ట్రిగ్వేలీ

ట్రిగ్వే హాల్వడన్ లీ (1896 జూలై 16 – 1968 డిసెంబరు 30) ఒక నార్వేజియన్ రాజకీయవేత్త, కార్మిక నాయకుడు, ప్రభుత్వాధికారి, రచయిత. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా 1946 నుంచి 1952 వరకు పనిచేశాడు. 1940 నుంచి 1945 వరకు కీలకమైన సమయంలో లండన్ నగరంలో ప్రవాసంలో ఏర్పరిచిన నార్వే ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు. కార్యసాధకునిగా, నిర్ణయాత్మకుడైన రాజకీయ నాయకునిగా లీ పేరుపొందాడు.[1]

ట్రిగ్వేలీ
ట్రిగ్వేలీ


ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి
పదవీ కాలం
1946 ఫిబ్రవరి 2 – 1952 నవంబరు 10
ముందుగ్లాడ్విన్ జెబ్ (తాత్కాలిక)
తరువాతడేగ్ హేమర్ షుల్డ్

వ్యక్తిగత వివరాలు

జననం(1896-07-16)1896 జూలై 16
ఓస్లో, నార్వే, యునైటెడ్ కింగ్డమ్స్ ఆఫ్ స్వీడన్ అండ్ నార్వే
మరణం1968 డిసెంబరు 30(1968-12-30) (వయసు 72)
గీలో, నార్వే
జాతీయతనార్వే నార్వేజియన్
రాజకీయ పార్టీనార్వేజియన్ లేబర్ పార్టీ
సంతానంసీసెల్, గూరి, మెట్
మతంలూథరన్/చర్చ్ ఆఫ్ నార్వే[ఆధారం చూపాలి]
సంతకంట్రిగ్వేలీ's signature

తొలినాళ్ళు

1896 జూలై 16న నేటి నార్వేలోని ఓస్లో నగరంలో (అప్పట్లో క్రిస్టియానియా అని పిలిచేవారు) జన్మించాడు. అతని తండ్రి మార్టిన్ లీ వడ్రంగి. 1902లో మార్టిన్ లీ కుటుంబాన్ని విడిచిపెట్టి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలసవెళ్ళిపోయాడు. ఇక అతని జాడ తెలియలేదు. తల్లి హుల్దా, చెల్లెలితో ట్రిగ్వే అత్యంత పేదరికంలో జీవించేవాడు. ఓస్లోలో భాగమైన గ్రోరుడ్ అనే ప్రాంతంలో అతని తల్లి ఓ వసతి గృహం, కెఫె నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేది.[2]

విద్యార్థి దశలోనే లీ రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. 1911 నాటికి లేబర్ పార్టీలో చేరాడు. 1919లో ఓస్లో విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందుతూనే లేబర్ పార్టీ జాతీయ కార్యదర్శి పదవి సాధించాడు. 1919 నుంచి 1921 వరకు దెట్ 20దె ఆర్హుంద్రె (20వ శతాబ్దం) అన్న పత్రికకు ప్రధాన సంపాదకుడిగా పనిచేశాడు. 1922 నుంచి 1935 వరకు వర్కర్స్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కి న్యాయ సలహాదారుగా ఉండేవాడు. 1931 నుంచి 1935 వరకు నార్వేజియన్ వర్కర్స్ కాన్ఫిడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ కు ఛైర్మన్ గా వ్యవహరించాడు.[3]

రాజకీయ రంగం

1922 నుంచి 1931 వరకు స్థానిక పరిపాలనలో భాగంగా అకెర్ పురపాలక సంఘంలో కార్యనిర్వాహక వర్గ సభ్యునిగా వ్యవహరించాడు. 1937లో అకెర్షస్ స్థానం నుంచి నార్వేజియన్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1935లో జోహన్ నైగార్డ్స్ వాల్డ్ ఏర్పాటుచేసిన లేబర్ పార్టీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా నియమితుడయ్యాడు. 1939 జూలై నుంచి అక్టోబరు వరకు వాణిజ్య మంత్రిగా, 1939 అక్టోబర్ నుంచి 1941 వరకు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశాడు.

