విలియం వర్డ్స్‌వర్త్

ఆంగ్ల కవి

విలియం వర్డ్స్‌వర్త్ (జ: 7 ఏప్రిల్ 1770 - మ: 23 ఏప్రిల్ 1850) సుప్రసిద్ధ ఆంగ్ల కవి. 1798వ సంవత్సరంలో శామ్యూల్ టేలర్ కొలరిడ్జ్‌తో కలసి "లిరికల్ బాలడ్స్" ప్రచురించాడు. దీనితో వాళ్ళు ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిక్ యుగానికి నాంది పలికారు.

విలియం వర్డ్స్‌వర్త్

జననం:7 ఏప్రిల్ 1770
వృత్తి:కవి
Literary movement:రొమాంటిసిజమ్
ప్రభావాలు:జాన్ మిల్టన్, హెన్రీ వాగన్, డేవిడ్ హార్ట్ లె, శామ్యూల్ కొలెరిడ్జ్, జొహాన్ వొల్ఫ గ్యాంగ్ వాన్ గోతె, విలియం షేక్‌స్పియర్, జాన్ వాకింగ్ స్టివార్ట్ , చార్లొటె స్మిత్
ప్రభావితులు:జాన్ స్టువార్ట్ మిల్, మాథ్యూ అర్నాల్డ్, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, లెస్లీ స్టీఫెన్, విల్ఫ్రెడ్ వోవన్, ఎజ్రా పౌండ్, రాబర్ట్ ఫ్రాస్ట్, విలియం బట్లర్ యీట్స్, జార్జ్ బైరన్, 6వ బారన్ , జాన్ మిల్లింగ్ టన్ సింజె

వర్డ్స్‌వర్త్ రచనలన్నిటిలోకి ది ప్రిల్యూడ్ను అమోఘమైనదిగా భావిస్తారు. ఇది రచయత తొలి వత్సరాల ఆత్మకథ. దీనిని రచయిత చాలామార్లు సమీక్షించాడు, పొడిగించాడు. ఈ రచనను మరణానంతరం "ది ప్రిల్యూడ్" పేరుతో ప్రచురించారు. అంతకుముందు ఈ రచనను "టు కొలరిడ్జ్"గా పిల్చేవాడు. వర్డ్స్‌వర్త్ ఇంగ్లాండు రాజకవిగా (poet laureate) 1843 నుండి 1850 వరకు ఉన్నాడు. కొన్నాళ్ళు రాబర్ట్ సౌతీతో కలిసి రచనలు సాగించారు. వర్డ్స్‌వర్త్, సౌతీ, కొలరిడ్జ్ - ఈ ముగ్గురినీ లేక్ కవులు అని పిలిచేవారు.

జీవిత చరిత్ర

తొలి జీవితం, చదువు

జాన్ వర్డ్స్‌వర్త్, అన్ కుక్సన్ దంపతుల ఐదుగురు సంతానంలో రెండవవాడు విలియం వర్డ్స్‌వర్త్. ఇతను ఇంగ్లాండు లోని కుంబర్లాండ్ లోని కాకర్ మౌత్ లో ఏప్రియల్ 7, 1770 న జన్మించాడు. ఈ కుంబర్లాండ్, ఆగ్నేయ ఇంగ్లాండ్ లో ప్రకృతి సౌందర్యంతో అలరారు లేక్ జిల్లా లోని భాగం. వర్డ్స్‌వర్త్ తోబుట్టువులందరూ జీవితంలో మంచి విజయాలు సాధించారు. ఇతని తరువాత సంవత్సరానికి జన్మించిన సోదరి డొరోతి వర్డ్స్‌వర్త్ ఒక కవి, డయారిస్ట్. పెద్దన్న రిచర్డ్ లండను నగరంలో లాయర్. చిన్నన్న జాన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో కేప్టనుగా ఎదిగాడు. చిట్టచివరివాడయిన క్రిస్టఫర్ కేంబ్రిడ్జి లోని ట్రినిటీ కాలేజిలో మాస్టరుగా ఎదిగాడు. 1778లో వర్డ్స్‌వర్త్ తల్లి మరణం తర్వాత, ఇతని నాన్న గారు హాక్స్ హెడ్ గ్రామర్ బడిలో చేర్పించాడు. సోదరి డొరోతిని యాక్షైర్ లో బంధువుల ఇంట్లో నివసించటానికి పంపాడు. ఆ తరువాత 9 సంవత్సరాల వరకు అన్నచెల్లెల్లిద్దరూ కలుసుకోలేదు. వర్డ్స్‌వర్త్ 13 ఏండ్ల వయసులో పితృవియోగం కలిగింది.[1] రచయితగా వర్డ్స్‌వర్త్ అరంగేట్రం 1787వ సంవత్సరంలో "ది యూరోపియన్ మాగజైన్ "లో చిన్న పద్యం ప్రచురించడం ద్వారా జరిగింది. ఇదే సంవత్సరం తను కేంబ్రిడ్జ్ సెయింట్ జాన్స్ కాలేజిలో చేరి 1791వ సంవత్సరానికి బి యే డిగ్రీలో ఉత్తీర్ణుడయినాడు.[2] తొలి రెండు వేసవి శలవులకూ హాక్స్ హెడ్ కు తిరిగి వచ్చాడు, ఆ తరువాతి శలవులను నడక యాత్రలు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రదేశాలను దర్శిస్తూ గడిపాడు. 1790వ సంవత్సరంలో యూరోప్ నడక యాత్రకు వెళ్లాడు. ఈ యాత్రలో ఆల్ప్స్ పర్వతాలు మూలమూలలా దర్శించాడు. ఇంకా ఆక్కడికి దగ్గరలోని ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, ఇటలీ దేశాలలోని సమీప ప్రాంతాలను కూడా దర్శించాడు. ఇతని చిన్న తమ్ముడు కేంబ్రిడ్జ్ ట్రినిటీ కాలేజి మాష్టరుగా ఎదిగాడు.[3]

