ఒపెరా

ఒపెరా అనేది సంగీతభరితమైన నాటక కళ. కానీ పూర్తి స్థాయి సంగీత నాటకం కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది.[1] గాయకులది ఇందులో ప్రధాన పాత్ర. ఈ ప్రదర్శనలు సాధారణంగా ఒపెరా హౌస్ అనే ప్రదర్శనశాలల్లో జరుగుతుంటాయి. పాశ్చాత్య సాంప్రదాయ సంగీతంలో ఒపెరా ఒక ముఖ్యభాగం. 16 వ శతాబ్దం చివరి భాగంలో ఇటలీలో ప్రారంభమైన ఈ కళ నెమ్మదిగా యూరోపు మొత్తం విస్తరించింది. జర్మనీకి చెందిన హెన్రిక్ స్కూట్జ్, ఫ్రాన్సులో జీన్ బాప్టిస్ట్ లల్లీ, ఇంగ్లండులో హెన్రీ పర్సెల్ 17వ శతాబ్దంలో తమ దేశాల్లో ప్రత్యేకమైన ఒపెరా శైలిని సృష్టించడానికి దోహద పడ్డారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఒక్క ఫ్రాన్సులో తప్ప మిగతా యూరప్ అంతా ఇటాలియన్ ఒపెరా ప్రాబల్యం కొనసాగింది. ఒపెరా సీరియా ఇటాలియన్ ఒపెరా యొక్క అత్యంత ప్రతిష్టాత్మక రూపంగా ఉండేది. 1760లో క్రిస్టోఫ్ విల్లిబాల్డ్ గ్లక్ ఈ శైలిలోని కృత్రిమత్వాన్ని మార్చి తనదైన శైలిని ప్రవేశపెట్టాడు. 18 వ శతాబ్దం చివర్లో మోజార్ట్ ఒపెరాలో మంచి పేరు సాధించాడు. అతను మొదట ఒపెరా సీరియాతో ప్రారంభించినా కానీ ఇటాలియన్ కామిక్ ఒపెరా లతో ప్రసిద్ధి పొందాడు.

మిలన్ లో లా స్కలా అనబడే ఒపెరా ప్రదర్శనశాల

నాటకంలో అక్కడక్కడ పాటలు కాకుండా నాటకమంతా ఒక పాటలా ఉంటుంది ఒపెరా. కాలక్రమేణా ఒపెరా మ్యూజికల్ డ్రామా, సింగ్ స్పీల్, ఒపెరా కామిక్ లాంటి అనేక శైలిలు తనలో ఇముడ్చుకుంది. సాంప్రదాయ నంబర్ ఒపెరాలో గాయకులు రెండు రకాలైన సంగీతం పాడతారు. ఒకటి మాటల్లాగా ధ్వనించే రిసైటేటివ్ స్టైల్,[2] ఇంకొకటి అరియాస్. 19వ శతాబ్దంలో ఎడతెరిపి లేకుండా సాగే మ్యూజిక్ డ్రామా బాగా ప్రాచుర్యం పొందింది.

మూలాలు