ఒసామా బిన్ లాడెన్ సంహారం

ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా వ్యవస్థాపకుడు, దాని మొదటి నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో 2011 మే 2 న స్థానిక సమయం అర్ధరాత్రి 1:00 (భారత సమయం 1:30) తరువాత అమెరికా దేశపు నావల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ కు చెందిన నేవీ సీల్స్ సైనికులు సంహరించారు. [1] ఈ బృందాన్ని DEVGRU లేదా సీల్ టీం సిక్స్ అని కూడా పిలుస్తారు. [2] సిఐఎ నేతృత్వం వహించిన, ఆపరేషన్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే పేరున్న ఈ ఆపరేషనులో సిఐఎ తో పాటు, దాడిలో పాల్గొన్న స్పెషల్ మిషన్ యూనిట్లతో సమన్వయం చేస్తూ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC) కూడా పాల్గొంది. సీల్ టీమ్ సిక్స్‌తో పాటు, జెఎస్‌ఒసి కింద పాల్గొనే యూనిట్లలో 160 వ స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్ (ఎయిర్‌బోర్న్) (దీనిని "నైట్ స్టాకర్స్" అని కూడా పిలుస్తారు), సిఐఎ లోని స్పెషల్ యాక్టివిటీస్ డివిజన్ నుండి ఆపరేటర్లు ఉన్నారు. అమెరికాపై బిన్ లాడెన్ జరిపిన సెప్టెంబరు 11 దాడుల తరువాత, అతడి కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు అమెరికా జరిపిన అన్వేషణ ఈ ఆపరేషనుతో ముగిసింది.

ఒసామా బిన్ లాడెన్ సంహారం
ఒసామా బిన్ లాడెన్ ఆవరణ
తేదీ2011 మే 2 (2011-05-02)
ప్రదేశంపాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, అబోట్టాబాద్, బిలాల్ టౌన్ లోని ఒసామా బిన్ లాడెన్ ఆవరణ
ఇలా కూడా అంటారుఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్
పాలుపంచుకున్నవారుసిఐఎ, స్పెషల్ యాక్టివిటీస్ డివిజను
అమెరికా నేవల్ స్పెషల్ వార్‌ఫేర్ డెవలప్‌మెంట్ గ్రూప్
160 వ స్పెషల్ ఆపరేషన్స్ ఏవియేషన్ రెజిమెంట్ (ఎయిర్‌బోర్న్)
మెరీన్ టాక్టికల్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్క్వాడ్రన్ 4
ఫలితంఒసామా బిన లాడెన్ దేహాన్ని ఉత్తర అరేబియా సముద్రంలో ఖననం చేసారు.
మరణాలుఒసామా బిన్ లాడెన్ (54)
ఖలీద్ బిన్ లాడెన్ (23)
అబూ అహ్మద్ అల్ కువైటీ (33)
అల్ కువైటీ సోదరుడు అబ్రార్ (30)
అబ్రార్ భార్య బుష్రా (వయసు తెలియదు)

పాకిస్తాన్‌లో అబోటాబాద్‌లోని బిన్ లాడెన్ ఆవరణపై జరిపిన ఈ దాడిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి చేసారు. దాడి తరువాత అమెరికా బలగాలు, బిన్ లాడెన్ మృతదేహాన్ని గుర్తింపు కోసం ఆఫ్ఘనిస్తాన్‌కు తీసుకెళ్లాయని, ఇస్లామిక్ సంప్రదాయానికి అనుగుణంగా మరణించిన 24 గంటల్లో సముద్రంలో ఖననం చేశారనీ అమెరికా సైనిక అధికారులు తెలిపారు.

అల్ ఖైదా మే నెలలో ఈ మరణాన్ని ధృవీకరించింది. 6 ఉగ్రవాద వెబ్‌సైట్లలో చేసిన పోస్టులలో, హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. టెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్తో సహా ఇతర పాకిస్తాన్ మిలిటెంట్ సమూహాలు కూడా అమెరికా పైన, ఆపరేషన్ను నిరోధించనందుకు పాకిస్తాను పైనా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన చేసాయి. [3] ఈ దాడికి 90% మంది అమెరికన్ ప్రజల మద్దతు ఉంది. [4] [5] ఐక్యరాజ్యసమితి, నాటో, ఐరోపా సమాఖ్య, పెద్ద సంఖ్యలో ప్రభుత్వాలు దీన్ని స్వాగతించాయి. కొందరు దీనిని ఖండించారు. మూడింట రెండు వంతుల మంది పాకిస్తానీయులు కూడా దీన్ని ఖండించారు.[6] నిరాయుధమైనప్పటికీ అతన్ని సజీవంగా పట్టుకోకపోవడం వంటి చట్టపరమైన, నైతిక అంశాలను అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో సహా ఇతరులు ప్రశ్నించారు. [7] బిన్ లాడెన్ మరణానికి సంబంధించిన ఫోటోగ్రాఫిక్ లేదా డిఎన్ఎ ఆధారాలను ప్రజలకు విడుదల చేయకూడదని అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది.[8]

హత్య తరువాత, పాకిస్తాన్ ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలాని, దాడి సంఘటనను దర్యాప్తు చేసేందుకు సీనియర్ జస్టిస్ జావేద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఒక కమిషను ఏర్పాటు చేశాడు.[9] ఆ అబోటాబాద్ కమిషన్ సమర్పించిన నివేదిక, పాకిస్తాన్ సైనిక, నిఘా అధికారుల "సామూహిక వైఫల్యాన్ని" బహిర్గతం చేసింది. ఈ వైఫల్యం కారణంగా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో తొమ్మిది సంవత్సరాల పాటు దాక్కోగలిగాడని నివేదిక పేర్కొంది. ఈ నివేదికను 2013 జూలై 8 న అల్ జజీరాకు లీక్ చేసారు. [10]

బిన్ లాడెన్ కోసం అన్వేషణ

అమెరికా నిఘా వర్గాలు బిన్ లాడెన్ ఉనికిని ఎలా కనుక్కున్నాయో చేప్పే కథనాలు భిన్నంగా ఉంటాయి. ఈ ప్రక్రియ 2002 లో వెలికితీసిన సమాచారంతో ప్రారంభమైందని, సంవత్సరాల తరబడి చేసిన పరిశోధన ఫలితమే ఈ దాడి అని వైట్ హౌస్, సిఐఎ డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ పేర్కొన్నారు. ఈ కథనం ప్రకారం, 2010 సెప్టెంబరు నాటికి, ఈ ఆధారాలు అబోటాబాద్ లోని ఆవరణ లోకి వెళ్ళే కొరియరును అనుసరించాయి. ఇక్కడ అమెరికా నిశితమైన మల్టీప్లాట్‌ఫార్మ్ నిఘా ప్రారంభించింది. జర్నలిస్టు సేమౌర్ హెర్ష్, ఎన్బిసి న్యూస్ ప్రకారం, పాకిస్తానీ నిఘా అధికారి ఒకరు, బిన్ లాడెన్‌ నిర్బంధానికి సంబంధించిన వివరాలను పెద్ద మొత్తానికి అమెరికాకు అమ్మాడు.

ఐఎస్ఐ వాక్-ఇన్ ప్రదేశాలు అబోటాబాద్‌లోని బిన్ లాడెన్

2010 ఆగస్టులో, పాకిస్తాన్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు, ఇస్లామాబాద్ ‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముఖ్యాధికారిని సంప్రదించి, 25 మిలియన్ డాలర్లు ఇస్తే, దానికి బదులుగా బిన్ లాడెన్ ఉన్న స్థానాన్ని వెల్లడించడానికి ముందుకొచ్చారని అమెరికా విశ్రాంత సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. మరో ఇద్దరు అమెరికా నిఘా అధికారులు ఎన్బిసి న్యూస్‌తో మాట్లాడుతూ పై కథనాన్ని నిర్ధారించారు, గతంలో నిఘా విశ్లేషకుడు రేలిన్ హిల్‌హౌస్ కూడా ఇదే సంగతిని చెప్పాడు. [11] [12] పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఐఎస్ఐ 2006 లోనే బిన్ లాడెన్‌ను కనుగొని, అప్పటినుండి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, సైనిక కేంద్రాల సమీపంలో గృహ నిర్బంధంలో ఉంచినట్లు పాకిస్తాన్ అధికారి అమెరికా నిఘా వర్గాలకు తెలియజేశారు. ఆ అధికారి పాలిగ్రాఫ్ (నిజ నిర్ధారణ) పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారు, తరువాత అమెరికా బిన్ లాడెన్ ఉన్న అబోటాబాద్ నివాసంపై స్థానికంగాను, ఉపగ్రహాల ద్వారానూ నిఘా ప్రారంభించింది.

