బ్లడ్ ప్లాస్మా

రక్తపు రసి (Blood plasma - బ్లడ్ ప్లాస్మా, రక్తరసము, నెత్తురు సొన, రక్తజీవద్రవ్యం) అనేది తేటైన ఎండుగడ్డి రంగు గల రక్తం యొక్క ద్రవ భాగం, ఇది రక్తం నుండి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్, ఇతర సెల్యూలర్ భాగాలు తొలగించబడిన తరువాత మిగిలిన భాగం. ఇది మానవ రక్తం యొక్క ఒక పెద్ద భాగం, రక్తంలో దాదాపు 55 శాతం దాకా వుంటుంది, నీరు, లవణాలు, ఎంజైములు, రోగనిరోధక కణాలు, ఇతర ప్రోటీన్లను కలిగి వుంటుంది. ప్లాస్మా 92% నీటితో కూడి ఉంటుంది, ఇది మానవ శరీరానికి అవసరమైన కణాలు, వివిధ కీలక పదార్థాలను సరఫరా చేసే ఒక మాధ్యమం. ప్లాస్మా శరీరంలో రక్తాన్ని గడ్డకట్టించడం సహా వ్యాధులను ఎదుర్కోవడం, వివిధ ఇతర క్లిష్టమైన విధులను చేపడుతోంది.

దానం చేయబడిన ఘనీభవించిన ప్లాస్మా యొక్క ఒక యూనిట్

రోగ నిరోధక వ్యవస్థ అన్నది అందరిలోనూ ఒకలా పని చెయ్యదు. కొందరిలో బలహీనంగా పనిచేస్తే, మరి కొందరిలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ విధంగా “రోగ నిరోధక వ్యవస్థ” సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు ఏదైనా ప్రమాదకరమైన వైరస్, బాక్టీరియా బారిన పడినప్పటికీ వారి రక్తంలో “ప్లాస్మా” లో ఉండే “యాంటీ-బాడీస్ (Antibodies)” ఆ వైరస్ లేదా బాక్టీరియా “సూక్ష్మజీవుల (microorganisms)” తో పొరాడి వ్యాధి బారిన పడకుండా కాపాడుతుంటాయి.

రక్తదానం వలన ఎలాంటి ప్రమాదం ఉండదో అలాగే ప్లాస్మా దానం వలన కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. పైగా రక్తం నుండి సేకరించబడిన ప్లాస్మా తిరిగి 24 నుండి 48 గంటల్లో రక్తంలో సదరు ప్లాస్మా దాత శరీరంలో యదావిధిగా తయారైపోతుంది. 600 ML రక్తం నుండి 360ML ప్లాస్మా ను సేకరించవచ్చు. అంతేకాదు ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి ప్లాస్మాను 28 రోజులకోసారి సంవత్సరంలో 13 సార్లు దానం ఇవ్వొచ్చు[1]. ప్లాస్మా ఇచ్చేవారి హిమోగ్లోబిన్ లెవెల్స్ 12.5 జి/డిఎల్ కంటే ఎక్కువగా ఉండాలి బరువు కనీసం 55 కేజీలుండాలి.డొనేషన్ టైమ్‌లో బి.పి కనీసం 100/60 నుంచి 150/90 మధ్య ఉండాలి. వారికి గత ఆరు నెలల్లో ఎలాంటి ఆప రేషన్లు జరిగి ఉండకూడదు. శ్వాస సంబంధ వ్యాధులు, గుండె, కిడ్నీ జబ్బులు ఉండకూడదు. అలాగే డోనర్, పేషెంట్ బ్లడ్ గ్రూప్ కూడా కలవాల్సి ఉంటుంది.

ప్లాస్మా థెరపీ

ఈ ప్లాస్మా థెరపీ అన్నది మందులకు సైతం నయమవని అనేక రకాలా క్యాన్సర్లు, “ఆటో ఇమ్యూన్ వ్యాధులు (Auto immune diseases)” ఇంకా అనేక అంటు వ్యాధులను నయం చేయటంలో కూడా ఉపయోగపడుతూ వస్తుంది. ఇటీవలి కాలంలో వచ్చిన ఎబోలా, సార్స్, మెర్స్‌ సహా, 2009లో వచ్చిన హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ)కు కూడా ప్లాస్మాతో చికిత్స చేశారు. “రోగ నిరోధక వ్యవస్థ” బలంగా పనిచేసే వ్యక్తులు గతంలో ఏదైనా వైరస్ బారిన పడి కోలుకున్న తరువాత వారి రక్తంలోని “ప్లాస్మా”ను సేకరించి, రోగనిరోధక శక్తి “బలహీనంగా” ఉన్న వారి రక్తంలో ప్రవేశపెట్టి “రోగ నిరోధక శక్తి”ని పెంచటం ద్వారా ప్రమాదకర వ్యాధిని నయం చేసే ప్రక్రియనే “ప్లాస్మా థెరపీ (Convalescent plasma therapy)” లేదా “యాంటీ-బాడీ థెరపీ (Antibody therapy)” అంటారు. ఆయితే ప్లాస్మా థెరపీ వల్ల కరోనా రోగుల్లో మరణాల సంఖ్య తగ్గుతుందని చెప్పలేమని ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయపడుతోంది[2]ప్లాస్మా చికిత్స పొందే గ్రహీతకు కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. వైరస్‌తో తీవ్ర అనారోగ్యం పాలైనవారికి మాత్రమే ప్లాస్మా థెరపీ చేస్తారు. అచ్చం రక్తదానం చేసినప్పుడు ఎలా అయితే రక్తాన్ని సేకరించటం జరుగుతుందో అలాగే రక్తం నుండి ప్లాస్మాను సైతం సేకరించటం జరుగుతుంది. ఈ విధానాన్ని “ప్లాస్మా ఫెరిసిస్ (Plasmapheresis)” అంటారు.

మూలాలు