ఫర్బిడెన్ సిటీ

చీనా దేశ రాజధాని బెజింగ్ లో ఉన్న ఒకానొక రాజప్రాసాదం

నిషిద్ధ నగరం (ఫర్బిడెన్ సిటీ) చైనాలోని సెంట్రల్ బీజింగ్ లోని ఒక ప్యాలెస్ కాంప్లెక్స్. ఇందులో ప్యాలెస్ మ్యూజియం ఉంది. 1420 - 1924 మధ్య మింగ్ రాజవంశం నుండి (యోంగిల్ చక్రవర్తి నుండి) క్వింగ్ రాజవంశం చివరి వరకు ఇది రాజప్రాసాదంగా, చైనా చక్రవర్తి అధికార నివాసంగా ఉంది. నిషిద్ధ నగరం చైనీస్ చక్రవర్తుల, వారి కుటుంబ సభ్యుల నివాసంగా ఉండేది. దాదాపు 500 సంవత్సరాల పాటు చైనా ప్రభుత్వానికి రాజకీయ కేంద్రంగా ఉంది.

ప్యాలెస్ మ్యూజియం
The Gate of Divine Might, the northern gate. The lower tablet reads "The Palace Museum" (故宫博物院)
ఫర్బిడెన్ సిటీ is located in China
ఫర్బిడెన్ సిటీ
Location within China
Established1922
Location4 Jingshan Front St, Dongcheng, Beijing,China
TypeArt museum, Imperial Palace, Historic site
Visitors1.4 కోట్లు
CuratorShan Jixiang (单霁翔)
నిర్మించినది1406–1420
వాస్తు శిల్పిKuai Xiang (蒯祥)
నిర్మాణ శైలిChinese architecture

1406 నుండి 1420 వరకు నిర్మించిన ఈ కాంప్లెక్సులో 980 భవనాలున్నాయి. [1] 72 హెక్టార్లలో (180 ఎకరాలకు పైగా) ఇది విస్తరించి ఉంది. [2] [3] ఈ ప్యాలెస్ సాంప్రదాయ చైనీస్ రాజభవన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూంటుంది. [4] తూర్పు ఆసియా లోను, ఇతర ప్రాంతాలలోనూ సాంస్కృతిక, నిర్మాణ పరిణామాలను ఇది ప్రభావితం చేసింది. ఈ నిషిద్ధ నగరాన్ని 1987 లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. [4]

1925 నుండి, ఫర్బిడెన్ సిటీ, ప్యాలెస్ మ్యూజియం యొక్క ఆధీనంలో ఉంది. మింగ్, క్వింగ్ రాజవంశాలు సేకరించిన కళాకృతులు, కళాఖండాలతో ఇది కూడుకుని ఉంది. మ్యూజియం యొక్క సేకరణల్లో కొంత భాగం ఇప్పుడు తైపీలోని నేషనల్ ప్యాలెస్ మ్యూజియంలో ఉంది. రెండు సంగ్రహాలయాలూ ఒకే సంస్థ నుండి వచ్చాయి, కాని చైనా అంతర్యుద్ధం తరువాత విడిపోయాయి. 2012 నుండి, ఫర్బిడెన్ సిటీను చూసేందుకు సంవత్సరానికి సగటున 1.4 కోట్ల మంది వస్తారు. 2019 లో 1.9 కోట్లకు పైగా సందర్శకులు చూసారు. [5]

చరిత్ర

ఫర్బిడెన్[permanent dead link] సిటీ విహంగ వీక్షణ (1900-1901).

హోంగ్‌వు చక్రవర్తి కుమారుడు ఝు డి, యోంగల్ చక్రవర్తి అయినపుడు అతను రాజధానిని నాంజింగ్ నుండి బీజింగ్ కు తరలించాడు. అప్పుడే, 1406 లో, ఈ ఫర్బిడెన్ సిటీ నిర్మాణం మొదలైంది. [6]

నిర్మాణం 14 సంవత్సరాల పాటు కొనసాగింది. పది లక్షల మందికి పైగా కార్మికులు పనిచేసారు. [7] దీని నిర్మాణంలో నైఋతి చైనా అడవుల్లో లభించే విలువైన ఫోబ్ జెన్నన్ కలపను, బీజింగ్ సమీపంలోని క్వారీల నుండి పెద్ద పాలరాతి పలకలనూ వాడారు. [8] ప్రధాన మందిరాల అరుగులను ప్రత్యేకంగా కాల్చిన "బంగారు ఇటుకలతో" వేసారు. [7]

