క్రెటేషస్-పాలియోజీన్ విలుప్తి ఘటన

క్రెటేషియస్-పాలియోజీన్ (K-Pg) విలుప్తి ఘటన [lower-alpha 1] అనేది, సుమారు 6.6 కోట్ల సంవత్సరాల కిందట [1] భూమ్మీద నాలుగింట మూడు వంతుల వృక్ష, జంతు జాతులు మూకుమ్మడిగా నశించిపోయిన సంఘటన. [2] [1] [3] దీన్ని క్రెటేషియస్-టెర్షియరీ (K–T) విలుప్తి అని కూడా పిలుస్తారు [lower-alpha 2] ఈ ఘటన లోనే నేలపై నివసించే డైనోసార్లు అంతరించిపోయాయి. అంతేకాదు, సముద్ర తాబేళ్లు, మొసళ్ళ వంటి కొన్ని ఎక్టోథర్మిక్ జాతులు మినహా, 25 కిలోలకు పైబడి బరువున్న టెట్రాపోడ్స్ ఏవీ బతకలేదు. [5] ఈ ఘటనతో క్రెటేషియస్ పీరియడ్ ముగిసింది. దానితో పాటే మెసోజాయిక్ ఎరా ముగిసి, సెనోజాయిక్ ఎరా మొదలైంది. ప్రస్తుతం జరుగుతున్నది సెనోజోయిక్ ఎరాయే.

Meteoroid entering the atmosphere with fireball
dark rocky hill sourrounded by a small semi-desert plateau and deep cliffs
rock hillside with rock striations
rock in museum with layering
Cretaceous Paleogene clay layer with finger pointing to boundary
పైన ఎడమ నుండి సవ్యదిశలో:
  • భూమిని ఢీకొట్టడానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలానికి ఆర్టిస్ట్ రెండరింగ్. ఇటువంటి ప్రభావం అనేక మిలియన్ల అణ్వాయుధాల సమానమైన శక్తిని ఒకేసారి పేల్చివేస్తుంది;
  • దక్కన్ ట్రాప్స్‌లో శిథిలమైన బాలి ఖిలా. K-Pg విలుప్తి ఘటనకు సంబంధించి మరొక పరికల్పన;
  • అల్బెర్టాలోని డ్రమ్‌హెల్లర్ సమీపంలోని బాడ్‌ల్యాండ్స్. ఇక్కడ కోత K-Pg సరిహద్దును బహిర్గతం చేసింది;
  • నెదర్లాండ్స్‌ లోని గెల్‌హెమ్మర్‌గ్రోవ్ సొరంగం వద్ద K-Pg బంకమట్టి పొర (బూడిద రంగు);
  • వ్యోమింగ్ వద్ద ఉన్న రాయి - దీనిలో ఉన్న బంకమట్టి పొరలో ఇరిడియం శాతం దానికి పైన కిందా ఉన్న పొరల కంటే 1000 రెట్లు ఉంది. ఈ చిత్రం శాన్ డీగో నేచురల్ హిస్టరీ మ్యూజియంలో తీసినది.

భౌగోళిక రికార్డులో K -Pg ఘటనను, K -Pg సరిహద్దు అని పిలిచే పలుచని అవక్షేప పొర ద్వారా గుర్తించవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా సముద్ర శిలలు, భూ శిలలు రెండింటి లోనూ కనిపిస్తుంది. ఈ సరిహద్దు పొర వద్ద ఉన్న బంకమట్టి సమ్మేళనంలో ఇరిడియం లోహం స్థాయి అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఈ లోహం భూమి పైపెంకులో ఇంత స్థాయిలో ఎక్కడా ఉండదు. భూమిపై కంటే గ్రహశకలాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. [6]

