కల్వకుంట్ల కవిత

రాజకీయ నాయకులు

కల్వకుంట్ల కవిత (జననం: మార్చి 13, 1978) భారతదేశ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు.[1] కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించారు.[2] 2020 నుండి నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేస్తున్నారు. 2014 నుండి 2019 వరకు నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించారు.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020 అక్టోబరు 12 - ప్రస్తుతం
నియోజకవర్గంనిజామాబాద్ స్థానిక సంస్థల కోటా

ఎంపీ
పదవీ కాలం
2014 – 2019
ముందుమధు యాష్కీ గౌడ్
తరువాతధర్మపురి అరవింద్
నియోజకవర్గంనిజామాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం13 మార్చి 1978
కరీంనగర్, తెలంగాణ, భారత దేశము
రాజకీయ పార్టీభారత్ రాష్ట్ర సమితి
సంతానం2
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశము
మతంహిందూ

ప్రారంభ జీవితం

కవిత 1978 మార్చి 13న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, శోభ దంపతులకు తెలంగాణలోని రాష్ట్రం కరీంనగర్ పట్ణణంలో జన్మించింది.[3] ఆమె స్టాన్లీ బాలికల పాఠశాలలో విద్యనభ్యసించింది. ఆ తర్వాత విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 2001లో అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.[4] తెలంగాణ ప్రజల కోసం పని చేయాలనే దృక్పథంతో 2004లో భారతదేశానికి తిరిగి వచ్చేముందు ఆమె అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు.

వ్యక్తిగత జీవితం

కల్వకుంట్ల కవిత దేవన్‌పల్లి అనిల్ ను వివాహమాడారు. ఆయన ఒక మెకానికల్ ఇంజనీరు. వారికి ఇద్దరు కుమారులు. వారు ఆదిత్య (జ.2003), ఆర్య (జ.2007).[5]

తెలంగాణ ఉద్యమం

వివాహం తరువాత కవిత, తన భర్తతో కలిసి అమెరికా వెళ్ళారు. 2006లో, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు హామీపై వెనక్కి వెళ్ళినందుకు కేంద్ర ప్రభుత్వంపై తన తీవ్ర అసమ్మతితో కేసీఆర్ కేంద్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేయడంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది. ఆ సమయంలో కవిత కూడా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ప్రజలను ప్రభావితం చేసే సమస్యలపై అవగాహన కోసం, కవిత తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో పర్యటించారు. 2006లో ఆమె నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యనందించి స్థానిక ప్రజలకు ఎంతో సహకరించింది. 2009 లో కొన్ని తెలుగు చలన చిత్రాలలో తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళనకు గురి అవుతుందని నంది అవార్డుల ప్రదానోత్సవంలో నిరసన తెలియజేశారు. 2010లో అదుర్స్ సినిమా తెలంగాణలో విడుదల అయినపుడు వ్యతిరేకించి వార్తలలో ప్రముఖంగా నిలిచింది. అదుర్స్ సినిమాలోని నిర్మాణ వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకిస్తున్నందున ఆ సినిమా విడుదలను అడ్డుకొని వార్తలకెక్కింది.

తెలంగాణ జాగృతి

తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడంకోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుండి ప్రేరణ పొంది 2006 ఆగస్టులో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అధికారికంగా 2007 నవంబరులో నమోదు చేయబడింది. తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. బతుకమ్మను పెద్ద ఎత్తున జరుపుకుంటూ, అన్ని వర్గాల ప్రజలను అందులో పాల్గొనేలా చేసారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది.

తెలంగాణ జాగృతి నైపుణ్య కేంద్రాలు

తెలంగాణ యువతకు ఉపాధి అందించడానికి చొరవ తీసుకున్న కవిత, [6] తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.

