గాన్ విత్ ద విండ్ (సినిమా)

గాన్ విత్ ది విండ్ 1939లో విడుదలైన అమెరికన్ ఐతిహాసిక చారిత్రక రొమాంటిక్ సినిమా. 1936లో మార్గరెట్ మిచెల్ రచించిన నవల ఆధారంగా తీయబడిన ఈ సినిమా సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్ బ్యానర్‌పై డేవిడ్ ఓ. సెల్జెనిక్ నిర్మించాడు. విక్టర్ ఫ్లెమింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. అమెరికన్ సివిల్ వార్, పునర్నిర్మాణ యుగం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా స్కార్లెట్ ఓ'హారా, యాష్లీ విల్కెస్‌ల ప్రణయ శృంగార కథను వివరిస్తుంది.

గాన్ విత్ ద విండ్
సినిమా రిలీజ్ పోస్టర్
దర్శకత్వంవిక్టర్ ఫ్లెమింగ్
స్క్రీన్ ప్లేసిడ్నీ హోవర్డ్
దీనిపై ఆధారితంగాన్ విత్ ద విండ్ (నవల) 
by మార్గరెట్ మిచెల్
నిర్మాతడేవిడ్ ఓ సెల్జెనిక్
తారాగణం
  • క్లార్క్ గేబుల్
  • వివియన్ లీ
  • లెస్లీ హోవార్డ్
  • ఒలివియా డే హావిలాండ్
ఛాయాగ్రహణంఎర్నెస్ట్ హ్యాలర్
కూర్పు
  • హాల్ సి కెర్న్
  • జేమ్స్ ఇ న్యూకామ్‌
సంగీతంమాక్స్ స్టైనర్
నిర్మాణ
సంస్థలు
  • సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్
  • మెట్రో-గోల్డ్విన్-మేయర్
పంపిణీదార్లులూయీస్ ఇన్‌క్.[1][nb 1]
విడుదల తేదీ
1939 డిసెంబరు 15 (1939-12-15)(అట్లాంటా)
సినిమా నిడివి
  • 221 నిమిషాలు
దేశంఅమెరికా
భాషఇంగ్లీషు
బడ్జెట్$3.85 మిలియన్లు
బాక్సాఫీసు>$390 మిలియన్లు

కథ

రెట్ బట్లర్‌తో స్కార్లెట్ ఛారిటీ డాన్స్

జార్జియా రాష్ట్రంలో పుట్టి పెరిగిన స్కార్లెట్ ఓ హారా తన జీవితాన్ని ఎలా నడుపుకుంటూ వచ్చింది అనేది ఈ చిత్ర కథ. ఆమె యాష్ లీ అనే అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను మెలనీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. చాలా కోపంతో స్కార్లెట్ మెలనీ తమ్ముడైన చార్లెస్‌ను పెళ్ళి చేసుకుంటుంది. కానీ చార్లెస్ ఆ తరువాత కొద్ది కాలానికే చనిపోతాడు. ఆమె ఆ విషాదంలో ఉన్న సమయంలోనే రెట్ బట్లర్‌తో డ్యాన్స్ చేస్తుంది. అప్పటికే అట్లాంటా నగరం అమెరికా అంతర్యుద్ధంలో మునిగి ఉంటుంది. కాలిపోతున్న ఇళ్ళల్లోంచి బట్లర్, స్కార్లెట్‌ను ఆమె బంధువులను రక్షిస్తాడు. ఇదే సమయంలో స్కార్లెట్ ఆస్తులను ఆమె పునరుద్ధరించి, చివరికి బట్లర్‌ను వివాహమాడుతుంది. అయినా ఆమెకు యాష్ అంటే ఇష్టం తగ్గదు. అది గుర్తించి బట్లర్ ఆమెను వదిలి వెళ్ళిపోతానంటాడు. ఆమె అతనిని బతిమాలుతుండగా కథ ముగుస్తుంది.[3]

