జార్జియా మెలోని

జార్జియా మెలోని (జననం 1977 జనవరి 15) ఇటాలియన్ రాజకీయ నాయకురాలు, అక్టోబరు 2022 నుండి ఇటలీ ప్రధాన మంత్రిగా పనిచేస్తుంది. ఇటాలియన్ ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన మొదటి మహిళ ఈమె. 2006 నుండి ఛాంబర్ ఆఫ్ డెప్యూటీస్ సభ్యురాలిగా వ్యవహరించిన జార్జియా మెలోని 2014 నుండి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ (ఎఫ్డీఐ) పార్టీకి నాయకత్వం వహిస్తోంది. ఆమె 2020 నుండి యూరోపియన్ కన్జర్వేటివ్స్ , రిఫార్మిస్ట్స్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉంది.

జార్జియా మెలోని
2023లో జార్జియా మెలోనీ
అధికారిక పోర్ట్రయిట్, 2023
ఇటలీ ప్రధానమంత్రి
Incumbent
Assumed office
2022 అక్టోబరు 22
అధ్యక్షుడుసర్గియో మట్టారెల్లా
Deputy
  • అంటానియో తజానీ
  • మాటియో సాల్వినీ
అంతకు ముందు వారుమారియో ద్రాఘీ
బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అధ్యక్షురాలు
Incumbent
Assumed office
2014 మార్చి 8
అంతకు ముందు వారుఇగ్న్యాసీయో లా రుస్సా
వ్యక్తిగత వివరాలు
జననం (1977-01-15) 1977 జనవరి 15 (వయసు 47)
రోమ్, ఇటలీ
రాజకీయ పార్టీబ్రదర్స్ ఆఫ్ ఇటలీ (2012 నుంచి)
ఇతర రాజకీయ
పదవులు
  • ఇటాలియన్ సోషల్ మూమెంట్ (1992–1995)
  • నేషనల్ అలయన్స్ (ఇటలీ) (1995–2009)
  • ద పీపుల్ ఆఫ్ ఫ్రీడమ్ (2009–2012)
Domestic partnerఆండ్రియ గియాంబ్రూనో (2015–2023)
సంతానం1
సంతకం
వెబ్‌సైట్

జార్జియా మెలోని 1977 జనవరి 15న రోమ్‌లో జన్మించింది. ఆమె తండ్రి ఫ్రాన్సిస్కో మెలోని పన్నుల సలహాదారుగా పనిచేసేవాడు, ఉత్తర ఇటలీలో లొంబార్డీ ప్రాంతానికి చెందినవాడు. తల్లి అన్నాది సిసిలీ ప్రాంతం, ఆమె తర్వాతి కాలంలో నవలా రచయిత్రిగా మారింది. జార్జియాకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి మొరాకో సమీపంలో అట్లాంటిక్ మహాసముద్రంలోని కానరీ దీవులకు వెళ్ళిపోయి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆమె తల్లి పెంపకంలో పెరిగింది. జార్జియా తండ్రి వామపక్ష భావజాలానికి చెందినవాడనీ తండ్రిపై ప్రతీకారంతోనే జార్జియా రైట్ వింగ్ రాజకీయాల్లోకి వెళ్ళిందనీ ఊహాగానాలు ఉన్నాయి.[1]

1992లో, మెలోని ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ అనే రాజకీయ పార్టీలోని యువజన విభాగమైన యూత్ ఫ్రంట్‌లో చేరింది.[2] ఈ ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంట్ అన్నది రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, యుద్ధ సమయంలోనూ ఇటలీ ఫాసిస్టు నియంత ముస్సోలినీ నేతృత్వంలోని ఇటాలియన్ ఫాసిజం రాజకీయాల్లో పనిచేసినవారు 1946లో ప్రారంభించిన నయా-ఫాసిస్టు రాజకీయ పార్టీ.[3] ఆ తర్వాత నేషనల్ అలయన్స్ (ఎఎన్) పార్టీకి చెందిన స్టూడెంట్ యాక్షన్ అన్న విద్యార్థి ఉద్యమానికి జాతీయ స్థాయి నాయకురాలైంది.[4][5] ఈ నేషనల్ అలయన్స్ అన్నది ఫాసిస్టు రాజకీయ విధానాల్లో నియంతృత్వ ధోరణులు, మరీ అతివాద ధోరణులు వదిలిపెట్టి కొంత మితవాదంతో ప్రధాన స్రవంతిలో కలసిన పోస్ట్-ఫాసిస్టు ధోరణులకు చెందిన పార్టీ. ఇది 1995లో ఇటాలియన్ సోషల్ మూవ్‌మెంటు నుంచి ఏర్పడింది.[6] 1998 నుంచి 2002 వరకూ రోమ్ ప్రావిన్స్‌కు ఛాన్సలర్‌గా, ఆ తర్వాత నేషనల్ అలయన్స్ యువజన విభాగమైన యూత్ యాక్షన్‌కు అధ్యక్షురాలిగా పనిచేసింది.[7]