1980 లో [7] లూయిస్ అల్వారెజ్, అతని కుమారుడు వాల్టర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ప్రతిపాదించినట్లుగా, K -Pg విలుప్తికి కారణం 6.6 కోట్ల సంవత్సరాల క్రితం [1] 10 నుండి 15 కి.మీ. వెడల్పున్న భారీ తోకచుక్క లేదా గ్రహశకలం భూమిని గుద్దుకోవడమేనని ఇప్పుడు విస్తృతంగా భావిస్తున్నారు. [8] [9] దీని వలన ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం నాశనమైంది. ఈ గుద్దుడు వలన ఏర్పడిన కృత్రిమ శీతాకాలం సూర్యరశ్మిని అడ్డుకోవడంతో మొక్కల్లోను, పాచి లోనూ కిరణజన్యు సంయోగ క్రియ ఆగిపోయింది. [10] [11] అల్వారెజ్ పరికల్పన అని పిలిచే ఈ పరికల్పనకు, 1990 ల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో లోని యుకాటాన్ ద్వీపకల్పంలో 180 కి.మీ. వ్యాసమున్న చిక్సులూబ్ బిలాన్ని కనుక్కోవడంతో బలం చేకూరింది. [12] దీనితో K -Pg సరిహద్దులో ఉన్న బంకమట్టి, గ్రహశకలం గుద్దుకోవడంతో ఏర్పడిన శిధిలాలేలని నిర్ధారించుకునే ఆధారాలు లభించాయి. [13] విలుప్తిలన్నీ ఏకకాలంలో సంభవించాయనే వాస్తవం, అవన్నీ గ్రహశకలం వల్లనే సంభవించాయని చెప్పేందుకు ఆధారంగా నిలుస్తోంది. [14] చిక్సులూబ్ లోకి 2016 లో చిక్సులూబ్ పీక్ రింగ్ లోకి చేసిన డ్రిల్లింగులో, గుద్దుడు తరువాతి నిమిషాల్లో భూమి లోతుల నుండి ఉబికి వచ్చిన గ్రానైటు ఆ పీక్ రింగులో కనబడింది. కానీ ఆ ప్రాంతపు సముద్ర గర్భంలోళ్ ఉండే జిప్సం మాత్రం కనబడలేదు. బహుశా తాకిడిలో జనించిన వేడి కారణంగా జిప్సం అవిరై వాతావరణంలోకి ఏరోసోల్‌గా చెదిరిపోయి ఉంటుంది. ఇది వాతావరణం పైన, ఆహార గొలుసుపైనా దీర్ఘకాలిక ప్రభావాలు కలిగించి ఉంటుంది. ఈ సంఘటన మహాసముద్రాలను వేగంగా ఆమ్లీకృతం చేసి, పర్యావరణ పతనానికి కారణమైందనీ, ఈ విధంగా అది వాతావరణంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలగజేసిందనీ, క్రెటేషియస్ చివరిలో జరిగిన సామూహిక విలుప్తికి అది కూడా ఒక కీలక కారణమనీ 2019 అక్టోబరులో పరిశోధకులు చెప్పారు. [15] [16] 2020 జనవరిలో శాస్త్రవేత్తలు, విలుప్తి ఘటన చుట్టూ చేసిన వాతావరణ-మోడలింగు, గ్రహశకలం గుద్దుకున్న పరికల్పనకే మొగ్గు చూపింది తప్ప, అగ్నిపర్వతం పేలుడును సూచించలేదు. [17] [18] [19]

K-Pg విలుప్తిలో అనేక రకాల జీవజాతులు నశించాయి. వాటిలో బాగా తెలిసినవి ఎగరని డైనోసార్‌లు. ఈ ఘటనలో కొన్ని క్షీరదాలు, పక్షులు, [20] బల్లులు, [21] కీటకాలు, [22] [23] మొక్కలు, టెరోసార్లతో సహా అనేక ఇతర నేల జీవులు నశించిపోయాయి. [24] ఈ ఘటనలో మహాసముద్రాలలో ఉండే ప్లెసియోసార్‌లు, మోసాసార్లు, టెలియోస్ట్ చేపలు, [25] సొరచేపలు, మోలస్క్‌లు (ముఖ్యంగా అమ్మోనైట్‌లు), అనేక రకాల పాచి అంతరించిపోయాయి. ఈ K-Pg విలుప్తి ఘటనలో భూమిపై ఉన్న జీవజాతు లన్నిటిలో 75% లేదా అంతకంటే ఎక్కువ అదృశ్యమైనట్లు అంచనా వేసారు. [26] అయితే విలుప్తి వలన జీవ పరిణామానికి కొత్త అవకాశాలు కలిగాయి: దాని పర్యవసానంగా, అనేక సమూహాలు అసాధారణమైన సానుకూల విస్తరణకు లోనయ్యాయి - విలుప్తి వలన ఆకస్మికంగా ఖాళీ అయిన పర్యావరణ సముదాయాలలోని కొత్త రూపాల్లో, కొత్త జాతులు సమృద్ధిగా విస్తరించాయి. ముఖ్యంగా క్షీరదాలు పాలియోజీన్‌లో విస్తరించాయి. [27] గుర్రాలు, తిమింగలాలు, గబ్బిలాలు, ప్రైమేట్స్ వంటి కొత్త రూపాలు అభివృద్ధి చెందాయి. డైనోసార్‌ల సమూహంలో జీవించి ఉన్న ఎగిరే డైనోసార్లు, నేల కోడి, నీటి కోడి మొదలైనవి ఆధునిక పక్షి జాతులలోకి పరిణామం చెందాయి. [28] టెలియోస్ట్ చేప, [29] బహుశా బల్లులు [30] కూడా పరిణామం చెందాయి.

