గారి బెకర్

గ్యారీ స్టాన్లీ బెకర్ ( 1930 డిసెంబరు 2 - 2014 మే 3) అమెరికన్ ఆర్థికవేత్త. 1992లో అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం పొందాడు. [1] అతను చికాగో విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్, సోషియాలజీ ప్రొఫెసర్. చికాగో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మూడవ తరానికి చెందిన నాయకుడు. [2] [3] 2007లో అమెరికా ప్రభుత్వపు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డు లభించింది.

గారి బెకర్ (2008)

బెకర్‌కు 1992 లో ఎకనామిక్ సైన్సెస్‌లో నోబెల్ మెమోరియల్ ప్రైజ్ లభించింది. 2007 లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం అందుకున్నాడు. 2011 లో ఎకనామిక్స్ ప్రొఫెసర్లపై చేసిన సర్వేలో, 60 ఏళ్లు పైబడి, జీవించి ఉన్న వారిలో తమ అభిమాన ఆర్థికవేత్త బెకర్ అని అత్యధికులు చెప్పారు. తరువాతి స్థానాల్లో కెన్నెత్ యారో, రాబర్ట్ సోలో ఉన్నారు. ఆర్థికవేత్త జస్టిన్ వోల్ఫర్స్ అతనిని "గత 50 సంవత్సరాల కాలంలోని అత్యంత ముఖ్యమైన సామాజిక శాస్త్రవేత్త" అని అన్నాడు. [4]

జాతి వివక్ష, నేరం, కుటుంబ వ్యవస్థ, హేతుబద్ధమైన వ్యసనం వంటి సామాజిక శాస్త్ర అంశాలను విశ్లేషించిన మొదటి ఆర్థికవేత్తలలో బెకర్ ఒకడు. అనేక రకాలైన మానవ ప్రవర్తనను హేతుబద్ధంగా, ప్రయోజనాన్ని పెంచేదిగా చూడవచ్చని ఆయన వాదించాడు. వ్యక్తుల ప్రవర్తనను సముచితంగా నిర్వచించడం ద్వారా, మానవుల పరోపకార ప్రవర్తనను కొలత వెయ్యడం అతని విధానం. మానవ మూలధన అధ్యయనాన్ని సమర్ధించిన అగ్రశ్రేణి శాస్త్రవేత్తలలో అతను కూడా ఉన్నాడు. మిల్టన్ ఫ్రైడ్మాన్ ప్రకారం, అతను ఇరవయ్యవ శతాబ్దం రెండవ భాగంలో "జీవించి పనిచేసిన అత్యంత గొప్ప సామాజిక శాస్త్రవేత్త". [5]

ఉద్యోగ జీవితం

పెన్సిల్వేనియాలోని పోట్స్విల్లేలో యూదు కుటుంబంలో బెకర్ జన్మించాడు. . 1951 లో ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం లో "బహుళ-దేశ వాణిజ్య థియరీ" పేరుతో ఒక సీనియర్ థీసిస్ సమర్పించి బియ్యే డిగ్రీ పొందాడు. [6] తరువాత అతను 1955 లో చికాగో విశ్వవిద్యాలయంలో ది ఎకనామిక్స్ ఆఫ్ రేసియల్ డిస్క్రిమినేషన్ అనే థీసిస్‌తో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందాడు. [7] చికాగోలో, బెకర్, మిల్టన్ ఫ్రైడ్మాన్ చే ప్రభావితమయ్యాడు. అతడి గురించి, "నాకు దొరికిన అత్యంత గొప్ప ఉపాధ్యాయుడు" అని బెకర్ అన్నాడు. [8] చికాగోలో ఉన్న సమయంలో, గ్రెగ్ లూయిస్, టిడబ్ల్యు షుల్ట్జ్, ఆరోన్ డైరెక్టర్, ఎల్జే సావేజ్ వంటి వారు తన భవిష్యత్ కార్యక్రమాలను బాగా ప్రభావితం చేసారని చెప్పాడు. [9] కొన్ని సంవత్సరాలు, బెకర్ చికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. అక్కడ పరిశోధనలూ చేశాడు. [9] తనకు 30 ఏళ్ళు రాకముందే, 1957 లో కొలంబియా విశ్వవిద్యాలయంలో బోధించడానికి వెళ్ళాడు. అదే సమయంలో నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్‌లో పరిశోధన కూడా చేశాడు. 1970 లో బెకర్ చికాగో విశ్వవిద్యాలయానికి తిరిగి వెళ్ళాడు. 1983 లో చికాగో లోని సోషియాలజీ విభాగం కూడా అతడికి నియామకాన్ని ఇచ్చింది. [9] 1965 లో అతను అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ యొక్క ఫెలోగా ఎన్నికయ్యాడు. [10]

మూలాలు