హెల్సింకి

ఫిన్లాండ్ రాజధాని

హెల్సింకి ఫిన్‌లాండ్ దేశపు రాజధాని, ఆ దేశంలో అతి పెద్దనగరం. సుమారు 12 లక్షలకు పైగా జనాభా[1] కలిగిన ఈ నగర పాలక ప్రాంతం దేశంలోనే అత్యంత ఎక్కువ జనసమ్మర్దం కలిగిన ప్రాంతం. అంతేకాక ఆ దేశానికి అతిముఖ్యమైన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, విద్యా, పరిశోధనా కేంద్రం కూడా. ఈ నగరం ఎస్టోనియాలోని టాలిన్ నగరానికి 80 కి.మీ, స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ నగరానికి 400 కి.మీ, రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరానికి 300 కి.మీ దూరంలో ఉంది. హెల్సింకి చారిత్రాత్మకంగా ఈ మూడు నగరాలతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది.

హెల్సింకి

ఈ నగరం 1952 వేసవి ఒలంపిక్ క్రీడలకు ఆతిథ్యాన్నిచ్చింది. సంవత్సరంలో ఎక్కువమంది సముద్ర ప్రయాణికులు ఇక్కడికి రావడం వల్ల ఇది ముఖ్యమైన ఓడరేవుగా కూడా అభివృద్ధి చెందింది.

హెల్సింకి ప్రపంచంలోనే అత్యధిక పట్టణ జీవన ప్రమాణాలను కలిగిన నగరాల్లో ఒకటి. 2011లో, బ్రిటీష్ మ్యాగజైన్ మోనోకిల్ నివసించడానికి అత్యంత అనువైన నగరాల సూచికలో హెల్సింకీని ప్రపంచంలోనే అత్యుత్తమమైన నగరంగా పేర్కొంది.[2] 2016 లో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ జీవించడానికి అనుకూలమైన నగరాల సర్వేలో, హెల్సింకి 140 నగరాల్లో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.[3] జూలై 2021లో, అమెరికన్ మ్యాగజైన్ టైమ్ హెల్సింకీని 2021లో ప్రపంచంలోని గొప్ప ప్రదేశాలలో ఒకటిగా పేర్కొంది. "భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న సాంస్కృతిక కేంద్రంగా ఎదగగలదని పేర్కొంది. ఈ నగరం ఇప్పటికే ప్రపంచంలో పర్యావరణ మార్గదర్శకుడిగా పేరుగాంచింది.[4] బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, BCG హెండర్సన్ ఇన్స్టిట్యూట్ 2021లో నిర్వహించిన ఇంటర్నేషనల్ సిటీస్ ఆఫ్ చాయిస్ సర్వేలో, హెల్సింకీ ప్రపంచంలో నివసించడానికి మూడవ అత్యుత్తమ నగరంగా నిలిచింది. లండన్ మరియు న్యూయార్క్ నగరాలు మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్నాయి.[5][6]

మూలాలు