అమెరికాలో బానిసత్వం

అమెరికాలో బానిసత్వం అనేది 18, 19వ శతాబ్దాల్లో అమెరికాలో స్వాతంత్ర్యం నాటి నుంచి అంతర్యుద్ధం వరకూ చట్టబద్ధంగా సాగిన మానవ బానిసత్వం. వలసల తొలినాళ్ళ నుంచి బ్రిటీష్ ఉత్తర అమెరికాలో బానిసత్వం వ్యాప్తిలో ఉండేది. 1776లో ఇండిపెండెన్స్ డిక్లరేషన్ నాటికి 13 కాలనీలన్నిటిలోనూ దీని వ్యాప్తిని గుర్తించారు. 1865 వరకూ చట్ట ప్రకారం, నల్లజాతికి చెందిన బానిసను వస్తువుగా వ్యవహరిస్తారు, వారిని అమ్మవచ్చు, కొనవచ్చు, ఇచ్చివేయనూ వచ్చు. 1865 వరకూ దాదాపు సగం అమెరికా సంయుక్త రాష్ట్రాల రాష్ట్రాల్లో బానిసత్వం కొనసాగింది ఒక ఆర్థిక విధానంగా బానిసత్వాన్ని కౌలు వ్యవసాయం, ఖైదీల లీజు వంటివి భర్తీచేశాయి.

1789-1861 మధ్య కాలంలో యునైటెడ్ స్టేట్స్ లో బానిసత్వం అమలు నిషేధాలు, వివిధ రాష్ట్రాల్లో సాగిన విధానాన్ని సూచించే యానిమేషన్

అమెరికన్ విప్లవం (1775 - 1783) సమయానికి, బానిసత్వం ఆఫ్రికన్ వంశపారంపర్యంతో సంబంధమున్న జాతికి పరిమితమైనట్టుగా వ్యవస్థీకృతమైంది.[1] అమెరికన్ రాజ్యాంగంలో బానిసత్వానికి ఏ స్థానం ఇవ్వాలన్నది దాన్ని రూపొందిస్తున్నప్పుడు అత్యంత వివాదాస్పదమైన అంశం. రాజ్యాంగ నిర్మాతలు ఎప్పుడూ "బానిసత్వం" (స్లేవరీ) అన్న పదాన్ని తుది రూపంలో వాడకపోయినా, త్రీ-ఫిఫ్త్స్ కాంప్రమైజ్ క్లాజ్ ద్వారా, బానిస యజమానులకు విపరీతమైన రాజకీయ శక్తిని కల్పించారు.[2] అమెరికన్ విప్లవ యుద్ధ సమయంలోనూ, పూర్తైన వెనువెంటనే, అత్యధిక శాతం ఉత్తరాది రాష్ట్రాల్లో బానిసత్వ రద్దు చట్టాలు (అబాలిషనిస్ట్ చట్టాలు అని పేరు) ఆమోదమై, బానిసత్వాన్ని రద్దుచేయాలన్న ఆలోచన ఉద్యమరూపం తీసుకోసాగింది. 1805 నాటికల్లా అన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఏదోక రూపంలో, ఏదో విధంగా బానిసత్వాన్ని రద్దుచేశాయి; కొన్నిసార్లు ఈ రద్దు అన్నది క్రమానుగతమైన పద్ధతిలో జరిగింది, 1840 జనగణన ప్రకారం అప్పటికీ కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో వందల మంది బానిసత్వంలోనే ఉన్నారు. దక్షిణాదిలోనూ ఉత్తర సరిహద్దులకు దగ్గరలోని రాష్ట్రాల్లో కొందరు బానిస యజమానులు తమ వద్ద బానిసలుగా ఉన్నవారికి స్వేచ్ఛనిచ్చారు. దాతలు, ధార్మిక కార్యక్రమాలు చేసే గ్రూపులు బానిసత్వంలోని వారిని కొని వారికి స్వేచ్ఛనిచ్చేవారు. అట్లాంటిక్ బానిస వ్యాపారాన్ని ఒక్కో రాష్ట్రమూ చట్టవిరుద్ధమని ప్రకటించడం అమెరికన్ విప్లవ సమయంలోనే ప్రారంభమైంది. బానిసల దిగుమతి వ్యాపారాన్ని 1808లో కాంగ్రెస్ నిషేధించింది, అయితే అప్పటి నుంచి దొంగ రవాణా సాధారణం కావచ్చింది.[3][4]

