ఉపవాసం

ఆహారం తీసుకోకుండా చేపట్టే దీక్ష

ఉప అంటే దగ్గరగా అనీ, వాసం అంటే నివసించడం అనీ, ఉపవాసం అనగా దగ్గరగా నివసించడం అని అర్థం. అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం అని అర్థం. కొన్ని ప్రత్యేక పండుగల సమయాలలో ఈ ఉపవాస దీక్షను చేపడతారు. ఉపవాసం ఉండాలనుకున్న రోజు భగవంతుని యందు మనస్సు లగ్నం చేయడానికి ఆహార, పానీయాలను తీసుకోకుండా లేదా కొద్ది మొత్తంలో తీసుకుని పస్తులు ఉంటారు. ఈ దీక్ష ఒక పూట లేక ఒకరోజు లేక కొన్ని రోజుల పాటు చేపట్టవచ్చు.

దీర్ఘ ఉపవాస దీక్ష చేపట్టిన బుద్ధుడి విగ్రహం

ప్రయోజనాలు

ఉపవాసం చేయడం వల్ల ఏకాగ్రతతో మనస్సును భగవంతుని పట్ల నిలిపి, దైవ చింతన చేయవచ్చు. దీని వల్ల కేవలం దైవ పరంగా మాత్రమే లాభాలు కలుగుతాయి అనుకుంటే పొరపాటు. ఉపవాసం చేయడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా జీర్ణించుకునే స్థాయి పెరుగుతుంది. అలానే హానికరమైన కెమికల్స్ అన్నీ కూడా ఒంట్లో నుంచి తొలగిపోతాయి.[1][2]

ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాల్లో ఆరోగ్య కరమైన మార్పులు కలుగుతాయి. జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అవుతుంది. మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములు, బాక్టీరీయా నాశనం అవుతాయి. మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు విసర్జించబడతాయి. ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడుతుంది. శ్వాసక్రియ చక్కగా జరుగుతుంది. గుండెచుట్టు,లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి హృదయ స్పందన మెరుగుపడుతుంది. ఈ ఉపవాసం చేయుట వలన కాలేయానికి విశ్రాంతి దొరుకుటుంది. దానిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అవుతుంది. శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉంటుంది. ఉపవాసం చేయుట తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ జరుగును. చర్మం కాంతివంతం అవుతుంది. చర్మవ్యాధులు హరింపబడతాయి.[3][4][5]

జాగ్రత్తలు

భక్తితో కావచ్చు.. బరువు తగ్గేందుకు కావచ్చు.. కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా లంఖణం చేయటం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మ రసం, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా.. మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ; సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ; పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.[6][7]

హిందూధర్మంలో ఉపవాసదీక్ష

హిందూధర్మంలో ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యత ఉంది. శివరాత్రి, నాగులచవితి, తొలి ఏకాదశి, కార్తీక సోమవారం వంటి ప్రత్యేక పర్వదినాల్లో హిందువులు ఉపవాస దీక్షలు చేపడుతుంటారు.[8] పెద్దలు పెట్టిన ఉపవాస నియమాల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఉపవాసం తో శరీరంలోని మాలిన్యాలను బహిష్కరింపబడి వ్యాధి నిర్మూలనం జరుగుతుంది. పొట్ట, కన్ను, వ్రణములు, జ్వరములు, జలుబు మొదలగు వ్యాదులను కనీసం 5 రోజులపాటు ఉపవాసం చేసి వ్యాధి తగ్గించుకోవచ్చు. ఏ వ్యాధిలోనైనా ఉపవాసం చేయుట వలన వ్యాధి తొందరగా తగ్గించుకోవచ్చు. లేనిచో ఒకపూట ఉపవాసం ఉండి తరువాత ఆ వ్యాధికి సంబంధించిన పథ్యకరమైన ఆహారం తీసుకోవచ్చు.[9]

ఇస్లాంలో ఉపవాసవ్రతం

సౌమ్ అనగా ఉపవాసం. ఇస్లాం ఐదు మూలస్తంభాలలో మూడవది. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అంటారు. అరబ్బీ భాషలో సౌమ్ అని పిలుస్తారు.

ఇవి కూడా చూడండి

మూలాలు