ఇరాక్ ఆక్రమణ 2003

2003 ఇరాక్ ఆక్రమణ ఇరాక్ యుద్ధం లోని మొదటి దశ. దండయాత్ర దశ 2003 మార్చి 19 (వైమానిక), 2003 మార్చి 20 (నేలపై) న ప్రారంభమైంది. కేవలం ఒక నెలలోనే అది ముగిసింది. ప్రధాన యుద్ధ కార్యకలాపాలు 26 రోజుల పాటు జరిగాయి. దీనిలో యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, పోలాండ్ ఇరాక్ పై దాడి చేశాయి. యుద్ధం లోని ఈ ప్రారంభ దశ 2003 మే 1 న అధికారికంగా ముగిసింది, అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ " ప్రధాన పోరాట కార్యకలాపాల ముగింపు "ను ప్రకటించాడు. ఆ తరువాత తాత్కాలిక సంకీర్ణ అథారిటీ (సిపిఎ) ను ఏర్పాటు చేసారు. 2005 జనవరిలో జరిగిన మొదటి ఇరాకీ పార్లమెంటరీ ఎన్నికల లోపు ఏర్పడిన అనేక వరుస పరివర్తన ప్రభుత్వాలలో ఇది మొదటిది. యుఎస్ సైనిక దళాలు తరువాత 2011 లో ఉపసంహరించుకునే వరకు ఇరాక్‌లో కొనసాగాయి. [1]

యుద్ధ జరుగుతున్న దృశ్యాలు

ప్రారంభ దండయాత్ర దశలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణం 1,77,194 మంది సైనికులను ఇరాక్‌లోకి పంపింది. ఇది మార్చి 19 నుండి 2003 మే 1 వరకు కొనసాగింది. ఒక్క యుఎస్ నుండే సుమారు 1,30,000 మంది వచ్చారు. సుమారు 45,000 మంది బ్రిటిష్ సైనికులు, 2,000 మంది ఆస్ట్రేలియా సైనికులు, 194 పోలిష్ సైనికులు కూడా ఈ దళంలో ఉన్నారు. దీని తరువాత 36 ఇతర దేశాలు కూడా పాల్గొన్నాయి. ఆక్రమణకు సన్నాహకంగా, ఫిబ్రవరి 18 నాటికి 1,00,000 యుఎస్ దళాలు కువైట్‌లో సమీకృతమయ్యాయి. [2] సంకీర్ణ దళాలకు ఇరాకీ కుర్దిస్తాన్‌లోని పెష్‌మెర్గా మద్దతు లభించింది.

అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్, యుకె ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ ప్రకారం, ఈ కూటమి "ఇరాక్ చేతి నుండి సామూహిక విధ్వంస ఆయుధాలను ఏరివెయ్యడం, ఉగ్రవాదానికి సద్దాం హుస్సేన్ మద్దతును అంతం చేయడం, ఇరాక్ ప్రజలను విముక్తులను చెయ్యడం" లక్ష్యంగా పెట్టుకుంది. [3] మరికొందరు మాత్రం -సెప్టెంబరు 11 దాడుల ప్రభావం, యుఎస్ వ్యూహాత్మక లెక్కలను మార్చడంలో ఆ దాడులు పోషించిన పాత్ర, స్వాతంత్ర్య ఎజెండా యొక్క పెరుగుదల వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కారణాలను భావిస్తారు. [4] [5] బ్లెయిర్ ప్రకారం, అణు, రసాయన, జీవ ఆయుధాలను తొలగించడానికి అందించిన అవకాశాలను ఇరాక్ అంది పుచ్చుకోలేక పోవడమే అసలు కారణమని చెప్పాడు

2003 జనవరి CBS పోల్‌లో, 64% మంది అమెరికన్లు ఇరాక్‌పై సైనిక చర్యను ఆమోదించారు; అయితే, 63% మంది యుద్ధానికి వెళ్ళకుండా దౌత్యపరమైన పరిష్కారం కనుగొనాలని కోరుకున్నారు. యుద్ధం కారణంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉగ్రవాద ముప్పు పెరుగుతుందని 62% మంది భావించారు. [6] ఇరాక్‌పై దాడిని ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, న్యూజిలాండ్ ప్రభుత్వాలతో సహా కొన్ని దీర్ఘకాల అమెరికా మిత్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. [7] [8] [9] ఇరాక్‌లో సామూహిక విధ్వంసకర ఆయుధాలు ఉన్నాయనేందుకు ఆధారాలు లేవని, UNMOVIC యొక్క 2003 ఫిబ్రవరి 12 నివేదిక నేపథ్యంలో ఆ దేశంపై దాడి చేయడం సమర్థించుకోలేమని ఆ దేశాల నాయకులు వాదించారు. ఇరాక్ యుద్ధంలో సుమారు 5,000 రసాయన వార్‌హెడ్‌లు, గుండ్లు లేదా విమాన బాంబులను కనుగొన్నారు. అయితే ఇవి 1991 గల్ఫ్ యుద్ధానికి ముందే సద్దాం హుస్సేన్ పాలనలో నిర్మించినవి, తదనంతర కాలంలో వీటిని విసర్జించారు కూడా. ఈ ఆయుధాలు ఇరాక్‌పై చేయ తలపెట్టిన దండయాత్రకు మద్దతు ఇవ్వలేదు. [10]

