స్వతంత్ర రాజకీయ నాయకుడు

ఏ రాజకీయ పార్టీ తోటీ అనుబంధం లేని రాజకీయ నాయకుడు.

స్వతంత్ర రాజకీయ నాయకుడురాజకీయ పార్టీ తోటీ అనుబంధం లేని రాజకీయ నాయకుడు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తారు. వీరు ఎన్నికయ్యాక సభల్లో ఏ పార్టీతోటీ అనుబంధం లేకుండా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఎన్నికల్లో ఏదైనా పార్టీ తరపున పోటీ చేసి గెలిచినప్పటికీ, ఆ తరువాత స్వతంత్రంగా వ్యవహరించడం కూడా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో స్వతంత్రంగా పోటీ చేసి, గెలిచాక ఏదైనా పార్టీతో అనుబంధంగా వ్యవహరించవచ్చు, లేదా పార్టీలో చేరనూ వచ్చు.

కొంతమంది రాజకీయ నాయకులకు ఏ రాజకీయ పార్టీ తోటీ కలవని రాజకీయ అభిప్రాయాలు ఉంటాయి. అందువల్ల వారు ఏ పార్టీ లోనూ చేరరు. కొంతమంది స్వతంత్ర రాజకీయ నాయకులకు ఏదో ఒక పార్టీతో అనుబంధం కలిగి ఉండవచ్చు, బహుశా దాని మాజీ సభ్యులై ఉండవచ్చు లేదా దానితో కలిసే అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు కూడా, కానీ ఆ పార్టీ గుర్తు మీద నిలబడకూడదని నిర్ణయించుకోవచ్చు లేదా ఆ పార్టీ మరొక అభ్యర్థిని ఎంచుకున్నందున ఆ పార్టీ తరపున నిలబడలేరు. మరికొందరు జాతీయ స్థాయిలో ఓ రాజకీయ పార్టీకి చెందినప్పటికీ మరొక స్థాయిలో ప్రాతినిధ్యం వహించకూడదని భావిస్తారు. అప్పుడు అక్కడ స్వతంత్రులుగా పోటీ చెయ్యవచ్చు

ప్రభుత్వ పదవికి పోటీ చేయడంలో స్వతంత్రులు కొన్నిసార్లు ఇతర స్వతంత్రులతో కలిసి పార్టీనో కూటమినో ఏర్పాటు చేయవచ్చు. అధికారికంగా వారి పార్టీ లేదా కూటమిని నమోదు చేసుకోవచ్చు. "స్వతంత్ర" అనే పదాన్ని ఉపయోగించిన చోట కూడా, అటువంటి పొత్తులు రాజకీయ పార్టీతో చాలా సారూప్యతను కలిగి ఉంటాయి.

భారతదేశంలో స్వతంత్రులు

భారతదేశంలో స్వతంత్రులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేకమైన నియమాలేమీ లేవు. పార్టీల టిక్కెట్లపై పోటీ చేసే అభ్యర్థులకు ఉండే వ్యక్తిగత అర్హతా నిబంధనలే వీరికీ వర్తిస్తాయి. ఎనికల్లో గెలిచాక వారు సభలో స్వతంత్రంగా వ్యవహరించవచ్చు, లేదా తమకు నచ్చిన పార్టీలో చేరవచ్చు.

స్వతంత్ర అభ్యర్థులు తమ వ్యక్తిగత పలుకుబడి ఆధారంగా లేదా పార్టీలకు భిన్నమైన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికీ ఎన్నికలలో పోటీ చేయవచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు స్వతంత్రులు ఎన్నికయ్యారు. తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుండి ఎన్నికలలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య క్రమేణా పెరుగుతూ వస్తోంది. అయితే గెలిచే అభ్యర్థుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. [1]

1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 44,962 మంది స్వతంత్రులు పోటీ చేయగా వారిలో గెలిచినది 222 మంది మాత్రమే. 1957 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే 47 మంది స్వతంత్రులు గెలిచారు. ఇది ఒక అరుదైన సందర్భం. 2014 ఎన్నికల్లో 3వేల పైచిలుకు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయగా, ముగ్గురు మాత్రమే గెలిచారు.[2] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన నాటి నుండీ ప్రతి ఎన్నిక లోనూ స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తూనే వస్తున్నారు. 2019 లో తొలిసారిగా ఒక్క సవతంత్ర అభ్యర్థి కూడా గెలవలేదు. [3]

స్వతంత్రుల పోటీకి వివిధ కారణాలు

ప్రజలు వివిధ కారణాల వలన స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడానికి మూందుకు వస్తారు. తమ ప్రాంతం లోని సమస్యలకు ప్రచారం కల్పించడం, తమ రాజకీయ పార్టీ టిక్కెట్టు లభించనందున తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయడం వగైరాలు ఆ కారణాల్లో ఉన్నాయి.

సమస్యలకు గుర్తింపు తెచ్చేందుకు

కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఉన్న సమస్యను ఎత్తిచూపేందుకు ఎన్నికలను ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రణాళికలో భాగంగా అనేకమంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసే సంఘటనలున్నాయి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నియోజక వర్గంలో 480 మంది పోటీ చేసారు. జిల్లా లోని ఫ్లోరైడు సమస్యను దేశం దృష్టికి తెచ్చేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. [4] అదే సంవత్సరం బెల్గాం నియోజకవర్గంలో 456 మంది పోటీ చేసారు. మరాఠీ మాట్లాడే ప్రజలు బెల్గాంను మహారాష్ట్రలో కలపాలనే తమ కోరికకు మద్దతుగా ఇలా పోటీ చేసారు. 1996 లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 1033 మంది పోటీ చేసారు. అందులో 1030 మంది డిపాజిట్లు కోల్పోయారు.

