భూఖండ చలనము

భూఖండ చలనము (కాంటినెంటల్ డ్రిఫ్ట్) అనగా ఖండాల యొక్క పరస్పర కదలిక.[1] సముద్ర గర్భంపై ఈ ఖండాలు కదలుతున్నట్లుగా అనిపిస్తుంది. ఖండాలు ఇలా కదలి ఉండవచ్చని మొట్టమొదట ఆలోచన వ్యక్తం చేసింది 1596 లో అబ్రహం ఓర్టీలియస్ అన్న శాస్త్రవేత్త. ఈ భావనను స్వతంత్రంగా, సంపూర్ణంగా వృద్ధి చేసినది 1912 లో ఆల్ఫ్రెడ్ వేజెనర్ అన్న వ్యక్తి. దీన్ని విపులీకరించే మెకానిజం లేకపోవడం వలన, ఇతర సిద్ధాంతాల పట్ల ఉన్న నమ్మకం వలననూ కొందరు దీన్ని వ్యతిరేకించారు. ఈ భూఖండ కదలికల సిద్ధాంతాన్ని, తరువాతి కాలంలో ప్లేట్ టెక్టోనిక్స్ అన్న మరొక సిద్ధాంతం పరిపూర్ణం చేసింది. ఈ కొత్త సిద్ధాంతం పాత దాని మీదే ఆధార పడి ఉంటుంది. అయితే ఇది మొదటి సిద్ధాంతం లాగా కాకుండా, ప్రకృతి ప్రవర్తనని విపులీకరిస్తుంది.

ముందు ఖండాలచే మూసుకుపోయిన, తరువాత బయల్పడిన అట్లాంటిక్ మహా సముద్రం - ఆంటోనియో స్నైడర్ - పెల్లెగ్రినిలు రూపొందిచిన చిత్రం (1858).

చరిత్ర

అట్లాంటిక్ మహాసముద్రానికి రెండు వైపుల ఉన్న భూఖండాలు ఒక దాని పక్కన ఒకటి సరిగ్గా అతికేలా ఉంటాయని మొట్టమొదట ఆబ్రహం ఓర్తెలియుస్ (ఓర్తెలియుస్ 1596) [2], థెయొడొర్ ఖ్రిస్టొఫ్ లిలియెంథల్ (1756) [3], అలెగ్జాండర్ వాన్ హంబోల్ద్ట్ (1801, 1845) [3], ఆంటోనియో స్నైడర్-పెల్లెగ్రిని (స్నైడర్-పెల్లెగ్రిని 1858) మొదలైన శాస్త్రవేత్తలు కనుగొన్నారు.[4] వీటిలో అతి ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రముఖంగా కనిపిస్తాయి.

1889 లో ఆల్ఫ్రెడ్ వాలెస్ రస్సెల్ ఇలా అన్నాడు -"జియాలజిస్టులతో సహా అందరూ అనుకున్నదేమిటంటే, ఈ భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని గొప్ప విశేషాలు కూడా పరివర్తన చెందుతూ ఉంటాయి. అందువల్ల మనకి తెలిసిన కాలంలో అన్ని సముద్రాలు ఖండాలూ కూడా పరస్పరం అనేక మార్లు స్థానాలు మార్చుకుని ఉంటాయి." అతడు చార్లెస్ లయెల్ ను ఉటంకిస్తూ ఇలా అన్నాడు, " అందుచేత, ఖండాలు ఒక శకంలో శాశ్వతంగా ఉన్నప్పటికీ, ఆ శకంలోని వివిధ యుగాలు గడిచే కొద్దీ తమ తమ స్థానాలను పూర్తిగా మార్చుకుంటూ ఉంటాయి". అంతే కాకుండా, ఈ సూత్రీకరణను మొదటిసారిగా సందేహించినది 1849లో జేమ్‌స్ డ్వెయిట్ డానా అని కూడా చెప్పాడు.

