స్టోన్‌హెంజ్

ఇంగ్లండు లోని కొత్త రాతియుగ స్మారకం

స్టోన్‌హెంజ్ అనేది ఇంగ్లండ్‌లోని విల్ట్‌షైర్‌లోని సాలిస్‌బరీ ప్లెయిన్‌లో అమెస్‌బరీకి పశ్చిమాన 3 కి.మీ.దూరంలో ఉన్న చరిత్రపూర్వ స్మారక కట్టడం. ఇందులో, ఒక్కొక్కటీ 25 టన్నుల బరువుతో 2.1 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తు ఉన్న రాళ్ళు, ఒక వృత్తాకారంలో నిలబెట్టి ఉంటాయి. ఈ రాళ్ళను కలుపుతూ పైన క్షితిజ సమాంతరంగా రాళ్ళు పెట్టి ఉంటాయి. ఈ వృత్తం లోపల చిన్న రాళ్ళతో మరొక వృత్తం ఉంది. వీటి లోపల రెండు లావాటి నిలువు రాళ్ళు నేలపై నిలబెట్టి ఉన్నాయి, నేలలోకి పాతలేదు. వాటిని కలుపుతూ పైన అడ్డంగా ఒక రాయి ఉంది. ఈ స్మారక కట్టడం ఇపుడు శిథిలావస్థకు చేరుకుంది. ఈ మొత్తం స్మారకమంతా వేసవి అయనాంతం నాడు (జూన్ 20) సూర్యోదయం వైపు సమలేఖనమై ఉంటుంది. ఇంగ్లండ్‌లో ఉన్న, కొత్త రాతియుగం, కాంస్య యుగం కాలాల నాటి అనేక స్మారక చిహ్నాలు, అనేక వందల టుములీలు (శ్మశాన దిబ్బలు) ఉన్న ప్రాంతంలో ఈ కట్టడాన్ని నిర్మించారు.

స్టోన్‌హెంజ్
2007 జూలైలో స్టోన్‌హెంజ్
స్టోన్‌హెంజ్ is located in Wiltshire
స్టోన్‌హెంజ్
స్టోన్‌హెంజ్ స్థానాన్ని చూపించే విల్ట్‌షైర్ మ్యాపు
స్థానంవిల్ట్‌షైర్, ఇంగ్లండ్
ప్రాంతంశాలిస్‌బరీ మైదానం
నిర్దేశాంకాలు51°10′44″N 1°49′34″W / 51.17889°N 1.82611°W / 51.17889; -1.82611
రకంస్మారక కట్టడం
ఎత్తునిలబడ్డ రాయి ఒక్కొక్కటీ 13 ft (4.0 m) ఎత్తున ఉంది
చరిత్ర
పదార్థాలుసార్సెన్, బ్లూస్టోన్
స్థాపన తేదీకాంస్య యుగం
స్థల గమనికలు
తవకాల తేదీలుఅనేకం
యజమానిబ్రిటిషు రాచరికం
నిర్వహణఇంగ్లీషు హెరిటేజ్
రకంసాంస్కృతికం
క్రైటేరియాi, ii, iii
గుర్తించిన తేదీ1986 (10 వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం)
దీనిలో భాగంస్టోన్‌హెంజ్, ఆవెబరీ, దాని అనుబంధ స్థలాలు
రిఫరెన్సు సంఖ్య.373
ప్రాంతంఐరోపా, ఉత్తర అమెరికా
Scheduled monument (యు.కె.)
అధికారిక పేరుStonehenge, the Avenue, and three barrows adjacent to the Avenue forming part of a round barrow cemetery on Countess Farm[1]
గుర్తించిన తేదీ18 ఆగస్టు 1882; 141 సంవత్సరాల క్రితం (1882-08-18)
రిఫరెన్సు సంఖ్య.1010140[1]

స్టోన్‌హెంజ్‌ను సా.పూ. 3000, సా.పూ. 2000 ల మధ్య నిర్మించి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. స్మారక చిహ్నపు తొలి దశకు చెందిన వృత్తాకారపు కట్ట, కందకాలు సుమారు సా.పూ. 3100 నాటివి. మొదటి బ్లూస్టోన్‌లను సా.పూ. 2400 - 2200 మధ్య కాలంలో పేర్చి ఉండవచ్చని రేడియోకార్బన్ డేటింగ్ సూచిస్తోంది. [2] అయితే అవి సా.పూ. 3000 నాటికే అవి ఆ ప్రదేశంలో ఉండి ఉండవచ్చు. [3] [4] [5]