రిటైర్డ్ సీనియర్ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి హెర్ష్‌తో మాట్లాడుతూ, ఈ సమయంలో బిన్ లాడెన్ అనారోగ్యంగా ఉన్నాడు. సౌదీ అరేబియాలోని కొంతమంది నుండి ఆర్థిక సహాయం పొందాడు. పాకిస్తాన్, ఆఫ్ఘన్ ఇస్లామిస్టు గ్రూపులతో తమ సంక్లిష్ట సంబంధాన్ని చక్కగా నిర్వహించుకోడానికి ఐఎస్ఐ అతన్ని తమతో ఉంచుకుంది. ఆ అధికారి ప్రకారం, రిటైర్డ్ సిఐఎ అధికారులు బిన్ లాడెన్ కొరియరు ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఎందుకంటే వారు అతడిపై జరగగల హింస గురించి, శిక్ష గురించీ భయపడ్డారు.

పాకిస్తానుకు చెందిన ఐఎస్‌ఐ ఎరుక తోనే బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్నాడని జర్మనీకి చెందిన ఫెడరల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (బిఎన్‌డి)కు తెలుసునని జర్మన్ వార్తాపత్రిక బిల్డ్ యామ్ సోన్‌టాగ్ 2015 మే లో రాసింది. [13] బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఉన్నాడని, బిఎన్‌డి సిఐఎకు తెలియజేయగా సిఐఎ అతడి ఖచ్చితమైన స్థానాన్ని సిఐఎ ఒక కొరియరు ద్వారా కనుగొందని బిల్డ్ యామ్ సోన్‌టాగ్ రాసింది. BND, NSA ల సహకారంపై కుంభకోణం వెల్లడైన సమయంలో వచ్చిన ఈ నివేదిక నిజాయితీని డెర్ స్పీగెల్ పత్రిక ప్రశ్నించింది.

కొరియర్ గుర్తింపు

అల్-ఖైదా కొరియర్లను గుర్తించడం సిఐఎ బ్లాక్ సైట్ల లోను, గ్వాంటనామో బే నిర్బంధ శిబిరంలో లోనూ ఉండే దర్యాప్తు అధికారులు ముందస్తు ప్రాధాన్యత.నిస్తారు ఎందుకంటే బిన్ లాడెన్ తన ఉనికి గురించి అల్-ఖైదా సైనికులకు, టాప్ కమాండర్లకూ తెలియకుండా కొరియర్ల ద్వారా సమాచారాన్ని పంపిస్తూంటాడని వాళ్ళు భావిస్తారు. ఒక అనుచరుడి ఉపగ్రహ ఫోన్‌ను ట్రాక్ చేయడం ద్వారా 1998 ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌లో తన స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు చేసిన తరువాత బిన్ లాడెన్, ఫోన్‌లను ఉపయోగించడం మానేసాడు. [14]

2002 నాటికి, కున్యా అబూ అహ్మద్ అల్-కువైటి (కువైట్ కు చెందిన షేక్ అబూ అహ్మద్ అని కూడా పిలుస్తారు) అనే అల్-ఖైదా కొరియర్ గురించి ధృవీకరించని వార్తలు విచారణాధికారులకు అందినట్లు అమెరికా అధికారి పేర్కొన్నారు. ఈ వార్తల్లో ఒకటి మొహమ్మద్ అల్-కహ్తానీ నుండి వచ్చింది.2002 నవంబరు 23, 2003 జనవరి 11 ల మధ్య 48 రోజుల పాటు నిరంతరాయంగా విచారించిన తరువాత అతడి నుండి ఈ సమాచారం బైటపడింది. ఈ కాలంలో ఏదో ఒక సమయంలో, అల్-ఖైదా అంతర్గత బృందంలో భాగమైన అబూ అహ్మద్ అల్-కువైట్ అని పిలువబడే వ్యక్తి గురించి అల్-కహ్తాని చెప్పాడు. [15] తరువాత 2003 లో, అల్-ఖైదా ఆపరేషన్ చీఫ్ అని చెప్పబడ్డ ఖలీద్ షేక్ మొహమ్మద్ అనే వ్యక్తి తనకు అల్-కువైటీతో పరిచయం ఉందని, అయితే ఆ వ్యక్తి అల్-ఖైదాలో చురుకుగా లేడని చెప్పాడనీ ఒక అమెరికా అధికారి తెలిపారు.

ఒక అమెరికా అధికారి ప్రకారం, 2004 లో హసన్ ఘుల్ అనే ఖైదీ, అల్-కువైటీ అనే విశ్వసనీయ కొరియర్ మీద బిన్ లాడెన్ ఆధారపడ్డాడని వెల్లడించాడు. [16] అల్-కువైటీకి బిన్ లాడెన్‌తో పాటు ఖలీద్ షేక్ మహ్మద్ తోటి, అతడి వారసుడు అబూ ఫరాజ్ అల్-లిబ్బి తోటీ సాన్నిహిత్యం ఉందని ఘుల్ చెప్పాడు. కొంతకాలంగా అల్-కువైటీ కనిపించడం లేదని కూడా ఘుల్ వెల్లడించాడు. ఇది, కువైటీ బిన్ లాడెన్‌తో ప్రయాణిస్తున్నట్లు అమెరికా అధికారులు అనుమానించడానికి దారితీసింది. ఘుల్ కథనాన్ని వివరించినపుడు, మహ్మద్ తన అసలు కథనానికే కట్టుబడి ఉన్నాడు. అబూ ఫరాజ్ అల్-లిబ్బి 2005 లో పట్టుబడ్డాడు. 2006 సెప్టెంబరులో అతన్ని గ్వాంటనామోకు పంపించారు. బిన్ లాడెన్ కొరియరు, మౌలావి అబ్దుల్-ఖాలిక్ జాన్ అనే వ్యక్తి అనీ అల్-కువైట్ గురించి తెలియదనీ అతడు సిఐఎకు చెప్పాడు. మొహమ్మద్, అల్-లిబ్బి ఇద్దరూ అల్-కువైటీ ప్రాముఖ్యతను తగ్గించినందున, అతను బిన్ లాడెన్ అంతర్గత వృత్తంలో భాగమై ఉంటాడని అధికారులు ఊహించారు.

2007 లో, అధికారులు అల్-కువైటీ అసలు పేరును తెలుసుకున్నారు, అయితే ఆ పేరునూ, అది తమకు ఎలా తెలిసిందనే విషయాన్నీ వెల్లడించబోమని చెప్పారు. పాకిస్తాన్ లోని స్వాత్ వ్యాలీకి చెందిన ఆ కొరియర్ పేరు ఇబ్రహీం సయీద్ అహ్మద్ అని 2011 లో పాకిస్తానీ అధికారులు పేర్కొన్నారు. అతను, అతని సోదరుడు అబ్రార్, వారి కుటుంబాలూ బిన్ లాడెన్ ఆవరణ లోనే నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. [17]

2011 ఏప్రిల్ 24 న వికిలీక్స్ విడుదల చేసిన అబూ ఫరాజ్ అల్-లిబ్బి కోసం జెటిఎఫ్-జిటిఎంఓ నిర్బంధ అంచనాలో మౌలావి అబ్దుల్-ఖాలిక్ జాన్ అనే పేరు కనిపిస్తుంది, కాని సిఐఎ మౌలావి జాన్ అనే వ్యక్తిని కనుగొననే లేదు. ఆ పేరు అల్-లిబ్బి కల్పన అని తేల్చింది.

2010 లో మరొక నిందితుడి ఫోన్ను ట్యాపు చేసినపుడు అల్-కువైటీతో అతడి సంభాషణను దొరకబుచ్చుకుంది. సిఐఎ పారా మిలటరీ ఆపరేటర్లు 2010 ఆగస్టులో అల్-కువైటీ ఉనికి పసిగట్టారు. అతనిని వెంటాడగా అబోటాబాద్ ఆవరణ గురించి తెలిసింది. ఇది బిన్ లాడెన్ దాక్కున్న ప్రదేశమే అని ఊహించటానికి దారితీసింది.

2011 మే 2 న జరిగిన దాడిలో కొరియరు, అతడి బంధువు (సోదరుడు గానీ వేలు విడిచిన సోదరుడు గానీ) చంపబడ్డారు. తరువాత, కొంతమంది స్థానికులు ఆ పురుషులను అర్షద్, తారెక్ ఖాన్ అనే పష్టూన్లుగా గుర్తించారు. అర్షద్ ఖాన్ వద్ద పాత, కంప్యూటరైజ్ చేయని పాకిస్తాన్ గుర్తింపు కార్డు ఉంది. అతడు వాయువ్య పాకిస్తాన్లోని చార్సద్దాకు సమీపంలో ఉన్న ఖాట్ కురునా అనే గ్రామానికి చెందిన వాడిగా దాన్నిబట్టి తెలిసింది. పాకిస్తాన్ అధికారులకు ఆ ప్రాంతంలో అర్షద్ ఖాన్ గురించి ఎటువంటి రికార్డూ కనబడలేదు. ఆ మనుషులు తప్పుడు గుర్తింపుతో నివసిస్తున్నారని అనుమానించారు.

