పేటెంట్

'పేటెంట్ ' అనేది ఒక రకమైన చట్టపరమైన మేధో సంపత్తి హక్కు. ఇది ఆవిష్కరణను బహిర్గతంగా ప్రచురించడానికి బదులుగా ఒక నిర్దుష్ట కాలపరిమితి వరకు ఆ మేధో ఉత్పత్తులను ఇతరులు తయారు చేయడం, ఉపయోగించడం లేదా విక్రయించడం నుండి మినహాయించే చట్టపరమైన పరిమిత హక్కు ఆవిష్కర్తకు లేదా హక్కుదారుకు (పేటెంట్ హోల్డర్) ప్రభుత్వం ఇస్తుంది. అంటే పేటెంట్ ఒక ఆవిష్కరణను తయారు చేయడానికి లేదా ఉపయోగించడానికి లేదా విక్రయించడానికి హక్కును ఇవ్వదు, బదులుగా, చట్టపరంగా ఇతరులను మినహాయించే హక్కును మాత్రమే అందిస్తుంది [1]. పేటెంట్ అనే పదానికి 'ఏకస్వం' అని 'ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 [2] 'ఏకస్వం', 'విశిష్టాధికారం' అని వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు పేర్కొన్నాయి. వాడుక సౌలభ్యం కొరకు ఎక్కువగా గుర్తింపు పొందిన పదము 'పేటెంట్' నే ఉపయోగించడమైనది. ఆధునిక వాడుకలో పేటెంట్ అనే పదం సాధారణంగా కొత్తగా, ఉపయోగకరంగా ఏదైనా కనిపెట్టిన వారికి మంజూరు చేయబడిన హక్కును సూచిస్తుంది. దీనిని మేధో సంపత్తి హక్కుగా, ఇంకా ట్రేడ్‌మార్క్‌లు, గ్రంథ స్వామ్యంగా కూడా సూచిస్తారు. [3][4].

అమెరికా పేటెంట్, ట్రేడ్‌మార్క్ కార్యాలయం జారీ చేసిన పేటెంట్

పేటెంట్ అంటే ఆవిష్కర్తలకు వారి ఆవిష్కరణల వివరాలను ప్రజలతో పంచుకోవడము బదులుగా ఏదైనా ఇతర ఆస్తి హక్కు వలె, దీనిని హక్కుదారు విక్రయించవచ్చు, లైసెన్స్ చేయవచ్చు, తనఖా పెట్టవచ్చు, కేటాయించవచ్చు లేదా బదిలీ చేయవచ్చు, ఇవ్వవచ్చు లేదా వదిలివేయవచ్చు. చాలా దేశాల్లో, పేటెంట్ హక్కులు వ్యక్తిగత (ప్రైవేట్) చట్టం క్రిందకు వస్తాయి. వారి హక్కులను ఉల్లంఘించిన వారిపై దావా వేయవచ్చు. కొన్ని పరిశ్రమలలో పేటెంట్ల పోటీ కూడా ఒక ప్రయోజనంగా పరిగణిస్తారు.[5]

చరిత్ర

పేటెంట్ అనే పదం లాటిన్ పటేర్ నుండి ఉద్భవించింది, దీని అర్థం "తెరిచి ఉంచడం" (ప్రజల తనిఖీ కోసం అందుబాటులో ఉంచడం). ఇది 'అక్షరాల పేటెంట్' (Letters patent) అనే పదానికి సంక్షిప్త రూపం. ఇది పూర్వం ఒక వ్యక్తికి ప్రత్యేక హక్కులను మంజూరు చేస్తూ చక్రవర్తి లేదా ప్రభుత్వం జారీ చేసిన బహిరంగ పత్రం. ఇదే విధముగా అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వాలచే భూమి మంజూరు చేయడానికి 'భూమి పేటెంట్లు' (Land patents ) ఉపయోగించేవారు. అమెరికాలో పారిశ్రామిక రూపకల్పన హక్కులను 'రూపకల్పన (డిజైన్) పేటెంట్లు'గా పిలుస్తారు.[6] మొక్కల పెంపకందారుల హక్కులను 'మొక్కల (ప్లాంట్స్) పేటెంట్లు' అని పిలుస్తారు.[7] వినియోగ నమూనాలు (యుటిలిటీ మోడల్స్), గెబ్రాచ్‌స్‌మస్టర్‌లను (ఆస్ట్రియా, జర్మనీ లోనివి ), కొన్నిసార్లు 'చిన్న పేటెంట్లు' లేదా 'ఆవిష్కరణ పేటెంట్లు' అంటారు. ఈ ప్రత్యేక రకాల ఆవిష్కరణల పేటెంట్లలో జీవ (బయోలాజికల్ ) పేటెంట్లు, వ్యాపార పద్ధతి (బిజినెస్పే మెథడ్) పేటెంట్లు, రసాయన (కెమికల్) పేటెంట్లు, సాఫ్ట్‌వేర్ పేటెంట్లు ఉన్నాయి.

వెనీస్ పేటెంట్ శాసనం, 1474లో వెనిస్ సెనేట్ జారీ చేసింది. ప్రపంచంలోని మొట్టమొదటి చట్టబద్ధమైన పేటెంట్ వ్యవస్థలలో ఒకటి.