వ్యవధి

విలుప్తి వేగం వివాదాస్పదమైన అంశం. ఎందుకంటే విలుప్తి కారణాల గురించి శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సిద్ధాంతాలు సాపేక్షంగా తక్కువ వ్యవధిలో (కొన్ని సంవత్సరాల నుండి కొన్ని వేల సంవత్సరాల లోపు) వేగంగా అంతరించిపోవడాన్ని సూచింవ్చగా, మరికొన్ని సిద్ధాంతాలు ఎక్కువ కాలాలను సూచిస్తున్నాయి. శిలాజ రికార్డు అసంపూర్తిగా ఉండడం, అంతరించిపోయిన చాలా జాతులు ఇటీవల కనుగొనబడిన శిలాజపు కాలానికి చాలా కాలం తర్వాత చనిపోయి ఉండవచ్చు. దీంతో సిగ్నర్-లిప్స్ ప్రభావం కారణంగా ఈ సమస్యను పరిష్కరించడం చాలా కష్టం. [31] K-Pg విలుప్తికి అనేక మిలియన్ సంవత్సరాల ముందు నుండి, దాని తర్వాత అనేక మిలియన్ సంవత్సరాల వరకు కాల పరిధిని కవర్ చేసే శిలాజాలున్న రాతి పడకలు చాలా తక్కువ సంఖ్యలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. [32] మూడు ప్రదేశాల నుండి K-Pg బంకమట్టి యొక్క అవక్షేపణ రేటు, మందం మొదలైనవి 10,000 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే వేగంగా అంతరించిపోవడాన్ని సూచిస్తున్నాయి. [33] కొలరాడోలోని డెన్వర్ బేసిన్‌లోని ఒక ప్రదేశంలో, K-Pg సరిహద్దు పొర ఏర్పడిన తర్వాత, ఫెర్న్ వృక్షాల అకస్మాత్తు విస్తరణ సుమారు 1,000 సంవత్సరాల పాటు, 71,000 సంవత్సరాల లోపు కొనసాగింది; అదే ప్రదేశంలో, సెనోజోయిక్ క్షీరదాలు దాదాపుగా 185,000 సంవత్సరాల తర్వాత, 570,000 సంవత్సరాల లోపు, మొట్టమొదటగా కనిపించాయి. "ఈ సంఘటన సమయంలో డెన్వర్ బేసిన్‌లో బయోటిక్ విలుప్తి, ప్రారంభ పునరుద్ధరణలో జరిగిన వేగవంతమైన రేటును ఇది సూచిస్తుంది." [34]

చిక్సులూబ్ తాకిడి

తాకిడికి నిదర్శనం

1980లో, నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త లూయిస్ అల్వారెజ్, అతని కుమారుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త వాల్టర్ అల్వారెజ్, రసాయన శాస్త్రవేత్తలు ఫ్రాంక్ అసరో, హెలెన్ మిచెల్‌లతో కూడిన పరిశోధకుల బృందం, ప్రపంచవ్యాప్తంగా క్రెటేషియస్-పాలియోజీన్ సరిహద్దు వద్ద కనిపించే అవక్షేప పొరల్లో ఇరిడియం సాంద్రత సాధారణం కంటే చాలా రెట్లు ఎక్కువ ఉందని కనుగొన్నారు. అధ్యయనం చేసిన మూడు విభాగాలలో ఈ సాంద్రత 30, 160, 20 రెట్లు ఉంది. ఇరిడియం, భూమి పై పెంకులో లభించడం చాలా అరుదు. గ్రహాలు విడివిడిగా ఏర్పడుతున్న సమయంలో ఇనుముతో పాటు ఇరిడియం కూడా భూమి యొక్క గర్భం (కోర్‌)లోకి చొచ్చుకు పోయింది. చాలా గ్రహశకలాలు, తోకచుక్కలలో ఇరిడియం సమృద్ధిగా ఉన్నందున, K-Pg సరిహద్దు సమయంలో ఒక గ్రహశకలం భూమిని తాకి ఉంటుందని అల్వారెజ్ బృందం సూచించింది. [10] తాకిడి సంఘటన పట్ల అంతకు ముందు కూడా ఊహాగానాలు ఉండేవి గానీ, మొట్టమొదటి గట్టి సాక్ష్యం మాత్రం ఇదే. [35]