అన్నెట్టో వాలన్ తో సంబంధం

1791వ సంవత్సరంలో వర్డ్స్‌వర్త్ విప్లవ ఫ్రాన్స్ దర్శించాడు. అక్కడి గణతంత్ర ఉద్యమాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. అక్కడే అన్నట్టె వలోన్ అనే ఫ్రెంచ్ స్త్రీని ప్రేమించాడు. వీరికి 1792లో కరొలిన్ జన్మించింది. కాని ఆర్థిక సమస్యల వల్ల, ఇంగ్లాండు, ఫ్రాన్స్ ల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం వల్ల ఆ తరువాతి సంవత్సరమే ఇంగ్లాండు తిరిగి వచ్చాడు.[4] ప్రియురాలిని వదిలివేసిన పరిస్థితులు, ఆ తరువాత ఇతని ప్రవర్తన కలిసి, అతను ఆనెట్‌ను ప్రేమించి మోసం చేశాడా అనే అనుమానాలకు తావిచ్చింది. కానీ తరువాతి జీవితంలో ప్రియురాలికీ, కుమార్తెకూ తగినంత సాయం చేశాడు. ఈ కాలంలో మంచి గుర్తింపు పొందిన "ఇట్ ఈస్ ఎ బ్యూటీయస్ ఈవెనింగ్, కాం అండ్ ఫ్రీ"ను వ్రాశాడు. ఇందులో పదిసంవత్సరాలగా చూడని తన భార్యను గుర్తు తెచ్చుకుంటూ, ఆమెతో సముద్రపు ఒడ్డున నడచిన నడకలు గుర్తు తెచ్చుకుంటూ వ్రాసిన వ్రాతలు ఉన్నాయి. ఇందులోని పంక్తులు భార్య, కుమార్తెలపై వర్డ్స్‌వర్త్ కున్న గాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తాయి. ఫ్రాన్సులో తలెత్తిన రీన్ ఆఫ్ టెర్రర్ అతనికి ఫ్రాన్స్ గణతంత్ర విప్లవం పట్ల గల అభిప్రాయాలను మార్చివేసింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ల మధ్య యుద్ధం కూడా అన్నెట్టా, కరోలిన్ ల నుండీ అతన్ని చాలా సంవత్సరాల పాటు దూరం చేసింది. ఈ సమయంలో వర్డ్స్‌వర్త్ మానసికంగా అశాంతికి లోనయినట్టు తెలుస్తుంది. 1802లో వర్డ్స్‌వర్త్, తన చెల్లెలుతో కలిసి ఫ్రాన్స్ వెళ్లి అన్నెట్టె, కెరొలిన్ లను కలిసాడు. కుమార్తె పట్ల తన బాధ్యతల గురించి ఒక ఒప్పందానికి వచ్చాడు.[4]

