భూమి కక్ష్య

భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే మార్గం

భూమి సూర్యుని చుట్టూ 14.960 కోట్ల కి.మీ. సగటు దూరంలో,[1] ఉత్తర అర్ధగోళం పై నుండి చూస్తే అపసవ్య దిశలో తిరుగుతూ ఉంటుంది. ఒక పూర్తి కక్ష్య తిరగడానికి 365.256 రోజులు (1 సైడ్‌రియల్ సంవత్సరం) పడుతుంది. ఈ సమయంలో భూమి 94 కోట్ల కి.మీ. ప్రయాణిస్తుంది. సౌర వ్యవస్థలోని ఇతర వస్తువుల ప్రభావాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, భూమి కక్ష్య అనేది భూమి-సూర్యుడు బేరీసెంటర్‌తో ఒక దీర్ఘవృత్తం లాగా ఉంటుంది. దాని ప్రస్తుత విపరీతత (ఎక్సెంట్రిసిటీ) 0.0167. ఈ విలువ సున్నాకి దగ్గరగా ఉన్నందున, ఈ కక్ష్య కేంద్రం సాపేక్షంగా సూర్యుని కేంద్రానికి దగ్గరగా (కక్ష్య యొక్క పరిమాణానికి సంబంధించి) ఉంటుంది.

భూమి దాని కక్ష్యలో కాలానుగుణ బిందువుల వద్ద (స్కేలుకు కాదు)
భూమి కక్ష్య (పసుపు) వృత్తం (బూడిద)తో పోలిస్తే

భూమి నుండి చూస్తే, కక్ష్యలో భూమి ప్రోగ్రేడ్ చలనం కారణంగా సూర్యుడు ఇతర నక్షత్రాలకు సంబంధించి ఒక్కో సౌర రోజుకు 1° తూర్పు వైపుగా కదులుతున్నట్లు (లేదా ప్రతి 12 గంటలకు ఒక సూర్యుడు లేదా చంద్రుని వ్యాసం) కనిపిస్తుంది. [nb 1] భూమి సగటు కక్ష్య వేగం 29.78 కి.మీ./సె. భూగ్రహ వ్యాసాన్ని 7 నిమిషాల్లోను, చంద్రునికి ఉన్నంత దూరాన్ని 4 గంటలలోనూ దాటేంత వేగం అది.[2]

సూర్యుడు లేదా భూమి ఉత్తర ధ్రువం పైనుండి చూస్తే, భూమి సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. అదే బిందువు నుండి చూసినపుడు, భూమి, సూర్యుడు రెండూ కూడా వాటి వాటి అక్షాల చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతున్నట్లు కనిపిస్తాయి.

భూమిపై ప్రభావం

భూమి అక్షంలో ఉన్న వంపు కారణంగా (దీన్నే జ్యోతిశ్చక్రపు వాలుగా పిలుస్తారు), ఆకాశంలో సూర్యుని పథం వంపు (భూమి ఉపరితలంపై నున్న పరిశీలకుడి దృష్టిలో) సంవత్సరం పొడవునా మారుతూ ఉంటుంది. ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న పరిశీలకుడికి, ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉన్నప్పుడు, పగలు ఎక్కువసేపు ఉంటుంది, సూర్యుడు ఆకాశంలో ఎత్తుగా కనిపిస్తాడు. మరింత సౌర వికిరణం భూఉపరితలంపైకి చేరుకోవడం వలన సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉత్తర ధ్రువం సూర్యుని నుండి దూరంగా వంగి ఉన్నప్పుడు, దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది, వాతావరణం సాధారణంగా చల్లగా ఉంటుంది. ఆర్కిటిక్ వలయానికి ఉత్తరాన, అంటార్కిటిక్ వలయానికి దక్షిణాన, విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి - సంవత్సరంలో కొంత భాగం పగటి వెలుతురు అసలే ఉండదు. అదే సంవత్సరం వ్యతిరేక సమయంలో పగటి వెలుగు నిరంతరం ఉంటుంది. దీనిని వరుసగా ధ్రువ రాత్రి, అర్ధరాత్రి సూర్యుడు అంటారు. వాతావరణంలో ఈ వైవిధ్యం వలన (భూమి యొక్క అక్షసంబంధ వంపు యొక్క దిశ కారణంగా) రుతువులు ఏర్పడతాయి.[3]

భూమి గురుత్వాకర్షణ ప్రభావం (దీన్ని హిల్ స్పియర్ అంటారు) దాదాపు 15,00,000 కిలోమీటర్లు (0.01 AU). ఐది భూమి నుండి చంద్రునికి ఉన్న సగటు దూరం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.[4][nb 2] హిల్ స్పియర్‌లో భూమి గురుత్వాకర్షణ ప్రభావం, సుదూరంలో ఉన్న సూర్యుడు, ఇతర గ్రహాల కంటే బలంగా ఉంటుంది. భూమి చుట్టూ తిరిగే వస్తువులు తప్పనిసరిగా ఈ హిల్ స్పియర్‌లోనే ఉండాలి. లేదంటే, అవి సూర్యుని గురుత్వాకర్షణ బలం కారణంగా విచలితమై భూమ్యాకర్షణ నుండి విడిపోతాయి.

కక్ష్య లక్షణాలు
ఇపోక్J2000.0
అప్‌హీలియన్152.10×10^6 km (94.51×10^6 mi)
1.0167 AU
పెరిహీలియన్147.10×10^6 km (91.40×10^6 mi)
0.98329 AU
సెమీ మేజర్ అక్షం149.60×10^6 km (92.96×10^6 mi)
1.0000010178 AU
విపరీతత (ఎక్సెంట్రిసిటీ)0.0167086
వంపుసూర్యుని భూమధ్యరేఖకు 7.155°
1.578690° మార్పులేని సమతలానికి
ఆరోహణ నోడ్ రేఖాంశం174.9°
పెరిహిలియన్ రేఖాంశం102.9°
ఆర్గ్యుమెంట్‌ ఆఫ్‌ పెరియాప్సిస్288.1°
కక్ష్యా వ్యవధి365.256363 004 రోజులు
సగటు కక్ష్య వేగం29.78 km/s (18.50 mi/s)[2]
107,208 km/h (66,616 mph)
అప్‌హీలియన్ వద్ద వేగం29.29 km/s (18.20 mi/s)[2]
పెరిహీలియన్ వద్ద వేగం30.29 km/s (18.82 mi/s)[2]

కింది రేఖాచిత్రం అయనాంతాల రేఖకు, భూమి దీర్ఘవృత్తాకార కక్ష్య అప్‌సైడ్‌ల రేఖకు మధ్య సంబంధాన్ని చూపుతుంది. కక్ష్య దీర్ఘవృత్తం ఇక్కడ చూపించిన ఆరు భూమి చిత్రాల గుండా వెళుతుంది. ఇవి వరసగా జనవరి 2, జనవరి 5 ల మధ్య ఉండే పెరిహీలియన్ (పెరియాప్సిస్-సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బిందువు), మార్చి 19, 20, లేదా 21 తేదీలలో ఉండే మార్చి విషువత్తు బిందువు, జూన్ 20, 21, లేదా 22 తేదీలలో వచ్చే జూన్ అయనాంతం, జూలై 3, జూలై 5 ల మధ్య వచ్చే అప్‌హీలియన్ (అపోయాప్సిస్-సూర్యుడికి అత్యంత దూరపు స్థానం), సెప్టెంబరు 22, 23, లేదా 24 న వచ్చే సెప్టెంబరు విషువత్తు, డిసెంబరు 21, 22, లేదా 23న వచ్చే డిసెంబరు అయనాంతం. [5] ఈ రేఖాచిత్రం భూమి కక్ష్యలో ఉండే దీర్ఘవృత్తాన్ని వాగా అతిశయించి చూపుతుంది; వాస్తవంగా ఈ కక్ష్య దాదాపు వృత్తాకారంలో ఉంటుంది.

సూర్యుని చుట్టూ భూమి తిరిగే దీర్ఘవృత్తాకార కక్ష్య (అతిశయించి చూపబడింది) కక్ష్య తీవ్ర బిందువులు ( అపోయాప్సిస్, పెరియాప్సిస్ ) నాలుగు కాలానుగుణ విపరీత బిందువులూ ( విషవత్తు, అయనాంతం ) వేరువేరు.

భూమి, సూర్యుడు, పాలపుంతల సందర్భం

భూమి, చంద్రుడు, సూర్యుని చలనాల పథాలు

ఇవి కూడా చూడండి

గమనికలు

మూలాలు