1863 లో "మాన్యువల్ ఆఫ్ జియాలజి" అనే పుస్తకంలో డానా ఇలా అన్నాడు "ఇప్పుడు ఉన్న భూఖండాలూ, సముద్రాలు వాటి రూపాలను చాలా పురాతన కాలంలోనే ఏర్పరచుకున్నాయి. ఈ విషయం ఉత్తర అమెరికా యొక్క విస్తరణ, స్థానంలో నిరూపణ అయినట్టు చెప్పవచ్చు. సిల్యూరియన్లో ఉన్న సముద్ర భూతలమే దీనికి సాక్ష్యం. అందువల్ల ఈ విషయం మిగతా ఖండాలకి కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు". ఈయన సిధ్ధాంతం అమెరికాలో చాలా ప్రసిద్ధి చెందింది. దీనినే పెర్మినెన్స్ సిద్ధాంతం అంటారు.

వేజెనర్, ఆయన ముందు వాళ్ళు

ఆల్ఫ్రెడ్ వేజెనర్

అమెరికా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు ఇప్పటి ఆకారాలు, స్థానాలు పొందడానికి ముందు, ఒకానొక సమయంలో అన్నీ కలిసి ఒకే భూఖండంగా ఉండేవని, ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆల్ఫ్రెడ్ వేజెనర్ కంటే ముందే భావించారు. ఒకానొక సమయంలో భూఖండాలన్నీ ఒకే మహా ఖండంగా ఉండేవని, తరవాత అవి ఒకదాని నుండి ఒకటి విడిపోయి ఇప్పుడు ఉన్న 7 ఖండాలుగా ఏర్పడ్డాయి అన్న విషయాన్ని మొట్టమొదట జర్మన్ జియొలాజికల్ సొసైటికి చెందిన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వేజెనర్ 1912 జనవరి 6 న చెప్పాడు.[5] ఈయన తన సిధ్ధాంతాన్ని స్వతంత్రంగా ప్రతిపాదించినప్పటికీ, అది పూర్వ సిద్ధాంతాల కన్నా సంపూర్ణంగా ఉన్నప్పటికీ, తన సిద్ధాంతం యొక్క శ్రేయస్సును పూర్వ శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చాడు.[6][7] ఎడువార్డ్ సువెస్స్ 1858 లో అతిపెద్ద భూఖండం గోండ్వానా గురించి, 1893 లో టెథిస్ మహాసముద్రం గురించి చెప్పాడు. 1895 లో జాన్ పెర్రీ అన్న శాస్త్రవేత్త, భూమి యొక్క అంతర్భాగం జల పదార్థం అని ప్రతిపాదిస్తూ, భూమి వయసు విషయంలో లార్డ్ కెల్విన్ తో విభేదించాడు.

ఇదే సమయంలో రొబెర్టో మాంటోవాని అనే శాస్త్రవేత్త, దక్షిణ భాగంలో ఉన్న భూ ఖండాలు ఒకేలా ఉండడం చూసి ఇవన్నీ ఒకసారి ఎప్పుడో ఒకే పెద్ద ఖండంలోని భాగాలు అయ్యి ఉండవచ్చు అని ప్రస్తావించాడు. ఆయన ఈ ఖండానికి పాంజియా అని పేరు పెట్టాడు. ఇప్పుడు వేజెనర్ తాను చేసుకున్న భూపటాలను, మాంటోవాని యొక్క దక్షిణ భూపటాలతో పోల్చి విస్తృత భూ సిధ్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది అగ్నిపర్వత విస్ఫోటనాలు, ఉష్ణ వ్యాకోచం సిధ్ధాంతాల మీద ఆధార పడి ఉంటుంది. వ్యాప్తి చెందకుండా కేవలం చలనం మాత్రమే కలిగిన భూఖండ చలన సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినది, 1908 లో ఫ్రేంక్ టెయిలర్. ఆయన ప్రకారం చంద్రుని ఆకర్షణ వల్ల భూఖండాలు భూమధ్యరేఖ వైపు ఆకర్షింపబడతాయి. ఇలా ఖండాల యొక్క దక్షిణ భాగాలలో హిమాలయాలు, ఆల్ప్స్ పర్వతాలు ఏర్పడ్డాయి. వేజెనర్ ప్రకారం అప్పటిలో ఉన్న అన్ని సిధ్ధాంతాలలోకి, పూర్తిగా కాకపోయినా, టెయిలర్ సిద్ధాంతం తన సిధ్ధాంతానికి అతి చేరువలో ఉందని అన్నాడు.