బిన్ లాడెన్ ఆవరణ

ఆవరణ దృశ్యం

కొరియర్ వెళ్ళివస్తూ ఉన్న అబోటాబాద్ ఆవరణలో ఉన్న నివాసితుల గుర్తింపులను నిర్ధారించడానికి సిఐఎ నిఘా ఫోటోలను, నిఘా నివేదికలనూ ఉపయోగించుకుంది. ఆ ఆవరణ ప్రముఖులను దాచి ఉంచడానికి - బహుశా బిన్ లాడెన్‌ను - అనుకూలంగా నిర్మించబడిందని 2010 సెప్టెంబరులో సిఐఎ తేల్చింది. అతను తన చిట్టచివరి భార్య, కుటుంబంతో కలిసి అక్కడ నివసిస్తున్నట్లు అధికారులు భావించారు.

2004 లో నిర్మించిన ఆ మూడంతస్థుల ఆవరణ ఒక ఇరుకైన మురికి రోడ్డు చివర ఉంది. ఉపగ్రహ ఛాయాచిత్రాల నుండి తయారైన గూగుల్ ఎర్త్ మ్యాపులను బట్టి ఈ ఆవరణ 2001 లో లేదని, 2005 లో కొత్త చిత్రాలు తీసే సమయానికి నిర్మించబడిందని చూపిస్తుంది. ఇది అబోటాబాద్ నగర కేంద్రానికి ఈశాన్యంగా 4 కి.మీ. దూరంలో ఉంది. అబోటాబాద్ పాకిస్తాన్ తూర్పు భాగంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుండి సుమారు 160 కి.మీ. దూరంలో, భారత సరిహద్దు నుండి సుమారు 30 కి,.మీ. దూరంలో ఉంది. పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ నుండి ఈ ఆవరణ నైరుతి దిశలో 1.3 కి.మీ. దూరంలో ఉంది. సమీపంలోని ఇళ్ల కంటే ఎనిమిది రెట్లు పెద్ద స్థలంలో ఉన్న ఈ ఆవరణ చుట్టూ 3.7 నుండి 5.5 మీటర్ల ఎత్తున్న కాంక్రీట్ గోడ, దానిపై ముళ్ళ కంచె ఉంది. దీనికి రెండు భద్రతా ద్వారాలు ఉన్నాయి. మూడవ అంతస్తు బాల్కనీలో 2.1 మీటర్ల ఎత్తైన పిట్టగోడ ఉంది. 1.93 మీటర్ల ఎత్తుండే బిన్ లాడెన్ బయటికి కనబడకుండా ఉండడానికి ఇది సరిపోతుంది.

ఆవరణలో ఇంటర్నెట్ గానీ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ గానీ లేవు. దాని లోని నివాసులు ఇంట్లోని చెత్తను పొరుగువారి లాగా బయట పెట్టకుండా కాల్సేసేవారు. స్థానికులు ఈ భవనాన్ని వజీరిస్తాన్ హవేలీ అని అంటారు. ఎందుకంటే దాని యజమాని వజీరిస్తాన్ నుండి వచ్చాడని వారు భావించారు. అమెరికా దాడి, బిన్ లాడెన్ హత్య తరువాత, పాకిస్తాన్ ప్రభుత్వం 2012 ఫిబ్రవరిలో ఈ ఆవరణను కూల్చివేసింది. [18]

ఇంటెలిజెన్స్ సేకరణ

ఆవరణ వైమానిక ఫోటో

ఆవరణపై నిఘా పెట్టి సమాచారాన్ని సేకరించడానికి సిఐఎ నాయకత్వం వహించింది. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్జిఎ), ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ఓడిఎన్ఐ), అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంటుతో సహా ఇతర అమెరికా ఏజెన్సీలు ఈ ఆపరేషన్లో కీలక పాత్రలు పోషించాయి. ఇంటెలిజెన్స్ సేకరణ ప్రయత్నం "ఎంత విస్తృతమైనది, ఖరీదైనదీ" అంటే డిసెంబరు [2010] లో సిఐఎ కాంగ్రెస్కు వెళ్లి, ఏజెన్సీ బడ్జెటు కేటాయింపుల్లో పదిలక్షల డాలర్లను పునఃకేటాయింపులు చేసేందుకు అధికారాన్ని పొందింది." అని అమెరికా అధికారులు ది వాషింగ్టన్ పోస్ట్కు చెప్పారు.

సిఐఎ అబోటాబాద్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. దాని నుండి ఒక బృందం అనేక నెలల పాటు ఆ ఆవరణను పరిశీలించింది. సిఐఎ బృందం సమాచారం పొందేందుకు ఇన్ఫార్మెంట్లను, ఇతర పద్ధతులనూ ఉపయోగించింది. విస్తృతంగా విమర్శించబడిన నకిలీ పోలియో టీకాల కార్యక్రమం కూడా చేసింది. [19] [20] బిన్ లాడెన్ మరణించిన వెంటనే ఈ ఇంటిని ఖాళీ చేసేసారు. అమెరికా నేషనల్ జియోస్పేషియల్-ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ పైలట్ల కోసం మిషన్ సిమ్యులేటర్లను రూపొందించడంలో సహాయపడింది. ఆవరణపై దాడి చెయ్యడానికి ముందు, దాడి సమయంలోను, దాడి తరువాతా RQ-170 [21] డ్రోన్ నుండి సేకరించిన డేటాను విశ్లేషించింది. NGA, ఆ ఇంటి త్రిమితీయ చిత్రాలను తయారు చేసింది. ఆ ప్రాంతంలో ఉండే ట్రాఫిక్ నమూనాలను వివరించే షెడ్యూల్లను తయారు చేసింది. ఆవరణ లోని నివాసితుల సంఖ్య, ఎత్తులు, లింగాన్నీ అంచనా వేసింది. [22] ఇంటెలిజెన్స్ సేకరణ చర్యలలో నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ లోని టైలర్డ్ యాక్సెస్ ఆపరేషన్స్ గ్రూప్ [23] అనే విభాగం కూడా పాలుపంచుకుంది. ఇతర విషయాలతోపాటు, లక్ష్యంగా ఉన్న కంప్యూటర్లు, మొబైల్-ఫోన్ నెట్‌వర్క్‌లలో స్పైవేర్లను చొప్పించడం, ట్రాకింగ్ పరికరాలను రహస్యంగా వ్యవస్థాపించడంలో దానికి ప్రత్యేకత ఉంది. టైలర్డ్ యాక్సెస్ ఆపరేషన్స్ గ్రూప్ పని కారణం గానే ఎన్ఎస్ఎ, బిన్ లాడెన్ వేటలో అల్-ఖైదా కార్యకర్తలు, ఇతర "ఆసక్తిగల వ్యక్తులూ" ఉపయోగించిన మొబైల్ ఫోన్ల నుండి సమాచారాన్ని సేకరించగలిగింది. [24]

బిన్ లాడెన్ ఉన్న ఇంటి ఆవరణ రూపకల్పనే చివరికి అతని ఉనికి గురించి బయట పెట్టి ఉండవచ్చు. మ్యాన్‌హంట్‌లో పాల్గొన్న మాజీ సిఐఎ అధికారి ది వాషింగ్టన్ పోస్ట్‌తో ఇలా అన్నాడు: "ఈ స్థలం మూడు అంతస్తుల ఎత్తులో ఉంది. దానిని వివిధ కోణాల నుండి చూడవచ్చు."

నిఘా సమాచారంపైబిన్ లాడెన్ అబోటాబాద్ ఆవరణ వద్ద నివసిస్తున్నట్లు వారి కేసుకు సంబంధించి సేకరించిన సందర్భోచిత సాక్ష్యాలను, అందుబాటులో ఉన్న వాస్తవాలనూ విడివిడిగా సమీక్షించడం కోసం, తాము సేకరించిన " రెడ్ టీమింగ్ " అనే ప్రక్రియను సిఐఎ ఉపయోగించింది. ఒక అధికారి మాట్లాడుతూ, "మేము మా పనిని తనిఖీ చేయడానికి రెడ్-టీమ్ ఎక్సర్‌సైజులను, ఇతర రకాల ప్రత్యామ్నాయ విశ్లేషణలనూ నిర్వహించాము.ఆ వివరాలు బిన్ లాడెన్ సరిపోయినట్లుగా ఏ ఇతర వ్యక్తికీ సరిపోలేదు."

ఆపరేషను చేపట్టే ముందు ఎంతో అసాధారణ స్థాయిలో కేంద్రీకృత సేకరణ ప్రయత్నం చేసామని అధికారులు ఎంతగ అభివర్ణించినప్పటికీ, దాడి చేయడానికి ముందు ఆవరణ వద్ద బిన్ లాడెన్ ఉన్న ఫోటో ఒక్కటి కూడా వాళ్ళు సంపాదించలేదు. ఆ ఆవరణలో ఉన్న ఒకానొక రహస్య వ్యక్తి గొంతు రికార్డింగ్‌ను ఏ అమెరికా గూఢచారి ఏజెన్సీ కూడా పట్టుకోలేకపోయింది.

ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్

ఈ మిషన్ అధికారిక కోడ్ నామం ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్. నెప్ట్యూన్ ఈటెకు మూడు కొనలుంటాయి. ఇది అమెరికా నేవీ వారి స్పెషల్ వార్ఫేర్ చిహ్నంలో కనిపిస్తుంది, త్రిశూలపు మూడు ములుకులు సముద్రం, గాలి, భూమి లపై సీల్స్ కున్న కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తాయి.

