అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్

అబ్సెసివ్ - కంపల్సివ్ డిజార్డర్ (Obsessive–compulsive disorder - OCD) అనేది ఒక మానసిక వ్యాధి. దీనిని సంక్షిప్తంగా 'ఓసిడి (OCD)' అని అంటారు. వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే రుగ్మత. వేమూరి ఇంగ్లీష్ తెలుగు నిఘంటువు దీనిని "స్వీయభావ అవరోధ రుగ్మత" అని పేర్కొంది. దీనిలో ఒక వ్యక్తి ఆలోచనల చొరబాటు కలిగి ఉంటాడు. కొన్ని నిత్యకృత్యాలను పదేపదే తప్పనిసరిగా అంటే నిర్బంధంగా (కంపల్సన్) చేయవలసిన ఆలోచనలను (అబ్సెషన్) గా భావిస్తారు. ఇది సాధారణ పనితీరును బలహీనపరుస్తుంది.[1][2][3]

అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్
OCD
OCD లక్షణాలు - తరచుగా, అధికముగా చేతులు కడుగు కొనటం
Specialtyమానసిక వైద్యం
Symptomsచేతులు కడుక్కోవడం, అతిగా శుభ్రం చేయడం, వస్తువులను పదే పదే తనిఖీ చేయడం, తలుపులకి తాళాలు వేయడం, చాలాసార్లు పరీక్షించుకోవడం
Complicationsఆందోళన, నిస్పృహ, అతిగా తినడం, ఒత్తిడి, శారీరక రుగ్మతలు,ఆత్మహత్య ప్రేరేపరణలు
Usual onset35 సంవత్సరాల లోపల [2][3]
Risk factorsఆందోళన, నిస్పృహ, అతిగా తినడం, ఒత్తిడి, శారీరక రుగ్మతలు,ఆత్మహత్య ప్రేరేపరణలు
Diagnostic methodలక్షణాలను అనుసరించి [3]
Treatmentకాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), సైకోట్రోపిక్ మందులు
Frequency2.3%

లక్షణాలు

అబ్సెషన్స్ అనేవి నిరంతరంగా చొచ్చుకు వచ్చే అవాంఛిత ఆలోచనలు. అవి మానసిక చిత్రాలు, ఆందోళన, అసహ్యం, అసౌకర్యం మొదలైన భావాలను సృష్టించే ప్రేరేపణలు. అబ్సెషన్స్ అనేవి ఒత్తిడిని కలిగించే ఆలోచనలు, వాటిని విస్మరించడానికి లేదా ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి పునరావృతమవుతాయి కొనసాగుతాయి.

సాధారణంగా వ్యక్తులు పదే పదే చర్యలను చేస్తున్నప్పటికీ, వారు ఈ చర్యలను తప్పనిసరిగా చేయరు. దినచర్యగా, వాడుకగా, కేవలం అలవాటుగా చేస్తారు. ఈ చర్యలు అలవాట్లు వారి జీవితానికి సామర్థ్యాన్ని, క్రమబద్ధతను తీసుకువస్తాయి. అయితే ఇవే చర్యలు ఇతర పరిస్థితులలో అంటే నిర్బంధంగా చేస్తే అసాధారణంగా కనిపిస్తుంది. క్రమమైన జీవితానికి అంతరాయం కలిగిస్తాయి.[4] ఈ నిర్బంధాలలో చేతులు కడుక్కోవడం, అతిగా శుభ్రం చేయడం, వస్తువులను పదే పదే తనిఖీ చేయడం, తలుపులకి తాళాలు వేయడం, చాలాసార్లు పరీక్షించుకోవడం, పునరావృత చర్యలు ఒక నిర్దిష్ట మార్గంలో వస్తువులను అమర్చడం, భరోసా కోరడం, పదేపదే ఆన్ చేయడం, ఆఫ్ చేయడం వంటివి ఉండవచ్చు.[5] ఇంకా కలుషితం గురించిన భయం, సమరూపతతో (సిమెట్రీ), బాధితుడి లైంగిక ధోరణిని దూషింపబడే భయం, ఇతరులకు లేదా తమకు హాని కలుగుతుందేమోనన్న భయం ఉంటాయి.[2][6]

ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం పొందడానికి ప్రతిస్పందనగా పునరావృతమయ్యే చర్యలు - పదే పదే చేతులు కడుక్కోవడం , శుభ్రపరచడం, లెక్కించడం, ఆదేశాలను తిరస్కరించడం, తటస్థీకరించడం , హామీ కోరడం , ప్రార్థన చేయడం, వస్తువులను తనిఖీ చేయడం వంటివి ఉంటాయి.[6][7] OCD ఉన్న వ్యక్తులకు వారి ఆలోచనలు అర్ధవంతం కావని తెలుసు కానీ వారు వాటినుంచి ఉపశమనం పొందడానికి ఏమైనా చేస్తారు. అటువంటి ఆలోచనలకు వారు అసాధారణ ప్రాముఖ్యతను జోడిస్తారు.[2] కాలక్రమేణా ఈ పరిస్థితి ఒత్తిడి పెరగడానికి కారణమవుతుంది. ఆత్మహత్య ప్రేరేపరణలు పెరుగుదల కూడా ముడిపడి ఉంటుంది.[8]

అబ్సెసివ్ - కంపల్సివ్ పర్సనాలిటీ లక్షణాలు ఆందోళన, నిస్పృహ, అతిగా తినడం వంటి ఇతర రుగ్మతలకు కూడా ఉంటాయి. ఒసిడి బాధిత వ్యక్తులు తమ ఆందోళన భయాన్ని అనుభవించడంతో పాటు ప్రతిరోజూ నిర్బంధ చర్యలను ప్రదర్శిస్తూ గంటలు రోజులు గడపుతుంటారు. అటువంటి పరిస్థితులలో , వారు స్వయంగా, కుటుంబంలో లేదా సామాజికంగా తమ బాధ్యతలను నెరవేర్చడం కష్టం అవుతుంది. ఈ ప్రవర్తనలు అనేక శారీరక రుగ్మతల లక్షణాలను కలిగిస్తాయి - ఉదాహరణకు కీటకనాసినుల సబ్బు నీటితో చేతులు కడుక్కున్న వ్యక్తుల చర్మం ఎరుపుగా మారవచ్చు.[9]

OCD లక్షణాలు కొన్ని లక్షణాల సమూహాలుగా కలిసి సంభవిస్తాయి. యేల్ - బ్రౌన్ అబ్సెసివ్ కంపల్సివ్ స్కేల్ (Y - BOCS) అనే ప్రామాణిక అంచనా సాధనం 13 లక్షణాలను గుర్తిస్తుంది.[10] నాలుగు సమూహాలను గుర్తించింది. ఒకటి సమరూపత కారకం (symmetry factor), ఒక నిషిద్ధ ఆలోచనలు కారకం (forbidden thoughts factor), శుభ్రపరిచే కారకం (cleaning factor) ఇంకా ఒక నిల్వ కారకం (hoarding factor). సమరూపత కారకం క్రమబద్ధీకరణ , లెక్కింపు, సమరూపతతో పాటు పునరావృతమయ్యే నిర్బంధ ఆలోచనలకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువ చేస్తుంది. నిషిద్ధ ఆలోచనల అంశం హింసాత్మక మతపరమైన లేదా లైంగిక ఆలోచనలతో సంబంధం కలిగి ఉంటుంది. శుభ్రపరిచే అంశం కాలుష్యం, శుభ్రపరచడానికి సంబంధించిన ఆలోచనలు ప్రేరేపిస్తుంది. నిల్వ కారకం నిల్వ సంబంధిత నిర్బంధ లక్షణాలు గుర్తించబడింది.[11]

ఒక అధ్యయనంలో OCD ప్రారంభమయ్యే సగటు వయస్సు బాలురకు 9.6, బాలికలకు 11.0 గా ఉందని, పురుషులు, స్త్రీలకు సగటు వయస్సు వరుసగా 21, 24 అని, ప్రత్యేకంగా మహిళలలో 62% మంది ఋతుస్రావం ముందు వయస్సులో వారి లక్షణాలు మరింత దిగజారాయని కనుగొన్నారు. ఏమైనా 25 కంటే ముందే ప్రారంభ వయస్సు అని తెలుసుకున్నారు. 29% రోగులు తమ జీవితంలో పర్యావరణ కారకం ఉందని సమాధానం ఇచ్చారు.[12]