1420 నుండి 1644 వరకు, ఫర్బిడెన్ సిటీ మింగ్ రాజవంశపు అధికార పీఠం. 1644 ఏప్రిల్ లో, షున్ రాజవంశపు చక్రవర్తిగా ప్రకటించుకున్న లి జిచెంగ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు దీనిని స్వాధీనం చేసుకున్నాయి. [9] మాజీ మింగ్ జనరల్ వు సాంగుయ్, మంచూ దళాల సంయుక్త సైన్యాల ధాటికి తాళలేక అతను పారిపోయాడు, ఈ క్రమంలో ఫర్బిడెన్ సిటీ లోని కొన్ని ప్రాంతాలకు నిప్పంటించాడు. [10]

అక్టోబరు నాటికి, మంచూలు ఉత్తర చైనాలో ఆధిపత్యాన్ని సాధించారు. క్వింగ్ రాజవంశం క్రింద యువ షుంజి చక్రవర్తిని మొత్తం చైనాకు పాలకుడిగా ప్రకటిస్తూ నిషిద్ధ నగరంలో ఒక ఉత్సవం జరిపారు. [11] క్వింగ్ పాలకులు కొన్ని ప్రధాన భవనాలపై పేర్లను మార్చారు, "ఆధిపత్యం" కంటే "సామరస్యాన్ని" నొక్కిచెప్పారు, [12] నేమ్ ప్లేట్లను రెండుభాషల్లో (చైనీస్, మంచూ) రాసారు. [13] ప్యాలెస్‌లో షమానిస్ట్ అంశాలను ప్రవేశపెట్టారు.

1860 లో, రెండవ నల్లమందు యుద్ధంలో, ఆంగ్లో-ఫ్రెంచ్ దళాలు నిషిద్ధ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని, యుద్ధం ముగిసే వరకు దానిలోనే ఉన్నాయి. [14] 1900 లో, బాక్సర్ తిరుగుబాటు సమయంలో రాణి డోవజర్ సిక్సీ ఫర్బిడెన్ సిటీ నుండి పారిపోయింది. తరువాతి సంవత్సరం వరకు దీనిని ఒప్పంద శక్తుల బలగాలు ఆక్రమించాయి. [14]

24 గురు చక్రవర్తులకు నివాసంగా ఉన్నాక- మింగ్ రాజవంశంలో 14, క్వింగ్ రాజవంశంలో 10 మంది - ఈ నిషిద్ధ నగరం, 1912 లో చైనా చివరి చక్రవర్తి పుయి తప్పుకోవడంతో, చైనా రాజకీయ కేంద్రంగా కనుమరుగై పోయింది. కొత్త రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వంతో ఒక ఒప్పందం ప్రకారం, పుయి అంతర భవనంలోనే ఉండిపోయాడు. బయటి భవనాన్ని ప్రజా వినియోగానికి తెరిచారు., [15] 1924 లో తిరుగుబాటులో అతన్ని తొలగించారు. [16] 1925 లో ఫర్బిడెన్ సిటీలో ప్యాలెస్ మ్యూజియాన్ని స్థాపించారు. [17] 1933 లో, చైనాపై జపాన్ దాడి కారణంగా నిషిద్ధ నగరం నుండి జాతీయ తరలించవలసి వచ్చింది. [18] ఈ సేకరణలో కొంత భాగాన్ని రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో తిరిగి ఇక్కడికే చేర్చారు. కాని మరొక భాగాన్ని 1948 లో చియాంగ్ కై-షేక్ ఆదేశాల మేరకు తైవాన్‌కు తరలించారు. సాపేక్షంగా చిన్నదైఅనప్పటికీ, విలువైన ఈ సేకరణను 1965 వరకు దాచి ఉంచారు. ఆ తరువాత తైపీలోని నేషనల్ ప్యాలెస్ మ్యూజియం కేంద్రంగా, మళ్ళీ ప్రజలు చూసేందుకు ఉంచారు. [19]

1949 లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటైన తరువాత, దేశం విప్లవాత్మక ఉత్సాహంతో మునిగిపోవడంతో నిషిద్ధ నగరానికి కొంత నష్టం జరిగింది. [20] అయితే, సాంస్కృతిక విప్లవం సందర్భంగా, ప్రధాని ఝౌ ఎన్‌లై నగరాన్ని కాపాడటానికి ఆర్మీ బెటాలియన్‌ను పంపి మరింత విధ్వంసం కాకుండా నిరోధించాడు. [21]

నిషిద్ధ నగరాన్ని 1987 లో UNESCO "మింగ్, క్వింగ్ రాజవంశాల ఇంపీరియల్ ప్యాలెస్" గా, ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు [22] దీన్ని ప్రస్తుతం ప్యాలెస్ మ్యూజియం నిర్వహిస్తోంది, ఇది నిషిద్ధ నగరంలోని అన్ని భవనాలను 1912 కి పూర్వపు స్థితికి తీసుకువచ్చేలా మరమ్మతు చేయడానికి, పునరుద్ధరించడానికీ పదహారు సంవత్సరాల పునరుద్ధరణ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. [23]

మూలాలు