భూఖండ చలనము అన్న పదాన్ని మొట్టమొదట వాడింది వేజెనర్. మొట్టమొదట అధికారికంగా దీని గురించి ప్రస్తావించింది కూడా అతనే. దీని గురించి ఆయన ఎన్నో ఆధారాలు చూపించినా ఈ చలనానికి కారణం గురించి ఆయన ప్రస్తావించలేకపోయారు. ఆయన దీనికి కారణం బహుశ అభికేంద్ర బలం (సెంట్రి ఫ్యూగల్ ఫోర్స్) అయి ఉంటుందని అన్నాడు కాని లెక్కలు వేసి చూస్తే ఈ కదలికకు ఆ బలం సరిపోదని తేలింది.[8][9][10]

వేజెనర్ సిధ్ధాంతం యొక్క తిరస్కరణ

చాలా యేళ్ళ వరకు భూఖండ చలన సిధ్ధాంతం ఆమోదం పొందలేదు. చలనాన్ని కలిగించే బలం ఏమిటో తెలియకపోవడం ఒక సమస్య కాగా, వేజెనర్ అంచనా వేసిన చలన వేగం - 250 సెం.మీ/సంవత్సరం - అనేది సమర్ధించలేనంత ఎక్కువ కావడం రెండో సమస్య. (అమెరికా ఖండాలు ఆఫ్రికా ఐరోపాల నుండి విడిపోతున్న వేగం 2.5 సెం.మీ/సంవత్సరం అనేది ప్రస్తుతం సర్వామోదం పొందినది). వేజెనర్ జియాలజిస్ట్ కాకపోవటం కూడా ఈ సిద్ధాంతం ఆమోదం పొందకపోవడానికి దోహదపడింది. వేజెనర్ చూపిన ఆధారాలు సరిపోవని ఇతర జియాలజిస్టులు భావించారు. ప్రస్తుతం, వేజెనర్ చెప్పినంత వేగంతో కానప్పటికీ, భూ ఖండాలని మోసే ప్లేట్లు భూ ఉపరితలం మీద కదులుతున్నాయని మాత్రం అందరూ అంగీకరించే సత్యం. అయితే, ఆనాడు వేజెనర్ గానీ, ఈనాడు మరే ఇతర శాస్త్రవేత్త గానీ ఇప్పటివరకూ వివరించలేకపోయినది మాత్రం ఈ ప్లేట్లను కదిలిస్తున్న శక్తులు ఏమిటి అన్నది.

ఎవ్వరూ ఒప్పుకోని కాలంలో బ్రిటిష్ జియాలజిస్ట్ ఆర్థర్ హోమ్స్ మాత్రం ఈ సిద్ధాంతాన్ని భుజాలకెత్తుకున్నాడు. భూమి యొక్క మేంటిల్ లో ఉన్న కన్వెక్షన్ సెల్స్ నుండి బయటకి వస్తున్న రేడియోధార్మిక ఉష్ణం వలన ఉపరితలం మీద ఉన్న పెంకు (క్రస్ట్) కదులుతున్నదని ఆయన 1931లో సూత్రీకరించాడు. 1944 లో ఆయన ప్రచురించిన పుస్తకం - ప్రిన్సిపుల్స్ ఆఫ్ జియాలజీ యొక్క ఆఖరి అధ్యాయాన్ని ఈ విషయానికే కేటాయించాడు.

