తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)

2023-2024 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2023 ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై 12న ముగిసాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ 2023 ఫిబ్రవరి 6న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు నాలుగవసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.[2] ఉద‌యం 10:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 12:15 గంట‌ల‌ వరకు 1 గంట 44 నిముషాలపాటు హ‌రీశ్‌రావు బడ్జెట్ ను చ‌దివి వినిపించాడు.[3]

 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)
Submitted2023 ఫిబ్రవరి 6
Submitted byతన్నీరు హరీశ్ రావు
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2023 ఫిబ్రవరి 6
Parliament2వ శాసనసభ
Partyభారత్ రాష్ట్ర సమితి
Finance ministerతన్నీరు హరీశ్ రావు
Tax cutsNone
‹ 2022
2024 ›

2023-2024 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ. 2,90,396 కోట్లు కాగా రెవెన్యూ వ్య‌యం రూ. 2,11,685 కోట్లు, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 37,525 కోట్లుగా అంచనా వేయబడింది. మంత్రి హరీశ్‌రావుకు ఇది నాలుగో బడ్జెట్‌. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టగా, ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నాడు.

2023-2024 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తో హరీశ్ రావు

రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా జూబ్లీహిల్స్ లోని వెంక‌టేశ్వ‌రస్వామి దేవాల‌యంలో హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు. అనంతరం శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖామంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కలిసి అసెంబ్లీకు చేరుకున్నాడు. అక్కడ ఇతర మంత్రులతో కలిసి స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి బడ్జెట్ ప్ర‌తుల‌ను అందించాడు. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా బడ్జెట్ ప్ర‌తుల‌ను అందించాడు.[4]

ప్రతిపాదనలు

2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కు సంబంధించిన ప్రతిపాదనలను 2023 జనవరి 13 వరకు ఆన్‌లైన్‌లో పంపాలని అన్నిశాఖల అధికారులకు ఆర్థికశాఖ సూచనలు అందించింది. గతేడాది ఆదాయాలు, వ్యయాలు, అంచనాలను అధికారులు సమగ్ర వివరాలతో ఆర్థిక శాఖకు అందజేయాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలతోపాటు 2022-23 సవరించిన ప్రతిపాదనలను సమర్పించాలని, డిసెంబరు వరకు చేయాల్సిన చెల్లింపుల వివరాలను ఇవ్వాలని కూడా పేర్కొంది.[5][6]

గవర్నర్ ఆమోదం

2023 జనవరి 21న బడ్జెట్‌ని ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పంపించగా, తన ప్రసంగం ఉంటుందా లేదా అని గవర్నర్ ప్రశ్నించగా దానిపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో గవర్నర్ బడ్జెట్‌ని ఆమోదించలేదు. తెలంగాణ హైకోర్టులో జనవరి 30న జరిగిన చర్చలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం తెలిపింది.

జనవరి 30న రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహనిర్మాణ శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు కలిసి బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరడంతోపాటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్‌‌ తమిళి సైను ఆహ్వానించి, బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన స్పీచ్ కాపీని గవర్నర్ కు అందించాడు. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా... రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి 3వ తేదీ మధ్యాహ్నం గవర్నర్‌ తమిళిసై ప్రసంగించింది. ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.[7]

ఉభయసభలు ఫిబ్రవరి 3వ తేదీన మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీహాల్‌లో సమావేశం కానున్నట్టు గవర్నర్‌ తమిళిసై జనవరి 31న నోటిఫికేషన్‌ (గ‌త స‌మావేశాల కొన‌సాగింపుగానే) విడుదల చేసింది.[8] గవర్నర్‌ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? గవర్నర్‌ ప్రసంగం, బడ్జెట్‌, పద్దులపై చర్చ ఏ రోజున చేపట్టాలనే అంశాలపై బీఏసీలో నిర్ణయించారు.[9]