2003 ఫిబ్రవరి 15 న, ఆక్రమణకు ఒక నెల ముందు, ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రోమ్‌లో ముప్పై లక్షల మంది ర్యాలీ జరిగింది. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద యుద్ధ వ్యతిరేక ర్యాలీగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరింది. [11] ఫ్రెంచ్ విద్యావేత్త డొమినిక్ రేనిక్ ప్రకారం, 2003 జనవరి 3 - ఏప్రిల్ 12 మధ్య, ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్ల మంది ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకంగా దాదాపు 3,000 నిరసనలలో పాల్గొన్నారు. [12] 

ఈ దండయాత్రకు ముందు మార్చి 20, 2003 న బాగ్దాద్‌లోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌పై వైమానిక దాడి జరిగింది. మరుసటి రోజు, సంకీర్ణ దళాలు ఇరాకీ-కువైట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న మాస్రా పాయింట్ నుండి బాస్రా ప్రావిన్స్‌లోకి చొరబడ్డాయి. బస్రాను, దాని చుట్టుపక్కల పెట్రోలియం క్షేత్రాలనూ కైవసం చేసుకోడానికి ప్రత్యేక దళాలు పెర్షియన్ గల్ఫ్ నుండి ఉభయచర దాడిని ప్రారంభించగా, ప్రధాన దండయాత్ర సైన్యం దక్షిణ ఇరాక్‌లోకి వెళ్లి, ఈ ప్రాంతాన్ని ఆక్రమించి, మార్చి 23 న నాసిరియా యుద్ధంలో పాల్గొంది. సంకీర్ణ దళాలు దేశవ్యాప్తంగాను, ఇరాకీ కమాండ్ అండ్ కంట్రోల్‌ పైనా భారీ వైమానిక దాడులు చేసాయి. ఈ దాడులు డిఫెండింగ్ సైన్యాన్ని గందరగోళంలోకి నెట్టాయి. అది ఈ దాడులను సమర్థవంతంగా ప్రతిఘటించలేక పోయింది. 26 మార్చి న, 173 వ ఎయిర్‌బోర్న్ బ్రిగేడ్‌ను ఉత్తరాది నగరం కిర్కుక్ సమీపంలో ఆకాశం నుండి దింపారు. అక్కడ వారితో కుర్దు తిరుగుబాటుదారులు కలిసారు. వీరంతా కలిసి ఇరాకీ సైన్యంతో అనేక పోరాటాలు చేసి దేశ ఉత్తర భాగంపై నియంత్రణ సాధించారు.

సంకీర్ణ శక్తుల ప్రధాన దళాలు ఇరాక్ నడిబొడ్డున తమ డ్రైవ్‌ను కొనసాగించింది. అవి పెద్దగా ప్రతిఘటనను ఎదుర్కోలేదు. ఇరాకీ మిలిటరీ చాలావరకూ త్వరగానే ఓడిపోయింది. ఏప్రిల్ 9 న సంకీర్ణం బాగ్దాద్‌ను ఆక్రమించింది. ఏప్రిల్ 10 న కిర్కుక్‌ను స్వాధీనం చేసుకోవడం, ఏప్రిల్ 15 న తిక్రిత్‌పై దాడి, స్వాధీనం వంటి ఇతర కార్యకలాపాలు జరిగాయి. సంకీర్ణ దళాలు దేశ ఆక్రమణను పూర్తి చేయడంతో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, కేంద్ర నాయకత్వం అజ్ఞాతంలోకి వెళ్ళారు. మే 1 న అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు. బుష్ ప్రధాన యుద్ధ కార్యకలాపాలకు ముగింపు ప్రకటించాడు. దీంతో దండయాత్ర ముగిసింది సైనిక ఆక్రమణ కాలం ప్రారంభమైంది.

మూలాలు