లీ వెన్లియాంగ్

లి వెన్లియాంగ్ (చైనీస్: 李文亮; 1986 అక్టోబరు 12 - 2020 ఫిబ్రవరి 7) ఒక చైనీస్ నేత్ర వైద్య నిపుణుడు, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ వైద్యుడు. కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు. లీ తన సహచరులను 2019 డిసెంబరులో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) ను పోలి ఉండే అనారోగ్యం గురించి హెచ్చరించాడు, తరువాత దీనిని COVID-19 గా గుర్తించారు. అతని హెచ్చరికలు తరువాత బహిరంగంగా సామాజిక మాధ్యమాలలో పంచుకున్నప్పుడు అతను ఇన్ఫార్మర్ అయ్యాడు.[2][3] 2020 జనవరి 3 న, వుహాన్ పోలీసులు "ఇంటర్నెట్‌లో తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు" అతనిని పిలిపించి మందలించారు.[4][3] లీ తిరిగి తన పనిలో చేరాడు. తరువాత కరోనా సోకిన రోగి నుండి వైరస్ బారిన పడి 2020 ఫిబ్రవరి 7 న 33 ఏళ్ళ వయసులో ఈ వ్యాధితో మరణించాడు.[5][6] తరువాతి చైనా అధికారిక విచారణ నుండి అతనికి మినహాయిపునిచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా అతని కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అతనితో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారులకు ఇచ్చిన హెచ్చరికలను ఉపసంహరించుకుంది.[7][8][9]

లీ వెన్లియాంగ్
李文亮
జననం(1986-10-12)1986 అక్టోబరు 12
బీజెన్, లియోనింగ్, చైనా
మరణం2020 ఫిబ్రవరి 7(2020-02-07) (వయసు 33)
ఊహాన్, హుబే, చైనా
మరణ కారణంకరోనా వైరస్ 2019
విద్యమాస్టర్ ఆఫ్ మెడిసన్
విద్యాసంస్థఊహాన్ విశ్వవిద్యాలయం
వృత్తిఆప్తమాలజిస్టు (నేత్ర వైద్య నిపుణులు)
క్రియాశీల సంవత్సరాలు2011–2020
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కరోనా వైరస్ గూర్చి అవగాహన పెంచడం
COVID-19, SARS-CoV-2 లను కనుగొనడం.
జీవిత భాగస్వామిఫ్యూ క్సుజి [1]
పిల్లలు1

బాల్య జీవితం

లీ వెన్లియాంగ్ లియోనింగ్, బెఝెన్ లోని మాంచు కుటుంబంలో 1986 అక్టోబరు 12 న జన్మించాడు.[10] అతను బీజెన్ ఉన్నత పాఠశాలలో చదివాడు. అతను అద్భుతమైన విద్యార్జనతో పట్టభద్రుడైనాడు. 2004లో నేషనల్ కాలేజీ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ లో 609 స్కోరును సాధించాడు. అతను వైద్య విద్యార్థిగా వూహాన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ లో చేరి ఏడు-సంవత్సరాల ఉమ్మడి బ్యాచులర్, మాస్టర్ డిగ్రీ కోర్సును పూర్తిచేసాడు. తరువాత అతను కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో చేరాడు.[11] అతని ఉపాధ్యాయుడు అతను శ్రద్ధగల, నిజాయితీగల విద్యార్థి అని చెప్పాడు. అతని స్నేహితులు అతను బాస్కెట్ బాల్ అభిమాని అని తెలియజేసారు.[12]

వృత్తి జీవితం

2011 లో గ్రాడ్యుయేషన్ తరువాత, లీ జియామెన్ విశ్వవిద్యాలయానికి చెందిన "జియామెన్ ఐ సెంటర్‌"లో మూడేళ్లపాటు పనిచేశాడు. జియామెన్ వద్ద ఒక మాజీ వైద్య విద్యార్థి మాట్లాడుతూ, లీ తన రోగులతో చాలా ఓపికగా చూసేవాడు. అతను చెప్పినదానిని వినడానికి లేదా అర్థం చేసుకోవడంలో వారు విఫలమైనప్పుడు కూడా అతను వారి పట్ల అసంతృప్తి చూపించేవాడు కాదు. అతని సహచరులు అతన్ని ఒక సాధారణ వ్యక్తిగా అభివర్ణించారు. 2014 లో, చైనాలోని వుహాన్ లోని వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ లో లీ నేత్ర వైద్యుడు అయ్యాడు.[3]