ఈ పరికల్పనను మొదట ప్రతిపాదించినప్పుడు అది మరీ విప్లవాత్మకంగా ఉందని భావించారు. అయితే త్వరలోనే మరిన్ని సాక్ష్యాలు వెలువడ్డాయి. సరిహద్దు వద్ద బంకమట్టిలో సూక్ష్మమైన రాతి గోళాలు ఉన్నట్లు కనుగొన్నారు. తాకిడి వలన కరిగిన రాయి చల్లబడి స్ఫటికీకరణం చెంది అలా బిందువుల లాగా రూపొందింది. [36] షాక్‌కు గురైన క్వార్ట్జ్ [lower-alpha 3] తదితర ఖనిజాలను కూడా K-Pg సరిహద్దులో గుర్తించారు. [37] [38] గల్ఫ్ తీరం, కరేబియన్ దీవుల వెంబడి భారీ సునామీ బెడ్‌లను గుర్తించడంతో దీనికి మరిన్ని ఆధారాలు లభించాయి. [39] తాకిడి, దానికి సమీపంలోనే సంభవించి ఉండవచ్చని ఇది సూచించింది. దక్షిణ యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళేకొద్దీ K-Pg సరిహద్దు మందంగా అవుతున్నట్లు కనుగొన్నారు -ఉత్తర న్యూ మెక్సికోలో ఈ పొరలు ఒక మీటరంత మందంగా ఉన్నాయి. [40]

రాడార్ స్థలాకృతి 180 km (112 mi) ని వెల్లడిస్తుంది - Chicxulub బిలం యొక్క విస్తృత రింగ్ .

తదుపరి పరిశోధనలో యుకాటాన్ తీరంలో చిక్సులూబ్ కింద పూడుకుపోయిన పెద్ద చిక్సులూబ్ బిలం, K-Pg సరిహద్దు మట్టికి మూలంగా గుర్తించారు. 1978లో జియోఫిజిసిస్ట్ గ్లెన్ పెన్‌ఫీల్డ్ చేసిన కృషి ఆధారంగా 1990 లో, ఈ బిలం అండాకారంగా ఉంటుందని, దాని సగటు వ్యాసం సుమారు 180 km (110 mi), అనీ తెలిసింది , అల్వారెజ్ బృందం లెక్కించిన పరిమాణానికి ఇది సరిపోలింది. తాకిడి పరికల్పన వేసిన అంచనాలకు బిలం యొక్క ఆవిష్కరణ K-Pg తాకిడికి నిశ్చయాత్మకమైన సాక్ష్యాలను అందించింది. జీవులు అంతరించిపోవడానికి తాకిడే కారణమన్న పరికల్పనను ఇది బలపరిచింది.

2013 పేపర్‌లో, బర్కిలీ జియోక్రోనాలజీ సెంటర్‌కు చెందిన పాల్ రెన్నె ఆర్గాన్-ఆర్గాన్ డేటింగ్ ఆధారంగా 66.043±0.011 million సంవత్సరాల క్రితం ఈ తాకిడి జరిగినట్లు తేలింది. ఈ సమయం నుండి 32,000 సంవత్సరాల లోపు సామూహిక విలుప్తి సంభవించి ఉంటుందని అతను పేర్కొన్నాడు. [41]

భూమిని గుద్దిన ఈ గ్రహ శకలం, బాప్టిస్టినా గ్రహశకలాల కుటుంబానికి చెందినదని 2007లో ప్రతిపాదించారు. ఈ గ్రహశకలానికి, దాని కుటుంబానికీ సంబంధించిన పరిశీలనలు లేకపోవడం వల్ల శాస్త్రవేత్తలు ఈ లింకును కొంతవరకు సందేహించారు, అయితే దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. 298 బాప్టిస్టినా లోను, K-Pg లో గుద్దిన శకలం లోనూ ఉన్న రసాయనిక సంతకం ఒకటి కాదని 2009లో తేలింది. ఇంకా, 2011 వైడ్-ఫీల్డ్ ఇన్‌ఫ్రారెడ్ సర్వే ఎక్స్‌ప్లోరర్ (WISE), ఈ కుటుంబంలోని గ్రహశకలాల నుండి ప్రతిబింబించే కాంతి 80 Ma వద్ద ఉందనీ, కక్ష్యలను మార్చుకుని భూమిని 66 Ma సమయంలో గుద్దడానికి వాటికి తగినంత సమయం లేదనీ అంచనా వేసింది. [42]