పార్టీపై తిరుగుబాటు

తమ పార్టీ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్టు లభించని సందర్భాల్లో కొందరు నాయకులు తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భాలున్నాయి. వాళ్ళు గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. గెలిచిన వెంటనే కొందరు నాయకులు తిరిగి తమ పార్టీ లోనే చేరిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. [5][6]

ప్రత్యర్థి పార్టీల వ్యూహంలో భాగంగా

కొన్నిపార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ ప్రత్యర్థి పార్టీ అబ్యర్థిని చిక్కుల్లో పెట్టేందుకు వేసే వ్యూహాల్లో భాగంగా కూడా స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టే సందర్భాలున్నాయి. తమ ప్రత్యర్థి పేరునే కలిగిన స్వతంత్ర అభ్యర్థులను పోటీలో నిలబెట్టడం వంటివి ఈ వ్యూహంలో భాగం. [7]

వ్యక్తిగత రికార్డుల కోసం

కేవలం వ్యక్తిగత గుర్తింపు కోసమో, లేదా తమ ఆదర్శాల గుర్తింపు కోసమో కొందరు వ్యక్తులు స్వతంత్రులుగా పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన పద్మ రాజన్ 170 వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా, మహారాష్ట్రకు చెందిన విజయ్ ఖండేకర్ 24 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. [2]

స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం

ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న కొన్ని చిహ్నాలు రాజకీయ పార్టీల అభ్యర్థుల చిహ్నాలతో సారూప్యంగా ఉండి, వోటర్లకు తికమక కలిగించిన సందర్భాలు ఉన్నాయి. తమకు రావలసిన వోట్లు ఆ స్వతంత్రులకు వెళ్ళడం వలన తాము నష్టపోతున్నామని కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపించిన దృష్టాంతాలున్నాయి. [7] 2019 లో భువనగిరి లోక్‌సభ నియోజక వర్గంలో జరిగిన ఎన్నికలో తమ అభ్యర్థి ఆ కారణంగా ఓడిపోయారని తెరాస ఆరోపించింది. [8]

పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడినపుడు బ్యాలట్ పేపర్లను ప్రత్యేకంగా ముద్రించాల్సి రావడం, ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రాలకు మరిన్ని ఇన్‌పుట్‌లను చేర్చాల్సి రావడం వంటివి చెయ్యాల్సి వస్తుంది. దీనివలన పోలింగుకు సిద్ధం కావడంలో జాప్యం జరగవచ్చు, పోలింగు సమయం కూడా ఎక్కువ పట్టవచ్చు. 1996 లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 1033 మంది పోటీ చేసినపుడు, ఎక్కడి ఎన్నికలను ఒక నెల రోజుల పాటు వాయిదా వేయవలసి వచ్చింది. పోలింగు సమయాన్ని కూడా 2 గంటల పాటు పొడిగించారు. [4]

లా కమిషను తన 255 వ నివేదికలో "స్వతంత్ర అభ్యర్థులు సీరియస్‌గా పోటీ చెయ్యడం లేదు, లేదా వోటర్లను తికమక పెట్టేందుకే వాళ్ళు పోటీ చేస్తున్నారు" అని చెబుతూ స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా నిషేధించాలని చెప్పింది. దాంతో ఒక వివాదం రేగింది. [9]

స్వతంత్ర అభ్యర్థుల గణాంకాలు

లోక్‌సభ ఎన్నికల్లో

1952 నుండీ 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటి చేసిన స్వతంత్ర అభ్యర్థుల గణాంకాలు ఇలా ఉన్నాయి: [10]

సంవత్సరంపోటీ చేసినవారి సంఖ్యగెలిచినవారి సంఖ్యరెండవ స్థానంలో నిలిచినవారుమూడవ స్థానంలో నిలిచినవారుడిపాజిట్లు కోల్పోయినవారుసాధించిన వోట్ల శాతం
20193461 [11]44773449[11]2.70%
20143235392032193.10%
200938319105138065.20%
200423855710223704.20%
19991945695719282.70%
19981915693018982.40%
19961063691555106046.30%
199155461143055294.20%
19893713122313136745.30%
19843894134229338319.40%
1980282691110327956.40%
1977122491833411905.50%
19711134144619110678.40%
1967866355519075613.80%
1962479205611638311.00%
1957542429713237219.40%
1952533386910839215.90%

ఇతర దేశాల్లో స్వతంత్రులు

చాలా దేశాల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చెయ్యడం, పదవులు చేపట్టడం మామూలే. అయితే వివిధ దేశాల్లో వివిధ రకాలైన నిబంధనలున్నాయి.

బ్రెజిల్, [12] కోస్టారికాల్లో [13] స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదు. ఎస్టోనియాలో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి వెంటనే తన పార్టీకి రాజీనామా చెయ్యాలి. రష్యాలో ఎన్నికైన అధ్యక్షులందరూ స్వతంత్ర అభ్యర్థులే.

యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాల్లో స్వతంత్ర అభ్యర్థులు బ్యాలట్ పేపరులో తమ పేరు పక్కన స్వతంత్ర అని రాసుకోవచ్చు, లేదా ఏమీ లేకుండానూ పోటీ చెయ్యవచ్చు. అది తప్ప ఈ రెండు రకాల్లోనూ తేడా ఏమీ లేదు.

స్వీడన్‌లో ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఉండాల్సిన కనీస వోట్ల శాతం (4%) నిబంధన ప్రకారం, అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చెయ్యడం దాదాపు అసాధ్యం. అయితే ఎన్నికయ్యాక, ఆ అభ్యర్థులు తమతమ పార్టీ సభ్యత్వం నుండి వైదొలగవచ్చు.

మూలాలు