తొలి ప్రచురణ, లిరికల్ బాలెడ్స్

లిరికల్ బాలడ్స్ ముందుమాటలో వర్డ్స్‌వర్త్ తన కవితలను ప్రయోగాలుగా పేర్కొన్నాడు. ఈ లిరికల్ బాలడ్స్‌ను రొమాంటిక్ విమర్శకు మానిఫెస్టోగా పేర్కొంటారు. "ఎన్ ఈవెనింగ్ వాక్", "డిస్క్రిప్టివ్ స్కెచెస్" కవితలతో కూడిన సంపుటి 1793వ సంవత్సరంలో వెలుగు చూసింది. 1795వ సంవత్సరంలో అతనికి రైస్లే కల్వర్ట్ నుండి వారసత్వంగా 900 పౌండ్లు వచ్చింది. తన కవితా వ్యాసంగం కొనసాగించడానికి ఆ సొమ్ముకు అక్కరకు వచ్చింది. ఇదే సంవత్సరం ఇతను సోమర్సెట్ లో శామ్యూల్ కొలెరిడ్జ్‌ను కలుసుకున్నాడు. ఈ కవులిద్దరూ చక్కని స్నేహితులుగా మారారు. 1797 వ సంవత్సరంలో తన చెల్లెలు డొరోతీతొ కలిసి సోమర్సెట్ లోని అల్ ఫాక్స్ టన్ హౌస్‌కు మారాడు. ఈ ఇల్లు నెదర్ స్టోవె లోని కొలెరిడ్జ్ ఇంటికి దగ్గరే. డొరోతి సహకారంతో, వర్డ్స్‌వర్త్, కొలోరిడ్జ్ కలిసి లిరికల్ బాలడ్స్ ను రూపొందించారు. ఈ లిరికల్ బాలడ్స్ ఆంగ్ల రొమాంటిక్ యుగంలో ఒక అతి ప్రధాన మైలురాయి. కానీ ఈ సంపుటికి వర్డ్స్‌వర్త్ పేరు కానీ, కొలోరిడ్జ్ పేరు కానీ రచయితగా లేదు. ఇందులో వర్డ్స్‌వర్త్ కవితల్లో ప్రఖ్యాతి గాంచిన "టింటర్న్ అబ్బే" ఉంది. అలాగే కొలోరిడ్జ్ కవిత "ది రైమ్ ఆఫ్ ది ఏన్షెంట్ మారినర్" కూడా ఇందులో ఉంది. 1800లో ముద్రించిన రెండవ ముద్రణలో రచయితగా కేవలం వర్డ్స్‌వర్త్ పేరు మాత్రమే ఉంది. అంతే కాకుండా ఈ రెండవ ముద్రణలో కవితలకు ముందుమాట కూడా వ్రాశారు, ఈ ముందు మాటను ఆ తరువాతి 1802 ముద్రణలో మరింత విపులీకరించారు. లిరికల్ బాలడ్స్‌కు రాసిన ఈ ముందుమాట రొమాంటిక్ సాహిత్య సిద్దాంతంలో ప్రధానమైనదిగా భావిస్తారు. ఈ ముందుమాటలో కొత్త రకం కవిత్వం లక్షణాలను చర్చిస్తాడు. ఈ కవిత్వాన్ని వాడుక భాషలో చెప్పే విప్లవాత్మకమైన కవిత్వంగా, అంతకు ముందు ఉన్న గ్రాంథిక భాషా కవిత్వానికి భిన్నమైనదిగా సూత్రీకరిస్తాడు. ఆలాగే తన విశ్వ విఖ్యాత కొటేషన్ ఇక్కడే వ్రాశాడు "the spontaneous overflow of powerful feelings from emotions recollected in tranquility." 1805లో లిరికల్ బాలడ్స్ నాలుగవ, చివరి ముద్రణ ప్రచురించబడింది.

అతని ఇతర ప్రసిద్ధ రచనలు 'పద్యాలు, రెండు సంపుటాలలో', 'గైడ్ టు ది లేక్స్', 'ది ఎక్స్‌కర్షన్' , 'ది ప్రిల్యూడ్'. గొప్ప కవి అయినప్పటికీ, వర్డ్స్‌వర్త్ 'ది బోర్డరర్స్' అనే ఒక్క నాటకం మాత్రమే రాశాడు, ఇది విషాదాంతం. వర్డ్స్‌వర్త్, అతని స్నేహితుడు కోల్‌రిడ్జ్ ప్రేరణతో, 'ది రెక్లూస్' పేరుతో ఒక పురాణ తాత్విక కవితను రాయాలనే ఆశయం ఉండేది. కానీ, అతను దాన్ని తీర్చులేకపోయాడు.

