బేరెంట్స్ సముద్రం

నార్వే, రష్యాల ఉత్తర తీరాన ఉన్న సముద్రం

బేరెంట్స్ సముద్రం ఆర్కిటిక్ మహాసముద్రపు ఉపాంత సముద్రం. ఇది నార్వే, రష్యాల ఉత్తర తీరాలలో ఉంది. ఈ రెండు దేశాల ప్రాదేశిక జలాల మధ్య ఇది విభజించబడింది. [1] మధ్య యుగాలలో రష్యన్లలో దీన్ని ముర్మాన్ సముద్రం ("నార్స్ సముద్రం") అని పిలిచేవారు. ప్రస్తుత పేరు చారిత్రక డచ్ నావికుడైన విల్లెం బేరెంట్స్జ్ పేరు మీద వచ్చింది.

బేరెంట్స్ సముద్రం
బేరెంట్స్ సముద్రం స్థానం
ప్రదేశంఆర్కిటిక్ మహాసముద్రం
అక్షాంశ,రేఖాంశాలు75°N 40°E / 75°N 40°E / 75; 40 (Barents Sea)
రకంసముద్రం
ప్రాథమిక ప్రవేశంనార్వేజియన్ సముద్రం, ఆర్కిటిక్ సముద్రం
బేసిన్ దేశాలునార్వే, రష్యా
1,400,000 km2 (540,000 sq mi)
సగటు లోతు230 m (750 ft)
మూలాలుInstitute of Marine Research, Norway

ఇది పెద్దగా లోతులేని సముద్రం - సగటు లోతు 230 metres (750 ft) ఉంటుంది. ఇది చేపలవేటకు, చమురు గ్యాసుల అన్వేషణకూ ముఖ్యమైన ప్రదేశం. [2] బేరెంట్స్ సముద్రానికి దక్షిణాన కోలా ద్వీపకల్పం, పశ్చిమాన నార్వేజియన్ సముద్రం వైపు షెల్ఫ్ అంచు, వాయువ్యంలో స్వాల్‌బార్డ్ ద్వీపసమూహాలు, ఈశాన్యంలో ఫ్రాంజ్ జోసెఫ్ ల్యాండ్, తూర్పున నోవాయా జెమ్లియాలు సరిహద్దులుగా ఉన్నాయి. నోవాయా జెమ్లియా ద్వీపాలు, కారా సముద్రం నుండి బేరెంట్స్ సముద్రాన్ని వేరు చేస్తాయి.

ఆర్కిటిక్ మహాసముద్రంలో భాగమైనప్పటికీ, బేరెంట్స్ సముద్రం " అట్లాంటిక్‌గా మారుతోంది" [3] లేదా "అట్లాంటిఫై" అయ్యే ప్రక్రియలో ఉంది. [4] ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వస్తున్న హైడ్రోలాజికల్ మార్పులు సముద్రపు మంచు తగ్గడానికి, నీటి స్తరీకరణకూ దారితీశాయి. ఇది యురేషియాలో వాతావరణంలో పెద్ద మార్పులను సృష్టించగలదు. [3] బేరెంట్స్ సముద్రంలో శాశ్వత మంచు రహిత ప్రాంతం పెరిగేకొద్దీ పెరిగే అదనపు బాష్పీభవనం, ఐరోపా ఖండంలో చాలా ప్రాంతాల్లో శీతాకాలపు హిమపాతం పెరుగుతుందని ఒక అంచనా.

పరిధి

ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ బారెంట్జ్ సముద్రపు హద్దులను క్రింది విధంగా నిర్వచించింది: [5]

పశ్చిమాన : నార్వేజియన్ సముద్రపు ఈశాన్య పరిమితి [ పశ్చిమ స్పిట్జ్‌బర్గెన్ యొక్క దక్షిణ బిందువును బేర్ ఐలాండ్ యొక్క నార్త్ కేప్‌కి, ఈ ద్వీపం ద్వారా కేప్ బుల్‌కి, అక్కడి నుండి నార్వేలోని నార్త్ కేప్‌కి (25°45'E) కలిపే రేఖ].
వాయువ్యంలో : పశ్చిమ స్పిట్జ్‌బర్గెన్ తూర్పు తీరంలో 80° అక్షాంశ ఉత్తరం వరకు హిన్లోపెన్ జలసంధి ; ఈశాన్య భూమి [ నార్డాస్ట్‌ల్యాండ్ ద్వీపం] దక్షిణ, తూర్పు తీరాలు కేప్ లీ స్మిత్ (80°05′N 28°00′E / 80.083°N 28.000°E / 80.083; 28.000 ).
ఉత్తరాన : కేప్ లీ స్మిత్ ద్వీపాలు బోల్షోయ్ ఓస్ట్రోవ్ (గ్రేట్ ఐలాండ్) [ స్టోరోయా ], గిల్లెస్ [ క్విటోయా ] విక్టోరియా ; కేప్ మేరీ హార్మ్స్‌వర్త్ ( అలెగ్జాండ్రా ల్యాండ్ నైరుతి అంత్య భాగం) ఫ్రాంజ్-జోసెఫ్ ల్యాండ్ ఉత్తర తీరాల వెంబడి కేప్ కోల్‌సాట్ వరకు (81°14′N 65°10′E / 81.233°N 65.167°E / 81.233; 65.167 )
తూర్పున : కేప్ కోల్‌సాట్ నుండి కేప్ జెలానియా (డిజైర్); నోవాయా జెమ్లియా యొక్క పశ్చిమ, నైరుతి తీరం నుండి కేప్ కుస్సోవ్ నోస్ వరకూ, అక్కడి నుండి పశ్చిమ ద్వారం కేప్, డోల్గయా బే వరకు (70°15′N 58°25′E / 70.250°N 58.417°E / 70.250; 58.417 ) వైగాచ్ ద్వీపం, వైగాచ్ ద్వీపం ద్వారా కేప్ గ్రెబెన్ వరకు; అక్కడి నుండి ప్రధాన భూభాగంలోని కేప్ బెలీ నోస్‌ వరకు.
దక్షిణాన : తెల్ల సముద్రపు ఉత్తర హద్దు [స్వ్యాటోయ్ నోస్ ( మర్మాన్స్క్ కోస్ట్, 39°47'E), కేప్ కనిన్‌లను కలిపే రేఖ].

