భూదానోద్యమం

భారతదేశంలో స్వచ్ఛంద భూ సంస్కరణ ఉద్యమం

భూదానోద్యమం భారతదేశంలో స్వచ్ఛందంగా జరిగిన ఒక భూముల పంపకం. దీన్ని గాంధేయవాది అయిన వినోబా భావే 1951 లో ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న పోచంపల్లి గ్రామంలో ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో భాగంగా భూస్వాములను తమ దగ్గరున్న భూముల్లో కొంత భాగాన్ని భూముల్లేని నిరుపేదలకు పంచి ఇచ్చేందుకు ఒప్పించారు. వినోబా, మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సర్వోదయ, గ్రామ స్వరాజ్యం ఉద్యమాలచే ప్రేరేపితుడై ఈ ఉద్యమం ప్రారంభించాడు.

1983 లో వినోబా గౌరవార్థం విడుదల చేసిన తపాలా బిళ్ళ

చరిత్ర

వినోబా భావే భారతదేశమంతటా పర్యటిస్తూ భూమి కలిగిన వారిని అందులో కొంత భాగాన్ని దానమివ్వవలసిందిగా అభ్యర్థిస్తూ వస్తున్నాడు. ఏప్రిల్ 18, 1951 న నల్గొండ జిల్లా, పోచంపల్లి గ్రామంలో అతని మొదటి ప్రయత్నం విజయవంతమైంది.[1] 1951 ఆ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. భూస్వాములపై ప్రాంతీయ రైతులు చేసిన ఉద్యమంలో అది పతాకస్థాయి.

వినోబా పర్యటనకు వచ్చినపుడు అక్కడి ఉద్యమ కారులు సుమారు 700 కుటుంబాలు నివసించే ఆ గ్రామంలో ఆగమని కోరారు. ఈ మొత్తం కుటుంబాల్లో రెండింట మూడువంతుల మందికి స్వంత భూమి లేదు. వినోబా హరిజనవాడలను పర్యటించినప్పుడు అక్కడి 40 కుటుంబాల వారు తమకు 40 ఎకరాల తడి భూములు (నంజ పొలం), 40 ఎకరాల మెట్ట భూములు కావాలని కోరారు. ప్రభుత్వం దగ్గర ఆ భూమి లేకపోతే గ్రామస్థులకు ఇంకేమీ చేయలేరా అని అడిగాడు వినోబా. అప్పుడు వి. రామచంద్రారెడ్డి అనే భూస్వామి తనకున్న 3500 ఎకరాల భూమి నుంచి 100 ఎకరాలు పంచిస్తానని మాటిచ్చాడు. తర్వాత అదనంగా 800 ఎకరాల పొలం కూడా దానం చేసి ఉద్యమంలో భాగం అయ్యాడు.[2] దీని తర్వాత భూదాన ఉద్యమం రామచంద్రారెడ్డి కుమారుల ఆధ్వర్యంలో కొనసాగింది. హైదరాబాదు సంస్థానం ఏడవ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వ్యక్తిగత ఆస్తి 14000 ఎకరాలను భూదానోద్యమానికి రాసిచ్చాడు.[3][4]

వారసత్వం

ఈ ఉద్యమం ఇంకా ముందుకెళ్ళి ఒక గ్రామ బహుమతి లేదా గ్రామదాన ఉద్యమంగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో, ఇంకా దేశం బయట సర్వోదయ సమాజ స్థాపనకు దారి తీసింది.[5]

1960 ల నాటికి, ఉద్యమం వేగం కోల్పోయింది. సర్వోదయ సమాజం సామాజిక పరివర్తన కోసం ఒత్తిడిని సృష్టించే ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమైంది. ఏదేమైనా, ఉద్యమం నైతిక సందిగ్ధతను సృష్టించడం, భూస్వాములపై ఒత్తిడి చేయడం, భూమిలేని వారికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం ద్వారా గణనీయమైన సహకారాన్ని అందించింది.[6]

మూలాలు