జర్మనీ, లేక్ జిల్లా పయనం

ఆ తరువాత 1798 లో వర్డ్స్‌వర్త్, డొరోతి, కొలరిడ్జ్ లు జర్మనీ వెళ్ళారు. ఈ ప్రయాణం కొలరిడ్జ్ జ్ఞానానికి ప్రేరణగా నిలిచినప్పటికీ వర్డ్స్‌వర్త్ మాత్రం ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడు.[4] 1798 - 1799 చలికాలంలో వర్డ్స్‌వర్త్, తన సోదరి డొరోతితో కలిసి గస్లర్లో నివసించాడు. విపరీతమైన ఒత్తిడిలోనూ, ఒంటరితనం ఫీలవుతూ కూడా ఈ కాలంలో తన ఆత్మకథని వ్రాశాడు. ఇంకా చాలా కవితలు వ్రాశాడు. "ది లూసీ పోయెమ్స్" ఈ కాలంలో వ్రాసినవే. తరువాత అన్నా చెల్లెళ్లిద్దరూ ఇంగ్లాండుకు తిరిగి వచ్చారు. ఈ సారి వారి నివాసం లేక్ జిల్లాలోని గ్రాస్మెరి లోని డోవ్ కాటేజీ. ఈ కాలంలో దగ్గరలో నివసించే మరో కవి రాబర్ట్ సౌతీతో కలిసి రచనలు సాగించారు. వర్డ్స్‌వర్త్, సౌతీ, కొలరిడ్జ్ మువ్వురినీ లేక్ కవులు అని పిల్చారు.[5] ఈ కాలంలో వర్డ్స్‌వర్త్ కవితలు ఎక్కువగా మరణం, విరహం, దుఃఖాల చుట్టూ పరిభ్రమించాయి.

విలియమ్ వర్డ్స్‌వర్త్
Portrait, 1842, by బెంజమెన్ హైడాన్

వివాహం, పిల్లలు

1802లో సోదరి డొరోతితో కలిసి ఫ్రాన్స్ వెళ్లి ప్రియురాలు అన్నెట్టె, కుమార్తె కరొలిన్ లను చూసి వచ్చాడు. ఆ తరువాత లార్డ్ లాన్స్ డేల్ నుండి వారసత్వ ఆస్తి పొందాడు. అదే సంవత్సరం ద్వితీయార్థంలో బాల్య స్నేహితురాలు మేరీ హచిన్సన్ ను వివాహం చేసుకున్నాడు.[4] వివాహానంతరం డొరోతి అన్నా వదినలతో కలిసి ఉంది. వదినా మరదళ్లు చక్కని స్నేహితురాళ్లుగా మారారు. 1803లో వర్డ్స్‌వర్త్ దంపతులుకు తొలి సంతానం ఉదయించింది. వీరికి మొత్తం ఐదుగురు సంతానం.

  1. జాన్ వర్డ్స్‌వర్త్ (1803 జూన్ 18 - 1875)
  2. డొరా వర్డ్స్‌వర్త్ (1804 ఆగస్టు 16 - 1847 జూలై 9)
  3. థామస్ వర్డ్స్‌వర్త్ (1806 జూన్ 15 - 1812 డిసెంబరు 1 )
  4. కాథరిన్ వర్డ్స్‌వర్త్ (1808 సెప్టెంబరు 6 - 1812 జూన్ 4)
  5. విలియం విల్లీ వర్డ్స్‌వర్త్ (1810 మే 12 - 1883 )

ఆత్మకథ, రెండు సంపుటాల్లో కవితలు

వర్డ్స్‌వర్త్ కు చాలా కాలం ఒక పెద్ద తాత్విక కవిత వ్రాయాలని పథకాలు ఉన్నాయి. ఈ కవితను తను ది రిక్లుజ్ అని పిలుద్దామనుకున్నాడు. 1798 - 99 కాలంలో ఒక ఆత్మ కథా కవితను వ్రాయడం మొదలు పెట్టాడు. దీనికి పేరు పెట్టలేదు, కానీ ది ప్రిల్యూడ్ అని పిల్చాడు. ఈ ప్రిల్యూడ్ తన ది రిక్లూజ్ నకు అపెండిక్స్ గా మారింది. 1804 నాటికి ఈ ప్రిల్యూడ్ ను పొడిగించటం మొదలు పెట్టాడు, 1805 నాటికి పూర్తి చేశాడు, కానీ వ్యక్తిగత వివరాలు ఎక్కువగా ఉన్న దాన్ని తన రిక్లూజ్ పూర్తి రచన అయ్యేంతవరకూ ప్రచురించదలచలేదు. 1805 నాటి తన సోదరుని మరణం మానసికంగా కృంగదీసింది, ఇహ తన రచన ఎప్పటికీ పూర్తి చెయ్యలేదు.