2019–20 కరోనావైరస్ మహమ్మారి - దోషారోపణ

30 డిసెంబరు 2019 న, రోగి యొక్క వైద్య నివేదికను లీ చూసాడు. ఇది SARS కరోనావైరస్ పరీక్షలకు అధిక విశ్వాస స్థాయితో సానుకూల ఫలితాన్ని చూపించింది. వెన్లియాంగ్ సహచరులకు ఈ వైరస్ గురించి హెచ్చరించేందుకు ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో దీని గురించి పోస్ట్ చేశాడు. అయితే, ఈ విషయం గురించి బయటకు మాట్లాడొద్దని, మౌనంగా ఉండాలని ఆయన్ను పోలీసులు హెచ్చరించారు.[13]

వుహాన్‌లోని చేపల మార్కెట్‌‌లో అక్రమంగా విక్రయిస్తున్న సముద్ర జీవుల నుంచి కరోనావైరస్ వ్యాపించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. వెన్లియాంగ్ పనిచేస్తున్న ఆసుపత్రిలో డిసెంబరులో ఏడుగురు వైరల్ ఇన్ఫెక్షన్‌తో చేరారు. 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వ్యాధి తరహా లక్షణాలే వీరిలో ఉన్నట్లు వెన్లియాంగ్‌కు అనుమానం వచ్చింది. సార్స్ కూడా కరోనావైరస్ కుటుంబానికి చెందిందే. తన సహచర వైద్యులను హెచ్చరిస్తూ ఓ చాట్ గ్రూప్‌లో డిసెంబరు 30న ఆయన సందేశం పెట్టాడు.[3] ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మాస్క్‌ల్లాంటివి ధరించాలని అందులో సూచించారు.[14] తాజాగా వెలుగుచూసిన వైరస్ కరోనావైరస్‌ల్లో పూర్తిగా కొత్త రకానిదని అప్పటికి వెన్లియాంగ్‌కు తెలియదు. నాలుగు రోజుల తర్వాత పబ్లిక్ సేఫ్టీ బ్యూరో అధికారులు ఆయన దగ్గరికి వచ్చి, ఓ లేఖపై సంతకం చేయమన్నారు. 'శాంతికి విఘాతం' కలిగించేలా 'అసత్యాలు' చెబుతున్నారని ఆ లేఖలో వెన్లియాంగ్‌పై ఆరోపణ మోపారు.[15] ''మేం హెచ్చరిస్తున్నాం. ఇలాగే మొండిగా, దురుసుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తే న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు ఈ విషయం అర్థమైందా?'' అని ఆ లేఖలో ఉంది.[16] దాని కిందే అర్థమైందని రాసి, వెన్లియాంగ్‌ సంతకం చేశాడు.[15] 'వదంతులు వ్యాప్తి చేస్తున్నందుకు' తాము విచారిస్తున్న ఎనిమిది మందిలో వెన్లియాంగ్ ఒకరని పోలీసులు ఇదివరకు వెల్లడించారు.[17] జనవరి చివర్లో వెన్లియాంగ్ ఆ లేఖ కాపీని చైనాలోని సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్ వీబోలో పోస్ట్ చేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాశాడు.[18]

అనారోగ్యం, మరణం

"వుహాన్ యూనివర్శిటీ క్లినికల్ మెడిసిన్ 2004" వెచాట్ సమూహంలో లి వెన్లియాంగ్ సందేశాలు
on 30 December 2019

(CST 17:43)

  • లీ: హువానన్ సీఫుడ్ మార్కెట్లో 7 ధృవీకరించబడిన SARS కేసులు ఉన్నాయి.
  • లీ: (రోగ నిర్ధారణ నివేదిక చిత్రం)
  • లీ: (CT స్కాన్ ఫలితాల వీడియో)
  • లీ: మా ఆసుపత్రిలోని హౌహు హాస్పిటల్ లోని అత్యవసర విభాగంలో వారు ఒంటరిగా ఉన్నారు.