సమావేశాల ప్రారంభం

ఫిబ్రవరి 3న ఉభయ సభల్లో ప్రసంగించడం కోసం దాదాపు రెండేళ్ళ తరువాత శాసనసభకు వచ్చిన గవర్నర్‌ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్‌కి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్‌ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించింది. గవర్నర్ సూచనల మేరకు ప్రభుత్వం 20 పేజీల ప్రసంగ పాఠాన్ని రూపొందించి ఇవ్వగా దాదాపు 40 నిమిషాలపాటు రాష్ట్రప్రభుత్వంపై ఆద్యంతం ప్రశంసలు, కితాబులతో ప్రసంగం సాగింది. తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని తన ప్రసంగంలో పేర్కొన్నది. 'పుట్టుక నీది చావు నీది.. బతుకంతా దేశానిది' అంటూ కాళోజీ కవితతో గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించి, 'కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో.. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో' అంటూ కవి దాశరథి గేయంలోని చరణాన్ని చదువుతూ జై తెలంగాణ అని ప్రసంగాన్ని ముగించింది. తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా ఆమెను సాగనంపారు.[10]

బీఏసీ సమావేశం

శాసనసభలో బీఏసీ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టడం, 8వ తేదీన బడ్జెట్ పై సాధారణ చర్చ - దానికి ప్రభుత్వ సమాధానం, 9 నుండి 11 తేదీ వరకు బడ్జెట్ పద్దులపై చర్చ, 12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది.[11]

ప్యానల్‌ చైర్మన్లు

బడ్జెట్‌ సమావేశాల్లో ప్యానల్‌ చైర్మన్లుగా రెడ్యానాయక్‌, మోజంఖాన్‌, హన్మంతు షిండే, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నియమించబడ్డారు.

ఆదాయం

2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల వివరాలు:[12]

  • రాష్ట్ర బ‌డ్జెట్ రూ. 2,90,396 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
  • క్యాపిట‌ల్ వ్యయం రూ. 37,525 కోట్లు
  • ట్యాక్స్, ఖర్చుల పన్నుల ద్వారా రూ. 650 కోట్లు
  • కేంద్ర ప‌న్నుల్లో వాటా రూ. 21, 471 కోట్లు
  • ప‌న్నేత‌ర ఆదాయం రూ. 22,801 కోట్లు
  • గ్రాంట్లు రూ. 41,259.17 కోట్లు
  • అమ్మకం ప‌న్ను అంచ‌నా రూ. 39.500 కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ. 19,8884.90 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల ద్వారా రూ. 18,500 కోట్లు
  • వాహన పన్ను ద్వారా రూ. 7,512 కోట్లు
  • ఎలక్టిసిటీ పన్నుల ద్వారా రూ. 750 కోట్లు
  • రియల్‌ ఎస్టేట్‌ పన్నుల ద్వారా రూ. 175 కోట్లు
  • ఇతర పన్నుల సుంకాల ద్వారా రూ. 44.20 కోట్లు
  • ల్యాండ్‌ రెవెన్యూ ద్వారా రూ. 12.5 కోట్లు

శాఖలవారిగా కేటాయింపులు

  1. వ్యవసాయం, సహకార శాఖ – రూ. 26,831 కోట్లు
  2. పశు సంవర్ధక, మత్స్య శాఖ – రూ. 2,071 కోట్లు
  3. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ – రూ. 6,229 కోట్లు
  4. ఇంధన శాఖ – రూ. 12,727 కోట్లు
  5. పర్యావరణం, అటవీ, సైన్స్, టెక్నాలజీ శాఖ – రూ. 1,471 కోట్లు
  6. ఆర్థిక శాఖ – రూ. 49,749 కోట్లు
  7. ఆహార, పౌర సరఫరాల శాఖ – రూ. 3,117 కోట్లు
  8. సాధారణ పరిపాలన శాఖ – రూ. 1,491 కోట్లు
  9. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ – రూ. 12,161 కోట్లు
  10. ఉన్నత విద్యా శాఖ – రూ. 3,001 కోట్లు
  11. హోం శాఖ – రూ. 9,599 కోట్లు
  12. పరిశ్రమలు, వాణిజ్య శాఖ – రూ. 4,037 కోట్లు
  13. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ – రూ. 366 కోట్లు
  14. నీటిపారుదల శాఖ – రూ. 26,885 కోట్లు
  15. కార్మిక, ఉపాధి శాఖ – రూ. 542 కోట్లు
  16. న్యాయ శాఖ – రూ. 1,665 కోట్లు
  17. శాసనసభ (లెజిస్లేచర్) – రూ. 168 కోట్లు
  18. మైనారిటీ సంక్షేమ శాఖ – రూ. 2,200 కోట్లు
  19. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ – రూ. 11,372 కోట్లు
  20. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ – రూ. 31,426 కోట్లు
  21. ప్రణాళికా శాఖ – రూ. 11,495 కోట్లు
  22. రెవెన్యూ శాఖ – రూ. 3,560 కోట్లు
  23. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ – రూ. 21,022 కోట్లు
  24. సెకండరీ ఎడ్యుకేషన్, సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్ – రూ. 16,092 కోట్లు
  25. రవాణా శాఖ – రూ. 1,644 కోట్లు
  26. రోడ్లు, భవనాల శాఖ – రూ. 22,260 కోట్లు
  27. గిరిజన సంక్షేమ శాఖ – రూ. 3,965 కోట్లు
  28. మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు – రూ. 2,131 కోట్లు
  29. యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం, కల్చర్ శాఖ – రూ. 1,117 కోట్లు