విజయాలు, కీర్తి ప్రతిష్టలు

1814లో ఇతను "The Recluse" సీరీస్ లోని రెండవ భాగంగా "The Excursion"ను ప్రచురించాడు. ఆయితే తొలి, తృతీయ భాగాలు ఎప్పటికీ పూర్తవ్వలేదు, కానీ తన కవితల యొక్క నిర్మానాన్నీ, ఉద్దేశ్యాన్నీ వివరిస్తూ ఒక prospectus మాత్రం వ్రాశాడు. ఈ prospectus నందు వర్డ్స్‌వర్త్, ప్రకృతి - మనస్సుల గురించి చేసిన ప్రముఖ కొటేషన్లు కొన్ని ఉన్నాయి.

కొంత మంది ఆధునిక విమర్శకులు 1810 తర్వాత వర్డ్స్‌వర్త్ కవితలు అంత క్రితం కవితలతో పోల్చి చూస్తే అంత బాగోలేవు అంటారు. బహుశా తన జీవితంలోనూ, నమ్మకాల్లోనూ వచ్చిన మార్పులే దీనికి కారణం అయి ఉండవచ్చు. ఈయన తొలిదశలో కవితా వస్తువులుగా స్వీకరించిన మరణం, ఓర్పు, ఎడం, విడిచిపోవటం వంటి విషయాలన్నింటినీ రచనల ద్వారా పరిష్కరించడంతో ఈయన కవితా జీవితంలో నిర్మాణాత్మక అధ్యాయం ముగిసింది. అయినా, 1820 కల్లా సమకాలీన విమర్శకులు ఈయన తొలిదశలోని కవితలపై విమర్శలను వెనక్కుతీసుకోవడంతో వర్డ్‌వర్త్ కవిగా విజయాన్ని అనుభవించాడు. 1828లో, వర్డ్‌వర్త్ కొలెరిడ్జ్‌తో ఉన్న విబేధాలు రూపుమాపుకొని సఖ్యత సాధించి, ఇద్దరూ కలిసి ఆ సంవత్సరం రైన్‌లాండ్ అంతా తిరిగివచ్చారు.[4] డొరోతికి 1829లో తీవ్రమైన జబ్బు చేసింది, ఆ తరువాత ఆమె కవిత్వ రచనలో వర్డ్స్‌వర్త్ కి ఎటువంటి సహాయం చేయలేదు. 1835లో ఫ్రాన్స్ ప్రియురాలు అన్నెట్టె, కుమార్తె కరోలిన్ ల పోషణకు సరిపోను నగదు చెల్లించాడు.

రాజకవి, ఇతర గౌరవాలు

సివిల్ న్యాయంలో గౌరవ డాక్టరేటును డుర్హం విశ్వవిద్యాలయంనుండి 1838వ సంవత్సరంలోను, ఆ తరువాత సంవత్సరం అదే గౌరవాన్ని ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంనుండి అందుకున్నాడు.[4] 1842లో ప్రభుత్వాన్నుండి 300 పౌండ్ల వార్షిక గ్రాంటు లభించింది. 1843లో రాబర్ట్ సౌతీ మరణం తరువాత ఇంగ్లాండుకు రాజకవిగా నియమితుడయ్యాడు. 1847లో కుమార్తె డోరీ మరణం తరువాత ఇహ కవితలు వ్రాయలేదు.

మరణం

విలియమ్ వర్డ్స్‌వర్త్ యొక్క సమాధి, గ్రస్మిర్, కమ్బ్రియ

ఏప్రియల్ 23 1850న న్యూమోనియా కారణంగా మరణించాడు. గ్రాస్మెరీలోని సెయింట్ ఆస్వాల్డ్స్ చర్చిలో ఆంతిమ సంస్కారాలు జరిపారు. మరణానంతరం అతని భార్య, అతని ఆత్మకథ "పోయెమ్ టు కోల్‌రిడ్జ్" ను ది ప్రిల్యూడ్ గా ప్రచురించింది. అప్పట్లో అది అంతగా ప్రాచుర్యం పొందకపొయినా ఆ తరువాత వర్డ్స్‌వర్త్ కవిత్వంలో ఇది ఘనమైనదిగా గుర్తింపు పొందింది.

మూలాలు

వనరులు

  • M. H. Abrams, ed. (2000), The Norton Anthology of English Literatures: Volume 2A, The Romantic Period (7th ed.), New York: W. W. Norton & Company, Inc., ISBN 0-393-97568-1
  • Stephen Gill, ed. (2000), William Wordsworth: The Major Works, New York: Oxford University Press, Inc., ISBN 0-19-284044-4

బయట లంకెలు

General information and biographical sketches

Wordsworth's works