(CST 18:42)

  • ఇతరుడు: జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మా చాట్ సమూహం తొలగించబడవచ్చు.
  • లీ: తాజా వార్త ఏమిటంటే, అవి కరోనావైరస్ అంటువ్యాధులు అని నిర్ధారించబడింది, అయితే ఖచ్చితమైన వైరస్ ఉపరూపంలో ఉంది.
  • లీ: ఈ గుంపు వెలుపల సమాచారాన్ని ప్రసారం చేయవద్దు, మీ కుటుంబ సభ్యులకు, ప్రియమైనవారికి జాగ్రత్తగా ఉండమని చెప్పండి.
  • లీ: 1937 లో, కరోనావైరస్లు మొదట కోడి నుండి వేరుచేయబడ్డాయి ...

Source: screenshots in The Beijing News report[19]

వైరస్ ఉన్న జంతువుల నుంచి మాత్రమే అది మనుషులకు వ్యాపిస్తుందని వుహాన్‌ అధికారులు మొదట బలంగా చెబుతూ వచ్చారు. వైద్యులకు కూడా జాగ్రత్తలేవీ సూచించలేదు. పోలీసులు తనను హెచ్చరించిన వారం తర్వాత గ్లకోమా వ్యాధితో ఉన్న ఓ మహిళకు వెన్లియాంగ్‌ చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమెకు కరోనావైరస్ సోకిన విషయం ఆయనకు తెలియదు. జనవరి 10న తనకు దగ్గు మొదలైందని, మరుసటి రోజు జ్వరం వచ్చిందని వీబో పోస్ట్‌లో వెన్లియాంగ్ చెప్పారు. రెండు రోజుల అనంతరం ఆసుపత్రిలో చేరానని, తన తల్లిదండ్రులు కూడా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సివచ్చిందని వివరించాడు.[20]

జనవరి 20న చైనా కరోనావైరస్ వ్యాప్తిని అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. చాలాసార్లు కరోనావైరస్ గురించి పరీక్షలు చేసినా, అది తనకు ఉన్నట్లు తేలలేదని వెన్లియాంగ్ అన్నాడు. ''ఈ రోజు న్యూక్లియిక్ యాసిడ్ పరీక్ష చేశారు. వైరస్ ఉన్నట్లు తేలింది. మొత్తానికి స్పష్టత వచ్చింది'' అని జనవరి 30న పోస్ట్ పెట్టాడు. ఆయన పోస్ట్‌కు వేల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. మద్దతు తెలుపుతూ చాలా మంది పోస్ట్‌లు పెట్టారు. ఆ తరువాత వెన్లియాంగ్ చైనాలో హీరో అయ్యాడు. ఆయనకు కూడా కరోనా వైరస్ సోకిన కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020 ఫిబ్రవరి 7 న 33 ఏళ్ళ వయసులో మరణించాడు

వ్యక్తిగత జీవితం

కరోనావైరస్ అనారోగ్య లక్షణాలను లి చూపించడం ప్రారంభించినప్పుడు, జనవరి 12 న ఆసుపత్రిలో చేరేముందు, తన కుటుంబానికి సోకే అవకాశం లేకుండా ఉండటానికి అతను హోటల్ గదిని బుక్ చేసుకున్నాడు. ఈ ముందు జాగ్రత్త ఉన్నప్పటికీ, అతని తల్లిదండ్రులు SARS-CoV-2 బారిన పడ్డారు. కాని తరువాత కోలుకున్నారు.[21] [22]

లీకు భార్య, కుమారుడు ఉన్నారు. అతని భార్య అతను మరణించే సమయానికి రెండవ బిడ్డకు గర్భవతిగా ఉంది. [22][23]

మూలాలు

బాహ్య లంకెలు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.