ప్రాచీన గ్రీకు నగరమైన సైబారిస్‌లో కొన్ని రకాల పేటెంట్ హక్కులు గుర్తించబడిన ఆధారాలు ఉన్నప్పటికీ [8][9] 1474 నాటి వెనీషియా పేటెంట్ శాసనం మొదటి చట్టబద్ధమైన పేటెంట్ వ్యవస్థగా పరిగణించబడుతుంది. ఈ పేటెంట్ శాసనం జెరూసలేం రాజ్యంలోని చట్టాల ద్వారా ప్రేరణ పొందిందని చారిత్రక పరిశోధన సూచించింది. ఇది పట్టు తయారీ సాంకేతికతలను అభివృద్ధి చేసేవారికి గుత్తాధిపత్యాన్ని మంజూరు చేసింది.[10] 1474 నాటికి వెనిస్‌లో పేటెంట్లు క్రమపద్ధతిలో మంజూరు చేయబడ్డాయి. వీటి రక్షణ కాలం 10 సంవత్సరాలు.[11] వెనీషియన్లు వలస వచ్చినప్పుడు, వారు తమ కొత్తఇళ్లకి ఇలాంటి పేటెంట్ రక్షణను కోరుకున్నారు. ఇది క్రమంగా ఇతర దేశాలకు పేటెంట్ వ్యవస్థల వ్యాప్తికి దారితీసింది.[12]

ఆంగ్ల పేటెంట్ వ్యవస్థ మేధో సంపత్తిని గుర్తించిన మొదటి పేటెంట్ వ్యవస్థ. 16వ శతాబ్దం నాటికి, ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I (స్కాట్లాండ్ VI) "కొత్త ఆవిష్కరణల ప్రాజెక్టుల" కోసం మాత్రమే దీనిని ఉపయోగించాలని ప్రకటించాడు. దీని వలన రాజు నిర్ణీత సంవత్సరాల పాటు ఆవిష్కర్తలకు 'లేఖల పేటెంట్‌' ను జారీ చేసాడు. ఈ శాసనం ఇంగ్లాండ్ తదితర ప్రాంతాలలో పేటెంట్ చట్టం ఏర్పడానికి పునాదిగా మారింది. పారిశ్రామిక విప్లవం ఉద్భవించి అభివృద్ధి చెందడానికి ఇది చట్టపరమైన పునాదిగా నిలిచింది. ఆంగ్ల న్యాయ వ్యవస్థ అమెరికా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో పేటెంట్ చట్టానికి పునాదిగా మారింది. 1641లో శామ్యూల్ విన్స్లో ఉప్పు తయారీకి సంబంధించిన కొత్త ప్రక్రియ కోసం ఉత్తర అమెరికాలో మసాచుసెట్స్ జనరల్ కోర్ట్ ద్వారా మొదటి పేటెంట్‌ను మంజూరు చేసింది.[13] ఇది ఆధునిక పేటెంట్ వ్యవస్థగా పరిణామం చెందింది.

జేమ్స్ పుకిల్ 1718లో మొదట్లో యాంత్రిక తుపాకీ (ఆటోకానన్) ఆవిష్కరణ పేటెంట్ కోసం అందించిన వివరాలు.

పేటెంట్ చట్టంలో ముఖ్యమైన పరిణామాలు 18వ శతాబ్దంలో ఉద్భవించాయి. క్వీన్ అన్నే పాలనలో ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరణను అందించడానికి పేటెంట్ దరఖాస్తులు అవసరం అయ్యాయి.[14] ఇప్పటికే ఉన్న ఆవిష్కరణలకు, ఆలోచనలు లేదా సూత్రాలు మెరుగుదల కోసం చట్టబద్ధంగా పేటెంట్ పొందవచ్చని జేమ్స్ వాట్ తన ఆవిరి ఇంజిన్ కోసం తీసుకున్న 1796 పేటెంట్ చట్టపరమైన పోరాటాలు నిర్దేశించాయి.[15] ఆధునిక ఫ్రెంచ్ పేటెంట్ వ్యవస్థ [16] 1791 విప్లవ కాలంలో సృష్టించబడింది. ఆవిష్కర్త హక్కు సహజమైనదిగా పరిగణించి పరీక్ష లేకుండా పేటెంట్లు మంజూరు చేసారు. అప్పట్లో పేటెంట్ ఖర్చులు చాలా ఎక్కువగా (500 నుండి 1,500 ఫ్రాంక్‌ల వరకు) ఉండేవి. 1844లో పేటెంట్ చట్టం సవరించి, ధర తగ్గించారు ఇంకా దిగుమతి పేటెంట్లు రద్దు చేసారు.

జాబితా చేయబడిన ఆవిష్కర్తలలో మహిళల భాగస్వామ్యం , PCT అప్లికేషన్‌ల వాటా కనీసం ఒక మహిళతో టాప్ 20 మూలాలు 2020కి ఆవిష్కర్తగా ఉంది [17]

