరిత్రము పై కూడా కీహొవ్టి ప్రభావము కనిపిస్తుంది.[70] మరాఠీ రచయిత జి.ఎ కులకర్ణీ, పంజాబీ రచయిత ఐ.సి. నందాల రచనల్లో కూడా కీహొవ్టి ప్రభావం కనిపిస్తుంటుంది.[70] 1974లో కులకర్ణి వ్రాసిన కథా సంకలనం పింగలావేల్ (మరాఠీలో పింగళావేళ్) లోని యాత్రిక్ అనే కథ కీహొవ్టి ఆధారంగా వ్రాయబడినది.[63][70]

2016లో కన్నడిగుడు ఐన ఆంగ్ల రచయిత రైయన్ లోబో "కీహొవ్టి" ఆధారంగా "మిస్టర్ అయ్యర్ గోస్ టు వార్" (Mr Iyer Goes to War, అర్థం: అయ్యర్‌గారు యుద్ధానికి వెళతారు) అనే నవల వ్రాసాడు.[75]

2023లో పద్మభూషణ్ గ్రహీత మూస రజ, తన ఆత్మకథను ఒఫ్ జైయన్ట్స్ అన్డ్ విన్డ్‌మిల్స్ (of Giants and Windmills, అర్థం: ఆజానుబాహులూ, గాలిమరల) అనే పేరుతో విడుదల చేసారు.[76]

నృత్య రూపకాలు

2015లో ప్రముఖ భరతనాట్య కళాకారుడు శీజిత్ కృష్ణ, "కీహొవ్టి"కు నృత్యరూపకాన్ని కూర్చాడు.[77] దీని నిర్మాణానికి గానూ ఆయన 2015లో కేంద్ర సాంస్కృతిక శాఖ "జాతీయ నిర్మాణ సహాయక నిధి"ని అందుకున్నారు.[78] చాలా చోట్ల ప్రదర్శించిన ఈ నృత్యం,[79] చెన్నైలో జరిగే వార్షిక నాట్య ఉత్సవం ఐన "నాట్యదర్శన్"‌లో 2022లో ప్రదర్శితమైంది.[80]తిరువనంతపురానికి చెందిన మార్గి కథకళీ బృందం 2016లో "కిహొతె" అనే పేరుతో ఈ నవల యొక్క నృత్య రూపకాన్ని భారతదేశంలోనూ, స్పెయ్న్‌లోనూ కూడా ప్రదర్శించింది.[73][81][82]

సంగీతం

ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు దిలీప్ తాహిల్ కీహొవ్టి ఆధారంగా మ్యూసిక్ ఆల్బమ్‌ను నిర్మించి అనేక చోట్ల ప్రదర్శించాడు.[73]

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు

మరింత సమాచారం కోసం

  • Bloom, Harold (ed.) (2000). Cervantes' Don Quixote (Modern Critical Interpretations). Chelsea House Publishers. ISBN 0-7910-5922-7.
  • D' Haen, Theo (ed.) (2009). International Don Quixote. Editions Rodopi B.V. ISBN 90-420-2583-2.
  • Dobbs, Ronnie (ed.) (2015). Don Quixote and the History of the Novel. Cambridge University Press.
  • Echevarría, Roberto González (ed.) (2005). Cervantes' Don Quixote: A Casebook. Oxford University Press US. ISBN 0-19-516938-7.
  • Duran, Manuel and Rogg, Fay R. (2006). Fighting Windmills: Encounters with Don Quixote. Yale University Press. ISBN 978-0-300-11022-7.
  • Graf, Eric C. (2007). Cervantes and Modernity: Four Essays on Don Quijote. Bucknell University Press. ISBN 978-1-61148-261-4.
  • Hoyle, Alan (2016). "Don Quixote of La Mancha"(1605): Highlights and Lowlights. Rocks Lane Editions. లంకె
  • Johnson, Carroll B (ed.) (2006). Don Quijote Across Four Centuries: 1605–2005. Juan de la Cuesta Hispanic Monographs. ISBN 1-58871-088-2.
  • Pérez, Rolando (2016). "What is Don Quijote/Don Quixote And…And…And the Disjunctive Synthesis of Cervantes and Kathy Acker." Cervantes ilimitado: cuatrocientos años del Quijote. Ed. Nuria Morgado. ALDEEU. Academia.eduలో చూడండి
  • Pérez, Rolando (2021). Cervantes’s “Republic”: On Representation, Imitation, and Unreason. eHumanista 47. 89-111.—ఎకడెమ్య లంకె, పి.డి.ఎఫ్[permanent dead link]

భారతీయ భాషల్లో అనువాదాలు

Ganguly, Shyama Prasad, ed. (2006). Quixotic Encounters: Indian Response to the Knight from Spain. Shipra Publications. ISBN 978-8175413122. Retrieved 30 December 2022.— భారతీయ భాషల్లో 2005 వరకూ వచ్చిన అనువాదాలపై హిస్పెనిక్ నిపుణుడు శ్యామ ప్రసాదు గంగూలీ విశ్లేషణ. భారతీయ భాషా అనువాదాలపై వచ్చిన మొదటి పుస్తకం. అంతర్జాలంలో కొనుగోలుకు దొరుకుతోంది.

వెలుపలి లంకెలు

ప్రతులు