ఉద్దేశం

ఈ ఆపరేషన్ "చంపడం లేదా పట్టుకునే మిషన్" అని ఇద్దరు అమెరికా అధికారులు అన్నారని అసోసియేటెడ్ ప్రెస్ ఆ సమయంలో రాసింది. ఎందుకంటే లొంగిపోవడానికి ప్రయత్నించే నిరాయుధులను అమెరికా చంపదు. కానీ, "ఆ గోడల వెనుక ఉన్నది ఎవరైనా గానీ, వారికి లొంగిపోయే ఉద్దేశం మాత్రం లేదని మొదటి నుండి స్పష్టమే". వైట్ హౌస్ తీవ్రవాద నిరోధక సలహాదారు జాన్ ఓ. బ్రెన్నన్ ఈ దాడి తరువాత ఇలా అన్నాడు: "బిన్ లాడెన్‌ను సజీవంగా పట్టుకెళ్లే అవకాశం మాకు ఉంటే, అతడి వలన ఎటువంటి ముప్పూ ఉండి ఉండకకపోతే, పాల్గొన్న వ్యక్తులు అతన్ని పట్టుకునేవాళ్ళే, అందుకు సిద్ధంగానే ఉన్నారు." సిఐఎ డైరెక్టర్ లియోన్ పనెట్టా PBS న్యూస్‌అవర్‌లో ఇలా అన్నాడు: "ఇక్కడ చెప్పిన పని బిన్ లాడెన్‌ను చంపడం. . . . పోరాటపు నిబంధనల ప్రకారం, అతను చేతులు పైకెత్తి, లొంగిపోయి, తననుండి ముప్పేమీ లేదని తెలిసేలా చేసి ఉంటే, వారు అతనిని పట్టుకునేవారే. కానీ, అతన్ని చంపడానికి వారికి పూర్తి అధికారం ఉంది."

"ఇదొక చంపే ఆపరేషన్" అని పేరు వెల్లడించని ఒక అమెరికా జాతీయ భద్రతా అధికారి రాయిటర్స్‌తో చెప్పాడు. మరొక అధికారి మాట్లాడుతూ, "మేము ఒసామా బిన్ లాడెన్‌ను కనుగొన్నాం, ఇక అతనిని చంపడమే మీ పని" అని సీల్స్‌కు చెప్పినప్పుడు వారు కేరింతలు కొట్టారు.

పొలిటికల్ సైన్స్ క్వార్టర్లీలో 2016 లో ప్రచురించబడిన ఒక వ్యాసంలో మిషన్ లక్ష్యం గురించి వివిధ ప్రచురణల్లో వచ్చిన కథనాలను, వ్యాఖ్యానాలను సర్వే చేసింది. "పట్టుకోవాలనే లక్ష్యం పైకి కనబడేందుకే ఉంది. అంతర్జాతీయ చట్టం కోసం మాత్రమే అది ఉంది. నిజానికి ఇది చంపే ఆపరేషను మాత్రమేనని పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తెలుసు." [25]

ప్రణాళిక, తుది నిర్ణయం

2011 జనవరిలో సిఐఎ, జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (జెఎస్‌ఓసి) కమాండర్ వైస్ అడ్మిరల్ విలియం హెచ్. మెక్‌రావెన్‌కు ఆవరణ గురించి వివరించింది. కమాండో దాడి చాలా సరళంగా ఉంటుందని మెక్‌రావెన్ అన్నాడు. కానీ పాకిస్తాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని అతను ఆందోళన చెందాడు. అతను వర్జీనియా లాంగ్లీలోని సిఐఎ క్యాంపస్‌లో సిఐఎ బృందంతో కలిసి పనిచేయడానికి అమెరికా నావల్ స్పెషల్ వార్‌ఫేర్ డెవలప్‌మెంట్ గ్రూప్ (DEVGRU) నుండి ఒక కెప్టెన్‌ను నియమించాడు. "బ్రయాన్" అనే ఆ కెప్టెన్, లాంగ్లీ లోని సిఐఎ ఆఫీసులో, ప్రింటింగ్ ప్లాంట్‌లో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని, మరో ఆరుగురు JSOC అధికారులతో కలిసి ఈ దాడి ప్రణాళికను రచించడం మొదలుపెట్టాడు. ప్రభుత్వ న్యాయవాదులు దాడులకు ముందు ఎదురు కాగల చట్టపరమైన చిక్కులు, వాటిని ఎదుర్కొనే వికల్పాలనూ పరిశీలించారు.[26]

హెలికాప్టరు దాడితో పాటు, ప్లానర్లు బి -2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లతో ఆవరణపై దాడి చేయాలని భావించారు. పాకిస్తాన్ బలగాలతో కలిసి సంయుక్తంగా ఆపరేషన్ చేపడితే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా వారు పరిశీలించారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాన్నీ విశ్వసించలేమని బరాక్ ఒబామా నిర్ణయించాడు. "పాకిస్తానీయులు ఈ రహస్యాన్ని ఒక నానోసెకండ్ కంటే ఎక్కువసేపు దాచి ఉంచుతారనే నమ్మకం మాకు లేదు" అని అధ్యక్షుడి సీనియర్ సలహాదారుడు న్యూయార్కర్‌తో అన్నాడు .

వికల్పాలను సమీక్షించడానికి ఒబామా మార్చి 14 న జాతీయ భద్రతా మండలితో సమావేశమయ్యాడు; మిషన్ సంగతి బయట పడుతుందేమోనని అతను ఆందోళన చెందాడు. ఆపరేషన్ను త్వరత్వరగా చేసేయ్యాలని అనుకున్నాడు. ఆ కారణంగా అతను పాకిస్తానీయులతో కలిసి చెయ్యాలనే ఆలోచనను తోసిపుచ్చాడు. రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ ఇతర సైనిక అధికారులు -అసలు బిన్ లాడెన్ ఆ ఆవరణలో ఉన్నాడా, ఇంత రిస్కు తీసుకుని కమాండో దాడి చెయ్యడం సరైన పనేనా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సమావేశం ముగిసే సమయానికి అధ్యక్షుడు, బాంబు దాడుల వైపే మొగ్గు చూపుతున్నట్లు అనిపించింది. ఆ అవకాశాన్ని మరింతగా పరిశీలించే పనిని ఇద్దరు అమెరికా వైమానిక దళ అధికారులకు అప్పజెప్పారు.

ఆవరణ క్రింద భూ గృహం ఉండే అవకాశాన్ని సిఐఎ తోసిపుచ్చలేక పోయింది. ఒకవేళ అలాంటిది ఉంటే, దానిని నాశనం చేయడానికి 910 కిలోల JDAM గైడెన్స్ వ్యవస్థలతో కూడిన బాంబులు 32 దాకా అవసరమౌతాయి. అంత మందుగుండు సామాగ్రిని పేలిస్తే, విధ్వంస జరిగే పరిధి లోకి కనీసం మరొక ఇల్లు కూడా వస్తుంది. ఆవరణలో ఉన్న వారితో పాటు డజను మంది పౌరులు కూడా మరణిస్తారని అంచనా వేసారు. పైగా, బిన్ లాడెన్ చనిపోయాడని నిరూపించే సాక్ష్యాలు మిగిలవు. మార్చి 29 న జరిగిన తదుపరి భద్రతా మండలి సమావేశంలో ఈ సమాచారాన్ని సమర్పించినపుడు ఒబామా బాంబు ప్రణాళికను నిలిపివేశాడు. బదులుగా అతను హెలికాప్టరు దాడి కోసం ప్రణాళికను అభివృద్ధి చేయమని అడ్మిరల్ మెక్‌రావెన్‌ను ఆదేశించాడు. బిన్ లాడెన్, ఆవరణ లోని కూరగాయల తోటలో నడిచేటపుడు డ్రోన్‌తో చిన్న వ్యూహాత్మక అయుధాన్ని ప్రయోగించి చంపగల అవకాశాన్ని కూడా పరిశీలించారు.