US కాంగ్రెస్ మొదటి పేటెంట్ 1790 ఏప్రిల్ 10న "ఉపయోగకరమైన కళల పురోగతిని ప్రోత్సహించడానికి ఒక చట్టం" పేరుతో ఆమోదించబడింది.[18] పొటాష్ (పొటాషియం కార్బోనేట్) ను ఉత్పత్తి చేసే పద్ధతి కోసం వెర్మోంట్‌కు చెందిన శామ్యూల్ హాప్‌కిన్స్‌కు 1790 జూలై 31న మొదటి పేటెంట్ మంజూరు చేయబడింది.[19] 1790, 1836ల మధ్య సుమారు పది వేల పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి. అమెరికన్ సివిల్ వార్ నాటికి దాదాపు 80,000 పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి.[20] కానీ USలో, చారిత్రాత్మకంగా మహిళలు పేటెంట్లు పొందకుండా నిరోధించబడ్డారు. 1790 పేటెంట్ చట్టంలోని సెక్షన్ 1 "ఆమె"ని సూచిస్తున్నప్పటికీ, [21] వివాహిత స్త్రీలు తమ పేరు మీద ఆస్తిని, ఆదాయంపై హక్కుల లేకపోవడముతో ఈ లింగ వివక్ష కనపడుతుంది. ఈ వ్యత్యాసం 20, 21వ శతాబ్దాల కాలంలో తగ్గినప్పటికీ, అసమానత ప్రబలంగా ఉంది. ఉదాహరణకు, UKలో 2015 నాటికి కేవలం 8% మంది మాత్రమే స్త్రీలు ఆవిష్కర్తలు. ప్రతి సంవత్సరం దాఖలు చేయబడిన పేటెంట్ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. USA ప్రపంచంలో అగ్రగామిగా ఉంది. 2007 నుండి PR చైనా ముందుంది.[22]

2023-04-15న క్వెస్టెల్-ఆర్బిట్ డేటాబేస్ ప్రకారం ప్రచురించిన పేటెంట్ కుటుంబాల సంఖ్య , ప్రారంభ ప్రాధాన్యత తేదీ.

సాధారణంగా, ఒక దేశం లేదా దేశాల సమూహం పేటెంట్ వ్యవస్థను నిర్వహించడానికి పేటెంట్ కార్యాలయాన్ని ఏర్పరుస్తుంది. పేటెంట్లు జాతీయ లేదా ప్రాంతీయ పేటెంట్ కార్యాలయాల ద్వారా మంజూరు చేయబడతాయి.[23] ఉల్లంఘన విషయాలు జాతీయ న్యాయస్థానాలద్వారా విచారిస్తారు. వివిధ దేశాలలో పేటెంట్ చట్టాల కోసం అధికారం మారుతూ ఉంటుంది. UKలో, పేటెంట్ల చట్టం 1977లో సవరించారు .[24] యునైటెడ్ స్టేట్స్‌లో, రాజ్యాంగం కాంగ్రెస్‌కు "విజ్ఞానశాస్త్రం , ఉపయోగకరమైన కళల పురోగతిని ప్రోత్సహించడానికి చట్టాలను రూపొందించడానికి అధికారం ఇస్తుంది. . ." . యునైటెడ్ స్టేట్స్ పేటెంట్, ట్రేడ్‌మార్క్ కార్యాలయం సృష్టించబడ్డాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) పేటెంట్ చట్టాల ప్రపంచ సామరస్యం కొరకు కృషి చేస్తుంది.[25] జాతీయ చట్టాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, పేటెంట్‌ అవసరాలను అనుసరించి దేశాల మధ్య పేటెంట్‌లను మంజూరు చేసే విధానం, కాల పరిమితి విస్తృతంగా మారుతూ ఉంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ - WTO) వారి - మేధో సంపత్తి హక్కుకు సంబంధించి వాణిజ్య విషయాల (TRIPS - Trade-Related Aspects of Intellectual Property Rights) ఒప్పందం ప్రకారం, సభ్య దేశాలలోని అన్ని సాంకేతికత రంగాలలో కొత్త ఆవిష్కరణలు పారిశ్రామిక అనువర్తనాన్ని (Indusrial కలిగినవి ఏదైనా ఆవిష్కరణ కోసం పేటెంట్లు అందుబాటులో ఉండాలి.[26] పేటెంట్ రక్షణ కాల వ్యవధి కనీసం ఇరవై సంవత్సరాలు ఉండాలి. ఈ సభ్య దేశాలలో కూడా పేటెంట్ పొందే విషయంపై వైవిధ్యాలు ఉన్నాయి.[27] పేటెంట్ చట్టాల సమలేఖనంపై దేశాల మధ్య TRIPS ఒప్పందం విజయవంతమైంది. TRIPS ఒప్పందానికి అనుగుణంగా ఉండటం WTOలో ప్రవేశము అనేక దేశాలు సమ్మతి కూడా వివిధ చట్టాలను అభివృద్ధికి కారణమయింది.

విశేషాలు, వివరాలు

పేటెంట్ల మంజూరు, అమలు కూడా జాతీయ, అంతర్జాతీయ చట్టాలచే ఒప్పందాల ద్వారా నిర్వహించబడతాయి. పేటెంట్ చట్టం అనేది ప్రాదేశిక స్వభావం (Territorial) కలిగిఉంటుంది. పేటెంట్ గ్రహీత నుండి అనుమతి లేకుండా ఇతరులు పేటెంట్ పొందిన ఆవిష్కరణను రూపొందించినప్పుడు, ఉపయోగించినప్పుడు లేదా విక్రయించినప్పుడు పేటెంట్ ఉల్లంఘన జరుగుతుంది. ఉదాహరణకు, US పేటెంట్‌ను ఉల్లంఘిస్తూ, చైనాలో ఒక వస్తువును తయారు చేస్తే ఆ వస్తువును USలోకి దిగుమతి చేసుకుంటేనే, US పేటెంట్ చట్టం ప్రకారం ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.[28] పేటెంట్ ఎప్పుడు మంజూరు చేయబడినా ఆవిష్కర్తలు, వారి వారసులు లేదా కేటాయింపబడినవారు దానికి యజమానులు అవుతారు. హక్కుదార్లు వాటిని మూడవ పార్టీలకు అదే హక్కులతో విక్రయించవచ్చు.[29]