2008 portrait of Meloni for the Chamber of Deputies
2008లో ఎంపీగా మెలోని

2008లో ఆమెకు ఇటలీ ప్రభుత్వంలో యువజన శాఖ మంత్రి పదవి లభించింది. దీనితో ఇటలీ రాజకీయాల్లో అతిపిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె రికార్డు సృష్టించింది.[1] 2011 వరకూ ఈ పదవిలోనే ఆమె కొనసాగింది. 2012లో అప్పటివరకూ ఆమె ఉన్న రాజకీయ పార్టీ సంక్షోభంలోకి జారిపోవడంతో దాన్ని విభజించి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అన్న పార్టీని మరో ఇద్దరు రాజకీయ సహచరులతో స్థాపించింది. 2014లో దానికి అధ్యక్షురాలైంది.[8] 2014లో జరిగిన యూరోపియన్ పార్లమెంటు ఎన్నికల్లోనూ, 2016లో జరిగిన రోమ్ పురపాలక ఎన్నికల్లోనూ ఆమె పోటీచేసి ఓడిపోయింది.[9][10]

Giorgia Meloni accepting the task of forming a new government
2022లో ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యతను అంగీకరిస్తూ మాట్లాడే సందర్భంలో మెలోని

2018 ఇటాలియన్ సాధారణ ఎన్నికల తర్వాత శాసనసభకు ఎంపికై బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకురాలిగా నేతృత్వం వహించింది.[11] క్రమేపీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ తన ప్రజాదరణ పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఇటలీలో కోవిడ్-19 మహమ్మారితో వ్యవహరించడానికి ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలోని ఏకైక ప్రతిపక్ష పార్టీగా బ్రదర్స్ ఆఫ్ ఇటలీ వ్యవహరించడం ఇందుకు బలాన్నిచ్చింది. డ్రాఘి ప్రభుత్వ పతనం తరువాత, 2022 ఇటాలియన్ సాధారణ ఎన్నికల్లో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ విజయం సాధించింది. తర్వాత ఆమె ఇటలీ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యింది.[12][13][14]

2023 జులైలో లిథువేనియా రాజధాని విల్నీయస్‌లో ఇతర నాటో నాయకులతో మెలోనీ; చిత్రంలో ఉక్రెయిన్ ప్రధాని వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఉన్నాడు.

జార్జియా మెలోని సంప్రదాయవాది (రైట్ వింగ్), జాతీయవాది. ఆమెను అత్యంత తీవ్ర సంప్రదాయవాదిగా (ఫార్-రైట్) కూడా వర్ణిస్తూంటారు.[15][16] తనను తాను క్రైస్తవురాలిగానూ, సంప్రదాయవాదిగానూ తరచుగా అభివర్ణించుకుంటూంటుంది. తాను "దేవుడు, మాతృభూమి, కుటుంబం" (గాడ్, ఫాదర్‌లాండ్, ఫ్యామిలీ) రక్షణ కోసం పనిచేస్తానని చెప్పుకుంటుంది.[17][18] కారుణ్య మరణాలు, స్వలింగ వివాహం, ఎల్జీబీటీలు సంతానాన్ని కలిగివుండడం వంటివి వ్యతిరేకిస్తుంది. చిన్న కుటుంబాలు అన్నది కేవలం మగ-ఆడ జంటలు నడిపించేవాటికే వర్తిస్తుందని ఆమె అంటుంది. జాతీయవాద ఆలోచనలు, స్త్రీవాద ఆలోచనలు కలగలిపిన ఫెమోనేషనలిస్ట్ వాదన, ప్రపంచీకరణ పట్ల వ్యతిరేకత కూడా ఆమె ప్రసంగాల్లో వినిపిస్తూంటాయి.[19] వలసలను అడ్డుకోవడానికి నౌకా దిగ్బంధనం చేయాలన్న వాదనని ఆమె వినిపించింది.[20] ఆమెకు విదేశీయులపై విద్వేషం, ఇస్లామోఫోబియా ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.[21] ఆమె నాటోను సమర్థిస్తుంది,[22] యూరోపియన్ యూనియన్ పట్ల సందేహాత్మక వైఖరి అవలంబిస్తుంది.[23] (ఈ ధోరణికి యూరోస్కెప్టిక్ అని పేరు) ఈ ధోరణిని యూరోరియలిస్ట్ (యూరో వాస్తవికవాదం) అని మెలోని పేర్కొంటూ ఉంటుంది.[24]

2022లో రష్యా యుక్రెయిన్‌పై దాడి చేయక ముందు వరకు రష్యాతో మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకోవాలన్న ఆలోచనలకు మద్దతునిచ్చేది. ఆ తర్వాత వైఖరి మార్చుకుని యుక్రెయిన్‌కి ఆయుధాలు పంపుతానని ముందుకువచ్చింది.[25] మెలోనీ చాలా వివాదాస్పద భావాలను ప్రకటించింది. ఉదాహరణకు ముస్సోలినీ ఇటాలియన్ సోషలిస్టు రిపబ్లిక్‌లో ఛీఫ్ ఆఫ్‌ క్యాబినెట్‌గా పనిచేసిన జార్జియో ఆల్మిరాంటేని 2022లో ప్రశంసిస్తూ స్మరించింది.[26] ఈ ఆల్మిరాంటే జాతివిద్వేషపూరితమైన ప్రచారాన్ని చేసినవాడు.[27]

2023లో మెలోనీకి ఫోర్బ్స్ ప్రపంచంలో అత్యంత శక్తివంతులైన మహిళల జాబితాలో నాలుగవ స్థానాన్ని ఇచ్చింది.[28]

మూలాలు