యునైటెడ్ కింగ్‌డమ్‌లోని అత్యంత ప్రసిద్ధ మైలురాళ్లలో ఒకటిగా, బ్రిటిష్ సాంస్కృతిక చిహ్నంగా స్టోన్‌హెంజ్‌ను పరిగణిస్తారు. బ్రిటన్‌లో చారిత్రిక స్మారక చిహ్నాలను రక్షించే చట్టం మొదటిసారిగా ప్రవేశపెట్టబడిన 1882 నుండి దీన్ని చట్టబద్ధంగా సంరక్షించబడిన షెడ్యూల్డ్ పురాతన స్మారక చిహ్నంగా గుర్తించారు. ఈ ప్రదేశాన్ని, దాని పరిసరాలనూ 1986లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. స్టోన్‌హెంజ్ రాచరికపు యాజమాన్యంలో ఉంది. దాన్ని ఇంగ్లీష్ హెరిటేజ్ నిర్వహిస్తోంది; దాని పరిసరాల్లోని భూమి నేషనల్ ట్రస్ట్ ఆధీనంలో ఉంది. [6] [7]

స్టోన్‌హెంజ్ దాని ప్రారంభ దశ నుండీ శ్మశానవాటిక అయి ఉండవచ్చు. [8] ఇక్కడ లభించిన మానవ ఎముకలను కలిగి ఉన్న నిక్షేపాలు సా.పూ. 3000 నాటివి. కందకం, కట్ట త్రవ్వడం అప్పుడే మొదలై, కనీసం 500 సంవత్సరాల పాటు కొనసాగింది. [9]

ప్రారంభ చరిత్ర

డ్యూరింగ్టన్ వాల్స్ పరసరాలపై పరిశోధించే స్టోన్‌హెంజ్ రివర్‌సైడ్ ప్రాజెక్టు నాయకుడు మైక్ పార్కర్ పియర్సన్, స్టోన్‌హెంజ్‌కు తొలి నుండీ ఖననంతో సంబంధం ఉన్నట్లు చెప్పాడు.

స్టోన్‌హెంజ్ నిర్మాణం అనేక దశల్లో కనీసం 1500 సంవత్సరాల పాటు జరిగింది. స్మారక చిహ్నం లోను, దాని చుట్టుపక్కలా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. దీని ఉనికి 6500 సంవత్సరాలకు వెనక్కు విస్తరించింది. మంచు ప్రభావం, జంతువులు తవ్విన బొరియలు, అంతగా నాణ్యత లేని తొలి త్రవ్వకాల రికార్డులు, ఖచ్చితమైన, శాస్త్రీయంగా ధృవీకరించబడిన తేదీలు లేకపోవడం, ప్రకృతి సహజంగా లభించే సుద్ద చెదిరిపోవడం వంటి కారణాల వల్ల ఇక్కడి నిర్మాణాల వివిధ దశలను డేటింగ్ చేయడం, అర్థం చేసుకోవడం సంక్లిష్టంగా మారింది. దీని నిర్మాణం ఏడు దశల్లో జరిగి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు సాధారణంగా అంగీకరించిన సిద్ధాంతం.

ప్రయోజనం, నిర్మాణం

స్టోన్‌హెంజ్‌ను నిర్మించిన సంస్కృతి, దానికి సంబంధించి రాతపూర్వక రికార్డులేమీ వదల్లేదు. స్టోన్‌హెంజ్‌ని ఎలా నిర్మించారు, ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించారు వంటి అనేక అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఈ రాళ్ల గురించి అనేక గాథలు ఉన్నాయి. [10] ఈ స్థలం, ప్రత్యేకంగా గ్రేట్ ట్రిలిథాన్, చుట్టూ ఉన్న ఐదు సెంట్రల్ ట్రిలిథాన్‌ల గుర్రపుడెక్క అమరిక, హీల్ స్టోన్, కట్టపోసిన అవెన్యూ.. ఇవన్నీ శీతాకాల అయనాంతపు సూర్యాస్తమయం, వేసవి అయనాంతపు సూర్యోదయాలతో ఒకే సరళ రేఖలో ఉంటాయి. [11] [12] స్మారక చిహ్నం ఉన్న ప్రదేశంలో ఉన్న ఒక ప్రకృతి సహజమైన భూభాగం ఈ రేఖను అనుసరించింది. అదే ఈ నిర్మాణానికి ప్రేరణ కలిగించి ఉండవచ్చు. [13] తవ్విన జంతువుల ఎముకల త్రవ్వకాల అవశేషాలను బట్టి చూస్తే, వేసవి కాలంలో కంటే శీతాకాలం లోనే ప్రజలు ఈ ప్రదేశంలో గుమిగూడి ఉండవచ్చని సూచిస్తున్నాయి. [14]