కేటాయింపుల వివరాలు

కేటాయింపుల వివరాలు:[13]

బడ్జెట్ ఆమోదం

2023 ఫిబ్రవరి 5న ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.[14]

చర్చలు

9వ తేదీన పద్దులపై చర్చ ప్రారంభంకాగా,

మొదటి రోజు సంక్షేమ శాఖలు – సాంఘిక సంక్షేమం, మైనార్టీ, గిరిజన, మహిళా, శిశు, బీసీ సంక్షేమ శాఖలు, పౌరసరఫరాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌, ఆర్‌అండ్‌బీ, ఎైక్సెజ్‌, అసెంబ్లీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక శాఖలపై చర్చించగా, మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

10న వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక, ఫిషరీస్‌, హోంశాఖ, విద్యాశాఖ, వ్యవసాయం, సహకారం, వైద్య ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ తదితర శాఖల పద్దులపై చర్చించి సభ ఆమోదం తెలిపింది.

11న పరిశ్రమలు, ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి, కార్మిక ఉపాధి కల్పన శాఖ, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, రవాణా, విద్యుత్తు, దేవాదాయ శాఖల పద్దులపై చర్చించారు.

12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించారు.

ముగింపు

2023 ఫిబ్రవరి 12న తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం అనంతరం సభను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశాడు. సమావేశాలు చివరి రోజు ఆర్థికమంత్రి టి. హరీశ్‌రావు ద్రవ్య వినియమ బిల్లును ప్రవేశపెట్టగా, ఆ బిల్లుకు శాసనసభ, శాసనమండలి ఆమోదం తెలిపాయి.[15] అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం ఇచ్చాడు. అనంతరం శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించాడు.[16]

సమావేశాల వివరాలు

ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో జరిగిన సమావేశాలలో ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాల నేపథ్యాన్ని ముఖ్యమంత్రి, అన్ని శాఖల మంత్రులు సభకు వివరించడంతోపాటు సభ్యులు లేవనెత్తిన అనేక అంశాలపై 30 గంటల 43 నిమిషాలపాటు నివృత్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాలు అర్ధరాత్రి దాకా కొనసాగాయి.[17]

శాసనసభ

  • సమావేశాలు జరిగిన రోజులు: 7 రోజులు
  • పనిచేసిన గంటల సంఖ్య: 56.25 గంటలు
  • మౌఖిక సమాధానాలిచ్చిన ప్రశ్నలు: 38
  • 12వ తేదీన ప్రశ్నలకు సమాధానాలు : 12
  • సభ్యులు లేవనెత్తిన అనుబంధ ప్రశ్నలు : 78
  • సభ్యులు చేసిన ప్రసంగాల సంఖ్య : 41
  • ప్రభుత్వం స్వీకరించిన తీర్మానాల సంఖ్య: 1
  • ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య: 5
  • సభ ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య: 5

శాసనమండలి

  • సమావేశాలు జరిగిన రోజుల సంఖ్య: 5
  • పనిచేసిన గంటల సంఖ్య: 17 గంటలు
  • నక్షత్ర పశ్నలకు సమాధానాలు: 15
  • 12తేదీన నక్షత్ర ప్రశ్నలకు సమాధానాలు: 10
  • సభ్యులు చేసిన ప్రసంగాల సంఖ్య: 47
  • ప్రవేశపెట్టిన బిల్లుల సంఖ్య: 5
  • సభ ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య: 5
  • చేసిన తీర్మానాల సంఖ్య: 1

మూలాలు

బయటి లింకులు