1940ల రెండో అర్థభాగంలో యూనివర్సిటీలో చదువుకున్న డేవిడ్ ఏటెన్‌బరో, ఈ సిధ్ధాంతం అంగీకారానికి నోచుకోని విషయాన్ని వివరిస్తూ ఒక సంఘటన చెప్పాడు: "నేను ఒక సారి నా లెక్చరర్ ను భూ కదలికల గురించి మాకు ఎందుకు చెప్పట్లేదో అడిగాను. అప్పుడాయన వెక్కిరింతగా, 'ఆ కదలికను కలిగించే ఫోర్స్ ఏదో నిరూపిస్తే, అప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తాను' అని అన్నారు. అదొక మూఢ భావన అని అప్పటి శాస్త్రవేత్తల అభిప్రాయం".

కేరీ తన ప్లేట్ టెక్టోనిక్స్ సిధ్ధాంతాన్ని ప్రవేశ పెట్టడానికి కేవలం 5 ఏళ్ళ ముందు, 1953లో, భౌతిక శాస్త్రవేత్త షీడెగ్గర్ భూ కదలిక సిధ్ధాంతాన్ని కొట్టిపడేసాడు. ఆయన చూపిన కారణాలివి:

  1. మొదటిది, భ్రమణంలో ఉన్న ఒక జియోయిడ్ మీద తేలుతున్న ద్రవ్యరాశులు భూమధ్యరేఖ వద్దకు చేరి అక్కడే ఉండినపోతాయన్నట్లుగా చూపబడింది. ఇది ఏ రెండు భూ ఖండాల మధ్య అయినా పర్వతాలు ఒక్కసారి ఏర్పడే క్రమాన్ని, ఒకే ఒక్కసారి ఏర్పడే క్రమాన్ని మాత్రమే, వివరిస్తుంది. మిగతా పర్వతాలు ఎలా ఏర్పడ్డాయో ఈ సిధ్ధాంతం చెప్పదు.
  2. రెండోది, నీటి మీద తేలుతున్న ఎటువంటి భూ ఖండం అయినా సరే ఐసో స్టేటిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి, సముద్రాల్లోని మంచుకొండల్లాగా (ఐస్ బెర్గ్). అంటే భూమ్యాకర్షణ శక్తి, ఉత్ప్లవన (బోయన్సీ) శక్తి సరితూగాలి. భూమ్యాకర్షక కొలతల ప్రకారం చూస్తే వివిధ ప్రదేశాలలో ఇలా లేదని తెలుస్తోంది.
  3. మూడోది, భూమిపై కొన్ని భాగాలు మాత్రమే ఘనీభవించి, మరికొన్ని భాగాలు ఇంకా ద్రవ రూపంలోనే ఎందుకు ఉండిపోయాయో వివరించలేకపోయింది. వివరించడానికి చేసిన ప్రయత్నాలు ఇతర ఇబ్బందుల వలన విఫలమయ్యాయి.

రెండు రకాల పెంకులు (క్రస్ట్) ఉన్నాయని ఇప్పుడు మనకు తెలుసు -కాంటినెంటల్ క్రస్ట్, ఓషియానిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ ఓషియానిక్ క్రస్ట్ కన్నా తేలికగా ఉంటుంది, దాని కన్నా విభిన్నమైన పదార్థాలతో కూడుకుని ఉంటుంది. ఈ రెండూ కూడా మేంటిల్ కన్నా పైన ఉంటాయి. ఓషియానిక్ క్రస్టు స్ప్రెడింగ్ సెంటర్ల దగ్గర తయారవుతుంది.ఇది, సబ్డక్షన్, రెండూ కలిసి ప్లేట్ల వ్యవస్థను చెల్లాచెదురుగా కదుపుతాయి. నిరంతరంగా జరిగే ఓరొజెనీ (టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల భూమి లిథోస్ఫియర్లో కలిగే తీవ్రమైన మార్పులు) కి, కొన్ని ప్రదేశాలలో ఏర్పడే ఐసో స్టేటిక్ ఇంబేలెన్స్ కూ ఇది దారితీస్తుంది. ప్లేట్ టెక్టోనిక్స్ సిధ్ధాంతం ఈ విషయాలన్నిటిని, ఖండాల కదలికలతో సహా, భూఖండ చలన సిధ్ధాంతం కన్నా బాగా వివరిస్తుంది.