స్టోన్‌హెంజ్ కోసం ఉపయోగించిన నిర్మాణ సాంకేతికతలను తెలియజేసే ఆధారాలేమీ లేవు. అతీంద్రియ లేదా అనాక్రోనిస్టిక్ పద్ధతులను ఉపయోగించి ఉంటారని వివిధ రచయితలు సూచించారు అంతటి భారీ పరిమాణంలో ఉన్న రాళ్ళను కదల్చడం సాధారణంగా అసాధ్యమని వాళ్ళు పేర్కొంటారు. అయితే, నియోలిథిక్ సాంకేతికత లోని షియర్ లెగ్‌ల వంటి సాంప్రదాయ పద్ధతులను వాడి ఆ పరిమాణంలో ఉన్న రాళ్లను తరలించడం, అంత ఎత్తిన పేర్చడం సాధ్యమేనని ప్రదర్శించి మరీ చూసారు. [15] చరిత్రపూర్వ ప్రజలు మెగాలిత్‌లను ఎలా తరలించారనేదానికి సంబంధించిన అత్యంత సాధారణ సిద్ధాంతం ఒకటి ఏమిటంటే, ఒకేచోట స్థిరంగా ఉండి దొర్లుతూ ఉండే కలప దొంగలను వరసగా పేర్చి, ఒక దారిలా చేసి వాటిపై పెద్ద రాళ్లను ఒక ఉంచి లాక్కువెళ్ళి ఉంటారు. మరొక రవాణా సిద్ధాంతం ఏమిటంటే, జంతువుల కొవ్వును కందెన లాగా పూసిన దారిపై నడిచే "స్లీ" (బండి)ని ఉపయోగించడం. [16] 1995లో స్టోన్‌హెంజ్ సమీపంలో 40-టన్నుల రాతి పలకను మోసే "స్లీ"తో ఇటువంటి ప్రయోగాన్ని విజయవంతంగా చేసారు. 100 కంటే ఎక్కువ మంది కార్మికుల బృందం మార్ల్‌బరో డౌన్స్ నుండి 18 మైళ్ళ దూరం పాటు ఈ స్లాబ్‌ను నెట్టడం, లాగడం చేసింది. [16]

పునరుద్ధరణ

1901లో స్టోన్‌హెంజ్‌కు మొదటిసారి పునరుద్ధరణ జరిగింది. దీన్ని విలియం గౌలాండ్ పర్యవేక్షించాడు. ఇందులో పడిపోయే ప్రమాదంలో ఉన్న సార్సెన్ స్టోన్ నంబర్ 56 ను సరిగా నిలబెట్టడం, కాంక్రీటుతో అమర్చడం ఉన్నాయి. రాయిని నిఠారుగా చేసే క్రమంలో అతను, దాని అసలు స్థానం నుండి అర మీటరు పక్కకు తరలించాడు. రాళ్లను నిలబెట్టడం గురించి మరింత వెల్లడిస్తూ, ఇప్పటి వరకు గౌలాండ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో మరింత తవ్వకాలు జరిపి, ఆ రాళ్లను ఎలా నిలబెట్టి ఉండవచ్చు అనే విషయంపై మరింత సమాచారాన్ని సేకరించాడు. అంతకు ముందు 100 సంవత్సరాలలో చేసిన పని కంటే విలువైన పని అతను చేసాడు. 1920 పునరుద్ధరణ సమయంలో, సమీపంలోని ఓల్డ్ సరుమ్‌ను త్రవ్విన విలియం హాలీ, ఆరు రాళ్ల పునాదిని, బయటి గుంటను త్రవ్వాడు. స్లాటర్ స్టోన్ సాకెట్‌లో కన్నింగ్టన్ వదిలిపెట్టిన పోర్ట్‌ వైన్‌ సీసాను కూడా కనుగొన్నాడు. సార్సెన్ సర్కిల్ వెలుపల Y, Z హోల్స్ అని పిలిచే సమ కేంద్రిత వృత్తాకార రంధ్రాలను అతను గుర్తించాడు. [17]

రిచర్డ్ అట్కిన్సన్, స్టువర్ట్ పిగ్గోట్, జాన్ FS స్టోన్ 1940లు, 1950లలో హాలీ తవ్విన చోట్లమ్నే తిరిగి త్రవ్వారు. సార్సెన్ స్టోన్స్‌పై చెక్కిన గొడ్డలి, బాకులను కనుగొన్నారు. స్మారక చిహ్నం నిర్మాణం లోని మూడు ప్రధాన దశలను మరింత అర్థం చేసుకోవడంలో అట్కిన్సన్ చేసిన కృషి కీలకమైనది.