చరిత్ర

7వ శతాబ్దం ADలో, జాన్ క్లైమాకస్ స్థిరంగా విపరీతమైన "దూషణకు ప్రలోభాలకు" గురవుతున్న ఒక యువ సన్యాసి యొక్క ఉదాహరణను ఒక పెద్ద సన్యాసిని సంప్రదించి నమోదు చేసాడు. ఐరోపాలో 14 నుండి 16వ శతాబ్దం వరకు దైవదూషణ, లైంగిక లేదా ఇతర చొచ్చుకు వచ్చే ఆలోచనలను అంటే ఆందోళన, మత భయాలు, చెడు ఆలోచనల అనుభవించిన వ్యక్తులు దెయ్యం పట్టి ఉంటారని నమ్ముతారు. భూతవైద్యం ద్వారా దైవదూషణను కలిగి ఉన్న వ్యక్తి నుండి దుష్టత్వాన్ని బహిష్కరించడం జరుగుతుంది.[13][14] అబ్సెసివ్ - కంపల్సివ్ అనే ఆంగ్ల పదం జర్మన్ Zwangsvorstellung (obsession) నుంచి ఉద్భవించింది. కార్ల్ వెస్ట్ఫాల్ మొదటి ఉపయోగించిన ఆలోచన అబ్సెషన్. వెస్ట్ఫాల్ వివరణలు పియరీ జానెట్ను ప్రభావితం చేసింది, అతను 'ఒసిడి' యొక్క లక్షణాలను నమోదు చేశాడు.[15] 1910ల ప్రారంభంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ అబ్సెసివ్ - కంపల్సివ్ లక్షణాలుగా వ్యక్తమయ్యే సంఘర్షణలకు "టచింగ్ ఫోబియా" సిద్ధాంతాన్ని ఆపాదించాడు.[16] 1980ల మధ్యకాలం వరకు, OCDకి ప్రధాన చికిత్సగా ఫ్రాయిడియన్ మానసిక విశ్లేషణ కొనసాగించారు.  జాన్ బన్యన్ (1628 - 1688) ది పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ రచయిత OCD యొక్క లక్షణాలను ప్రదర్శించారు (అయితే అప్పటికి ఇంకా OCD పేరు పెట్టలేదు). తన పరిస్థితి అత్యంత తీవ్రమైన కాలంలో అతను అదే పదబంధాన్ని పదే పదే, ముందుకు వెనుకకు కదిలిస్తూ, తన వైఖరిని వివరించాడు.[13] బ్రిటిష్ కవి , వ్యాసకర్త లెక్సికోగ్రాఫర్ శామ్యూల్ జాన్సన్ (1709 - 1784) కు కూడా ఈ రుగ్మత ఉంది.[17]  అమెరికన్ ఏవియేటర్, చిత్రనిర్మాత హోవార్డ్ హ్యూస్ కు ఈ OCD వ్యాధి కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.[18] హ్యూస్ చలనచిత్ర జీవితచరిత్ర ది ఏవియేటర్ (2004) లో ఈ విషయం తెలియజేయబడింది.[19] ఆంగ్ల గాయకుడు - గేయరచయిత 'జార్జ్ ఎజ్రా' ఒసిడి (OCD) తో తన జీవితకాల పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడాడు.[20] ప్రపంచ ప్రఖ్యాత స్వీడిష్ వాతావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ తన ఇతర మానసిక అనారోగ్య పరిస్థితులలో 'ఒసిడి' కూడా ఉన్నట్లు తెలుసుకుంది.[21]. అమెరికన్ నటుడు 'జేమ్స్ స్పేడర్కు' కూడా 'ఒసిడి' బాధితుడు అని తెలుస్తోంది.[22]

