దానం నాగేందర్

దానం నాగేందర్‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ఉన్నాడు.[2] 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి... 2009, 2018 ఎన్నికలలో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల శాఖ, ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు.[3]

దానం నాగేందర్‌
దానం నాగేందర్


పదవీ కాలం
1994- 2004 (ఆసిఫ్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజకవర్గం)

2009 - 2014,  2018 - ప్రస్తుతం (ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం)

నియోజకవర్గంఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం1964, ఆగస్టు 9
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలుభారత్ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులులింగమూర్తి - లక్ష్మీబాయి
జీవిత భాగస్వామిఅనిత[1]
సంతానంఇద్దరు కుమార్తెలు

జననం, విద్య

నాగేందర్ 1964, ఆగస్టు 9న లింగమూర్తి - ల‌క్ష్మీబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MA) పూర్తిచేశాడు.

రాజకీయ జీవిత చరిత్ర

కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగాడు.[4][5] 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2004లో ఆసిఫ్‌నగర్ నుండి టిడిపి టికెట్‌పై గెలిచిన తరువాత, తన సీటుకు రాజీనామా చేశాడు. ఆ సమయంలో ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత, 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు.[6][7] 2009లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నాడు. కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగాడు.

2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 20,846 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[8] 2018, జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 28,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9]

ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి 2024 మార్చి 17న ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి & టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[10]

మూలాలు