బేరెంట్స్ సముద్రంలోని ఇతర ద్వీపాలలో చైచీ, టిమానెట్స్ ఉన్నాయి.

చరిత్ర

స్వాల్బార్డ్ సమీపంలో డచ్ తిమింగలాలు, 1690

బేరెంట్స్ సముద్రాన్ని గతంలో రష్యన్లు ముర్మాన్స్కోయ్ మోర్ లేదా "సీ ఆఫ్ మర్మాన్స్" (అంటే, నార్వేజియన్లకు వారి పదం) అని పిలిచేవారు. 1595 లో గెరార్డ్ మెర్కేటర్ప్రచురించిన మ్యాప్ ఆఫ్ ఆర్కిటిక్‌తో పదహారవ శతాబ్దపు మ్యాప్‌లలో ఈ పేరుతో కనిపిస్తుంది. పెచోరా నది ఎశ్చువరీ ప్రాంతంలో దాని తూర్పు మూలను పెచోర్స్కోయ్ మోరీ, అంటే పెచోరా సముద్రం అని పిలుస్తారు.

డచ్ నావికుడు, అన్వేషకుడు విల్లెం బారెంట్జ్ గౌరవార్థం ఈ సముద్రానికి యూరోపియన్లు ప్రస్తుత పేరు పెట్టారు. బారెంట్జ్ పదహారవ శతాబ్దం చివరిలో ఉత్తరానికి చేసిన తొలి యాత్రలకు నాయకుడు.

నావికులు బేరెంట్స్ సముద్రపు అనూహ్యత, క్లిష్టత స్థాయి కారణంగా దాన్ని" ది డెవిల్స్ డ్యాన్స్ ఫ్లోర్ " అని పిలుస్తారు. [6]

ఓషన్ రోవర్లు దీనిని " డెవిల్స్ జా " అని పిలుస్తారు. 2017లో కెప్టెన్ ఫియాన్ పాల్‌, పోలార్ రో సాహసయాత్రలో ట్రోమ్‌సో నుండి లాంగ్‌ఇయర్‌బైన్‌కు బేరెంట్స్ సముద్రాన్ని మొదటిసారిగా ఒక రో బోట్‌లో దాటాడు. ఆ తరువాత బేరెంట్స్ సముద్రం ఎలా ఉంది అని టీవీ పాత్రికేయులు అడిగినపుడు అతను అది "డెవిల్స్ జా" (దయ్యపు దవడ) అని అన్నాడు. [7]

ఆధునిక యుగం

రెండవ ప్రపంచ యుద్ధంలో బేరెంట్స్ సముద్రం ఒక ముఖ్యమైన యుద్ధ రంగం. ఇక్కడ బ్రిటిష్ వ్యాపార నౌకల కాన్వాయ్‌పై జర్మనీ దాడి చేసింది. దీన్ని తరువాత బేరెంట్స్ సీ యుద్ధం అన్నారు. ఆస్కార్ కుమ్మెట్జ్ ఆధ్వర్యంలో, జర్మన్ యుద్ధనౌకలు, HMS బ్రాంబుల్, డిస్ట్రాయర్ HMS అచేట్స్ లను ముంచేసాయి. డిస్ట్రాయర్ జెడ్ 16 ఫ్రెడరిక్ ఎక్కోల్ట్, అడ్మిరల్ హిప్పర్ నౌకలు బ్రిటిషు తుపాకీ కాల్పుల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జర్మన్లు తర్వాత వెనక్కి తగ్గారు. బ్రిటిషు నౌకలు కొద్దిసేపటి తర్వాత మర్మాన్స్క్ వద్దకు సురక్షితంగా చేరుకుంది.

ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, సోవియట్ రెడ్ బ్యానర్ నార్తర్న్ ఫ్లీట్, బేరెంట్స్ సముద్రపు దక్షిణ ప్రాంతాలను బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి స్థావరంగా వాడుకుంది. ఈ వ్యూహం రష్యా కొనసాగిస్తోంది. రష్యా నావికా రియాక్టర్ల నుండి చెత్తను బేరెంట్స్ సముద్రంలో పారబోస్తున్నందు వలన కలిగే అణు కాలుష్యం, పర్యావరణ ఆందోళన కలిగిస్తోంది.

దశాబ్దాలుగా నార్వే, రష్యాల మధ్య బేరెంట్స్ సముద్రంలో తమతమ సరిహద్దు స్థానాలకు సంబంధించి వివాదం ఉంది. నార్వేజియన్లు 1958 జెనీవా కన్వెన్షన్ ఆధారంగా మధ్యస్థ రేఖకు మొగ్గు చూపారు. అయితే రష్యన్లు 1926 నాటి సోవియట్ నిర్ణయం ఆధారంగా మెరిడియన్ -ఆధారిత సెక్టార్ లైన్‌కు మొగ్గుచూపారు. [8] వారి వాదనల మధ్య ఉండే తటస్థ "గ్రే" జోన్ విస్తీర్ణం 1,75,000 చ.కి.మీ ఉంది. ఇది బేరెంట్స్ సముద్రపు మొత్తం వైశాల్యంలో దాదాపు 12%. 1974 లో రెండు దేశాలు, సరిహద్దుపై చర్చలు ప్రారంభించాయి. 1976 లో హైడ్రోకార్బన్ అన్వేషణపై తాత్కాలిక నిషేధం విధించుకునేందుకు అంగీకరించాయి.

2010 లో, సోవియట్ యూనియన్ పతనమైన ఇరవై సంవత్సరాల తర్వాత, నార్వే రష్యాలు సరిహద్దును తమతమ వాదనలకు సమాన దూరంలో ఉంచే ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది 2011 జూలై 7 న అమలులోకి వచ్చింది, హైడ్రోకార్బన్ అన్వేషణ కోసం గ్రే జోన్‌ను ప్రారంభించింది. [9]

చమురు, వాయువు

1960లలో ఉత్తర సముద్రంలో చమురు అన్వేషణ, ఉత్పత్తి విజయవంతం కావడంతో నార్వే, 1969లో బేరెంట్స్ సముద్రంలో హైడ్రోకార్బన్ అన్వేషణను ప్రారంభించింది. వారు తరువాతి సంవత్సరాలలో భూకంప ప్రతిబింబ సర్వేలు చేసారు. వాటిని విశ్లేషించి, ప్రధాన అవక్షేపణ బేసిన్‌ల స్థానాలను తెలుసుకున్నారు. నార్స్క్‌హైడ్రో 1980లో మొదటి బావిని తవ్వింది. అయితే ఇందులో చమురు కనబడలేదు. మరుసటి సంవత్సరం తవ్విన ఆల్కే, అస్కెలాడెన్ గ్యాస్ ఫీల్డ్‌లలో చమురు కనబడింది. [8] 1980లలో బేరెంట్స్ సముద్రానికి నార్వే వైపున ముఖ్యమైన స్నోహ్విట్ ఫీల్డ్‌తో సహా అనేక ఇతర బావుల్లో చమురును కనుగొన్నారు. [10]

కానీ, వరుసగా చమురు లేని, కొన్నిటిలో గ్యాస్ (అప్పట్లో ఇది చౌకగా ఉండేది) మాత్రమే ఉన్న బావులు కనబడడం, అవి కూడా బాగా మారుమూల ప్రాంతంలో ఉండడంతో వాటికి చాలా ఖర్చు అవుతూండడం కారణంగా ఈ ప్రాంతంపై ఆసక్తి తగ్గడం ప్రారంభమైంది. 2000ల చివరలో స్నోవ్‌హిట్ ఫీల్డ్‌ను ఉత్పత్తిలోకి [11] తీసుకువచ్చిన తర్వాత, కొత్తగా రెండు పెద్ద బావుల్లో చమురును కనుగొన్న తర్వాత ఈ ప్రాంతంపై ఆసక్తి మళ్ళీ పెరిగింది. [12]

రష్యన్లు దాదాపు అదే సమయంలో తమ భూభాగంలో అన్వేషణ ప్రారంభించిన రష్యన్లు టిమాన్-పెచోరా బేసిన్‌లో జరిపిన అన్వేషణల్లో విజయాలు పొందారు. 1980 ల ప్రారంభంలో మొదటగా బావులను తవ్వారు. ఆ దశాబ్దంలో చాలా పెద్ద గ్యాస్ క్షేత్రాలను కనుగొన్నారు. 1988లో కనుగొన్న ష్టోక్మాన్ ఫీల్డ్ ఒక పెద్ద గ్యాస్ ఫీల్డ్‌. ప్రస్తుతం ఇది ప్రపంచంలో 5వ అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ . 1990 వ దశకంలో దేశంలో రాజకీయ అస్థిరత కారణంగా బేరెంట్స్ సముద్రంలో రష్యా అన్వేషణ తగ్గింది.

మూలాలు