మిన్నసోటా

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని రాష్ట్రం

మిన్నసోటా (English: Minnesota), అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన మధ్య పశ్చిమ ప్రాంతములోని రాష్ట్రము. ఇది విస్తీర్ణంలో అమెరికాలో కెల్లా 12వ పెద్ద రాష్ట్రము. 50 లక్షల జనాభాతో దేశములో 21వ స్థానములో ఉంది. మిన్నసోటా ప్రాంతంలోని తూర్పు భాగమునుండి ఈ రాష్ట్రాన్ని సృష్టించారు. ఇది సంయుక్త రాష్ట్రాల సమాఖ్యలో 32వ రాష్ట్రముగా 1858, మే 11న అవతరించింది. 10,000 సరస్సులు కల భూమిగా పేరుపొందిన రాష్ట్రము ఆ సరస్సులు, జాతీయ వనాలు, ఉద్యానవనాలతో రాష్ట్ర ప్రజలు, పర్యాటకులకు అత్యంత జీవనవిధానాన్ని అందజేస్తున్నది.

50 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రములో ప్రధానముగా పశ్చిమ, ఉత్తర (స్కాండినేవియా) ఐరోపావాసుల సంతతికి చెందిన వారు ఉన్నారు. ఇతర అల్పసంఖ్యాక జాతులలో ఆఫ్రికన్ అమెరికన్లు, ఆసియా ఖండ వాసులు, హిస్పానిక్‌లు, అదివాసి సంతతికి చెందిన స్థానిక అమెరికన్లు, ఇటీవల వలస వచ్చిన సొమాలీలు, మోంగ్ ప్రజలు ఉన్నారు. రాష్ట్రములోని 60% జనాభా ట్విన్ సిటీస్ గా పేరుబడిన మిన్నియాపోలిస్-సెయింట్ పాల్ మహానగరప్రాంతములో నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలోని రవాణా సౌకర్యాలకు, వాణిజ్యానికి, ప్రరిశ్రమలకు, కళలకు ఈ నగరప్రాంతమే కేంద్రబిందువు. తక్కిన రాష్ట్రాన్ని గ్రేటర్ మిన్నసోటా లేదా ఔట్ స్టేట్ మిన్నసోటా అని వ్యవహరిస్తుంటారు. గ్రామీణ మిన్నసోటాలో పాశ్చాత్య ప్రయరీ భూములతో నిండి ఉండే భూమిని చాలామటుకు ఇప్పుడు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. తూర్పు భాగములో డెసిడ్యువస్ అడవులలో కూడా అవాసాలు ఏర్పడి వ్యవసాయానికి ఉపయోగించబడుతున్నది. జనాభా స్వల్పముగా ఉండే ఉత్తర ప్రాంతము టైగా అడువులతో నిండిఉన్నది.

మిన్నసోటా వాతావరణము విపరీతమైన మార్పులతో, మిన్నసోటా ప్రజల మితస్వభావానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రాష్ట్రము మితవాద, పురోగామి రాజకీయ, సామాజిక ధోరణులు, పౌరుల క్రియాశీలకత్వానికి, అత్యధిక సంఖ్యలో వోటు వెయ్యటానికి పెట్టింది పేరు. వివిధ గణాంకాల ఆధారముగా దేశములోని అత్యంత ఆరోగ్యవంతమైన రాష్ట్రాలలో మిన్నసోటా ఒకటి. దేశములోనే అత్యంత విద్యావంతులైన జనాభా కలిగిన రాష్ట్రములలో మిన్నసోటా ఒకటి.

పేరు వ్యుత్పత్తి

మిన్నసోటా అన్న పదము డకోటా భాషలో మిన్నసోటా నదికి పెట్టిన పేరు: మ్నిసోటా నుండి వచ్చింది. మూలపదము మ్ని అంటే "నీరు". మ్నిసోటాను ఆకాశ వన్నె నీరు లేదా కొద్దిగా మబ్బుపట్టిన నీరుగా అనువదించవచ్చు.[1][2] స్థానిక అమెరికన్లు తొలినాటి వలసప్రజలకు నీళ్ళలో పాలను వేసి దాన్ని మ్నిసోటా అంటూ సూచించారు.[1] రాష్ట్రములోని అనేక ప్రాంతాలకు ఇదే విధమైనటువంటి పేర్లు ఉన్నాయి.ఉదాహరణకు మిన్నహాహా జలపాతం (మిన్నహాహా అంటే సాధారణంగా భావించినట్లు "నవ్వే నీళ్ళు" కాదు. దాని అర్ధం "జలపాతం"), మిన్నియెస్కా ("తెల్లటి నీళ్ళు"), మిన్నటోంకా సరస్సు ("పెద్ద నీరు"), మిన్నెట్రిస్టా ("వంకర నీళ్ళు"),, మిన్నియాపోలిస్, మ్ని, పోలిస్ (నగరానికి గ్రీకు పదం) అనే పదాల పదబంధం[3]

భౌగోళికం

దారులు, పెద్ద జలవనరులను సూచిస్తున్న మిన్నసోటా పటం

అలాస్కాను మినహాయిస్తే మిన్నసోటా దేశములోనే అత్యంత ఉత్తరమున ఉన్న రాష్ట్రము. రాష్ట్రానికి వాయువ్యములోని లేక్ ఆఫ్ ద ఉడ్స్ ప్రాంతములోని ఒక కొమ్ములాంటి ప్రదేశము ఉంది. ఖండాంతర సంయుక్త రాష్ట్రాలలోని 48 రాష్ట్రాలలో 49 డిగ్రీల రేఖాంశానికి ఉత్తరాన ఉన్న ప్రదేశము ఇదొక్కటే. మిన్నసోటా అమెరికాలో ఉత్తర మధ్యపశ్చిమము అనే ప్రదేశములో ఉంది. రాష్ట్రానికి ఈశాన్యాన సుపీరియర్ సరస్సు సరిహద్దుగా ఉంది. సుపీరియర్ మిన్నసోటాతో పాటు మిషిగన్, విస్కాన్సిన్ రాష్ట్రాలకు కూడా సరిహద్దుగా ఉంది. తక్కిన తూర్పు భాగమంతా విస్కాన్సిన్ కు సరిహద్దుగా ఉంది. దక్షిణాన ఐయోవా, పశ్చిమాన ఉత్తర డకోటా, దక్షిణ డకోటా రాష్ట్రాలు, ఉత్తరాన కెనడా ప్రాంతాలైన ఒంటారియో, మానిటోబా సరిహద్దులుగా ఉన్నాయి. 87,014 చదరపు మైళ్ళు (225,365 కి.మీ²), అనగా దాదాపు అమెరికా మొత్తం వైశాల్యంలో 2.25% వైశాల్యముతో[4] మిన్నసోటా దేశములోనే 12వ పెద్ద రాష్ట్రము.[5]

మూలాలు