డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫయర్

డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ ( DOI ) అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) ప్రామాణీకరించిన వివిధ వస్తువులను ప్రత్యేకంగా గుర్తించడానికి ఉపయోగించే ఐడెంటిఫైయర్ లేదా హ్యాండిల్ . [1] DOIలు, హ్యాండిల్ సిస్టమ్ ను అమలు చేస్తాయి; [2] [3] అవి URI వ్యవస్థలో కూడా ఒదిగిపోతాయి. జర్నల్ వ్యాసాలు, పరిశోధన నివేదికలు, డేటా సెట్‌లు, అధికారిక ప్రచురణల వంటి విద్యా, వృత్తిపరమైన, ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని గుర్తించడానికి వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వాణిజ్య వీడియోల వంటి ఇతర రకాల సమాచార వనరులను గుర్తించడానికి కూడా DOIలను ఉపయోగిస్తారు.

డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫయర్
పొడి పేరుDOI
ప్రవేశపెట్టిన తేదీ2000; 24 సంవత్సరాల క్రితం (2000)
నిర్వహించే సంస్థఇంటర్నేషనల్ DOI ఫౌండేషను
ఉదాహరణ10.1000/182

DOI ఐడెంటిఫయరు ఏ సమాచార వస్తువునైతే సూచిస్తుందో, ఆ వస్తువును చేరడమే DOI లక్ష్యం. దీనికోసం ఆ వస్తువుకు సంబంధించిన URL వంటి మెటాడేటాకు DOI ఐడెంటిఫయరును అనుసంధించి ఉంచుతుంది. అంటే DOI, ఐడెంటిఫయరు మాత్రమే కాక, ఇతర వ్యవస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా. తద్వారా, ISBN. ISRC ల వంటి కేవల ఐడెంటిఫైయర్‌ల కంటే DOI భిన్నమైనది. మెటాడేటాను సూచించడానికి DOI వ్యవస్థ ఇండెక్‌స్ కంటెంట్ మోడల్‌ని ఉపయోగిస్తుంది.

ఓ పత్రానికి కేటాయించిన DOI ఐడెంటిఫయరు, ఆ పత్రపు జీవితాంతం మారదు. దాన్ని హోస్టింగు చేసిన స్థానం, ఇతర మెటాడేటా మారినప్పటికీ, DOI ఐడెంటిఫయరు మాత్రం సుస్థిరంగా ఉంటుంది. ఏదైనా పత్రాన్ని దాని DOI ద్వారా గుర్తించినపుడు, దాని URLని నేరుగా ఉపయోగించినప్పటి కంటే సుస్థిరమైన లింకును అందిస్తుంది. అయితే ఎప్పుడైనా దాని URL మారితే, నిర్వహించడానికి DOI మెటాడేటాలో ఉండే URL లింకును తప్పనిసరిగా తాజాకరించాలి. [4] DOI డేటాబేస్‌ను తాజాకరించే బాధ్యత ఆ పత్రపు ప్రచురణకర్తదే. ప్రచురణకర్త తాజాకరించకపోతే, DOI ఐడెంటిఫయరు డెడ్ లింకుకు తీసుకుపోతుంది. దాంతో DOI నిరుపయోగంగా పడి ఉంటుంది.

ఇంటర్నేషనల్ DOI ఫౌండేషన్ (IDF), DOI వ్యవస్థ డెవలపరు, నిర్వాహకులు. దీనిని 2000లో ప్రవేశపెట్టారు. [5] DOI వ్యవస్థ ఒప్పందం లోని నిబంధనలకు అనుగుణంగా ఉండే సంస్థలు, సభ్యత్వ రుసుము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న సంస్థలు DOIలను కేటాయించవచ్చు. DOI వ్యవస్థను రిజిస్ట్రేషన్ ఏజెన్సీల సమాఖ్య అమలు చేస్తుంది. ఈ ఏజెన్సీలను IDF సమన్వయం చేస్తుంది. [6] 2011 ఏప్రిల్ చివరి నాటికి దాదాపు 4,000 సంస్థలు 5 కోట్లకు పైబడిన DOI పేర్లను కేటాయించాయి. [7] 2013 ఏప్రిల్ నాటికి ఈ సంఖ్య 9,500 సంస్థలు, 8.5 కోట్ల DOI పేర్లకు పెరిగింది.

నామకరణం, నిర్మాణం

DOI రెండు భాగాలుగా ఉంటుంది -మొదటిది ఉపసర్గ (ప్రిఫిక్స్), రెండవది ప్రత్యయం (సఫిక్స్). ఈ రెంటి మధ్య స్లాష్‌ (/) ఉంటుంది, ఇలాగ:

ఉపసర్గ/ప్రత్యయం

ఉపసర్గ, ఆ ఐడెంటిఫైయరును రిజిస్టరు చేసిన ఏజన్సీని గుర్తిస్తుంది. ప్రత్యయం ఆ DOI ఐడెంటిఫయరుకు అనుబంధించబడిన నిర్దుష్ట వస్తువును గుర్తిస్తుంది. ఈ పదాల్లో (ఉపసర్గ, ప్రత్యయం) యూనికోడ్ కారెక్టర్లు చాలావరకు వాడవచ్చు. ఇవి కేస్-సెన్సిటివ్‌గా ఉంటాయి. ఉపసర్గ సాధారణంగా 10. NNNN అనే రూపంలో ఉంటుంది. ఇక్కడ NNNN అనేది కనీసం నాలుగు అంకెలుండే ఏదైనా సంఖ్య. దీని పరిమితి మొత్తం నమోదుదారుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. [8] [9] ఉపసర్గ కొత్త డెసిమల్‌లను చేరుస్తూ పొడిగించుకుంటూ పోవచ్చు ఉదా: 10.NNNN.N. [10]

