ఆస్కార్ షిండ్లర్

ఆస్కార్ షిండ్లర్ జర్మనీ లోని మొరేవియాకు చెందిన పారిశ్రామిక వేత్త. హిట్లర్ పాలనలో నాజీలు యూదులను విచక్షణా రహితంగా పొట్టబెట్టుకుంటున్న సమయంలో సుమారు 1200 మంది యూదులను తన కర్మాగారాలలో అవసరమైన దానికన్నా ఎక్కువగా పని అవసరం ఉందంటూ నియమించుకోవడం ద్వారా వాళ్ళ ప్రాణాల్ని కాపాడాడు.[1][2] ఈ కర్మాగారాలు ఇప్పుడు పోలండ్, చెక్ రిపబ్లిక్ గా పిలవబడుతున్న ప్రాంతాల్లో ఉన్నాయి.[3]ఆయన జీవితం ఆధారంగా షిండ్లర్స్ ఆర్స్, అనే నవల, షిండ్లర్స్ లిస్ట్ అనే సినిమా వచ్చాయి.[4]

ఆస్కార్ షిండ్లర్
జననంఏప్రిల్ 28, 1908
స్వితేవీ, మొరేవియా (ప్రస్తుతం చెక్ రిపబ్లిక్)
మరణం1974 అక్టోబరు 9(1974-10-09) (వయసు 66)
హిల్డెషీమ్, పశ్చిమ జర్మనీ
వృత్తిపారిశ్రామిక వేత్త
రాజకీయ పార్టీనేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ (NSDAP)
జీవిత భాగస్వామిఎమిలీ షిండ్లర్
తల్లిదండ్రులుహ్యాన్స్ షిండ్లర్
ఫ్రాంజికా ల్యూజర్

జీవితం

విలాస వంతమైన జీవితం గడుపుతున్న షిండ్లర్ సహజంగానే హిట్లర్ నెలకొల్పిన నాజీ పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పార్టీ సభ్యుడిగా పోలండ్ లో ఒక ఎనామిల్ ఫ్యాక్టరీ బాధ్యతలు చేపట్టిన షిండ్లర్ అతి తక్కువ వేతనాలకు పని చేసే యూదుల్ని పనివారిగా చేర్చుకున్నాడు. ఆ సమయంలో యూదులు పడుతున్న కష్టాలను చూసి అతని మనసు చలించింది. తన పరిధిలో వీలైనంత మందిని కాపాడటం కోసం స్టెర్న్ అనే యూదుజాతీయుణ్ణి సహాయకుడిగా నియమించుకున్నాడు. తనకు అవసరమైన దానికన్నా ఎక్కువగా పనివారి అవసరం ఉందంటూ దాదాపు 1200 మంది యూదుల్ని చేర్చుకున్నాడు. అలా అతనివద్ద చేరిన వారందరినీ కలిపి షిండ్లర్ జూడెన్ అంటారు. వారందరి పేర్లూ ఉన్న జాబితానే షిండ్లర్స్ లిస్ట్. నాజీ అధికారులందరి దగ్గరా తమ వద్ద పనిచేసే వారి జాబితా ఉండేది. కానీ షిండ్లర్ లిస్ట్ ప్రత్యేకత ఏమిటంటే యూదు జీవితానికి పూర్తి భరోసా ఉన్నట్టే.

నాజీల ఆకృత్యాలు

నాజీలు యూదులకు రోజుకు గుక్కెడు నీళ్ళు, రెండు బ్రెడ్ ముక్కలు మాత్రనే ఆహారంగా ఇచ్చేవారు. తిండి సరిపోక చనిపోవాలి. లేదా రోగంతో పోవాలి. నీరసంతో పని చేయలేక చావాలి. మొత్తానికి యూదులు చచ్చిపోవాలి. జర్మనీలో ఒక్క యూదు జాతీయుడు కూడా మిగలకూడదు. ఇదే నాజీల లక్ష్యం.