నటీనటులు

తారా ప్లాంటేషన్‌లో
  • థామస్ మిట్చెల్ - గెరాల్డ్ హోరా పాత్రలో
  • బార్బరా ఓ నీల్ - ఎలెన్ ఓ హోరా
  • వివియన్ లీ - స్కార్లెట్ ఓ హోరా
  • ఈవ్‌లిన్ కీస్ - సుల్లెన్ ఓ హోరా
  • ఆన్ రూథర్‌ఫర్డ్ - కరీన్ ఓ హోరా)
  • జార్జ్ రీవ్స్ - బ్రెంట్ టర్లెటన్ (నిజానికి స్టూవర్ట్‌గా)[nb 2]
  • ఫ్రెడ్ క్రేన్ - స్టూవర్ట్ టర్లెటన్ (నిజానికి బ్రెంట్‌గా)[nb 2]
  • హాట్టీ మెక్‌డేనియల్- మమ్మీ (పనిమనిషి)[nb 3]
  • ఆస్కార్ పోల్క్ - పోర్క్ (పనిమనిషి)[nb 3]
  • బటర్‌ఫ్లై మెక్వీన్- ప్రిస్సీ (పనిమనిషి)[nb 3]
  • విక్టర్ జోరీ - జోనాస్ విల్కర్‌సన్ (సూపర్‌వైజర్)
  • ఎవరెట్ బ్రౌన్ - బిగ్ సామ్‌ (ఫోర్‌మాన్)
ట్వెల్వ్ ఓక్స్‌లో
  • హోవర్డ్ హిక్‌మాన్ - జాన్ విల్కెస్
  • అలీషియా రెట్ - ఇందియా విల్కెస్
  • లెస్లీ హోవర్డ్ - యాష్ లీ విల్కెస్
  • ఒలివియా డే హావిలాండ్ - మెలనీ హామిల్టన్
  • రాండ్ బ్రూక్స్ - ఛార్లెస్ హామిల్టన్
  • కరోల్ నై - ఫ్రాంక్ కెన్నడీ
  • క్లార్క్ గేబుల్ - రెట్ బట్లర్‌
అట్లాంటాలో
  • లారా హోప్ క్రూస్ - పిట్టీపాట్ హామిల్టన్
  • ఎడ్డీ ఆండర్సన్ - అంకుల్ పీటర్
  • హ్యారీ డావెన్‌పోర్ట్ - డాక్టర్ మీడ్
  • లీనా రాబర్ట్స్ - మిసెస్ మీడ్
  • జేన్ డార్వెల్ - మిసెస్ మెర్రివెదర్
  • ఓన మన్సన్ - బెల్లె వాట్లింగ్
సహాయపాత్రలలో
  • పాల్ హర్స్ట్
  • కామీ కింగ్
  • జె.ఎం.కెర్రిగన్
  • జాకీ మోరన్
  • లిలియన్ కెంబుల్ కూపర్
  • మర్సెల్లా మార్టిన్
  • మికీ కున్
  • ఇర్వింగ్ బేకన్
  • విలియం బేక్‌వెల్
  • ఇసాబెల్ జువెల్
  • ఎరిక్ లిండెన్
  • వార్డ్ బాండ్
  • క్లిఫ్ ఎడ్వర్డ్స్
  • యకీమ కానట్
  • లూయిస్ జీన్ హెయ్ద్‌ట్
  • ఓలిన్ హౌలాండ్
  • రాబర్ట్ ఇలియట్
  • మేరీ ఆండర్సన్

నిర్మాణం

ఈ చిత్రానికి మార్గరెట్ మిచెల్ రచించిన నవల ఆధారం. ఈ 1,037 పేజీల ఈ నవల వెలువడక మునుపే ఈ నవలను చిత్రీకరించే హక్కులను డేవిడ్ ఓ సెల్జనిక్ కొనుగోలు చేశాడు. ఆయన కంపెనీలో స్టోరీ ఎడిటర్‌గా పనిచేస్తున్న కే బ్రౌన్ ఆ నవలను ముందు చదివి, దానిపై హక్కులు తీసుకోవలసిందిగా సెల్జనిక్‌కు సలహా ఇచ్చింది. సెల్జనిక్ ఆ నవల చదివి, నవల చాలా పెద్దదిగా ఉందని భావించి, కొంతకాలం సందేహించాడు. చివరికి కేవలం 50 వేల డాలర్ల ఖరీదుకు ఆ నవల చిత్రీకరణ హక్కులు పొందాడు. ఈ మొత్తం ఆ చిత్రం సంపాదించిన మొత్తంలో 0.0005 శాతం మాత్రమే.[3][4][5][6]

నటీనటుల ఎంపిక

రెట్ పాత్రలో క్లార్క్ గేబుల్, స్కార్లెట్‌గా వివియన్ లీ

పాఠకుల సూచనలమేరకు రైట్ బట్లర్ పాత్రకు క్లార్క్ గేబుల్‌ను ఎంచుకున్నా, హీరోయిన్ పాత్ర స్కార్లెట్ ఓ హారా పాత్ర కోసం ఆయన సుమారు 1400 మంది అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసి, తొంభైమందికి స్క్రీన్ టెస్ట్ చేసి, చివరకు వివియన్ లీను ఎంచుకున్నాడు. అయితే ఎందరో అమెరికన్ అమ్మాయిలను పరీక్షించి, చివరకు భారతదేశంలోని డార్జిలింగ్ పుట్టిన ఒక బ్రిటిష్ అమ్మాయిని ఎంచుకోవటం పట్ల అమెరికాలో నిరసన వ్యక్తం అయింది. కానీ క్రమంగా ఆమె అమెరికన్ల హృదయం కూడా గెలుచుకుంది.[3] స్కార్లెట్ పాత్ర ఎంపిక కోసం $100,000 ఖర్చయ్యింది కానీ వెలలేని పబ్లిసిటీ లభించింది.[4]

స్క్రీన్ ప్లే

ఈ సినిమా స్క్రీన్‌ప్లే వ్రాయడానికి మొత్తం 15 మంది రచయితలు పాల్గొన్నారు.[3] మొదట సిడ్నీ హోవార్డ్ 1037 పేజీల నవలను సినిమాకు అనుగుణంగా తయారు చేసిన స్క్రీన్ ప్లే చాలా పెద్దగా అంటే కనీసం ఆరుగంటల నిడివి కలిగిన సినిమా తయారయ్యే విధంగా ఉంది. దానిని సవరించడానికి నిర్మాత అతడిని తమతోనే ఉండమని కోరాడు. కానీ హోవార్డ్ లండన్ వదిలి రావడానికి నిరాకరించాడు. దానితో సవరణలను చేయడానికి స్థానిక రచయితలను నియమించాడు.[7] దర్శకుడు ఈ స్క్రీన్ ప్లే సవరణల పట్ల అసంతృప్తిగా ఉండటంతో మొత్తం స్క్రీన్ ప్లేను ఐదురోజులలో తిరిగి వ్రాయమని బెన్ హెచ్‌ను నియమ్ంచాడు. అతడు మొదటి సగం పనిని మాత్రం పూర్తి చేయగలిగాడు. దానితో నిర్మాత అయిన సెల్జినిక్ మిగిలిన సగం స్క్రీన్ ప్లే వ్రాయడానికి పూనుకున్నాడు.[8]

1940లో డేవిడ్ ఓ సెల్జ్‌నిక్

చిత్రీకరణ

అట్లాంటా అగ్నిప్రమాదం 1961లో పునర్మించబడిన సినిమా ట్రైలర్

చిత్రీకరణ 1939 జనవరి 26న ప్రారంభమై జూలై 1న ముగిసింది, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ 1939 నవంబరు 11 వరకు కొనసాగింది.[9]

సంగీతం

"తారా థీమ్" ట్రైలర్ నుండి

ఈ చిత్ర్రంలో సంగీతాన్ని కంపోజ్ చేయడానికి, సెల్జెనిక్ ఆర్.కె.ఓ. పిక్చర్స్‌లో పనిచేసిన మాక్స్ స్టెయినర్‌ను ఎంచుకున్నాడు. స్టెయినర్ ఈపనిపై పన్నెండు వారాలు పనిచేశాడు. రెండు గంటల ముప్పై-ఆరు నిమిషాల నిడివిలో ఇతడు కూర్చిన అతి పొడవైన సంగీతం ఇది. ఈ సినిమా కోసం హ్యూగో ఫ్రైడ్‌హోఫర్, మారిస్ డి ప్యాక్, బెర్న్‌హార్డ్ కౌన్, అడాల్ఫ్ డ్యూచ్, రెజినాల్డ్ బాసెట్ అనే ఐదుగురు ఆర్కెస్ట్రేటర్‌లను నియమించారు.

దీనిలో రెండు ప్రేమ థీమ్‌లు ఉన్నాయి, ఒకటి యాష్లే, మెలానీల మధురమైన ప్రేమ కాగా మరొకటి యాష్లే పట్ల స్కార్లెట్‌కు ఉన్న ఇష్టాన్ని రేకెత్తిస్తుంది. స్టెయినర్ జానపద, దేశభక్తి సంగీతాన్ని గణనీయంగా వాడుకున్నాడు. ఇందులో "లూసియానా బెల్లె", "డాలీ డే", "రింగో డి బాంజో", "బ్యూటిఫుల్ డ్రీమర్", "ఓల్డ్ ఫోక్స్ ఎట్ హోమ్", "కేటీ బెల్లె" వంటి స్టీఫెన్ ఫోస్టర్ ట్యూన్‌లు ఉన్నాయి. ప్రముఖంగా కనిపించే ఇతర ట్యూన్‌లు: హెన్రీ క్లే వర్క్‌చే "మార్చింగ్ త్రూ జార్జియా", "డిక్సీ", "గారియోవెన్", "ది బోనీ బ్లూ ఫ్లాగ్". సినిమాతో ఎక్కువగా కలిసిపోయిన ఇతివృత్తం తారా ఓ'హారా ప్లాంటేషన్‌తో కూడిన మెలోడీ. మొత్తంగా, స్కోర్‌లో తొంభై తొమ్మిది వేర్వేరు సంగీత భాగాలు ఉన్నాయి.

విడుదల

ప్రివ్యూ, ప్రీమియర్, తొలి విడుదలలు

1939 సెప్టెంబరు 9వ తేదీన నిర్మాత సెల్జెనిక్, అతని భార్య ఐరేన్, పెట్టుబడిదారుడు జాక్ విట్నీ, ఫిల్మ్ ఎడిటర్ హాల్ కెర్న్ కాలిఫోర్నియాలోని ఫాక్స్ థియేటర్‌కు చేరుకున్నారు. అప్పటికి ఇంకా సినిమా పూర్తిగా ఎడిటింగ్ చేయబడలేదు. అది నాలుగు గంటల ఇరవై ఐదు నిముషాలపాటు నడిచింది. తరువాత దానిని విడుదల కోసం చాలా కుదించారు. ఆరోజు ఆ థియేటర్‌లో ఒకే టికెట్టుపై రెండు సినిమాలు చూపిస్తున్నారు. మొదటి సినిమా హవాయియన్ నైట్స్ తరువాత ప్రదర్శించాల్సిన సినిమాకు బదులుగా ఇంకా పేరుపెట్టని రాబోయే ఒక సినిమా ప్రివ్యూను చూపిస్తున్నామని, ప్రేక్షకులు థియేటర్‌ను వదిలి వెళ్ళవచ్చని, కానీ ప్రివ్యూ మొదలయ్యాక మళ్ళీ లోపలికి అనుమతించబోమని ప్రకటించారు. సినిమా పేర్లు పడగానే ప్రేక్షకులు చప్పట్లు చరిచి సినిమా ముగిసిన తరువాత అందరూ లేచినిలబడి తమ ఆనందాన్ని ప్రకటించారు.[9][10]

ప్రీమియర్ షోను ప్రదర్శించిన లూయీస్ గ్రాండ్ థియేటర్, అట్లాంటా
1939 డిసెంబరు 15. హాలివుడ్ చరిత్రను మలుపు తిప్పిన రోజు. ఆ రోజే 'గాన్ విత్ ది విండ్' చిత్రం విడుదలయింది. జార్జియాలోని అట్లాంటా నగరంలో ఆ చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనకు చిత్రంలో నటించిన తారలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. పుష్పాలంకృతమైన 50 కార్లలో వీరు విచ్చేశారు. కేవలం 3 లక్షల జనాభా ఉండే అట్లాంటా నగరం ఆ రోజు 15 లక్షల మంది జనాభా కేంద్రమయింది. ఆ రోజు నగరమంతా 'గాన్ విత్ ది విండ్' గాలే![3] జార్జియా గవర్నరు ఆ రోజు ( 1939 డిసెంబరు 15)ను సెలవుగా ప్రకటించాడు.[11]{[12]

1939 డిసెంబరు నుండి 1940 జూలై వరకూ రోడ్ షోల ద్వారా అడ్వాన్స్ బుకింగులతో మామూలు టికెట్ ధరకన్నా రెట్టింపు ధరకు అమ్మి సినిమాను ప్రదర్శించారు. బాక్సాఫీస్ వసూళ్ళలో 70 శాతం వాటాను ఈ సినిమా పొందగలిగింది. కొంత కాలం తరువాత 1941లో ఈ సినిమా మామూలు టికెట్టు ధరకు సాధారణ ప్రేక్షకులకోసం విడుదలయ్యింది.[13] ప్రకటన ఖర్చులు, పంపిణీ ఖర్చులు అన్నీ కలుపుకుని ఈ సినిమా నిర్మాణానికి $7 మిలియన్లు వ్యయం అయ్యింది.[12][14]

తరువాతి విడుదలలు

1967లో పునఃవిడుదల పోస్టర్

1942లో, సెల్జెనిక్ పన్నుల కారణంగా తన కంపెనీని రద్దు చేశాడు. గాన్ విత్ ది విండ్‌లో తన వాటాను తన వ్యాపార భాగస్వామి జాన్ విట్నీకి $500,000కి విక్రయించాడు. విట్నీ దానిని ఎం.జి.ఎం.కి $2.8 మిలియన్లకు విక్రయించింది, తద్వారా ఎం.జి.ఎం.స్టూడియో పూర్తిగా సినిమాని తన సొంతం చేసుకుంది.[14] వెంటనె ఎం.జి.ఎం. ఈ సినిమాను 1942 వసంతకాలంలో [8], 1947లో, 1954లో [9] మళ్ళీ విడుదల చేశారు.1954లో విడుదలైన సినిమా వైడ్ స్క్రీన్ ఫార్మాట్‌లో (1.75:1 నిష్పత్తి) తయారు చేశారు. అలా చేయడానికి ఐదు షాట్లలో మార్పులు చేశారు.[15]

అమెరికాలో అంతర్యుద్ధం ప్రారంభమైన వందేళ్ళ సందర్భంగా 1961లో ఈ చిత్రాన్ని మళ్ళీ లూయీస్ గ్రాండ్ థియేటర్‌లో మళ్ళీ ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు సెల్జెనిక్, నటీనటులు వివియన్ లీ, ఒలివియా డే హావిలాండ్ తదితరులు హాజరయ్యారు.[16] 1967లో ఈ సినిమా 70ఎం.ఎం.ఫార్మాట్‌లో విడుదలయ్యింది.[9] తరువాత ఈ సినిమా 1971, 1974, 1989లలో పునర్విడుదలయ్యింది. 1989లో ఈ సినిమా నిర్మించి అర్ధశతాబ్ది గడిచిన సందర్భంగా విడుదల కావడం విశేషం.1998లో మరోసారి విడుదలయ్యింది.[17][18]

2013లో, 4కె రెసొల్యూషన్‌లో డిజిటట్ ఫార్మాట్లో పునరుద్ధరించి విడుదల చేశారు. యాధృచ్చికంగా అది వివియన్ లీ శతజయంతి కావడం కూడా ఒక విశేషం.[19] సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2014లో అమెరికా అంతటా రెండురోజులు ఈ సినిమాను అనేక థియేటర్లలో ప్రదర్శించారు.[20]

ఆదరణ

విమర్శకుల స్పందన

మెక్‌డేనియల్, డే హావిలాండ్, వివియన్ లీ ల నటనకు ప్రశంసలు లభించాయి.

సినిమా విడుదలైన తర్వాత వార్తాపత్రికలు అద్భుతమైన సమీక్షలను అందించాయి;[9] అయినప్పటికీ, దాని నిర్మాణ విలువలు, సాంకేతిక విజయాలు, ఆశయం యొక్క స్థాయి విశ్వవ్యాప్తంగా గుర్తించబడినప్పటికీ, ఆ సమయంలోని కొంతమంది సమీక్షకులు ఈ చిత్రం చాలా పొడవుగా ఉందని విమర్శించారు. నాటకీయంగా ఆమోదయోగ్యంగా లేదని కొందరు వ్యాఖ్యానించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక చలనచిత్ర నిర్మాణం అయినప్పటికీ, ఇది అంత గొప్ప చిత్రం కాకపోవచ్చునని కానీ "ఆసక్తికరమైన కథ అందంగా చెప్పబడింది" అని "ది న్యూయార్ టైమ్స్" పత్రికలో ఫ్రాంక్ ఎస్.న్యూజెంట్ అనే విమర్శకుడు తన అభిప్రాయాన్ని తెలిపాడు.[21] ది నేషన్‌కు చెందిన ఫ్రాంజ్ హోలెరింగ్ ఇదే అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశాడు: "ఫలితం అనేది పరిశ్రమ చరిత్రలో ఒక ప్రధాన సంఘటన, కానీ చలనచిత్ర కళలో ఇది ఒక చిన్న విజయం మాత్రమే"[22]

నవలను చిత్రీకరించడం పట్ల ఉన్న విశ్వసనీయతకు ఈ సినిమా ప్రశంసలు అందుకుంది.[21] వెరైటీ పత్రికకోసం జాన్ సి.ఫ్లిన్ అనే విమర్శకుడు సెల్జెనిక్ "చాలా ఎక్కువ వదిలేశాడని" రాశాడు. కథలోని చివరి భాగం నుండి పునరావృతమయ్యే సన్నివేశాలు, సంభాషణలను కుదించి ఉంటే సినిమా మరింత ప్రయోజనకారిగా ఉండివుండేదని భావించాడు.[23] కథలో కాలవ్యవధిని సమర్ధించే నాణ్యత లేకపోవడం ఒక తీవ్రమైన లోపంగా ది మాంచెస్టర్ గార్డియన్ పత్రిక పేర్కొంది.

అకాడమీ అవార్డులు

12వ అకాడమీపురస్కారాలలో, గాన్ విత్ ది విండ్ రికార్డు సృష్టించింది. మొత్తం పదమూడు నామినేషన్ల నుండి ఎనిమిది పోటీ విభాగాల్లో నామినేట్ చేయబడింది. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ కళా దర్శకత్వం, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాలలో అవార్డును గెలుచుకుంది. మరో రెండు విభాగాలలో గౌరవ పురస్కారాలను అందుకుంది..[24][25] దాదాపు 20 సంవత్సరాల తరువాత 1959లో మాత్రమే 'గాన్ విత్ ది విండ్' చిత్రం రికార్డును 11 ఆస్కార్ అవార్డులతో 'బెన్ హర్' చిత్రం అధిగమించింది.[3]

అకాడమీ అవార్డులు, ప్రతిపాదనలు
పురస్కారంగ్రహీత (లు)ఫలితం
అసాధారణ నిర్మాణంసెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్గెలుపు
ఉత్తమ దర్శకుడువిక్టర్ ఫ్లెమింగ్గెలుపు
ఉత్తమ నటుడుక్లార్క్ గేబుల్ప్రతిపాదన
ఉత్తమ నటివివియన్ లీగెలుపు
ఉత్తమ సహాయనటిఒలివియా డే హావిలాండ్ప్రతిపాదన
హాట్టీ మెక్‌డేనియల్గెలుపు
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లేసిడ్నీ హోవర్డ్గెలుపు
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌లైల్ వీలర్గెలుపు
ఉత్తమ సినిమాటోగ్రఫీ - కలర్ఎర్నెస్ట్ హ్యాలర్ & రే రెన్నహాన్గెలుపు
ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌హాల్ సి.కెర్న్ & జేమ్స్ ఇ.న్యూకామ్‌గెలుపు
ఉత్తమ సంగీతంమాక్స్ స్టెయినర్‌ప్రతిపాదన
ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌థామస్ టి.మౌల్టన్ప్రతిపాదన
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌జాక్ కాస్‌గ్రోవ్, ఫ్రెడ్ ఆల్బిన్, ఆర్థర్ జాన్స్ప్రతిపాదన
ప్రత్యేక అవార్డువిలియమ్‌ కామెరాన్ మెంజీస్
గాన్ విత్ ది విండ్ నిర్మాణంలో నాటకీయ వాతావరణాన్ని పెంపొందించడం కోసం రంగును ఉపయోగించడంలో అత్యుత్తమ సాధన కోసం.
గౌరవ
టెక్నికల్ అఛీవ్‌మెంట్ అవార్డుడాన్ ముస్గ్రేవ్ & సెల్జెనిక్ ఇంటర్నేషనల్ పిక్చర్స్
గాన్ విత్ ది విండ్ నిర్మాణంలో సమన్వయంతో కూడిన పరికరాలను ఉపయోగించడంలో ముందున్నందుకు.
గౌరవ

ఆఫ్రికన్-అమెరికన్ల స్పందన

మొట్టమొదటి ఆఫ్రికన్-ఆమెరికన్ ఆస్కార్ అవార్డ్ విజేత హాట్టీ మెక్‌డేనియల్

ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి బానిసత్వం సమస్యను తప్పుదోవపట్టించే ప్రయత్నంగా నల్లజాతీయుల వ్యాఖ్యాతలచే విమర్శించబడింది. అయితే, ప్రారంభంలో, శ్వేతజాతీయుల నియంత్రణలో ఉన్న వార్తాపత్రికలు ఈ విమర్శలను ప్రచురించలేదు.[26] కార్ల్టన్ మోస్ అనే నల్లజాతీయుడైన నాటకకర్త ఒక బహిరంగ లేఖలో, ఈ సినిమా అమెరికన్ చరిత్ర, నీగ్రో ప్రజలపై వెనుకనుండి చేసిన దాడిగా అభివర్ణించాడు. "మారలేని , మొండి-బుద్ధిగల పోర్క్", "ఉదాసీన, బాధ్యతారహిత ప్రిస్సీ", బిగ్ సామ్ "బానిసత్వాన్ని ప్రకాశవంతంగా అంగీకరించడం" మమ్మీ తన "నిరంతరం వేధించడం ప్రతిదానిపై చులకన చేయడం" వంటి స్టీరియోటైపు నల్లజాతీయ పాత్రల రూపకల్పనను తీవ్రంగా నిరసించాడు.[27] అదేవిధంగా,మెల్విన్ బి. టోల్సన్ అనే కవి, విద్యావేత్త ఇలా అంటాడు "గాన్ విత్ ది విండ్ చాలా సూక్ష్మమైన అబద్ధం, దానిని మిలియన్ల శ్వేతజాతీయులు, నల్లజాతీయులు కూడా ఒకే విధంగా సత్యంగా భావిస్తున్నారు."[28]హాట్టీ మెక్‌డేనియల్ ఆస్కార్ విజయం తర్వాత నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ సంస్థకు చెందిన వాల్టర్ ఫ్రాన్సిస్ వైట్ ఆమెను అంకుల్ టామ్ అని ఆరోపించాడు. మెక్‌డేనియల్ ప్రతిస్పందిస్తూ, "ఏడు డాలర్లు ఒకటిగా ఉండటం కంటే పనిమనిషిగా నటించడం ద్వారా వారానికి ఏడు వందల డాలర్లు సంపాదించడం ఉత్తమం" నల్లజాతీయుల తరపున మాట్లాడటానికి వైట్‌కు ఉన్న అర్హతను ఆమె ప్రశ్నించింది.[29]