DOI పేరు 10.1000/182, అనే ఉదాహరణ తీసుకుంటే, అందులో ఉపసర్గ 10.1000 కాగా, ప్రత్యయం 182 . ఉపసర్గలోని "10" అంటే DOI వ్యవస్థకు గుర్తింపు. [A] 1000 అనేది రిజిస్టరు చేస్తున్న DOI ఏజన్సీ గుర్తింపు. ఇక్కడ 1000 అంటే స్వయంగా అంతర్జాతీయ DOI ఫౌండేషనే. ఇకపోతే ప్రత్యయం లోని 182 అనేది ఏ వస్తువునైతే ఈ ఐడెంటిఫయరు సూచిస్తోందో ఆ వస్తువు ID (ఈ సందర్భంలో, 182 అంటే DOI హ్యాండ్‌బుక్ యొక్క తాజా కూర్పు).

DOI పేర్లు ప్రదర్శనలు, పాఠ్యాలు, చిత్రాలు, ఆడియో లేదా వీడియో అంశాలు, సాఫ్ట్‌వేర్ వంటి సృజనాత్మక కృతులను [11] ఎలక్ట్రానిక్ రూపాలు, భౌతిక రూపాలు రెండింటిలోనూ గుర్తించగలవు.

DOI పేర్లు వస్తువులను వాటి వివరాలకు సంబంధించిన వివిధ స్థాయిలలో సూచించగలవు: అంటే ఒక పత్రికను, ఆ పత్రికకు చెందిన ఓ నిర్దుష్ట సంచికను, సంచిక లోని ఒక వ్యాసాన్ని, వ్యాసంలో ఉన్న ఒక పట్టికను కూడా గుర్తించగలవు. వివరాల స్థాయి ఎంపిక అసైనర్‌ తన అభీష్టం మేరకు చేసుకుంటారు. కానీ DOI సిస్టమ్‌లో ఇది తప్పనిసరిగా DOI పేరుతో అనుబంధించబడిన మెటాడేటాలో భాగంగా, సూచికల కంటెంట్ మోడల్ ఆధారంగా డేటా నిఘంటువుని ఉపయోగించి ప్రకటించాలి.

చూపించే ఆకృతి

DOI ఐడెంటిఫయర్లను తెరపైన, ముద్రణలోనూ doi:10.1000/182 ఆకృతిలో ప్రదర్శించాలని అధికారిక DOI హ్యాండ్‌బుక్ స్పష్టంగా పేర్కొంది. [12]

ఒక ప్రధాన DOI రిజిస్ట్రేషన్ ఏజెన్సీ అయిన CrossRef, DOI హ్యాండ్‌బుక్‌కి విరుద్ధంగా, అధికారికంగా పేర్కొన్న ఫార్మాట్‌కు బదులుగా URL (ఉదాహరణకు, https://doi.org/10.1000/182 )ను చూపించమని సిఫార్సు చేస్తోంది (ఉదాహరణకు, doi:10.1000/182 ). [13] [14]

DOI ఐడెంటిఫయరును ప్రచురించేవారు, దాని URLకి హైపర్‌లింక్ చేయకుండానే ప్రదర్శిస్తారని భావించి, CrossRef పై సిఫార్సు చేసింది. హైపర్‌లింక్ లేకపోతే సంబంధిత పేజీకి చేరుకోలేరు. అంచేత మొత్తం URL ప్రదర్శిస్తే, వాడుకరులు తమ బ్రౌజర్‌లోని కొత్త విండో/ట్యాబ్‌లోకి URLని కాపీ చేసి అతికించడానికి వీలు కల్పిస్తుంది. [15]

కంటెంటు

DOI సిస్టమ్ లోని ప్రధాన కంటెంటులో ప్రస్తుతం ఇవి ఉన్నాయి:

  • సుమారు 3,000 మంది ప్రచురణకర్తలతో కూడిన ఒక కన్సార్టియం క్రాస్‌రెఫ్; Airiti, చైనీస్, తైవానీస్ ఎలక్ట్రానిక్ అకడమిక్ జర్నల్స్ యొక్క ప్రముఖ ప్రొవైడర్; జపాన్ లింక్ సెంటర్ (JaLC) [16] ల ద్వారా స్కాలర్‌లీ మెటీరియల్‌లు (జర్నల్ కథనాలు, పుస్తకాలు, ఈబుక్స్, మొదలైనవి)
  • డేటాసైట్ ద్వారా పరిశోధన డేటాసెట్‌లు
  • EU ప్రచురణల కార్యాలయం ద్వారా యూరోపియన్ యూనియన్ అధికారిక ప్రచురణలు;
  • సింఘువా విశ్వవిద్యాలయంలోను, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ చైనా (ISTIC) లోనూ జరుగుతున్న చైనీస్ నేషనల్ నాలెడ్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు.
  • ఎంటర్‌టైన్‌మెంట్ ID రిజిస్ట్రీ ద్వారా వాణిజ్య, వాణిజ్యేతర ఆడియో/విజువల్ కంటెంట్ శీర్షికలు, సవరణలు, వ్యక్తీకరణలు రెండింటికీ శాశ్వత గ్లోబల్ ఐడెంటిఫైయర్‌లు, దీన్ని EIDR అని పిలుస్తారు.

నోట్స్

మూలాలు