తొలి నుంచీ ట్రిగ్వే లీ సామ్యవాది. ఈ కారణంగానే వ్లాదిమిర్ లెనిన్ వంటి కమ్యూనిస్టు నేతతో పరిచయాన్ని ఏర్పరుచుకున్నాడు, జోసెఫ్ స్టాలిన్ విధానాలను విమర్శిస్తున్నందుకు కమ్యూనిస్టు నేత లియోన్ ట్రాట్స్కీ ప్రమాదాన్ని ఎదుర్కొంటూ సోవియట్ యూనియన్ నుంచి శరణార్థిగా రాగా ఆశ్రయం ఇచ్చాడు. కానీ, స్టాలిన్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ట్రాట్స్కీని బంధించి, దేశం విడిచివెళ్ళాల్సిందిగా బలవంతపెట్టాడు.[4][5][6]

1940లో నాజీ జర్మనీ నార్వేని ఆక్రమించుకుంది. ఆక్రమణ సమయంలో లీ నార్వేజియన్ నౌకలన్నిటినీ మిత్రపక్షాల దేశాల నౌకాశ్రయాలకు తరలించమని ఆదేశమిచ్చాడు. 1941లో లండన్ నగరంలో ప్రవాసంలో నార్వేజియన్ ప్రభుత్వం ఏర్పాటు కాగా దానికి ట్రిగ్వే లీ విదేశాంగ శాఖ మంత్రి అయ్యాడు. 1946 వరకు అదే పదవిలో కొనసాగాడు.[7]

ఐక్యరాజ్య సమితి కెరీర్

1945లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి కాన్ఫరెన్సులో నార్వేజియన్ ప్రతినిధి బృందానికి లీ నాయకత్వం వహించాడు. ఆ సమావేశంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనల ముసాయిదా రచనకు కూడా నాయకత్వం వహించాడు. ట్రిగ్వే లీ 1946లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొన్న నార్వేజియన్ ప్రతినిధి బృందానికి కూడా నాయకుడు. 1946 ఫిబ్రవరి 1న ఐక్యరాజ్య సమితికి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.

లీ ప్రధాన కార్యదర్శిగా ఇజ్రాయిల్, ఇండోనేషియాల ఏర్పాటును సమర్థించాడు. ఇజ్రాయెల్ కు గట్టి మద్దతును ఇచ్చే క్రమంలో అతను కీలకమైన సైనిక, దౌత్య రహస్య సమాచారాన్ని ఇజ్రాయెలీ అధికారులకు అందజేశాడు.[8] ఇరాన్లో సోవియట్ దళాల ఉపసంహరణకు, కాశ్మీర్లో కాల్పుల విరమణకు అనుకూలంగా పనిచేశాడు. 1950లో కొరియా ఆక్రమణకు గురయ్యాకా దక్షిణ కొరియా రక్షణకు లీ మద్దతు కూడగట్టడంతో సోవియట్ యూనియన్ ఆగ్రహానికి గురయ్యాడు.[9] ఐరాస సమావేశాలను సోవియట్ యూనియన్ బహిష్కరించడం ప్రారంభించాకా ఆ విధానాన్ని వారు విడనాడేందుకు ప్రయత్నిస్తూ పనిచేశాడు. ఐతే సోవియట్ యూనియన్ తిరిగి ఐరాసకు రావడం వెనుక అతని కృషి స్వల్పమే. ఫ్రాన్సిస్కో ప్రాంకో ప్రభుత్వం పట్ల అతనికున్న వ్యతిరేకత వల్ల ఐక్యరాజ్య సమితిలో స్పెయిన్ సభ్యదేశంగా చేరడాన్ని వ్యతిరేకించాడు.[10]

1968, డిసెంబర్ 30న తన 72 వ ఏట ట్రిగ్వేలీ మరణించాడు.

బయటి లింకులు

మూలాలు