రెడ్‌ స్క్వాడ్రన్ నుండి అత్యంత అనుభవజ్ఞులైన సీనియర్ ఆపరేటర్లతో మెక్‌రావెన్ ఒక బృందాన్ని ఎంచుకున్నాడు. [27] ఈ రెడ్ స్క్వాడ్రన్ అనేది DEVGRU లోని నాలుగు స్క్వాడ్రన్లలో ఒకటి. రెడ్ స్క్వాడ్రన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి వచ్చేస్తోంది. ఆ కారణంగా ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా దాన్ని ఈ ఆపరేషను కోసం మళ్ళించవచ్చు. ఈ బృందానికి భాషా నైపుణ్యాలు, పాకిస్తాన్‌లోకి సరిహద్దు కార్యకలాపాలలో అనుభవమూ ఉన్నాయి. రెడ్ స్క్వాడ్రన్ లోని ఆపరేటర్లు దాదాపుగా అందరికీ ఆఫ్ఘనిస్తాన్లో పదో అంతకంటే ఎక్కువో ఆపరేషన్లలో పనిచేసిన అనుభవం ఉంది. [28]

తమ మిషన్ ఖచ్చితమైన స్వభావం గురించి ఏమీ చెప్పకుండా ఈ బృందం చేత అమెరికా లోని రెండు ప్రదేశాలలో దాడికి రిహార్సల్స్ చేయించారు. ఏప్రిల్ 10 న నార్త్ కరోలినాలోని హార్వే పాయింట్ డిఫెన్స్ టెస్టింగ్ యాక్టివిటీ ఫెసిలిటీ వద్ద ఒకటి చేసింది. ఇక్కడ సరిగ్గా బిన్ లాడెన్ ఇంటి ఆవరణ పరిమాణం లోనే ఒక నమూనాను నిర్మించారు. రెండవ రిహార్సలు ఏప్రిల్ 18 న నెవాడాలో చేసారు. ఈ స్థానం సముద్ర మట్టం నుండి 1,200 మీటర్ల ఎత్తున ఉంది. హెలికాప్టర్లపై ఎత్తున ఉండే ప్రభావాలను పరీక్షించడానికి ఈ స్థానాన్ని ఎంచుకున్నారు. గొలుసు-లింక్ కంచెలను ఆవరణ గోడల లాగా ఉపయోగించారు. దీనివలన ఎత్తైన గోడల పైగా ఎగిరేటపుడు హెలికాప్టర్ల లిఫ్ట్ సామర్ధ్యాలపై ఉండే ప్రభావాల గురించి దాడిలో పాల్గొనేవారికి తెలియకుండా పోయింది.

పాకిస్తాన్ మిలిటరీ నుండీ ఏ సవాలు రాక ముందే సీల్స్ అబోటాబాద్ వెళ్ళి పని పూర్తి చేసుకుని తిరిగి రావచ్చని ప్లానర్లు విశ్వసించారు. దాడిలో ఉపయోగించే హెలికాప్టర్లకు (సవరించిన బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ) నిశ్శబ్దంగా పనిచేసే సామర్థ్యం, తక్కువ రాడార్ దృశ్యమానత కలిగి ఉండే సామర్థ్యాలున్నాయి. పాకిస్తానీయులను సన్నద్ధం చేయడానికి, శిక్షణ ఇవ్వడానికి అమెరికా సహాయం చేసినందున, వారి రక్షణ సామర్థ్యాల గురించి అమెరికాకు ముందే తెలుసు. 24 గంటలూ అమెరికా నిఘాలో ఉండేలా పాకిస్తాన్ సైనిక స్థావరంలో ఉంచే షరతుపై గతంలో అమెరికా పాకిస్తాన్‌కు ఎఫ్ -16 ఫైటింగ్ ఫాల్కన్‌లను సరఫరా చేసింది. [29]

బిన్ లాడెన్ లొంగిపోతే, అతన్ని బగ్రామ్ ఎయిర్ బేస్ దగ్గర ఉంచుతారు. దాడి మధ్యలో పాకిస్తానీయులు సీల్స్‌ను కనుగొన్నట్లయితే, జాయింట్ చీఫ్స్ చైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అష్ఫాక్ పర్వేజ్ కయానీకి ఫోను చేసి వారి విడుదలపై చర్చలు జరుపుతాడు.

ఏప్రిల్ 19 న జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సి) మరోసారి సమావేశమైనప్పుడు, హెలికాప్టరు దాడికి ఒబామా తాత్కాలిక అనుమతి ఇచ్చాడు. పాకిస్తానీయులతో వ్యవహరించే ప్రణాళిక చాలా అనిశ్చితంగా ఉందని భయపడిన ఒబామా అవసరమైతే జట్టును పోరాడటానికి సన్నద్ధం చేయాలని అడ్మిరల్ మెక్‌రావెన్‌ను కోరారు.

బాగ్రామ్‌లో క్యాంప్ ఆల్ఫా అనే నిరోధిత ప్రాంతంలో ఎకరం స్థలంలో నిర్మించిన ఆవరణ పూర్తి స్థాయి ప్రతిరూపంలో ప్రాక్టీసు చేయడానికి మెక్‌రావెన్, సీల్స్ ఆఫ్ఘనిస్తాన్‌కు బయలుదేరారు. ఈ బృందం ఏప్రిల్ 26 న నావల్ ఎయిర్ స్టేషన్ ఓషియానా నుండి సి -17 విమానంలో బయలుదేరి, జర్మనీలోని రామ్‌స్టీన్ ఎయిర్ బేస్ వద్ద మైదానంలో ఇంధనం నింపిపుకుని, బగ్రామ్ ఎయిర్ బేస్ వద్ద దిగి, ఏప్రిల్ 27 న జలాలాబాద్‌కు తరలి వెళ్ళింది.

ఏప్రిల్ 28 న అడ్మిరల్ ముల్లెన్ తుది ప్రణాళికను ఎన్‌ఎస్‌సికి వివరించాడు. "పోరాడి బయట పడండి" అనే పరిస్థితికు అనుకూలంగా ఉండేలా, చినూక్ హెలికాప్టర్లను అదనపు దళాలతో సహా సమీపంలో సిద్ధంగా ఉంచాలి. సమావేశంలో పాల్గొన్న సలహాదారులలో ఎక్కువ భాగం ముందుకు సాగడానికే మద్దతు ఇచ్చారు. ఉపాధ్యక్షుడు బైడెన్ మాత్రమే దీనిని పూర్తిగా వ్యతిరేకించాడు. గేట్స్, డ్రోన్ క్షిపణి దాడి చెయ్యాలని వాదించాడు. కాని మరుసటి రోజున హెలికాప్టరు దాడి ప్రణాళికను సమర్ధించాడు. కొనసాగడానికి ఆదేశాలు ఇచ్చే ముందు అడ్మిరల్ మెక్‌రావెన్‌తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నానని ఒబామా అన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాక, మిషన్‌ పట్ల ఆందోళన కలిగించే అంశాలు ఏమైనా కనిపించాయా అని అధ్యక్షుడు మెక్‌రావెన్‌ను అడిగాడు. జట్టు సిద్ధంగా ఉందని, తరువాతి కొన్ని రాత్రుల పాటు అబోటాబాద్‌పై వెన్నెల తక్కువగా ఉంటుంది, దాడి చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ మెక్‌రావెన్ అతనికి చెప్పాడు.

ఏప్రిల్ 29 న 8:20 am EDT, ఒబామా తన సలహాదారులతో సమావేశమయ్యాడు. తుది అనుమతి ఇచ్చాడు. ఈ దాడి మరుసటి రోజున జరుగుతుంది. మేఘావృత వాతావరణం కారణంగా ఆపరేషన్ ఒక రోజు ఆలస్యం అవుతుందని ఆ రోజు సాయంత్రం అధ్యక్షుడికి సమాచారం అందింది.

ఏప్రిల్ 30 న, ఒబామా మెక్‌రావెన్‌ను మరోసారి పిలిచి, సీల్స్‌కు శుభాకాంక్షలు చెప్పి, వారి సేవకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ సాయంత్రం, హాస్యనటుడు, టెలివిజన్ నటుడు సేథ్ మేయర్స్ నిర్వహించిన వార్షిక వైట్ హౌస్ కరస్పాండెంట్ అసోసియేషను విందుకు ఒబామా హాజరయ్యాడు. ఒకానొక సమయంలో, మేయర్స్ "బిన్ లాడెన్ హిందూ కుష్‌లో దాక్కున్నారని అందరూ అనుకుంటారు. కానీ, ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు వరకు అతను సి-స్పాన్‌లో ఒక కార్యక్రమం నిర్వహిస్తూంటాడని మీకు తెలుసా?" అని చమత్కరించాడు. రాబోయే ఆపరేషన్ గురించి తనకు తెలిసినప్పటికీ ఒబామా నవ్వేసాడు.

మే 1 న మధ్యాహ్నం 1:22 కు ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు పనెట్టా, ఆపరేషన్‌ మొదలుపెట్టమని మెక్‌రావెన్‌ను ఆదేశించాడు. మధ్యాహ్నం 3 గంటల తరువాత, దాడిని పరిశీలించడానికి అధ్యక్షుడు జాతీయ భద్రతా అధికారులతో పాటు సిట్యుయేషన్ రూమ్‌లో కూచున్నాడు. వారు సెంటినెల్ డ్రోన్ నుండి తీసిన నైట్-విజన్ చిత్రాలను చూశారు. సిఐఎ ప్రధాన కార్యాలయంలో ఉన్న పనెట్టా, స్క్రీన్‌పై ఒక మూల కనిపిస్తూ ఏమేం జరుగుతుందో వివరిస్తూ ఉన్నాడు. సిఐఎ ప్రధాన కార్యాలయంలో ఉన్న పనెట్టా తోటి, ఆఫ్ఘనిస్తాన్లోని మెక్‌రావెన్‌ తోటీ వీడియో లింకులను అక్కడ ఏర్పాటు చేశారు. ప్రక్కనే ఉన్న కార్యాలయంలో ఉన్న JSOC అసిస్టెంట్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ మార్షల్ వెబ్ వద్ద ఉన్న ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లో డ్రోన్ నుండి లైవ్ ఫీడ్ అందుతోంది. సిట్యువేషన్ రూమ్‌లో విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ కూడా ఉంది. ఆమె ఇలా చెప్పింది: "కొన్ని వార్తా నివేదికల్లోనో, సినిమాల్లోనీ చూపినట్లుగా భవనం లోపల ఏం జరుగుతుందో చూసే మార్గం లేదు మాకు. క్షేత్రస్థాయి బృందం నుండి వచ్చే సమాచారం కోసం వేచి ఉండడమే మేం చెయ్యగలిగేది. నేను అధ్యక్షుడి వైపు చూశాను. అతను ప్రశాంతంగా ఉన్నాడు. అతడితో కలిసి పనిచేస్తున్నందుకు నేను ఆ రోజున గర్వించినంతగా చాలా అరుదుగా గర్వించాను." [30] ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం నుండి, పెంటగాన్ నుండి మరో రెండు కమాండ్ సెంటర్లు ఈ దాడిని పరిశీలించాయి.

