భౌగోళిక గుర్తింపు

భౌగోళిక గుర్తింపు (geographical indication) (GI) అనేది ఒక ప్రాంతానికి చెందిన ఉత్పత్తులకు ఇచ్చే గుర్తింపు.[1]

గుర్తింపు చట్టం

ఒక్కో ప్రాంతంలో తయారయ్యే లేదా ఉత్పత్తి అయ్యే కొన్ని రకాల వస్తువులకు సహజంగా ఒక నాణ్యత ఉంటుంది. అదే వాటి ప్రత్యేకత. ఆ విశిష్టతను దృష్టిలో ఉంచుకొని చేసిందే "ది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999". ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతంనుంచి వచ్చే ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వర్తిస్తుంది.

వ్యవసాయ సంబంధమైన, సహజమైన, తయారుచేసిన వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉత్పత్తిఅయిన వస్తువుల విషయంలో, ఆ వస్తువులను ఆ ప్రాంతంలోనే ప్రాసెస్ చేసి ఉత్పత్తిచేయడం జరగాలి. ఆ వస్తువుకు ప్రత్యేకమైన లక్షణాలు, ఖ్యాతి ఉండాలి.[2]

భారత దేశంలో గుర్తింపు[3]

చట్టపరమైన రక్షణ

ఈ భౌగోళీక గుర్తింపు పొందిన ఉత్పత్తులను గుర్తింపు పొందిన వారి అనుమతి లేకుండా ఇతరులు వినియోగించకూడదు. అయితే రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. కానీ రిజిస్ట్రేషన్ వలన మేలైన చట్ట సంరక్షణ సాధ్యమవుతుంది. వ్యక్తులు, ఉత్పత్తిదారులు, చట్టప్రకారం ఏర్పాటయిన సంస్థలు, లేదా అథారిటీలు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దరఖాస్తులో పేర్కొనాలి. నిర్ణీత దరఖాస్తులోవివరాలను తెలియజేయాలి. నిర్ధారిత రుసుమును చెల్లించి రిజిస్ట్రార్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ పేరిట దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి మూడు విభాగాలకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టే వారిని ‘ఉత్పత్తిదారులు’గా భావించటం జరుగుతుంది.

  • ప్రొడక్షన్, ప్రాసెసింగ్, ట్రేడింగ్ లేదా డీలింగ్‌తో ముడిపడిన వ్యవసాయ ఉత్పత్తులు.
  • ఎక్స్‌ప్లాయిటింగ్, ట్రేడింగ్, డీలింగ్‌తో ముడిపడిన సహజ ఉత్పత్తులు.
  • మేకింగ్, మాన్యుఫాక్చరింగ్ ట్రేడింగ్, డీలింగ్‌తో ముడిపడిన హస్తకళలు, పారిశ్రామిక ఉత్పత్తులు.

జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ కాలవ్యవధి 10సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత 10 సంవత్సరాల కాలవ్యవధిలో దానిని పునరుద్ధరించుకోవచ్చు. అనధికారికంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్‌ను ఉపయోగిస్తూ ఇతర ప్రాంతాలలో ఉత్పత్తిఅయిన వస్తువులను ప్రత్యేక ప్రాంతాల్లో తయారయినట్లు ప్రజలను తప్పుదారి పట్టించటం జియోగ్రాఫికల్ ఇండికేషన్‌లను ఉల్లంఘించటమే అవుతుంది. అధీకృత వినియోగదారులు మరణించిన సందర్భంలో వారసులకు హక్కులు బదిలీఅవుతాయి.

ట్రేడ్ మార్కు

జియోగ్రాఫికల్ ఇండికేషన్, ట్రేడ్ మార్కుల మధ్య వ్యత్యాసం వ్యాపారం చేస్తున్న సందర్భంలో ఉపయోగించే చిహ్నం ట్రేడ్ మార్క్. వేర్వేరు వ్యాపార సంస్థల వస్తువులను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఏదేనీప్రత్యేక భౌగోళిక ప్రాంతంనుంచి కొన్ని ప్రత్యేక లక్షణాలతో తయారయిన వస్తువులను గుర్తించేందుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉపయోగపడుతుంది.

భౌగోళిక గుర్తింపుతో ప్రీమియం ధర

జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (భౌగోళిక గుర్తింపు-జీఐ). ఈ గుర్తింపు ఉన్న ఉత్పత్తులకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. దీనికి కారణం వాటి ప్రత్యేకతే. డార్జిలింగ్ టీ, పోచంపల్లి ఇకత్, మైసూర్ సిల్క్, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ బొమ్మలు, బికనీర్ భుజియా, గుంటూరు సన్నమ్ చిల్లి, హైదరాబాద్ హలీమ్.. భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర పలుకుతోందట. అందుకే వీటిని విక్రయించేందుకు ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలూ ముందుకొస్తున్నాయి.[4]

మూలాలు

ఇతర లింకులు