బతుకమ్మ

కవిత తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలంపాటు తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ప్రస్తుతం 30కి పైగా దేశాల్లో బతుకమ్మను జరుపుకుంటున్నారు.[7]

లేబర్, ట్రేడ్ యూనియన్లు

కవిత కార్మిక, కార్మిక సంఘాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆమె కొన్ని లేబర్ అండ్ ట్రేడ్ యూనియన్లలో పనిచేస్తున్నారు. అవి:

  1. గౌరవాధ్యక్షురాలు - తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం - విద్యుత్ ఉద్యోగుల సంఘం.
  2. గౌరవాధ్యక్షురాలు - తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ - అంగన్‌వాడీ కార్యకర్తల సంస్థ.

స్కౌట్స్ అండ్ గైడ్స్‌

కల్వకుంట్ల కవిత స్కౌట్స్ అండ్ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా 2015లో తొలిసారి ఎన్నికయింది.[8] రాష్ట్ర ప్రధాన కమిషనర్‌గా నియమితులైన కవిత దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా, భారతదేశంలోనే రెండవ మహిళా రాష్ట్ర ప్రధాన కమిషనర్ గా రికార్డు నెలకొల్పారు.. దోమల్‌గూడలోని బిఎస్‌జి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.[9] 2021 ఏప్రిల్ 2న రెండవసారి ఎన్నికయ్యారు.[10][11]

రాజకీయ జీవితం

శాసనమండలిలో రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తూ

ఆమె తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్రను 2009 నుండి 2014 వరకు పోషించారు. 2014లో ఆమె 16 వ లోక్‌సభకు నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైనారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై ఓడిపోయారు.[12] ఆమె 2020 అక్టోబరులో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచింది. కవిత 2020 అక్టోబరు 29న ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసింది.[13][14] ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా 2021 మార్చి 18న మండలి సమావేశాలకు హాజరైంది.[15] కవిత శాస‌న‌మండ‌లిలో ఎమ్మెల్సీగా తొలిసారిగా 2021 సెప్టెంబరు 27న స్థానిక సంస్థల‌ సమస్యలపైన మాట్లాడింది.

తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత పేరును టిఆర్ఎస్ అధిష్టానం 2021 నవంబరు 21న ఖరారు చేసింది.[16][17] కవిత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబరు 23న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసింది.[18] నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నవంబరు 26న గెలుపు పత్రాన్ని అందుకుంది.[19] కవిత 2022 జనవరి 19న రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసింది.[20]

పార్లమెంటరీ కమిటీ

పార్లమెంటులో, కవిత ఎస్టిమేట్స్ కమిటీ, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో సభ్యురాలిగా పనిచేశారు.

కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్

కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్స్, ఇండియా రీజియన్ స్టీరింగ్ కమిటీకి నామినేట్ చేయబడ్డారు. పార్లమెంటులలో మహిళా ప్రతినిధులను పెంచడానికి కృషిచేయడం కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల బాధ్యత.

పార్లమెంటరీ ప్రతినిధి బృందం

అధికారికంగా కవిత కంబోడియా, లావోస్‌లకు ఉపాధ్యక్షుని ప్రతినిధి బృందంలో అలాగే బెల్జియంలోని బ్రస్సెల్స్‌కు యూరోపియన్ పార్లమెంట్‌కు లోక్‌సభ స్పీకర్ ప్రతినిధి బృందంలో పాల్గొన్నారు.[21]

ఇతర వివరాలు

కవిత తన స్వగ్రామమైన తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, సీ.హెచ్.కొండూర్ గ్రామంలో తన సొంత ఖర్చుతో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించింది. 2022 జూన్ 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ దేవాలయ ప్రతిష్ఠాపనోత్సవాలు జరిగాయి.[22]

ఢిల్లీ మద్యం కుంభకోణం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 2024 మార్చి 15న కవిత ఇంటిపై మధ్యాహ్నం నుండి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆమెను అరెస్టు చేసింది.[23] ఆమెను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా మొత్తం 10 రోజుల పాటు కవితను విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, కేసు దర్యాప్తు పురోగతిని న్యాయస్థానానికి వివరించి ఆమెను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది.[24][25]

మూలాలు

వంశవృక్ష ఆధారం