ఆపరేషన్ అమలు

చేరడం, ప్రవేశించడం

ఒసామా బిన్ లాడెన్ రహస్య స్థావరపు రేఖాచిత్రం, ఆవరణ చుట్టూ ఉన్న ఎత్తైన కాంక్రీట్ గోడలను చూపిస్తుంది

DEVGRU లోని రెడ్ స్క్వాడ్రన్ కు చెందిన సుమారు రెండు డజన్ల మంది అమెరికా నేవీ సీల్స్ హెలికాప్టర్లపై వెళ్ళి ఈ దాడి చేశారు. చట్టపరమైన కారణాల వల్ల (అంటే అమెరికా పాకిస్తాన్‌ల మధ్య యుద్ధమేమీ లేదు కాబట్టి), మిషన్‌కు కేటాయించిన సైనిక సిబ్బందిని తాత్కాలికంగా పౌరసంస్థ యైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నియంత్రణ లోకి బదిలీ చేసారు. [31]

సీల్స్ బృందాలుగా పనిచేస్తారు. HK416 [32] అటాల్ట్ రైఫిల్ (వారి ప్రాధమిక ఆయుధం), మార్క్ 48 మెషిన్ గన్, వ్యక్తిగత రక్షణ ఆయుధంతో పాటు దగ్గరగా ఉన్న లక్ష్యాల కోసం, మరింత నిశ్శబ్దం కోసం MP7 ఆయుధాలనూ ఉపయోగించారు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, దాడిలో మొత్తం "79 మంది కమాండోలు, ఒక కుక్క" పాల్గొన్నాయి. సైనిక కుక్క పేరు కైరో. అది బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందినది. ఒక నివేదిక ప్రకారం, "తప్పించుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినా, పాకిస్తాన్ భద్రతా దళాలు వస్తూ ఉన్నా సీల్స్‌ను అప్రమత్తం చేయటానికి" ఆ కుక్కను నియమించారు. ఈ దాడిపై పాకిస్తాన్ దళాల స్పందనను అరికట్టడానికీ, ఆవరణలో ఉన్న రహస్య గదులు, తలుపులను గుర్తించడంలో సహాయపడటానికీ ఈ కుక్కను ఉపయోగించారు. మిషన్‌లోని అదనపు సిబ్బందిలో అనువాదకుడు, డాగ్ హ్యాండ్లర్, హెలికాప్టరు పైలట్లు, నిఘా సమాచార సేకర్తలు, ఆపరేషన్‌ను చూడటానికి అధిక వర్గీకృత హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజర్‌లను ఉపయోగించే నావిగేటర్లు ఉన్నారు.

ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం నుండి బయలుదేరిన సీల్స్ బృందాలు, తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ నగరంలోని స్టేజింగ్ స్థావరం నుండి పాకిస్తాన్ లోకి వెళ్లాయి. [33] " నైట్ స్టాకర్స్ " అనే పేరున్న 160 వ స్పెషల్ ఆపరేషన్ ఏవియేషన్ రెజిమెంట్ (SOAR), ఈ దాడి కోసం మార్పుచేర్పులు చేసిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను అందించింది.[34] అలాగే చాలా పెద్ద చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్లను బ్యాకప్‌గా ఉపయోగించారు.

బ్లాక్ హాక్‌లు గతంలో కనిపించని "స్టెల్త్" రూపాలు. ఇవి సాంప్రదాయ నమూనాల కంటే మరింత నిశ్శబ్దంగా ప్రయాణించాయి. రాడార్‌పై వాటిని గుర్తించడం కష్టం. [35] స్టెల్త్ పరికరాల అదనపు బరువు కారణంగా, వారి సరుకును "ఒక ఔన్సు వరకూ లెక్కించారు. వాతావరణాన్ని పరిశీలన లోకి తీసుకున్నారు."

ఈ దాడి కొద్దిగా చంద్రకాంతి ఉన్న సమయంలో చేసేలా షెడ్యూల్ చేసారు. తద్వారా హెలికాప్టర్లు "భూమికి తక్కువ తక్కువ ఎత్తులో ఎవరికీ కనబడకుండా" పాకిస్తాన్లోకి ప్రవేశించవచ్చు. రాడార్‌పై కనిపించకుండా, పాకిస్తాన్ మిలిటరీని అప్రమత్తం చేయకుండా ఈ ఆవరణ వద్దకు చేరుకోవడానికి హెలికాప్టర్లు కొండ భూభాగం గుండా, నేలను తాకుతూ వెళ్ళేంత తక్కువ ఎత్తులో ప్రయాణించాయి. జలాలాబాద్ నుండి అబోటాబాద్ వెళ్లేందుకు 90 నిమిషాలు పట్టింది.

మిషన్ ప్లాన్ ప్రకారం, మొదటి హెలికాప్టరు ఆవరణ మీదుగా తిరుగుతూ ఉంటుంది. అపుడు దాని లోని సీల్స్ సభ్యులందరూ తాడు సాయంతో వేగంగా భూమిపైకి దిగుతారు. అదే సమయంలో రెండవ హెలికాప్టరు, ఆవరణ లోని ఈశాన్య మూలకు వెళ్తుంది. అక్కడ అనువాదకుడు, కుక్క, దాని హ్యాండ్లర్‌లతో పాటు భవనం చుట్టూ ఉన్న ఆవరణను నియంత్రణ లోకి తీసుకోడానికి నలుగురు సీల్స్‌లు దిగుతారు. ప్రాంగణంలోని బృందం గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఇంట్లోకి ప్రవేశించవలసి ఉంది.[36]

లక్ష్యానికి పైన ఎగురుతూ ఉండగా, మొదటి హెలికాప్టరు సుడి గాలిలో చిక్కుకుంది. అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉన్న గాలి ఉష్ణోగ్రత, ఎత్తైన ఆవరణ గోడలూ కలిసి బ్లేళ్ళు కిందికి తోస్తున్న గాలి పక్కలకు చెదరిపోకుండా అడ్డుకున్నాయి. దీంతో పరిస్థితి తీవ్రతర మైంది. [37] హెలికాప్టరు తోక ఆవరణ గోడలలో ఒకదానిని రాసుకుని, తోకకు ఉండే రోటార్‌ దెబ్బతిని, హెలికాప్టరు బోల్తా పడబోయింది పైలట్ హెలికాప్టరు ముక్కును భూమికి అదిమి పెట్టి, బోల్తా పడకుండా కాపాడాడు.మృదువైన క్రాష్ ల్యాండింగ్‌లో హెలికాప్టరు లోని సీల్స్, సిబ్బంది, పైలట్లు ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. రెండో హెలికాప్టరు ఆవరణ వెలుపల దిగింది. సీల్స్ గోడలు ఎక్కి లోపలికి వెళ్ళారు. గోడలు, తలుపులను పేలుడు పదార్థాలతో పేలుస్తూ సీల్స్, ఇంట్లోకి ప్రవేశించారు.

ఇంట్లోకి ప్రవేశం

ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ పురోగతిని పర్యవేక్షించడానికి అమెరికా జాతీయ భద్రతా బృందం వైట్ హౌస్ సిట్యువేషన్ రూంలో సమావేశమైంది

ఆవరణలో, మొదటి అంతస్తులోని అతిథి గృహంలో ఇద్దరు వయోజన పురుషులు కనిపించారు. రెండవ, మూడవ అంతస్థులలో బిన్ లాడెన్ తన కుటుంబంతో ఉన్నాడు. రెండవ, మూడవ అంతస్తులను చివరిగా ఆక్రమించారు.. "ప్రతీ అంతస్థు లోనూ పిల్లలు ఉన్నారు ... బిన్ లాడెన్ గది బాల్కనీతో సహా ".

ఈ దాడిలో ఒసామా బిన్ లాడెన్‌ను చంపేసారు. [38] మరో ముగ్గురు పురుషులు, ఒక మహిళ కూడా మరణించారని తొలి వార్తల్లో చెప్పారు: చనిపోయిన వారిలో బిన్ లాడెన్ కుమారుడు ఖలీద్, బిన్ లాడెన్ కొరియరు అబూ అహ్మద్ అల్-కువైటీ, అల్-కువైటీ సోదరుడు అబ్రార్, అబ్రార్ భార్య బుష్రా ఉన్నారు.