యునైటెడ్ స్టేట్స్‌లోని నైరుతి ఉత్తర డకోటాలోని టానిస్ సైట్‌లో ఈ తాకిడి సంఘటనకు మరిన్ని ఆధారాలు లభించాయి. టానిస్, హెల్ క్రీక్ ఫార్మేషన్‌లో భాగం. ఉత్తర అమెరికాలోని నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న శిలల సమూహం, ఎగువ క్రెటేషియస్, దిగువ పాలియోసీన్ కాలాలకు చెందిన అనేక ముఖ్యమైన శిలాజ ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. [43] టానిస్ ఒక అసాధారణమైన, ప్రత్యేకమైన స్థలం. ఎందుకంటే ఇది భారీ చిక్సులూబ్ గ్రహశకలం తాకిడి జరిగిన తొలి నిమిషాల నుండి కొన్ని గంటల వరకు సంఘటనలను చాలా వివరంగా రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. [44] [45] ఇక్కడి అంబర్ రాతిలో, చిక్సులూబ్ తాకిడి ఘటనతో సరిపోలే మైక్రోటెక్టైట్‌లు ఉన్నట్లు తెలిసింది. కొంతమంది పరిశోధకులు, ఈ స్థలం లోని అన్వేషణల విశ్లేషణలపై సందేహం వెలిబుచ్చుతున్నారు. కొందరు, అప్పటికి ఇంకా Ph.D కూడా పొందని బృంద నాయకుడైన రాబర్ట్ డిపాల్మాపై సందేహాలు వెలిబుచ్చారు. వాణిజ్య కార్యకలాపాలతో అతనికి ఉన్న సంబంధాలను కూడా అనుమానస్పదంగా పరిగణించారు.

తాకిడి ప్రభావాలు

2010 మార్చిలో, 41 మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ ప్యానెల్, 20 సంవత్సరాల శాస్త్రీయ సాహిత్యాన్ని సమీక్షించి, గ్రహశకలం తాకిడి పరికల్పనను ఆమోదించింది. ప్రత్యేకంగా చిక్సులూబ్ తాకిడే అంతరించిపోవడానికి కారణమని అంగీకరిస్తూ, భారీ అగ్నిపర్వత విస్ఫోటనం వంటి ఇతర సిద్ధాంతాలను తోసిపుచ్చింది. వారు 10-to-15-kilometer (6 to 9 mi) గ్రహ శకలం మెక్సికో లోని యుకాటాన్ ద్వీపకల్పంలోని చిక్సులూబ్ వద్ద గుద్దుకుని భూమిలోకి చొచ్చుకెళ్లింది. తాకిడి 100 teratonnes of TNT (420 zettajoules) కు సమానమైన శక్తిని విడుదల చేసింది. ఇది హిరోషిమా, నాగసాకి లపై చేసిన అణు బాంబు దాడులలో విడుదలైన శక్తి కంటే 100 కోట్ల రెట్లు ఎక్కువ. [46]

చిక్సులూబ్ తాకిడి ప్రపంచ విపత్తుకు కారణమైంది. కొన్ని దృగ్విషయాలు తాకిడి జరిగిన వెంటనే సంభవించిన క్లుప్త సంఘటనలు కాగా, జీవావరణాన్ని నాశనం చేసే భౌగోళిక రసాయన, వాతావరణ అంతరాయాలు కూడా దీర్ఘకాలంలో జరిగాయి.

భూ వాతావరణంలోకి విరజిమ్మబడిన పదార్థం తిరిగి ప్రవేశించడంలో, కొద్దిసేఫు (కొన్ని గంటలపాటు) తీవ్రమైన ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా ఉంది. దీనికి గురైన జీవజాలం ఉడికిపోయాయి. [47] దీన్ని వ్యతిరేకించిన వారు, స్థానికంగా చెలరేగిన ఘోరమైన మంటలు బహుశా ఉత్తర అమెరికాకు మాత్రమే పరిమితమై ఉంటాయనీ, అది ప్రపంచవ్యాప్త అగ్ని తుఫానుల స్థాయి కంటే తక్కువగా ఉండవచ్చనీ వాదించడంతో ఇది చర్చనీయాంశమైంది. ఇదే "క్రెటేషియస్-పాలియోజీన్ ఫైర్‌స్టార్మ్ వాదన". 2013లో రూపొందించిన ఒక ప్రముఖ అణు శీతాకాలపు నమూనా పత్రం ప్రకారం, గ్లోబల్ శిధిలాల పొరలో ఉన్న మసి పరిమాణం ఆధారంగా, యావత్తు భూగోళ జీవావరణం కాలిపోయి ఉండవచ్చునని భావించింది. ప్రపంచవ్యాప్త మసి-మేఘం సూర్యుడిని నిరోధించి, శీతాకాలపు ప్రభావాన్ని సృష్టించడాన్ని ఇది సూచిస్తుంది. . [48]

