దక్షిణం

నాలుగు దిక్కులలొ ఒకటి

దక్షిణం ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఉత్తర దిక్కుకు వ్యతిరేక దిశలో, తూర్పు పడమరలకు లంబకోణంలో (90 డిగ్రీల కోణం) ఉంటుంది. దక్షిణము అంటే "కుడి" అని అర్థం. సూర్యుడు ఉదయించే దిశకు ఎదురుగా నిలబడితే కుడిచేతి వైపున ఉండేదే దక్షిణ దిక్కు.[1] దక్షిణం అనే సంస్కృత పదానికి సరిపోయే అచ్చతెలుగు మాట దచ్చినం.[2] మాపులో సాధారణంగా ఇది క్రింద వైపు ఉంటుంది.

ఎనిమిది దిక్కుల సూచిక.

దక్షిణాన్ని ఇంగ్లీషులో సౌత్ అంటారు. భూమి దక్షిణం దిక్కు దక్షిణ ధ్రువంతో అంతమౌతుంది. దీనినే అంటార్కిటికా అంటారు. లాటిన్‌లో దక్షిణాన్ని ఆస్ట్రాలిస్ అంటారు. ఈ పేరుననే భూగోళానికి దక్షిణాన ఉన్న భూమికి ఆస్ట్రేలియా అని పేరుపెట్టారు. ఈ పేరు మీదనే ఆస్ట్రలోపిథెకస్ అనే మానవ పూర్వీక జాతికి ఆ పేరు పెట్టారు. ఆఫ్రికా దక్షిణ భాగంలో దొరికిన కోతి వంటి జీవి కాబట్టి దాన్ని ఆస్ట్రలోపిథెకస్ అన్నారు. దక్షిణాది కోతి అని ఆ పేరుకు అర్థం.

"ప్రదక్షిణం" చేసేటపుడు సవ్యదిశలో (కుడిచేతివైపుగా) తిరుగుతారు. ఆ కారణాన దాన్ని ప్రదక్షిణం అన్నారు.

శృంగార పురుషుణ్ణి తెలుగులో దక్షిణ నాయకుడు అని అనడం కద్దు.[3][4]

ఇతర విశేషాలు

హిందూ సంస్కృతిలో దక్షిణ దిక్పాలకుడు యముడు. దక్షిణ దిశను అశుభ సూచికగా భావిస్తారు. రామాయణంలో త్రిజట (రావణాసురుడు అశోకవనంలో సీతకు కాపలాగా ఉంచిన రాక్షసి) రావణుడు గాడిద నెక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్టు కలగంటుంది. ఆమె దాన్ని లంకకు అశుభంగా భావిస్తుంది.[5]

మూలాలు