మొదట్లో జరిగిన సంఘర్షణల గురించి వివిధమైన నివేదికలు ఉన్నాయి. మార్క్ ఓవెన్ పుస్తకంలో బిన్ లాడెన్‌ను చేరుకునే ముందు జట్టు "చిన్న కాల్పుల" ను ఎదుర్కొందని రాసాడు. [39] కాల్పులు జరగలేదని ఇంటెలిజెన్స్ అధికారి 2015 లో సేమౌర్ హెర్ష్‌తో చెప్పారు. అంతకు ముందు వచ్చిన కొన్ని వార్తల్లో, అల్-కువైట్ గెస్ట్ హౌస్ తలుపు వెనుక నుండి ఎకె -47 తో సీల్స్ మొదటి బృందంపై కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఒక సీల్‌ స్వల్పంగా గాయపడ్డాడు. అల్-కువైటీ, సీల్స్ మధ్య ఒక చిన్నపాటి కాల్పులు జరిగాయి. ఇందులో అల్-కువైటీ హతుడయ్యాడు. అతని భార్య మరియంకు కూడా కుడి భుజంలో గాయమైంది. [40] [41] ఇంటి మొదటి అంతస్తు నుండి కొరియర్ సోదరుడు అబ్రార్ అప్పటికే కాల్పులు జరపుతున్నట్లు భావించిన సీల్స్ రెండవ బృందం అతడిని కాల్చి చంపినట్లు చెప్పారు. అతడి వద్ద లోడ్ చేసిన ఎకె -47 ఉందని భావించాడు (ఇది నిజమేనని తరువాత అధికారిక నివేదికలో నిర్ధారించబడింది). [42] అతని దగ్గర ఉన్న ఒక మహిళ (అబ్రార్ భార్య బుష్రా అని తరువాత గుర్తించబడింది) ను కూడా కాల్చి చంపారు. బిన్ లాడెన్ యువ కుమారుడు ప్రధాన ఇంటి మెట్ల మీద సీల్స్ రెండవ బృందాన్ని ఎదుర్కొన్నట్లు, వాళ్ళు అతన్ని కాల్చి చంపినట్లు చెప్పారు. చంపబడిన ఐదుగురిలో ఒకరు, అబూ అహ్మద్ అల్-కువైటీ వద్ద మాత్రమే ఆయుధాలు ఉన్నాయని పేరు వెల్లడించని అమెరికా సీనియర్ డిఫెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఇంటి లోపలి భాగం కటిక చీకటిగా ఉంది. ఎందుకంటే సిఐఎ ఆపరేటర్లు విద్యుత్ సరఫరాను కట్‌ చేసారు. సీల్స్ నైట్ విజన్ గాగుల్స్ ధరించారు.

బిన్ లాడెన్ హతం

సీల్స్ ప్రధాన భవనపు మూడవ అంతస్తులో బిన్ లాడెన్‌ను ఎదుర్కొన్నారు. బిన్ లాడెన్ నిరాయుధుడుగా, "వదులుగా ఉండే ట్యూనిక్, కుర్తా పైజామా ధరించి " ఉన్నాడు. ఆ బట్టల్లో € 500, రెండు ఫోన్ నంబర్లు కుట్టేసి ఉన్నట్లు కనుగొన్నారు. [43]

అమెరికన్లు మెట్లు ఎక్కుతూ ఉంటే, బిన్ లాడెన్ తన పడకగది తలుపు గుండా వాళ్లను చూసాడు. సీల్ నాయకుడు అతనిపై కాల్పులు జరిపాడు. దీనిపై కథనాలు విభిన్నంగా ఉన్నాయి. అతడి శరీరానికి, తలకూ తూటాలు తగిలాయని మాత్రం కథనాలన్నీ అంగీకరించాయి. మొదటి కాల్పులు తప్పిపోవడం గానీ, అతని ఛాతీకి, పక్కలా లేదా తలపైన తగలడం గానీ జరిగింది. [44] [43] అతని చుట్టూ చాలా మంది మహిళా బంధువులు ఉన్నారు. జర్నలిస్టు నికోలస్ ష్మిడ్లే ప్రకారం, బిన్ లాడెన్ భార్యలలో ఒకరైన అమల్ అహ్మద్ అబ్దుల్ ఫతాహ్, దాడి చేయబోతున్నట్లుగా కదిలింది. సీల్ నాయకుడు ఆమె కాలిపై కాల్చి, ఆపై ఇద్దరి మహిళలను పట్టుకుని పక్కకు తోసేసాడు.

బిన్ లాడెన్‌ను కాల్చిన వాళ్లలో తాను ఒకడినని రాబర్ట్ జె. ఓ నీల్ బహిరంగంగా చెప్పాడు. [45] [46] తాను సీల్స్ నాయకుడిని దాటుకుని ముందుకు వెళ్ళి, తలుపు గుండా లోనికి వెళ్ళి, పడగ్గదిలో బిన్ లాడెన్‌ను ఎదుర్కొన్నానని అతడు చెప్పాడు. బిన్ లాడెన్ ఒక మహిళ వెనుక, ఆమె భుజాలపై చేతులు వేసి నిలబడి ఆమెను ముందుకు నెట్టాడని ఓ నీల్ చెప్పాడు. ఓ నీల్ వెంటనే బిన్ లాడెన్ నుదిటిపై రెండుసార్లు కాల్చాడు. బిన్ లాడెన్ నేలమీద కుప్పకూలిపోయాక, మరోసారి కాల్చాడు.[47]

మాట్ బిస్సోనెట్ చెప్పిన కథనం ఇందుకు విరుద్ధంగా ఉంది. మెట్ల మీది నుండి సీల్ నాయకుడు కాల్చిన కాల్పుల తోనే బిన్ లాడెన్ బాగా గాయపడ్డాడు. బిన్ లాడెన్ భార్యల వద్ద ఏమైనా పేలుడు పదార్థాలుంటాయేమోనని భావించిన సీల్ నాయకుడు, తన సహచరులను ఆ మహిళల నుండి రక్షించేందుకు వాళ్ళిద్దరినీ పక్కకు తోసేసాడు. బిన్ లాడెన్ తూలుకుంటూ వెనక్కి తిరిగి పడకగదిలోకి పోయాక, బిస్సోనెట్, ఓ నీల్ లు ఆ గదిలోకి వెళ్ళి, గాయపడి నేలమీద పడి ఉన్న బిన్ లాడెన్‌ను చూశారు. అతడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపి చంపేసారు.[48] జర్నలిస్టు పీటర్ బెర్గెన్ ఈ విరుద్ధమైన వాదనలను పరిశోధించాడు. దాడిలో పాల్గొన్న చాలామంది సీల్స్ ఈ సంఘటనల గురించి బిస్సోనెట్ చెప్పిన కథనాన్నే బలపరచినట్లు కనుగొన్నాడు. బెర్గెన్ వర్గాల నుండి అతడికి అందిన సమాచారం ప్రకారం, ఆపరేషన్ల తరువాత సమర్పించిన చర్య నివేదికలో బిన్ లాడెన్‌ను చంపిన షాట్లను తానే కాల్చానని ఓ నీల్ ప్రస్తావించలేదు. [49]

బిన్ లాడెన్‌ను చంపడానికి 5.56 మిమీ నాటో 77-గ్రెయిన్ OTM (ఓపెన్-టిప్ మ్యాచ్ ) రౌండ్లను ఉపయోగించిన HK416 ఆయుధాలను వాడారు.[50] సీల్ బృందం నాయకుడు, "దేవుడి కోసం, దేశం కోసం-గెరోనిమో, గెరోనిమో, గెరోనిమో" అని రేడియోలో చెప్పాడు. ఆ తరువాత, మెక్‌రావెన్ ధృవీకరణ కోసం మళ్ళీ అడిగినపుడు, "గెరోనిమో ఎకియా" (చర్యలో శత్రువు హతుడయ్యాడు) అని చెప్పాడు. వైట్ హౌస్ సిట్యుయేషన్ రూములో ఈ ఆపరేషన్ను చూస్తూ ఉన్న ఒబామా, "పట్టేసాం" అని మాత్రం అన్నాడు.

