పునీత్ రాజ్‍కుమార్

భారతీయ కన్నడ నటుడు, నిర్మాత

పునీత్ రాజ్ కుమార్ (1975 మార్చి 17 - 2021 అక్టోబరు 29) కన్నడ సినిమా నటుడు. ఆయన ఆరు నెలల వయస్సులో 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించి బాలనటుడిగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. పునీత్ రాజ్‍కుమార్ 2002లో అప్పూ సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించాడు.

పునీత్ రాజ్ కుమార్
జననం
లోహిత్ రాజ్ కుమార్

17 మార్చి 1975
చెన్నై, తమిళనాడు, భారతదేశం
మరణం2021 అక్టోబరు 29(2021-10-29) (వయసు 46)
ఇతర పేర్లుఅప్పు
యువరత్నా
పవర్ స్టార్
వృత్తి
  • నటుడు
  • గాయకుడు
  • నిర్మాత
  • టివి వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు
  • 1976–1989
  • 2002–2021
జీవిత భాగస్వామిఅశ్విని రేవంత్ (1999)
పిల్లలుధ్రితి, వందిత
తల్లిదండ్రులు
బంధువులురాఘవేంద్ర రాజ్‌కుమార్, శివ రాజ్‌కుమార్ (అన్నయ్యలు)

జననం, విద్యాభాస్యం

పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17లో తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో రాజ్‌కుమార్, పార్వతమ్మ దంపతులకు జన్మించాడు. పునీత్ అసలు పేరు లోహిత్. ఆయన కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా పూర్తి చేశాడు.

సినీ జీవితం

పునీత్ రాజ్ కుమార్ ను తన తండ్రి రాజ్ కుమార్ సినిమా సెట్స్ కు తీసుకువెళ్ళేవాడు. అలా ఆయన పుట్టిన ఏడాదిలోనే వి.సోమశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'ప్రేమడ కనికే' చిత్రంలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. అప్పటికి పునీత్ వయసు కేవలం ఆరు నెలలు మాత్రమే. పునీత్ తరువాత బాల నటుడిగా భూమిగే బండ భగవంత, భాగ్యవంత, హోస బెళక్కు, చలిసువ మోడగులు, భక్త ప్రహ్లాద, ఎరాడు నక్షత్రగలు, యారీవను, బెట్టాడా హువు, శివ మెచ్చిడ కన్నప్ప, పరశురామ్ చిత్రాల్లో నటించాడు. ఆయన 1985లో నటించిన "బెట్టద హూవు" చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు.[1]

పునీత్ రాజ్‌కుమార్‌ 2002లో 'అప్పు' సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో రవితేజ నటించిన ఇడియట్ సినిమాకు రీమేక్. ఆయన అభి (2003), వీర కన్నడిగ (2004), మౌర్య (2004), ఆకాష్ (2005), అజయ్ (2006), అరసు (2007), మిలానా (2007), వంశీ (2008), పవర్, బిందాస్, జాకీ, హుడుగారు, అన్న బాండ్, రానా విక్రమ, రాజకుమార లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించాడు. ఆయన మిలనా చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సువర్ణ ఫిల్మ్ అవార్డును, 2008లో బిందాస్ మూవీతో ఉత్తమ నటుడిగా సౌత్ స్కోప్ అవార్డు అందుకున్నాడు.

పునీత్ రాజ్‌కుమార్‌ 2019లో తొలిసారిగా కవలుదారీ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన పలు టి.వి. షో లకు హోస్ట్ గా, జడ్జిగా, యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు. పునీత్ 2012, 2013లలో కన్నడద కొట్యాధిపతి షోను రెండు సీజన్స్ పాటు హోస్ట్ గా వ్యవహరించి, 2019లో మూడోసారి కన్నడద కొట్యాధిపతి షోకు హోస్ట్ గా వ్యవహరించాడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.[2]

సేవ కార్య్రమాలు

పునీత్‌ రాజ్‌కుమార్‌ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థుల‌కు చ‌దువు చెప్పించ‌డం, 26 అనాథ ఆశ్ర‌మాలు, 16 వృద్ధుల ఆశ్ర‌మాలు, 19 గోశాల‌లు ఏర్పాటు చేశాడు.

మరణం

పునీత్‌ రాజ్‌కుమార్‌ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు.[3][4]

డాక్టరేట్‌

మైసూరు విశ్వవిద్యాలయం 112వ స్నాతకోత్సవంలో భాగంగా పునీత్‌ రాజ్‌కుమార్‌కు మరణానంతరం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్‌ స్వీకరించింది.[5]

మూలాలు