డార్జిలింగ్ తేనీరు

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో పెంచిన తేయాకులు

డార్జిలింగ్ తేనీరు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లో  డార్జిలింగ్ జిల్లాకు చెందిన టీ జాతి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఊలంగ్ టీ వంటి రకాలు కూడా ఇక్కడ పండిస్తారు. ఈ తేనీటి రుచి విచిత్రంగా, వైవిధ్యభరితంగా ఉండటంతో దానికి ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. సువాసనాభరిమైన దీని వాసన మత్తుగా ఉండటంతో  ద్రాక్షను గుర్తితెస్తుంటుంది.[1]

భారతదేశంలోని మిగిలిన ప్రదేశాల్లో అస్సామ్ రకమైన పెద్ద ఆకుల్ని పండిస్తుంటారు. కానీ డార్జిలింగ్ లో మాత్రం చైనా దేశంలోని చిన్న ఆకులైన కమెల్లియా సినెన్సిస్ వంటి వాటిని పండిస్తుంటారు.  సాధారణంగా డార్జిలింగ్ తేయాకులను బ్లాక్ టీ కోసం ఎక్కువగా వాడుతుంటారు. కానీ ప్రస్తుతం ఊలుంగ్, గ్రీన్ టీ ఆకులను కూడా పండిస్తున్నారు. ఈ మధ్య వైట్ టీల కోసం కూడా ఎస్టేట్లను పెంచడం కూడా ప్రస్తుతం గణనీయంగా పెరుగుతోంది. 2003 జియోగ్రాఫికల్  ఇండికేషన్స్  ఆఫ్ గూడ్స్ చట్టం అమలు లోకి  వచ్చాకా జిఐ ట్యాగ్ పొందిన మొదటి భారతీయ వస్తువు డార్జిలింగ్ తేయాకే.[2] 

చరిత్ర

1841లో ఆర్ధర్ కాంప్బెల్ డార్జిలింగ్ లో మొదటిసారి తేయాకు పండించడం ప్రారంభించారు.[3] ఆయన భారత వైద్య సర్వీస్ లో సివిల్ సర్జన్ గా పనిచేసేవారు. 1839లో నేపాల్ లోని ఖాట్మండూ నుంచి డార్జిలింగ్ కు ట్రాన్స్ ఫర్ అయిన ఆయన కుమౌన్ నుంచి చైనా తేయాకులను తెప్పించి పంట వేసి, డార్జిలింగ్ లో ప్రయోగంగా పండించారు.[4] ఇదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా టీ నర్సరీలను పెంచడం మొదలుపెట్టింది. అయితే తేయాకు వాణిజ్యపంటగా మాత్రం 1850ల్లో మొదలైంది.[5] 1856లో కుర్సెంగ్ అలుబరీ టీ తోటను, డార్జిలింగ్ టీ కంపెనీలను ఇతరులు స్థాపించారు.[5][6]

తేయాకులో రకాలు

సంప్రదాయంగా, డార్జిలింగ్ తేయాకులను బ్లాక్ టీ రకాల్లోకి లెక్క వేస్తారు. డార్జిలింగ్ లో బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఊలుంగ్ టీలకు కూడా తేయాకులను పండిస్తున్నారు.

  • మొదటి విడత పంట మార్చి మధ్యలో వసంత మాసపు వర్షాల సమయంలో పండిస్తారు. ఈ సమయంలో ఆకులు మెత్తగా, లేత రంగులో, లేత వాసనతో తేలికగా ఉంటాయి.
  • మధ్య విడతను మొదటి, రెండు విడతల మధ్యలో పండిస్తారు.
  • రెండో విడతను జూన్ లో పండిస్తారు. ఈ సమయంలో పండే ఆకులు పసుపు రంగులో ఉండి, పూర్తిగా తయారై ఉంటాయి. ఈ ఆకుతో చేసే తేనీరు మత్తు వాసనతో ఉంటుంది.
  • రుతుపవనాల సమయంలో రెండో విడతకు, ఆకురాలు కాలం పంటకు మధ్యలో పండిస్తారు. ఈ ఆకులు తక్కువ రేట్లకు దొరుకుతాయి. వీటి ఎగుమతి కూడా తక్కువే. ఈ ఆకును మసాలా చాయ్ లో కూడా వాడతారు.
  • ఆకురాలు కాలం విడత సమయంలో వర్షాకాలం తరువాత పండే ఈ తేయాకు లేత వాసనతో, తక్కువ ఘాటుతో, ముదురు రంగుతో ఉంటాయి.

డార్జిలింగ్ వైట్ టీ

లేత బంగారు రంగులో, లేత వాసనతో ఉండే డార్జిలింగ్ వైట్ టీ ఆకులు

డార్జిలింగ్ వైట్ టీ ఆకులు లేత వాసనతో, లేత బంగారు రంగుతో,  మృదువైన  రుచితో ఉంటాయి. నిజానికి కొంత తీపి కూడా ఉంటుంది. ఈ ఆకులు మెత్తగా, తేలికగా ఉంటాయి. అందుకే వీటిని బ్లాక్, గ్రీన్ టీ తయారీలకు ఎక్కువగా వాడరు.[7]

ఈ ఆకులను చేతితో కోసి, చుట్టి, ఎండలో ఎండబెడతారు. ఈ రకంగా తయారు చేయడంతోనే ఈ ఆకులను అరుదుగా భావిస్తారు. డార్జిలింగ్ లో 2000 మీటర్ల ఎత్తులో చల్లని వాతావరణంలో పెరుగుతాయి ఈ ఆకులు. 

డార్జిలింగ్ ఊలుంగ్

చాక్లెటీ ఊలుంగ్ అయిన డార్జిలింగ్ ఊలుంగ్ తేయాకులు.

డార్జిలింగ్ ఊలూంగ్ తేయాకులో క్లోనల్, చైనా అని రెండు రకాలున్నాయి. చైనా రకం తైవాన్ ఊలుంగ్ రకానికి దగ్గరగా ఉంటుంది. క్లోనల్ రకం మాత్రం దీనికి పూర్తి విభిన్నంగా ఉంటుంది.[8]

మూలాలు