కారణాలు

'ఒసిడి' కి నిర్దుష్టమైన కారణం తెలియదు.[23] పర్యావరణ జన్యు కారకాలు రెండూ కూడా కారణము అని భావిస్తారు. ఇంకా ప్రతికూల బాల్య అనుభవాలు లేదా ఒత్తిడిని కలిగించే ఇతర సంఘటనలు ఈ రుగ్మత ఏర్పడడములో కారణమని అంటారు.[24] మెథాంఫేటమిన్, కొకైన్ వంటి కొన్ని మందులు, యాంటిసైకోటిక్స్ ముఖ్యంగా స్కిజోఫ్రెనియా ఉన్న వ్యక్తులలో ఒసిడికి కారణమవుతాయి.[25] ఈ రుగ్మత వారసత్వంగా కూడా వచ్చే ప్రమాదం ఉండటానికి ఆధారాలున్నాయి. ఈ ఒసిడి లక్షణాలతో బాధపడుతున్న పిల్లలలో 45 - 65% వరకు జన్యుపరమైన కారకాలు కనుగొన్నారు. ఓ.సి.డి. రోగగ్రస్తుల దగ్గర వారికి అనోరెక్సియా నెర్వోసా (ఆహారం తీసుకోలేక పోవడం) అను వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.[26] ఒ.సి.డి. తో సంబంధం లేని కుటుంబాలలో మానవ సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్ జన్యువు హెచ్.ఎస్.ఈ.ఆర్.టి. (hSERT)లో ఒక ఉత్పరివర్తనం కనుగొన్నారు.[27] బాల్యంలో గాయాలు, వేధింపులకు, నిర్లక్ష్యానికి గురియైన వ్యక్తులలో OCD మరింత సాధారణం కావచ్చు. జీవితంలో ముఖ్యమైన సంఘటనలు కొన్నిసార్లు ప్రసవం, మరణం వంటి తర్వాత ప్రారంభమవుతుంది.[28]

మెదడులోని కొన్ని భాగాలు ఒ.సి.డి.లో అసాధారణ చర్యను చూపుతున్నాయి

చికిత్స

మనస్తత్వ శాస్త్రవేత్త, మానసిక వైద్యుడు లేదా అధికారికంగా అనుమతులు పొందిన మానసిక ఆరోగ్య నిపుణులు రోగ నిర్ధారణ చేస్తారు. రోగుల రోజువారీ జీవితాలలో చొరబడి, ఆందోళన కలిగించే స్థాయిలో పునరావృతమయ్యే బలమైన ఆలోచనలు లేదా హఠాత్తుగా వచ్చే ప్రేరణల ఆధారంతో గుర్తిస్తారు.[29] సాధారణంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) ఇంకా సైకోట్రోపిక్ మందులు OCDకి మొదటి చికిత్సలుగా ఉపయోగిస్తారు.[30]

మేధో ప్రవర్తన ఆధార చికిత్స (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ - CBT)లో OCD రోగులు ఎటువంటి నిర్బంధాలలో పాల్గొనకుండా చొరబాటు ఆలోచనలను అధిగమించమని సలహా ఇస్తారు. నమ్మకాలు 'ఒసిడి'ని బలంగా ఉంచుతాయని, వాటిని పాటించకపోతే 'ఒసిడి' బలహీనపడుతుందని వారికి బోధిస్తారు.[31] ఈ చికిత్సకు ఎక్కువగా ఉపయోగించే మందులు కృంగుబాటును నిరోధించే మందులు (యాంటి డిప్రెసెంట్స్) - సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ (SSRIs), సెరోటోనిన్ - నోర్పైన్ఫ్రైన్ రీఅప్టకే ఇన్హిబిటర్లు (SNRIs) ఉన్నాయి.[32] పిల్లలకు కౌమారదశలో ఉన్నవారికి సెర్ట్రాలైన్ (Sertraline), ఫ్లూక్సెటైన్ (fluoxetine)లు ప్రభావవంతంగా ఉంటాయి.[33] సహజంగా లభించే చక్కెర ఇనోసిటాల్ [34] హైడ్రోకోడోన్, ట్రామాడోల్ వంటి μ - ఓపియాయిడ్స్ OCD లక్షణాలను తగ్గిస్తాయి.[35]

కొంతమంది తీవ్రమైన రోగులలో ఎలెక్ట్రోకాన్వల్సివ్ థెరపీ (ఇసిటి) ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.[36] ట్రాన్స్క్రానియల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్ చికిత్సా ఈ లక్షణాలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని తేలింది.[37] ఇతర చికిత్సలతో మెరుగుపడని వ్యక్తులలో శస్త్రచికిత్సను చివరి ప్రయత్నంగా పరిగణిస్తారు. పాల్గొనేవారిలో 30% మంది ఈ ప్రక్రియ నుండి ప్రయోజనం పొందారు. మెదడు కణజాలాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేని శస్త్రచికిత్సలను, లోతైన - మెదడు ఉద్దీపనను OCD చికిత్స కోసం యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (United States, the Food and Drug Administration) మానవతా దృష్టితో ఆమోదించింది.[38]