అమ్మాయి కోసం

అమ్మాయి కోసం 2001 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1][2]ఇందులో మీనా, రవితేజ, వినీత్, ఆలీ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు.[3] ఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి బాబూరావు ఈ చిత్రాన్ని నిర్మించగా వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. నిరుద్యోగులుగా జీవితకాలాన్ని వృధా చేస్తూ గడుపుతున్న నలుగురు యువకులకు ఒక అమ్మాయి ప్రేమ పేరుతో ఎలా దిశా నిర్దేశం చేసి దారి లోకి తీసుకువచ్చిందన్నది ఈ చిత్ర ప్రధాన కథాంశం.

అమ్మాయి కోసం
దర్శకత్వంముప్పలనేని శివ
రచనమరుధూరి రాజా (మాటలు)
స్క్రీన్ ప్లేముప్పలనేని శివ
కథఈతరం యూనిట్,
బాలశేఖరన్
నిర్మాతపోకూరి బాబురావు
తారాగణంమీనా,
రవితేజ,
వినీత్,
ఆలీ,
శివారెడ్డి
ఛాయాగ్రహణంసె. హెచ్. రమణరాజు
కూర్పుగౌతంరాజు
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ
సంస్థ
ఈతరం ఫిలింస్
విడుదల తేదీ
2001 మే 18 (2001-05-18)
సినిమా నిడివి
140 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

రవి, వెంకట్, బాలు, వేణు చదువు పూర్తి చేసుకుని ఖాళీగా తిరుగుతూ దారిన పోయే మహిళలపై కామెంట్లు చేస్తుంటారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వీళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడూ తిడుతూ ఉంటారు. అయినా సరే లెక్కచేయక ఏదో రకంగా కాలయాపన చేస్తుంటారు. ఇలా ఉండగా ఒకసారి బస్సులో అంజలి అనే అమ్మాయిని చూసి ఏడిపించబోతారు. కానీ అంజలి వీళ్లనే బోల్తా కొట్టిస్తుంది. అలా పలుమార్లు డక్కామొక్కీలు తిన్నాక నలుగురూ ఆమెతో సంధి చేసుకుని మంచి స్నేహితులవుతారు. ఖాళీగానే తిరుగుతున్నా అందరిలో ఒక్కో వృత్తిలో అభినివేశం ఉన్నట్లు అంజలి గమనిస్తుంది. రవి బైక్ బాగా నడుపుతుంటాడు. వినీత్ కవిత్వం బాగా రాయగలడు. ఆలీ వంటల్లో కొట్టిన పిండి. శివారెడ్డి మిమిక్రీ చేయడంలో దిట్ట.

అంజలి పుట్టినరోజు నలుగురూ ఒకరికి తెలియకుండా ఒకరు తమ తమ ఇళ్ళలో ఏదో ఒక వస్తువు దొంగతనం చేసి ఆమెకు బహుమతి ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటారు. అంజలి అందరి ప్రేమకు సరేనని చెబుతుంది. కానీ జీవితంలో వాళ్ళకిష్టమైన రంగంలో ఏదో ఒకటి సాధించుకుని వస్తేనే వాళ్ళని పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. ఆమె ప్రేమను దక్కించుకోవాలనే ఆశతో అందరూ కష్టపడి వృద్ధిలోకి వస్తారు. తీరా పెళ్ళి కోసం అడగడానికి వెళ్ళేముందు అంజలి తమని మోసం చేసిందని తెలుసుకుంటారు. అదే సమయానికి అంజలి సైన్యంలో పనిచేసే ఒక అతన్ని పెళ్ళి చేసుకోబోతుంటుంది. నలుగురూ కలిసి ఆమె తనను మోసం చేసిందని నిందించి పెళ్ళి ఆపు చేయబోతారు. ఇంతలో అంజలి తండ్రి కలుగ జేసుకుని తమ జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన గురించి చెబుతాడు. అంజలి అన్న అలాగే నిరుద్యోగిగా తిరుగుతుంటే అతని తండ్రి అలాగే ఎప్పుడూ కోప్పడుతూ, తిడుతూ ఉంటాడు. చివరికి అతను తను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని వస్తే తండ్రి తీవ్రంగా నిందించి ఇంట్లోంచి వెళ్ళిపొమ్మంటాడు. దాంతో ఆమె అతన్ని వదిలేస్తుంది. అంజలి అన్న తండ్రి నడుపుతున్న రైలు కింద పడి మరణిస్తాడు. తమ కుటుంబంలో జరిగిన విషాదం వీళ్ళ విషయంలో జగరకూడదని అలా చేసినట్లు అంజలి చెబుతుంది. అంజలి గొప్పమనసుని అర్థం చేసుకుని నలుగురూ కలిసి ఆమె పెళ్ళి జరిపించడంతో కథ సుఖాంతమవుతుంది.

తారాగణం

సంగీతం

వందేమాతరం శ్రీనివాస్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు. ఇందులో ఆరు పాటలున్నాయి.[4] సిరివెన్నెల సీతారామశాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, భువనచంద్ర, చంద్రబోస్ పాటలు రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, హరిహరన్, ఉన్నికృష్ణన్, ఉదిత్ నారాయణ్, సోనూ నిగం, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు గీతాల్ని ఆలపించారు.[5]

మూలాలు

బయటి లింకులు