1958లో రాళ్లను మళ్లీ పునరుద్ధరించారు. మూడు నిలబడి ఉన్న సార్సెన్‌లను తిరిగి నిర్మించి, కాంక్రీట్ స్థావరాలలో అమర్చారు. సర్సెన్ సర్కిల్‌లోని 23వ రాయి కూలిపోయిన తర్వాత 1963లో చివరి పునరుద్ధరణ జరిగింది. దీన్ని మళ్లీ నిర్మించి, మరో మూడు రాళ్లను కాంక్రీట్ చేసారు. మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ అండ్ ఆంత్రోపాలజీకి చెందిన క్రిస్టోఫర్ చిప్పిండేల్, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెందిన బ్రియాన్ ఎడ్వర్డ్స్‌తో సహా తరువాతి పురావస్తు శాస్త్రవేత్తలు వివిధ పునరుద్ధరణల గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రచారం చేశారు. [18] [19]

1966, 1967లో, ఆ స్థలంలో కొత్తగా ఒక కారు పార్కింగు నిర్మించేందుకు గాను, రాళ్లకు పక్కనే వాయవ్యంలో ఉన్న భూభాగాన్ని ఫెయిత్, లాన్స్ వాచర్లు త్రవ్వారు. సా.పూ. 7000 - 8000 మధ్యకాలానికి చెందిన మెసోలిథిక్ పోస్ట్‌హోల్స్‌ను, అలాగే 10-metre (33 ft) పొడవున్న పాలిసేడ్ కందకాన్ని కనుగొన్నారు. V-ఆకారంలో ఉన్న ఈ కందకంలో కలప దుంగలను చొప్పించి, అవి కుళ్ళిపోయే వరకు అక్కడే ఉంచారు. తదుపరి పరిశోధనల్లో, ఈ కందకం స్టోన్‌హెంజ్‌కు పశ్చిమం నుండి ఉత్తరం వైపుగా వెళుతోందని గమనించారు. [17]

1978లో అట్కిన్సన్, జాన్ ఎవాన్స్ మరోసారి తవ్వకాలు జరిపారు. ఈ సమయంలో వారు, బయటి గుంటలో స్టోన్‌హెంజ్ ఆర్చర్ అవశేషాలను కనుగొన్నారు. [20] 1979లో కేబుల్‌ను అమర్చడం కోసం పొరపాటున రోడ్డుపక్కన తవ్వడంతో, హీల్ స్టోన్ పక్కన కొత్త రాతి గుంత ఉనికి గురించి తెలిసింది. దాంతో హీల్ స్టోన్‌తో పాటు రెస్క్యూ ఆర్కియాలజీ కూడా అవసరమైంది.

1980ల ప్రారంభంలో జూలియన్ సి. రిచర్డ్స్ స్టోన్‌హెంజ్ ఎన్విరాన్స్ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించాడు. ఇది చుట్టుపక్కల ప్రకృతి దృశ్యం యొక్క వివరణాత్మక అధ్యయనం. లెస్సర్ కర్సస్, కోనీబరీ హెంజ్, అనేక ఇతర చిన్న అంశాల లక్షణాలను విజయవంతంగా డేటింగు చేయగలిగింది.

1993లో హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, స్టోన్‌హెంజ్‌ని ప్రజలకు అందించిన విధానాన్ని 'జాతీయ అవమానం' అని వర్ణించింది. ఈ విమర్శకు ఇంగ్లీష్ హెరిటేజ్ ప్రతిస్పందనలో భాగంగా, ఆ నాటి వరకు స్మారక చిహ్నం వద్ద నిర్వహించిన అన్ని పురావస్తు పరిశోధనలను క్రోడీకరించి, ఒకచోట చేర్చడానికి పరిశోధనను నియమించింది. ఈ రెండు సంవత్సరాల పరిశోధన ప్రాజెక్టు ఫలితంగా 1995లో స్టోన్‌హెంజ్ ఇన్ ఇట్స్ ల్యాండ్‌స్కేప్‌ అనే మోనోగ్రాఫ్‌ను ప్రచురించారు. ఇక్కడి సంక్లిష్టమైన స్ట్రాటిగ్రఫీని, ఈ స్థలంలో కనుగొనబడిన వస్తువులనూ ప్రదర్శించే మొట్టమొదటి ప్రచురణ. [21]

మూలాలు