అలాంటి సమయంలో యూదుల కోసం షిండ్లర్ నానా కష్టాలు పడ్డాడు. వారికి సరైన ఆహారం, వైద్యం అందే ఏర్పాటు చేశాడు. గెస్టపో అధికారులు సోదాకు వస్తే వారికి లంచాలు ఇచ్చి పంపేసేవాడు. ఇందుకోసం సుమారు 40 లక్షల మార్క్స్ (జర్మన్ కరెన్సీ) ఆ రోజుల్లోనే ఖర్చు పెట్టాడు. ఇల్లూ, పొలాలు ఆఖరుకు భార్య నగలతో సహా అన్ని అమ్మేశాడు. తన దగ్గర పనిచేసే 1200 మంది యూదుల్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఆ క్యాంపులో యూదులకు తండ్రి లాంటి వాడైతే అతని భార్య ఎమిలీ వారికి తల్లిలా సేవలు చేసేది. జబ్బు పడిన వారికి వైద్యం చేసేది.

తన వద్ద ఉన్న యూదుల్ని ఇలా దాదాపు నాలుగేళ్ళపాటు కాపాడుకున్నాడు షిండ్లర్. ఈ క్రమంలో రెండు సార్లు జైలుపాలు కూడా అయ్యాడు. నాజీల పాలన అంతమయ్యేనాటికి అతని ఆస్తులు దాదాపు కరిగిపోయాయి. అలాంటి స్థితిలోనూ తను కాపాడిన యూదులందరికీ వీడ్కోలు పలికేందుకు బహుమతిగా దుస్తులు, మద్యం పంచిపెట్టాడు. ఎన్ని మంచి పనులు చేసినా తానొక నాజీ అధికారి కాబట్టి శత్రుదేశాల సైన్యాధికారులకు భయపడి భార్యతో సహా అర్జెంటీనాకు వెళ్ళిపోయాడు. అక్కడొక చిన్న అపార్ట్‌మెంట్ లో అతని జీవితం మళ్ళీ మొదలైంది.

నివాళి

కొన్నేళ్ళ తర్వాత జర్మనీ వచ్చి చిన్నా చితకా వ్యాపారాలెన్నో చేశాడు.. కానీ ఏదీ కలిసి రాలేదు. ఒకప్పుడు లక్షాధికారిగా విలాసజీవితం గడిపిన షిండ్లర్ చివరి రోజుల్లో దారిద్య్రంలో బతుకు వెళ్ళదీశాడు. అతని దగ్గర ప్రాణాలు నిలుపుకున్న యూదులంతా అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ఇజ్రాయెల్ ఉన్నవారు ఏటా అతడి పుట్టిన రోజు నాటికి తమ దేశానికి పిలిచి సత్కరించి పంపేవాళ్ళు. ఆయన చనిపోయాక జెరూసలెం పురవీధుల్లో ఘనంగా ఊరేగించి ఆ గడ్డపైనే సమాధి చేసి తమ కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం షిండ్లర్ ను రైటియస్ అమాంగ్ ది నేషన్స్ పురస్కారంతో గౌరవించింది.[5]


షిండ్లర్‌ చనిపోయాక ఆయన సూట్‌కేస్‌లో లభ్యమైన యూదుల జాబితా (షిండ్లర్స్‌ లిస్ట్‌) ను ఇజ్రాయెల్‌లోని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లో స్టెర్న్‌ సాయంతో దాదాపు పది జాబితాలను రూపొందించాడు షిండ్లర్‌. వాటిలో నాలుగు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికా, ఆస్ట్రేలియా మ్యూజియాలలో మూడు ప్రతులు ఉండగా ఒక్కటి మాత్రం స్టెర్న్‌ వద్ద ఉండిపోయింది. యాభైఐదేళ్లపాటు అది స్టెర్న్‌, అతని వారసుల దగ్గరే ఉంది. అనంతరం వారు ఆ లిస్ట్‌ను న్యూయార్క్‌కు చెందిన ఒక వ్యాపారికి అమ్మేశారు.

ఇప్పటికీ ఇజ్రాయెల్ లో పుట్టే పిల్లల్లో ఎక్కువమంది పేరు మగ పిల్లాడైతే షిండ్లర్, ఆడపిల్లయితే ఎమిలీ. ఇలా వారు ఆ దంపతుల పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఆధారాలు