నాడీ వ్యవస్థ

జంతు శాస్త్రంలో, జంతువుల్లో నాడీ వ్యవస్థ అత్యంత క్లిష్టమైన అంశం. అతి పెద్ద కణము విభజన చెందలేవు. మానవ శరీరములో నరాలకణాలు 10 బిలియనులు.

మానవుని నరాల వ్యవస్థ. ఎరుపు రంగు - కేంద్రీయ నరాలవ్యవస్థ , నీలం రంగు - పరిధీయ నాడీవ్యవస్థ.

నరాల వ్యవస్థ (Nervous system) నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైనది. ఇది జంతువులలో మాత్రమే కనిపిస్తుంది. సకశేరుకాలలో ఇది మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది.1. ప్రేరణకు ప్రతిచర్య, 2. సమన్వయం, 3. అభ్యాసన.

సౌలభ్యంకోసం నరాల వ్యవస్థను మూడు భాగాలుగా విభజించడం జరిగింది.

  • 1. కేంద్ర నరాల వ్యవస్థ (Central nervous system:CNS) - మెదడు, వెన్నుపాము.
  • 2. పరిధీయ నరాల వ్యవస్థ (Peripheral nervous system:PNS) - కపాల నరాలు, కశేరు నరాలు.
  • 3. స్వయంచోదిత నరాల వ్యవస్థ (Autonomous nervous system:ANS).

గ్రాహకాల నుండి కేంద్ర నరాల వ్యవస్థకు కలిపే నరాలను జ్ఞాన నరాలు లేదా అభివాహి నరాలనీ (Sensory or afferent nerves), కేంద్ర నరాల వ్యవస్థ నుండి కండరాలు వంటి అపసారి భాగాలకు కలిపే నరాలను చాలక నరాలు లేదా అపసారి నరాలనీ ( Motor or efferent nerves), చాలక, జ్ఞాన నరాల పోగులను కలిగిన వాటిని మిశ్రమ నరాలనీ అంటారు.[1]

సూక్ష్మ నిర్మాణం

Diagram of a typical myelinated vertebrate motoneuron.

నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది.

  • నాడీ కణాలు (Neurons) : నాడీ కణంలో మూడు భాగాలుంటాయి. నాడీ కణదేహం, డెండ్రైట్లు, ఏక్సాన్.
    • నాడీ కణదేహం (Cell body) లో పెద్ద కేంద్రకం ఉంటుంది. దీని జీవపదార్ధంలో ఆర్.ఎన్.ఎ., ప్రోటీన్లతో ఏర్పడిన నిస్సల్ కణికలు (Nissle substance) ఉంటాయి.
    • డెండ్రైట్లు (Dendrites) చెట్లలో కొమ్మల వలె నాడీ కణదేహం నుండి ఏర్పడిన నిర్మాణాలు. ఇవి ఇతర నాడీకణాల నుంచి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందిస్తాయి.
    • ఏక్సాన్ (Axon) ప్రతి కణదేహం నుండి బయలుదేరే ఒక పొడవైన అక్షీయ తంతువు. దీనిని ఆవరించి పలుచని ప్లాస్మాత్వచం మయెలిన్ తొడుగు (Myelin sheath) ఉంటుంది. ఈ ఏక్సాన్ చివరిభాగం నాడీ అంత్యంతో అంతమవుతుంది. నాడీఅంత్యం మరో నాడీకణ డెండ్రైట్ లేదా ఏక్సాన్ లేదా నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులతో సంబంధం కలిగివుంటుంది. నాడీకణ ఏక్సాన్లు నిర్వాహక అంగాలతో సంబంధం కలిగి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ (Synapse) అంటారు. మయెలిన్ తొడుగులో అక్కడక్కడ కనిపించే ఖాళీ ప్రదేశాలను రాన్వియర్ కణుపులు (Nodes of Ranvier) అంటారు. మయెలిన్ తొడుగున్న ఏక్సాన్లు వార్తలను వేగంగా తీసుకొని వెళతాయి.
  • గ్లియల్ కణాలు (Glial cells) : ఇవి నాడీ కణాలకు పోషక పదార్ధాలను అందజేయడంలో, వాటి చర్యలను విస్తరించడంలో సహాయపడతాయి.

మూలాలు