జాతీయ పేటెంట్ కార్యాలయం అధికారికంగా అనుమతించి జారీ చేసిన పేటెంట్ పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లుబాటును సవాలు చేయడానిని ప్రతిపక్ష చర్యలు అంటారు. వీటికి పేర్కొనే కారణాలు - ఇది పేటెంట్ చేయదగిన విషయం కాదు; విషయం కొత్తది కాదు; లేదా ఆవిష్కర్తల జాబితా, ఆవిష్కరణలు ఎప్పుడు జరిగాయి మొదలైనవి.[30][31] పేటెంట్లు సాధారణంగా పౌర (సివిల్) వ్యాజ్యాల ద్వారా మాత్రమే అమలు చేయబడతాయి, అయితే కొన్ని దేశాలు ( ఫ్రాన్స్, ఆస్ట్రియా వంటివి) అక్రమ ఉల్లంఘన నేరంగా పరిగణించి జరిమానాలను విధిస్తారు.[32]

పేటెంట్ నిర్దిష్ట సమయం వరకు మాత్రమే అమలులో ఉంటుంది, ఆ తర్వాత ఇతరులు స్వేచ్ఛగా ఆవిష్కరణను నకలు చేయవచ్చు; ప్రభుత్వ మధ్యవర్తి సంస్థలకు (ఏజెన్సీ) రుసుము చెల్లించడం లేదా వ్రాతపనిని దాఖలు చేయడం అవసరం లేదు;, ప్రజలకు ఎలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.[33]

సంబంధిత పేటెంట్ కార్యాలయంలో వ్రాతపూర్వక దరఖాస్తును దాఖలు చేయడం ద్వారా పేటెంట్ అభ్యర్థించబడుతుంది. దరఖాస్తును దాఖలు చేసే వ్యక్తి లేదా సంస్థని "దరఖాస్తుదారు"గా సూచిస్తారు. దరఖాస్తుదారు ఆవిష్కర్త లేదా దానికి కేటాయించిన వ్యక్తి కావచ్చు. పేటెంట్ అనుమతులు (లైసెన్సింగ్) ఒప్పందాలు అనేవి పేటెంట్ హక్కుదారు (లైసెన్సర్) కు అమలు చేయడానికి లేదా ఉపయోగించడానికి, విక్రయించడానికి లేదా దిగుమతి చేసుకునే హక్కును మంజూరు చేస్తూ అంగీకరించే ఒప్పందాలు.[34][35]

సంక్లిష్టమైన సాంకేతిక రంగాలలో నిమగ్నమైన కంపెనీలు ఒకే ఉత్పత్తికి సంబంధించిన బహుళ లైసెన్స్ ఒప్పందాలను కుదుర్చుకోవడం సర్వసాధారణం. చాలా దేశాల్లో వ్యక్తిగతంగాను, కార్పొరేట్ సంస్థలు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే యునైటెడ్ స్టేట్స్‌లో, ఆవిష్కర్త(లు) మాత్రమే పేటెంట్ కోసం దరఖాస్తు చేయగలరు. తదనంతరం దానిని ఒక కార్పొరేట్ సంస్థకు కేటాయించవచ్చు లేదా ఆవిష్కర్తలు కూడా తమ ఉద్యోగ ఒప్పందం ప్రకారం యజమానులకు ఆవిష్కరణలను కేటాయించవలసి ఉంటుంది.[36]

మిలిటరీ విమానం యొక్క మార్టిన్ ఎజెక్టర్ సీటు యొక్క ప్లేట్, ఉత్పత్తి UK, దక్షిణాఫ్రికా, కెనడాలో బహుళ పేటెంట్ల ద్వారా కవర్ చేయబడిందని , "ఇతర" అధికార పరిధిలో పెండింగ్‌లో ఉందని పేర్కొంది. డ్యూబెండోర్ఫ్ మ్యూజియం ఆఫ్ మిలిటరీ ఏవియేషన్.

పారిస్ కన్వెన్షన్ కనీస పేటెంట్ రక్షణను 20 సంవత్సరాలకు నిర్దేశించింది, అయితే కన్వెన్షన్‌లోని అత్యంత ముఖ్యమైన అంశం ప్రాధాన్యతను క్లెయిమ్ చేసే హక్కును అందించడం. ప్యారిస్ కన్వెన్షన్‌లోని ఏదైనా ఒక సభ్య దేశంలో దరఖాస్తును దాఖలు చేయడం ద్వారా పేటెంట్ ఫైల్ చేయడానికి ఒక సంవత్సరం పాటు హక్కు ఉంటుంది. మరో కీలక ఒప్పందం పేటెంట్ సహకార ఒడంబడిక (పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ - PCT). ఇది ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) చే నిర్వహించబడుతుంది, 150 కంటే ఎక్కువ దేశాలు దీనిని అనుసరిస్తున్నాయి. యజమానులకు ధరఖాస్తు కోసం 30 నెలల ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆవిష్కరణలను రక్షించడానికి పేటెంట్ ధరఖాస్తులను దాఖలు చేయడానికి ఏకీకృత విధానాన్ని అందిస్తుంది. PCT కింద దాఖలు చేసిన పేటెంట్ దరఖాస్తును అంతర్జాతీయ దరఖాస్తు లేదా PCT దరఖాస్తు అంటారు. పేటెంట్ చట్ట ఒడంబడిక (పేటెంట్ లా ట్రీటీ -PLT) ఫైలింగ్ తేదీ, అవసరాలను, దరఖాస్తు పత్రాలను (ఫారమ్‌) ప్రామాణికం చేస్తుంది, ఎలక్ట్రానిక్ సమాచార ప్రసారాన్ని (కమ్యూనికేషన్), ఎలక్ట్రానిక్ మాధ్యమంలో నమోదు (ఫైలింగ్‌) ను అనుమతిస్తుంది. పేటెంట్ కార్యాలయ విధానాలను సులభతరం చేస్తుంది.[37] PCT దరఖాస్తుల దశలు: 1. దరఖాస్తును దాఖలు చేయడం; 2. అంతర్జాతీయ స్థాయిలో పరీక్ష; 3. జాతీయ స్థాయిలో పరీక్ష.[38] కొన్నిసార్లు, దేశాలు పేటెంట్ యజమాని కాకుండా ఇతరులకు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే పేటెంట్ పొందిన ఉత్పత్తిని రూపొందించడానికి అనుమతులను మంజూరు చేస్తాయి. ఇవి తప్పనిసరి అనుమతులు, శాస్త్రీయ పరిశోధన, దేశంలో రవాణాకు సంబంధించి ఉండవచ్చు.[39]

పేటెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, వారి ఆవిష్కరణ పేటెంట్ పొందగలదని నిర్ధారించుకోవాలి. ఆవిష్కరణ ఏదైనా కొత్తది ఉపయోగకరమైనది స్పష్టమైన అయిఉండాలి. ఉదాహరణకు, ఖనిజాలు, పదార్థాలు, జన్యువులు, వాస్తవాలు, జీవులు, జీవప్రక్రియలు పేటెంట్ చేయబడవు.[40] కళలో నైపుణ్యం ఉన్న వ్యక్తికి ఆవిష్కరణను రూపొందించడానికి, ఉపయోగించడానికి, సాంకేతిక సమస్యలు, పరిష్కరించబడిన సమస్యలు తగిన వివరాలను దరఖాస్తులోనే ఇవ్వాలి. ఆవిష్కరణను వివరించే రేఖాచిత్రాల (డ్రాయింగ్‌) ను కూడా అందించవచ్చు.

దాఖలు చేసిన తర్వాత, ఒక దరఖాస్తు" నిరీక్షణలోని పేటెంట్ (పెండింగ్) "గా సూచించబడుతుంది. ఈ పదం చట్టపరమైన రక్షణను అందించనప్పటికీ, పేటెంట్ మంజూరు చేయబడే వరకు అమలు చేయబడదు, పేటెంట్ జారీ చేయబడితే సంభావ్య ఉల్లంఘనదారులకు హెచ్చరికను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది.[41][42] ఒకసారి పేటెంట్ మంజూరు చేయబడిన తర్వాత సాధారణంగా చాలా దేశాల్లో పేటెంట్‌ను అమలులో ఉంచడానికి పునరుద్ధరణ రుసుము వార్షిక ప్రాతిపదికన చెల్లించబడతాయి. కొన్ని దేశాలలో ప్రాంతీయ పేటెంట్ కార్యాలయాలు (ఉదా. యూరోపియన్ పేటెంట్ కార్యాలయం) పేటెంట్ దరఖాస్తు మంజూరు చేయడానికి ముందు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

ప్రయోజనాలు

పేటెంట్‌లు సాధారణ ప్రయోజనాల కోసం ప్రజోపయోగ పరిధి (పబ్లిక్ డొమైన్‌) లోకి ఆవిష్కరణలను బహిర్గతం చేయడానికి, ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆవిష్కర్తలకు పేటెంట్ల యొక్క చట్టపరమైన రక్షణ లేకపోతే, అనేక సందర్భాల్లో, తమ ఆవిష్కరణలను రహస్యంగా ఉంచడానికి మొగ్గు చూపవచ్చు.[43]. ఈ పేటెంట్లు దరఖాస్తుల ప్రచురణ మరింత కొత్త ఆవిష్కరణ కార్యకలాపాలను ప్రేరేపింస్తుంది. ఇటువంటి నకిలీ పనిని నివారించడం ద్వారా మానవజీవన నాణ్యత తద్వారా సమాజ శ్రేయస్సు మెరుగుపడుతుంది.

WIPO ఆవిష్కరణలకు పేటెంట్ పొందడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలను పేర్కొంది -

  • పేటెంట్ దరఖాస్తును దాఖలు చేసిన తేదీ నుండి 20 సంవత్సరాల వరకు ఇతరులు ఒక ఆవిష్కరణను వాణిజ్యపరంగా నకలు లేదా దోపిడీ చేయకుండా నిరోధించగలగడం.
  • పెట్టుబడులపై రాబడి: పేటెంట్లు ఆర్థికంగా సమర్థవంతమైన పరిశోధన అభివృద్ధికి (R&D) ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన మొత్తంలో డబ్బును,  సమయాన్ని పెట్టుబడి పెట్టిన తర్వాత, ఆవిష్కర్త మార్కెట్‌లో స్థిరపడి పెట్టుబడులపై అధిక రాబడిని పొందగలడు. అంతేకాకుండా, పేటెంట్ పొందిన ఆవిష్కరణ యొక్క వాణిజ్యీకరణను మరొక సంస్థకు అనుమతులను జారీచేసే అవకాశం ఉంటుంది, ఇది వ్యక్తి లేదా సంస్థకు ఆదాయాన్ని పెంపొందిస్తుంది. 
  • పేటెంట్ వివరాల (పోర్ట్‌ఫోలియోలు) ను అనుసరించి కంపెనీకి చెందిన వ్యాపార భాగస్వాములు, పెట్టుబడిదారులు, వాటాదారులు అధికస్థాయి నైపుణ్యం, ప్రత్యేకత, సాంకేతిక సామర్థ్యంగా భావించవచ్చు. ఈ సానుకూల భావము నిధులను సేకరించడానికి, వ్యాపార భాగస్వాములను కనుగొనడానికి వ్యక్తులు/సంస్థలకు వాణిజ్య (మార్కెట్) విలువను పెంచడానికి ఉపయోగపడుతుంది.
  • ఆవిష్కరణల సమాచారం బహిరంగంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత పేటెంట్లకు ప్రోత్సాహకాలు, రక్షణ, ఆవిష్కర్తలకు గుర్తింపు, వారి ఆవిష్కరణలకు ప్రతిఫలం, బహుమతులు లభిస్తాయి.