బిన్ లాడెన్ గదిలో రెండు ఆయుధాలు ఉన్నాయని వివిధ రచయితలు వ్రాశారు. అవి, ఎకెఎస్ -74 యు కార్బైన్, రష్యన్ నిర్మిత మాకరోవ్ పిస్టల్ . అతని భార్య అమల్ ప్రకారం, బిన్ లాడెన్ AKS-74U ను అందుకునే లోపే కాల్చి చంపబడ్డాడు. [51] [52] అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, తుపాకులు తలుపు పక్కన ఉన్న షెల్ఫ్‌లో ఉన్నాయి. మృతదేహాన్ని ఫోటో తీసే వరకు సీల్స్ వాటిని చూడలేదు. జర్నలిస్టు మాథ్యూ కోల్ ప్రకారం, తుపాకులు లోడ్ చేసి లేవు. మూడవ అంతస్తులో గాలిస్తున్న సమయంలో మాత్రమే వీటిని కనుక్కున్నారు. [43]

దాడి సమయంలో కనబడిన మహిళలు, పిల్లలను సీల్స్ ప్లాస్టిక్ సంకెళ్ళు, జిప్ టైలతో బంధించారు. దాడి ముగిసిన తరువాత, జీవించి ఉన్న నివాసితులను "పాకిస్తాన్ దళాలు కనుగొనేందుకు వీలుగా" వెలుపలకు తరలించారు. గాయపడిన అమల్ అహ్మద్ అబ్దుల్ ఫతా అరబిక్‌లో రైడర్‌లను వేధించడం కొనసాగించింది. శిధిలాల ముక్క ఒకటి ఎగిరొచ్చి బిన్ లాడెన్ 12 ఏళ్ల కుమార్తె సఫియా పాదాలకు తగలడంతో ఆమె గాయపడింది. [53]

బిన్ లాడెన్ మృతదేహాన్ని అమెరికా బలగాలు తీసుకెళ్లగా, ఈ దాడిలో మరణించిన మరో నలుగురి మృతదేహాలను ఆవరణ వద్దనే వదిలిపెట్టారు. తరువాత పాకిస్తాన్ దళాలు వాటిని తమ అదుపులోకి తీసుకున్నారు.

ముగింపు

పర్షియన్ గల్ఫ్‌లో విమాన కార్యకలాపాలు నిర్వహిస్తున్న USS కార్ల్ విన్సన్ (2011 ఏప్రిల్ 4)

ఈ దాడికి 40 నిమిషాలు పడుతుందని అంచనా వేసారు. జట్టు ఆవరణ లోకి ప్రవేశించిన దగ్గర్నుండి, బయటికి నిష్క్రమించే వరకూ పట్టిన సమయం 38 నిమిషాలు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం, దాడి మొదటి 15 నిమిషాల్లోనే పూర్తయింది.

దాడికి పట్టిన సమయాన్ని, రక్షకులను చంపడానికి, ఒక్కో గదినీ, ఒక్కో అంతస్థునూ వెతికి మహిళలు పిల్లలను రక్షించడానికీ, "ఆయుధాలు, బారికేడ్లను" తొలగించడానికీ, ఒక దొంగ దారికి ఉన్న తలుపును తెరవడానికీ, సమాచారం కోసం వెతకడానికీ ఖర్చుపెట్టారు. అమెరికా సిబ్బంది మూడు కలాష్నికోవ్ రైఫిల్స్, రెండు పిస్టల్స్, పది కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లు, పత్రాలు, డివిడిలు, దాదాపు వంద ఫ్లాష్ డ్రైవ్‌లు, డజను సెల్ ఫోన్లు, "ఎలక్ట్రానిక్ పరికరాలనూ" తదుపరి విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పెద్దమొత్తంలో నిల్వ చేసిన నల్లమందును కూడా సీల్స్ కనుక్కున్నారు.

ల్యాండింగ్ అయిన హెలికాప్టర్లలో ఒకటి దెబ్బతిని, జట్టును బయటకు తీసుకువెళ్ళే స్థితిలో లేనందున, దాన్ని నాశనం చేసారు. దాని స్టెల్త్ పరికారలతో సహా ఇతర రహస్య సమాచారం ఉండే పరికరాల సమాచారం ఇతరులకు అందకుండా ఉండేందుకు ఈ పని చేసారు. ఇన్స్ట్రుమెంట్ పానెల్, రేడియో, ఇతర పరికరాలనూ పైలట్ పగులగొట్టాడు. సీల్స్ హెలికాప్టర్ను పేలుడు పదార్థాలతో పేల్చివేసారు. ఒక హెలికాప్టర్‌ తగ్గినందున, రిజర్వ్‌లో ఉంచిన రెండు చినూక్ హెలికాప్టర్లలో ఒకదానిని, జట్టులో కొంత మందిని, బిన్ లాడెన్ మృతదేహాన్నీ పాకిస్తాన్ నుండి బయటకు తీసుకెళ్లడానికి వాడుకున్నారు.

అధికారిక రక్షణ శాఖ కథనంలో ఆపరేషన్ కోసం ఏయే వైమానిక స్థావరాలను ఉపయోగించుకున్నారనే ప్రస్తావన లేకపోయినా, తరువాత వచ్చిన కథనాల్లో హెలికాప్టర్లు బాగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌కు తిరిగి వెళ్ళాయని తెలిసింది. ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని రెండు అమెరికా నేవీ ఎఫ్ / ఎ -18 ఫైటర్ జెట్లు రక్షణగా వెంట రాగా వి -22 ఓస్ప్రే టిల్ట్‌రోటర్ విమానంలో బాగ్రామ్ నుండి కార్ల్ విన్సన్ విమాన వాహక నౌక లోకి తరలించారు. [54] [55]

మృతదేహం ఖననం

బిన్ లాడెన్‌ను సముద్రంలో ఖననం చేసారని అమెరికా అధికారులు చెప్పారు. అతని అవశేషాలను స్వీకరించేందుకు ఏ దేశమూ ముందుకు రాదు కాబట్టి ఈ పని చేసారు. మృతదేహాన్ని సముద్రంలో పాతిపెట్టడానికి అమెరికా, సౌదీ అరేబియా ప్రభుత్వ ఆమోదం పొందింది. బిన్ లాడెన్ మరణించిన 24 గంటల్లో అతడి మృతదేహానికి ఉత్తర అరేబియా సముద్రంలో కార్ల్ విన్సన్ విమాన వాహక నౌక మీద ముస్లిం మతపరమైన ఆచారాలు జరిగాయి. సన్నాహాలు ఉదయం 10:10 గంటలకు ప్రారంభమయ్యాయి. స్థానిక సమయం ఉదయం 11 గంటలకు సముద్రంలో ఖననం పూర్తయింది. మృతదేహాన్ని కడిగి, తెల్లటి వస్త్రంలో చుట్టి, బరువులు పెట్టిన ప్లాస్టిక్ సంచిలో ఉంచారు. ఒక అధికారి, ముందే సిద్ధం చేసుకున్న మతపరమైన వ్యాఖ్యలను చదివగా, వీటిని అరబిక్‌లోకి అరబ్బీ మాతృభ్హాషగా కల వ్యక్తి అనువదించాడు. తరువాత, బిన్ లాడెన్ మృతదేహాన్ని ఒక బల్లపరుపు బల్ల మీద ఉంచి, ఆ బల్లను ఒక వైపు పైకి లేపారు; అతడి దేహం సముద్రంలోకి జారిపోయింది.[56]

వర్తీ ఫైట్స్: ఎ మెమోయిర్ ఆఫ్ లీడర్‌షిప్ ఇన్ వార్ అండ్ పీస్, అనే పుస్తకంలో లియోన్ పనెట్టా, బిన్ లాడెన్ మృతదేహాన్ని తెల్లటి బట్టలో కప్పి, అరబిక్‌లో తుది ప్రార్థనలు చేసి, 140 కిలోల బరువులు పెట్టిన నల్ల సంచిలో ఉంచారు. అది ఖచ్చితంగా మునిగిపోవాలని, ఎప్పటికీ తేలకుండా ఉండేదుకు ఈ బరువులు పెట్టారు. దేహమున్న ఈ సంచీని ఓడపై తెల్లటి టేబుల్‌పై ఉంచారు. ఆ సంచీ సముద్రంలోకి జారిపోయేలా టేబుల్‌ను పైకి లేపారు. కాని అది జారిపోకుండా టేబులును కూడా దానితో తీసుకుపోయింది. బరువున్న సంచీ మునిగిపోయాక, టేబుల్ ఉపరితలంపైకి తేలింది.

పాకిస్తాన్ అమెరికాల మధ్య సమాచారం

ఒబామా ప్రభుత్వ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడి ముగిసే వరకు అమెరికా అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఈ సంగతి చెప్పలేదు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మైఖేల్ ముల్లెన్ పాకిస్తాన్ సైనిక అధినేత అష్ఫాక్ పర్వేజ్ కయానీకి తెల్లవారు ఝామున సుమారు 3 గంటల స్థానిక సమయానికి ఫోను చేసి, ఆపరేషను గురించి చెప్పాడు.

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఆపరేషన్ను పూర్తిగా అమెరికా బలగాలే నిర్వహించాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారులు మాత్రం ఇది ఉమ్మడి ఆపరేషన్ అనీ, ఇందులో తామూ ఉన్నామనీ చెప్పారు; అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ దీనిని ఖండించాడు. దాడి గురించి తెలుసుకున్న తరువాత పాకిస్తాన్ మిలిటరీ ఎఫ్ -16 లను పంపించింది గానీ, అప్పటికే అమెరికా హెలికాప్టర్లు ఆవరణ నుండి వెళ్ళిపోయాయి అని పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి సల్మాన్ బషీర్ చెప్పాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు