సహజ రబ్బరు

సహజ రబ్బరు లేదా రబ్బరు ఐసోప్రీన్ అనే కర్బన రసాయన సమ్మేళనపు పాలిమర్. దీనినే గం రబ్బరు (ఆంగ్లం: Gum rubber) అని కూడా అంటారు.[1] థాయ్‌ల్యాండ్, ఇండోనేషియా దేశాలు ప్రపంచంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.

రబ్బరు చెట్ల నుంచి పాల లాంటి లేటెక్స్ ను పాత్రలోకి సేకరిస్తున్న దృశ్యం

ప్రస్తుతం దీనిని రబ్బరు చెట్ల నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే లేటెక్స్ అనే పదార్థం నుంచి ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఈ లేటెక్స్ అనేది పాల రూపంలో, జిగురుగా ఉండే పదార్థం. రబ్బరు చెట్ల కాండాలకు రంధ్రాలు చేసి పాత్రల్లో దీనిని సేకరిస్తారు. తర్వాత దీనిని శుద్ధి చేసి వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మారుస్తారు.

సహజ రబ్బరు అనేక అనువర్తనాల్లోనూ, ఉత్పత్తుల్లోను స్వచ్ఛమైన రూపంలో, లేదా వేరే పదార్థాలతో కలిపి వాడుతారు. రబ్బరును కదలికలు, రాపిడిని అడ్డుకునే వాషర్లుగానూ, బెలూన్లలోనూ, బొమ్మలు లాంటి వాటిలో విరివిగా వాడతారు. దీనికున్న బాగా సాగేగుణం, పటుత్వం, తేమను అడ్డుకోవడం లాంటి గుణాలు ప్రత్యేకమైనవి.

చరిత్ర

మొట్టమొదటి రబ్బరు వాడకం మీసోఅమెరికా ప్రాదేశిక సంస్కృతుల్లో కనిపించింది. హీవియా చెట్ల నుంచి తీసిన లేటెక్స్ వాడకం ఓల్మెక్ సంస్కృతిలో ఉన్నట్లు పురాతత్వ ఆధారాలు కనిపించాయి. వీళ్ళు ఒక రకమైన బంతి ఆట కోసం రబ్బరు బంతిని వాడారు. ఆ తర్వాత రబ్బరును మాయన్ నాగరికతలోనూ, ఆజ్‌టెక్ సంస్కృతిలోనూ వాడారు.[2][3]

ఉత్పత్తి

2017 లో ప్రపంచంలో 2.8 కోట్ల టన్నుల రబ్బరు ఉత్పత్తి కాగా అందులో 47% సహజ రబ్బరే. అయితే ఉత్పత్తిలో ఎక్కువ భాగం కృత్రిమ రబ్బరు కావడం వల్ల, అది పెట్రోలియం ఆధారితం కావడం వల్ల దీని ధర, ముడి చమురు ధర మీద ఆధారపడి ఉంటుంది.[4][5] సహజ రబ్బరు ఆసియా ఖండం నుంచే ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది.

సాగు

రబ్బర్ లేటెక్స్ రబ్బరు చెట్ల నుంచి ఉత్పత్తి అవుతుంది. రబ్బరు చెట్లు సుమారు 32 సంవత్సరాల ఆర్థిక వనరుగా ఉంటాయి. ఇందులో సుమారు మొదటి 7 సంవత్సరాలు పెరుగుదల దశలో ఉంటాయి. మిగతా 25 సంవత్సరాలు ఉత్పత్తి దశ.

ఈ చెట్లు బాగా పెరగాలంటే నీటిని మధ్యస్థంగా నిల్వ ఉంచుకునే నేల, లేటరైట్ ఖనిజాలు గలిగిన నేల, ఒండ్రు నేల అవసరం. ఏడాదిలో సుమారు 100 రోజుల పాటు సుమారు 250 సె.మీ వర్షపాతం ఉండాలి. 20 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. నెలవారీ ఉష్ణోగ్రత సగటు 25 నుంచి 28 డిగ్రీ సెంటీగ్రేడు మధ్యలో ఉండాలి. వాతావరణంలో సుమారు 80% తేమ (నీటి ఆవిరి) ఉండాలి. సంవత్సరంలో రోజుకు ఆరు గంటల చొప్పున సుమారు 2000 గంటలపాటు ఎండ ఉండాలి. బలమైన గాలులు వీచకూడదు.

రహదారుల నిర్మాణం

సహజ రబ్బరుతో రహదారుల నిర్మాణానికి సంబంధించి విస్తృత పరిశోధనలు జేఎన్‌టీయూ(ఏ) మొదలుపెట్టింది.[6]

మూలాలు