విశ్వసనీయ సమాచారం లేకపోవడం కొన్ని ఉల్లంఘనల వ్యాజ్యాలు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. 2008లో కేవలం ఐరోపా‌లోనే పేటెంట్ పొందిన R&D ఉత్పత్తులపై 20 బిలియన్ యూరోలు వృధా అయ్యాయి అని యూరోపియన్ పేటెంట్ కార్యాలయ గణాంకాలు పేర్కొన్నాయి. పేటెంట్ల ఉల్లంఘనకు సంబంధించిన వ్యాజ్యాలు కూడా గణనీయమైన సమయం, డబ్బును వినియోగించాయి, ఉదా. మైక్రోసాఫ్ట్‌కు వ్యతిరేకంగా ఎయోలాస్ టెక్నాలజీస్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ద్వారా పేటెంట్ వివాదాన్ని పరిష్కరించడానికి 8 సంవత్సరాలు వెచ్చించింది. మైక్రోసాఫ్ట్‌పై జ్యూరీ అవార్డు $521 మిలియన్లు. దాని తక్షణ కెమెరా సాంకేతికతను ఉల్లంఘించినందుకు కొడాక్‌పై పోలరాయిడ్ దావాను పరిష్కరించడానికి 15 సంవత్సరాలు పట్టింది. ఈస్ట్‌మన్ కొడాక్ పోలరాయిడ్‌కి $925 మిలియన్లు చెల్లించింది. ‘రీసెర్చ్ ఇన్ మోషన్’ విస్టో కార్పోరేషన్ తో 'ఇ-మెయిల్' టెక్నాలజీ పై పేటెంట్ ఉల్లంఘన దావాను మూడు సంవత్సరాల తర్వాత $267.5 మిలియన్లకు పరిష్కరించింది.

పేటెంట్ కార్యాలయాలు

భారతదేశముతో సహా దాదాపు ప్రతి దేశము పేటెంట్ కార్యాలయాన్ని నిర్వహిస్తుంది.

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (World Intellectual Property Organization - WIPO) ప్రపంచ వ్యాప్తంగా మేధో సంపత్తి (IP) సేవలు, విధానం, సమాచారం, సహకారం అందించే వేదిక. 1967లో WIPOని స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. WIPO మేధో సంపత్తికి సంబంధించి ఆదేశాలు, పాలక సంస్థలు అనుసరించవలసిన  విధానాలను నిర్దేశించింది. అందరి ప్రయోజనం కోసం ఆవిష్కరణలను  సృజనాత్మకతను పెంపొందించే విధంగా  సమతుల్యమయిన, సమర్థవంతమైన అంతర్జాతీయ మేధో సంపత్తి వ్యవస్థ అభివృద్ధికి నాయకత్వం వహించడమే ఈ సంస్థ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నుంచి WIPO సమగ్ర డేటా, వాస్తవ సమాచారం, గణాంక, చట్టపరమైన, సాంకేతిక సమాచారం, అధ్యయనాలు, మేధో సంపత్తి వ్యవస్థపై నివేదికలను అందిస్తుంది.  అనేక పేటెంట్ సమాచారం సంబంధిత సేవలను అందించే సాంకేతిక ఆవిష్కరణల మద్దతు కేంద్రాలు  (టెక్నాలజీ, ఇన్నోవేషన్ సపోర్ట్ సెంటర్‌ -TISCs) స్థాపన, అభివృద్ధికి ఈ సంస్థ మద్దతు ఇస్తుంది. ఇది అన్ని సభ్య దేశాలలో మేధో సంపత్తి కార్యాలయాల సమాచార దర్శిని (డైరెక్టరీ) ని నిర్వహిస్తుంది. ఈ ప్రపంచ సంస్థ అల్జీర్స్ (అల్జీరియా), రియో డి జనీరో (బ్రెజిల్), బీజింగ్ (చైనా), టోక్యో (జపాన్), అభుజా (నైజీరియా), మాస్కో (రష్యా), సింగపూర్ ప్రాంతాలలో తమ కార్యాలయాలను ఆయా ప్రాంతాల సౌకర్యార్ధం నిర్వహిస్తున్నారు.[44]

అమెరికా పేటెంట్ , ట్రేడ్ మార్క్ కార్యాలయం

అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయం (USPTO - United States Patent, Trademark Office) వాణిజ్య విభాగానికి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్) అనుసంధానంగా పనిచేస్తోంది. దీని ప్రధాన కార్యాలయం వర్జీనియా లోని అలెగ్జాండ్రియాలో ఉంది. ఇది జూలై 4, 1836 న ఏర్పడింది.[45] ఆవిష్కరణల రక్షణ కోసం పేటెంట్లను మంజూరు చేయడం, ట్రేడ్‌మార్క్‌లను నమోదు చేయడం దీని విధి. ఇది అమెరికా అధ్యక్షుడు, వాణిజ్య శాఖ కార్యదర్శి, వాణిజ్య శాఖ యొక్క కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు "మేధో సంపత్తి" విషయాలలో అన్ని దేశీయ అంతర్జాతీయ అంశాలలో సహాయం చేస్తుంది. ఇంకా, USPTO పేటెంట్ సమాచారాన్ని భద్రపరచి, నిర్వహిస్తుంది, వ్యాప్తి చేయడానికి ప్రచురిస్తుంది. ప్రజా ప్రయోజనం కోసం దేశ విదేశీ పేటెంట్‌ల శోధన సమాచారమును ఉపయోగిస్తుంది. మేధో సంపత్తి రక్షణపై అవగాహనను పెంపొందింస్తుంది. ఇంకా ప్రపంచవ్యాప్తంగా కొత్త సాంకేతికాలు అభివృద్ధి చేసి భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుంది.[46]

ఐరోపా పేటెంట్ కార్యాలయం [47]

ఐరోపా పేటెంట్ కార్యాలయం (EPO – European Patent Office Archived 2023-06-22 at the Wayback Machine) ఐరోపా అంతటా ఆవిష్కరణ, పోటీతత్వం, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తుంది. ఇది 1973లో మ్యూనిచ్‌లో సంతకం చేసిన యూరోపియన్ పేటెంట్ కన్వెన్షన్ (EPC) ఆధారంగా 1977 అక్టోబరు 7న ఏర్పాటు చేయబడింది. ఐరోపా పేటెంట్ సంస్థకి ఐరోపా పేటెంట్ కార్యాలయం కార్యనిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. మరియొకటి పరిపాలనా విభాగం (అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్.). ఈ పరిపాలనా విభాగం దాని పర్యవేక్షక సంస్థగా పరిమిత స్థాయిలో దాని శాసన సంస్థగా పనిచేస్తుంది. ఐరోపా పేటెంట్ కార్యాలయంలో, ఒక ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు నిర్ణయించడానికి, దరఖాస్తుదారులు దాఖలు చేసిన యూరోపియన్ పేటెంట్ దరఖాస్తులను అధ్యయనం చేసే బాధ్యతను పరిశీలకులది. యూరోపియన్ పేటెంట్ కార్యాలయం మంజూరు చేసిన పేటెంట్లను యూరోపియన్ పేటెంట్లు అంటారు. న్యాయవాదులు, పేటెంట్ కార్యాలయ సిబ్బంది, న్యాయమూర్తులు ఇతర ఆసక్తిగలవారికి పేటెంట్ సమాచారం, శిక్షణ మొదలగు సేవలను అందిస్తుంది. ఈ కార్యాలయం సభ్య దేశాలు, ప్రపంచంలోని ఇతర దేశాల పేటెంట్ కార్యాలయాలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తుంది.[48]

భారతీయ పేటెంట్ వ్యవస్థ

భారతీయ పేటెంట్ వ్యవస్థ (ఇండియన్ పేటెంట్ సిస్టం - IPS) ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్,, ట్రేడ్‌మార్క్‌ (CGPDTM), భారత ప్రభుత్వంలోని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం క్రింద పని చేస్తోంది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ & ట్రేడ్ మార్క్స్ (CGPDTM) కార్యాలయం ముంబైలో ఉంది.

  • పేటెంట్ కార్యాలయం యొక్క ప్రధాన కార్యాలయం కోల్‌కతాలో ఉంది, దాని శాఖా కార్యాలయాలు చెన్నై, న్యూఢిల్లీ, ముంబైలలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేక ప్రాదేశిక అధికార పరిధిని కలిగి ఉంది.
  • ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ముంబైలో ఉంది, దాని శాఖలు కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, న్యూఢిల్లీలో ఉన్నాయి.
  • డిజైన్ కార్యాలయం కోల్‌కతాలో పేటెంట్ కార్యాలయంలో ఉంది.
  • పేటెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (PIS), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ (NIIPM) కార్యాలయాలు నాగ్‌పూర్‌లో ఉన్నాయి.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, యాక్ట్ 1970లో సవరించిన ప్రకారం డిజైన్స్ యాక్ట్ 2000, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999 యొక్క పనిని పర్యవేక్షిస్తారు ఇంకా ఈ విషయాలకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వానికి సలహాలు కూడా అందిస్తారు. IPI న్యాయ వ్యవస్థ 1856లో చట్టం VIతో ప్రారంభించబడింది, ఇందులో 14 సంవత్సరాల పాటు కొత్త ఆవిష్కర్తలకు కొన్ని ప్రత్యేక అధికారాలు మంజూరు చేయబడ్డాయి. ఇది 1852 నాటి బ్రిటిష్ పేటెంట్ చట్టంపై ఆధారపడింది. భారతీయ పేటెంట్ వ్యవస్థ ప్రధానంగా పేటెంట్ల చట్టం, 1970 (క్ర.సం.39) ద్వారా నిర్వహించబడుతుంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పేటెంట్ నిబంధనలు ఎప్పటికప్పుడు సవరించబడతాయి. పేటెంట్ల చట్టం, 1970 సెక్షన్ 159 ప్రకారం, చట్టాన్ని అమలు చేయడానికి, పేటెంట్ పరిపాలనను నియంత్రించడానికి నియమాలను రూపొందించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. పేటెంట్ నిబంధనలు 20.4.1972 నుండి 2003 మే 20 వరకు కొనసాగాయి. ఈ నియమాలు 2005లో, 2006లో ఇటీవల 2016 లో పేటెంట్స్ (సవరణ) నిబంధనల ద్వారా ప్రతి పేటెంట్‌కు దరఖాస్తు దాఖలు చేసిన తేదీ నుండి 20 సంవత్సరాల వ్యవధి మంజూరు చేయబడుతుంది. ఆవిష్కర్త IPI తో పేటెంట్ దరఖాస్తును ఫైల్ చేసిన తర్వాత 12 నెలలలోపు PCTలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసే ప్రమాణాలు - ఆవిష్కరణ అనేది కొత్తగా ఉండాలి, పారిశ్రామిక అప్లికేషన్‌ల సామర్థ్యం కలిగి ఉండాలి. పేటెంట్ చట్టం 1970 సెక్షన్ 3, 4 నిబంధనలలో జాబితా చేయబడిన వస్తువులకు దరఖాస్తు చేయకూడదు.

పేటెంట్ కోసం దరఖాస్తును అచ్చులో సమర్పించడం ద్వారా లేదా వివరాలను సమర్పించడానికి డిజిటల్ సంతకంతో ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ద్వారా హిందీ లేదా ఇంగ్లీషులో దాఖలు చేయవచ్చు. పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేసిన తేదీ లేదా ప్రాధాన్యత తేదీ నుండి 18 నెలల వరకు రహస్యంగా ఉంచబడతాయి. పేటెంట్ కార్యాలయం, IPO వెబ్‌సైట్ లో అధికారిక వార పత్రికలో ప్రచురించబడతాయి. దరఖాస్తుదారు పేటెంట్ కోసం తన అభ్యర్థనను 15 నెలలలోపు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు.[49]

పేటెంట్ సమాచారం లభించే వనరులు

పేటెంట్ సమాచారం, పేటెంట్ కోసం చేసిన దరఖాస్తులు, మంజూరు చేయబడిన వాటినుంచి గ్రహిస్తారు. దీనిలో ఆవిష్కర్త లేదా పేటెంట్ దరఖాస్తుదారు లేదా పేటెంట్ హక్కుదారు నమోదు చేసిన ఆవిష్కరణ, సాంకేతిక రంగంలో సంబంధిత పరిణామాల వివరణ, దావాల జాబితాను, దరఖాస్తుదారు కోరిన పేటెంట్ రక్షణ పరిధి వంటి సమాచారం ఉంటుంది. పరిశోధన అభివృద్ధి పనుల నకిలీని నివారించడానికి పరిశోధకులు, పరిశ్రమలు, వ్యవస్థాపకులు మొదలైన వారికి ఈ సమాచారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేటెంట్ల ద్వారా రక్షించబడిన ఆవిష్కరణలను గుర్తించడానికి, ముఖ్యంగా ఉల్లంఘనను నివారించడానికి, అనుమతుల కోసం అవకాశాలను వెతకడానికి; దేశ విదేశాలలో సంభావ్య భాగస్వాములు పోటీదారుల కార్యకలాపాలను పర్యవేక్షించడం వీలవుతుంది. ఈ సమాచారం పేటెంట్ కార్యాలయ అంతర్జాల వేదికలు (Web sites), గూగుల్ పేటెంట్స్ ద్వారా ఉచితంగాను, ఇంకా చందా కట్టిన వైజ్ఞానిక పత్రికలు, డేటాబేస్ లలో లభిస్తుంది. ఉదాహరణకి ఉచిత సమాచారం ఈ క్రింది వనరులు నుంచి లభిస్తుంది -

  • "పేటెంట్ స్కోప్" ప్రపంచ మేధో సంపత్తి సంస్థ వారి పేటెంట్ డేటాబేస్.
  • USPTO పేటెంట్ డేటాబేస్ - అమెరికా పేటెంట్, ట్రేడ్ మార్క్ కార్యాలయం నుంచి
  • Espacenet – పేటెంట్ శోధన - ఐరోపా పేటెంట్ కార్యాలయం నుంచి
  • గూగుల్ పేటెంట్స్
  • భారతీయ పేటెంట్ సంబంధించిన సమాచారం ప్రతి శుక్రవారం జారీ చేయబడిన పేటెంట్ కార్యాలయ వారపత్రికలో ప్రచురించబడుతుంది. ఇది పేటెంట్ కార్యాలయ వెబ్‌సైట్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది, [49]

వైజ్ఞానిక ప్రచురణకర్తలైన బెంతాం, ఎలిసేవియార్, టేలర్ అండ్ ఫ్రాన్సిస్ వారి పత్రికలూ, పుస్తకాలు పేటెంట్ సమాచారాన్ని ప్రచురిస్తాయి. కెమికల్ ఆబ్స్ట్రాక్ట్ సర్వీస్ డేటాబేస్, ఎలిసేవియర్ స్కొపస్, ఐఇఇఇ ఎక్సప్లోర్, వెబ్ ఆఫ్ సైన్స్‌లో డెర్వెంట్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్ మొదలయిన డేటాబేస్ లు పేటెంట్ సమాచారాన్ని అందచేస్తాయి.

ప్రస్తావనలు

బాహ్య లింకులు