భూఖండ చలనానికి నిదర్శనాలు

టెక్టోనిక్ ప్లేట్ల మీద ఉన్న ఖండాల యొక్క కదలికలకి ఇప్పుడు మన దగ్గర చాలానే ఆధారాలు ఉన్నాయి. వివిధ ఖండాల యొక్క సముద్ర తీరాలలో ఒకే జంతువు, మొక్కల యొక్క శిలాజాలు (ఫాజిల్స్) దొరికాయి. దీని బట్టి మనం ఈ ఖండాలు ఒకానొక సమయంలో ఒకే పెద్ద ఖండంలోని భాగాలుగా ఉండేవని చెప్పవచ్చు .

ఉదాహరణ 1

బ్రెజిల్ లోనూ, దక్షిణ ఆఫ్రికా లోనూ ఒకే మొసలి లాంటి సరీసృపం యొక్క శిలాజం దొరకడం

ఉదాహరణ 2

భారత్, అంటార్కిటికా, ఆఫ్రికాలలో ఒకే సరీసృపం యొక్క శిలాజం దొరకడం

ఉదాహరణ 3

దక్షిణ అమెరికా, ఆఫ్రికా లలో ఒకే వానపాము కుటుంబం యొక్క శిలాజాలు దొరకడం

దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల యొక్క ఎదురెదురు వైపులు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉంటాయి. కాని ఇది అనుకోకుండా ఏర్పడిన తాత్కాలిక అమరిక మాత్రమే. కొన్ని మిలియన్ల ఏళ్ళ తరవాత స్లాబ్‌పుల్, రిడ్జ్‌పుష్ వంటి టెక్టోనోఫిసికల్ ఫోర్సుల కారణంగా ఈ రెండు ఖండాలు ఇంకా దూరమైపోయి, వర్తులంగా తిరుగుతాయి. ఈ తాత్కాలిక విశేషమే వేజెనర్ తన కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టడానికి కారణం అయ్యింది. కాని ఈ సిద్ధాంతం విస్తృత జనామోదం పొందడం వేజెనర్ జీవిత కాలంలో జరగలేదు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, అంటార్కిటికా, అరేబియా, ఆస్ట్రేలియా ఖండాలలో విస్తరించి ఉన్న పెర్మో- కార్బోనిఫెరస్ గ్లేషియల్ సెడిమెంట్స్ భూఖండ చలన సిద్ధాంతానికి గల ముఖ్య నిదర్శనాల్లో ఒకటి. గ్లేసియర్ల యొక్క వ్యాప్తి, ఒక అతి పెద్ద ఖండం - గోండ్వానా- ఉండేది అని సూచిస్తుంది. భూఖండ చలన సిద్ధాంతానికి గోండ్వానాయే మూలబిందువు. ఈ సిధ్ధాంతం ప్రకారం ఈ మంచు గడ్డలు భూమధ్యరేఖ నుండి ధ్రువాల వైపుగా వెళ్ళాలి. ఇప్పుడు మన భూమి అదే విధంగా ఉంది . దీని వల్ల మనం ఈ సిద్ధాంతం సరైనదే అని చెప్పవచ్చు.

ఉదహరించబడిన ప్రచురణలు

నోట్సు
మూలాలు

ఇతర లింకులు