ప్రేక్షకుల స్పందన

ఈ చిత్రాన్ని అమెరికాలో కనీసం మూడున్నర కోట్ల మంది ప్రేక్షకులు చూసి ఉంటారని అంచనా. అంతమంది ప్రేక్షకులు చూసిన సినిమా వేరొకటి అనేక దశాబ్దాలపాటు లేదన్నది వాస్తవం.[3] ఒక్క న్యూయార్క్‌లోనే క్యాపిటల్ థియేటర్‌లో, డిసెంబరు చివరిలో ఇది రోజుకు సగటున పదకొండు వేలమంది ఈ సినిమాను చూశారు.[13]విదేశాలలో కూడా ఇది విజయపరంపరను కొనసాగించింది. లండన్‌లోని బ్లిట్జ్ థియేటర్‌లో 1940 ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రదర్శన ప్రారంభమై నాలుగేండ్ల పాటు నిర్విరామంగా నడిచింది.[30]

పెన్సకోలా, ఫ్లోరిడాలో గాన్ విత్ ద విండ్ సినిమా చూడటానికి క్యూలో నిలుచున్న జనం (1947)

1947లో ఈ సినిమా తిరిగి విడుదలైనప్పుడు అమెరికా, కెనడా దేశాలలో ఈ సినిమా ఐదు మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఆ ఏడాది విడుదలైన సినిమాలలో మొదటి పది స్థానాలలో ఈ సినిమాకు చోటుదక్కింది.[14][31]

పరిశ్రమ గుర్తింపు

1977లో అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (AFI) సంస్థ నిర్వహించిన పోల్‌లో ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది.[9] AFI 1998లో "వంద అత్యంత గొప్ప చలనచిత్రాలు" జాబితాలో ఈ చిత్రానికి నాల్గవ స్థానం ఇచ్చింది,[32] 2007లో పదవ వార్షికోత్సవ సంచికలో ఇది ఆరవ స్థానానికి పడిపోయింది.[33] ఈ చలనచిత్ర దర్శకుడు విక్టర్ ఫ్లెమింగ్‌కు 2012లో నిర్వహించిన సైట్ & సౌండ్ దశవార్షిక పోల్‌లో 322వ ర్యాంక్ లభించింది.[34] 2016లో డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సభ్యుల పోల్‌లో తొమ్మిదవ ఉత్తమ "డైరెక్టోరియల్ అచీవ్‌మెంట్"గా ఈ సినిమా ఎంపికైంది.[35] 2014లో, ది హాలీవుడ్ రిపోర్టర్ చేపట్టిన విస్తృతమైన పోల్‌లో ఈ చిత్రం పదిహేనవ స్థానంలో నిలిచింది.[36]

1989లో యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో ఎంపిక చేసిన ఇరవై-ఐదు తొలితరం చిత్రాలలో గాన్ విత్ ది విండ్ ఒకటి.[37][38]

మూలాలు

వివరణాత్మక నోట్సు

అనులేఖనాలు

ఉపయుక్త గ్రంథాలు

బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.