కాటన్ జిన్ అని పిలిచే పత్తి వలిచే యంత్రం కనుగొన్నాకా అమెరికన్ దక్షిణాది రాష్ట్రాల్లో, అందులోనూ డీప్ సౌత్ గా పిలిచే దక్షిణ కొసనున్న రాష్ట్రాల్లో, కాటన్ పరిశ్రమ అత్యంత వేగంగా విస్తరించడంతో బానిసత్వంలోని ప్రజల శ్రమ మరింతగా అవసరం అయింది. దక్షిణాది రాష్ట్రాలు బానిసత్వపు సమాజాలుగా కొనసాగాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు బానిసత్వం అన్న అంశంపై మరింతగా చీలిపోయింది, ఈ చీలిక వల్ల కొన్నిటిని బానిస రాష్ట్రాలు, కొన్నిటిని స్వేచ్ఛా రాష్ట్రాలుగా పిలవసాగారు. దక్షిణాదిలోకెల్లా దక్షిణ రాష్ట్రాల్లో కొత్త ప్రత్తి పొలాలలో శ్రామికుల గిరాకీ పెరగడంతో పై దక్షిణాది రాష్ట్రాల్లోని (అప్పర్ సదరన్ స్టేట్స్) బానిసలుగా ఉన్నవారిలో పదిలక్షల పైబడి అత్యంత దక్షిణాది రాష్ట్రాలకు అమ్మి, ఆ రాష్ట్రాలకు బలవంతంగా తరలించారు. క్రమేణా దక్షిణాదిలో బానిసత్వంలో జీవిస్తున్నవారి జనాభా నలభై లక్షలకు చేరుకుంది.[5][6] అమెరికా సంయుక్త రాష్ట్రాలు విస్తరిస్తూ ఉండడంతో దక్షిణాది రాష్ట్రాలు కొత్తగా దేశంలో కలుపుతున్న పశ్చిమ భూభాగాల్లో బానిసత్వాన్ని ఆమోదింపజేసి, బానిసత్వ అనుకూల శక్తుల బలాన్ని పెంచి, తద్వారా దేశంలో తమ శక్తిని కొనసాగించాలని ప్రయత్నించాయి. లూసియానా కొనుగోలు, మెక్సికన్ అప్పగింతల ద్వారా కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాలు గొప్ప రాజకీయ సంక్షోభాలు, రాజీలకు గురయ్యాయి. 1850 నాటికి కొత్తగా సంపద పోగుచేస్తూ ప్రత్తిని పండిస్తున్న దక్షిణాది యూనియన్ నుంచి విడవడి వేరే దేశంగా ఏర్పడతామని బెదిరించసాగాయి. ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కొందరు బానిసత్వం అన్నది మొత్తంగా చూస్తే మంచిది ("పాజిటివ్ గుడ్") అంటూ కొన్ని సిద్ధాంతాలతో సమర్థించసాగారు. ప్రొటెస్టెంట్ మత శాఖల్లో కూడా బానిసత్వం విషయంగా ఉత్తరాది, దక్షిణాది ప్రాంతీయ శాఖల్లో విభజన వచ్చింది.

అబ్రహం లింకన్ బానిసత్వ విస్తరణ నిలుపుదల అన్న ప్రాతిపదికన పోటీచేసి 1860 అమెరికా ఎన్నికలు గెలవడంతో ఏడు రాష్ట్రాలు అమెరికా నుంచి విడిపోయి కాన్ఫెడరసీ ఏర్పాటుచేశాయి. ఇది జరిగిన కొన్నాళ్ళకి కాన్ఫడరేట్ బలగాలు, యునైటెడ్ స్టేట్స్ సైన్యానికి చెందిన ఫోర్ట్ సమ్టర్ పై దాడిచేశాయి, అమెరికా అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఫోర్ట్ సమ్టర్ దాడికి ప్రతీకార దాడి చేయడానికి అవసరమైన దళాలను పంపమని లింకన్ రాష్ట్రాలను కోరడంతో అప్పటిదాకా యూనియన్లో కొనసాగిన మరో నాలుగు బానిస రాష్ట్రాలు యూనియన్ నుంచి విడవడి కాన్ఫెడరసీలో చేరిపోయాయి. యుద్ధం కొనసాగుతూ ఉండగానే 1863లో కాన్ఫెడరేట్ ఆస్తులు వేటినైనా స్వాధీనం చేసుకునే హక్కు యూనియన్ కు ఇస్తూ (తద్వారా ఆస్తులుగా పరిగణనకు వచ్చిన బానిసలు జప్తు అవుతారు) కాన్ఫెస్కేషన్ చట్టాలు, దానికి తోడు బానిసత్వంలో ఉన్నవారందరికీ స్వేచ్ఛను ఇస్తూ జారీచేసిన ఎమాన్సిపేషన్ ప్రొక్లైమేషన్ అన్న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేయడంతో, యుద్ధం ముగియడంతోనే బానిసత్వ వ్యవస్థ ముగిసిపోయింది. అంతర్యుద్ధంలో యూనియన్ గెలవడంతో రాజ్యాంగానికి చేసిన పదమూడవ సవరణను ధ్రువపరచడం ద్వారా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 1865 డిసెంబరులో బానిసత్వాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించారు.

మూలాలు