అగ్ని తుపానులు, శీతాకాలపు ప్రభావాల ఊహలను పక్కన పెడితే, ఆ ప్రభావం ఒక దుమ్ము మేఘాన్ని సృష్టించి, సూర్యరశ్మిని ఒక సంవత్సరం వరకు నిరోధించి, కిరణజన్య సంయోగక్రియను నిరోధించి ఉంటుంది. [49] పెద్ద మొత్తంలో మండే హైడ్రోకార్బన్‌లు, సల్ఫర్‌ కలిగి ఉన్న కార్బొనేట్ శిలల ప్రాంతాన్ని గ్రహశకలం తాకింది. [50] తాకిడిలో వీటిలో ఎక్కువ భాగం ఆవిరై, తద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్ల ఏరోసోల్‌లను స్ట్రాటో ఆవరణం లోకి ఇంజెక్ట్ చేస్తుంది. ఇది భూ ఉపరితలం పైకి చేరే సూర్యరశ్మిని 50% కంటే ఎక్కువ తగ్గించి ఉండవచ్చు, యాసిడ్ వర్షాన్ని కలిగించి ఉండవచ్చు. [49] [51] మహాసముద్రాల ఆమ్లీకరణ ఫలితంగా కాల్షియం కార్బోనేట్ పెంకులను పెంచే అనేక జీవులు అంతరించి ఉండవచ్చు. తాకిడి జరిగిన దశాబ్దాల తరువాత, బ్రజోస్ నది సంగమం వద్ద సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 7 °C (13 °F) కి పడిపోయింది. [52] ఈ ఏరోసోల్‌లు పూర్తిగా తగ్గిపోడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది. దీంతో మొక్కలు, ఫైటోప్లాంక్టన్ నశిస్తాయి. దాంతో శాకాహారులు, వాటిని తినే మాంసాహారులు అంతరిస్తాయి. ఆహార కోసం డెట్రిటస్‌పై ఆధారపడిన జీవుల మనుగడకు సహేతుకమైన అవకాశం ఉంది. [49] గడ్డకట్టే ఉష్ణోగ్రతలు బహుశా కనీసం మూడు సంవత్సరాల పాటు కొనసాగి ఉంటాయి. [53]

మంటలు విస్తృతంగా సంభవించి ఉన్నట్లయితే అవి, తాకిడి తర్వాత జీవించి ఉన్న జీవులను వెంటనే నాశనం చేసి ఉండేవి. [54]

దాదాపు క్రెటేషియస్ చివరిలో ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టిందని చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అయితే జీవులు అంతరించిపోవడానికి అదొక్కటే కారణమా అనే దానిపై కొంతకాలంగా వివాదం ఉండేది. మారుతున్న పర్యావరణ కారకాల కారణంగా అప్పటికే 5 కోట్ల సంవత్సరాల నుండీ డైనోసార్‌లు క్రమేణా క్షీణిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. [55]

2020లో హల్ తదితరులు, [56] చియారెంజా తదితరులు [57] చేసిన అధ్యయనాల్లో దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం క్రెటేషియస్-పాలియోజీన్ సామూహిక విలుప్తి ఎక్కువగా గ్రహ శకల ప్రభావం వల్ల సంభవించిందని అగ్నిపర్వతం ఫలితంగా కాదని పరిమాణాత్మకంగా చూపాయి. [58]

విలుప్తి ప్రభావాలకు మించి, ఈ సంఘటన అమెజోనియా వంటి నియోట్రోపికల్ రెయిన్‌ఫారెస్ట్ బయోమ్‌లకు దారితీసే వృక్షజాలం, జంతుజాలంలో మరింత సాధారణమైన మార్పులకు కారణమైంది. వృక్ష వైవిధ్యం పూర్వ స్థాయికి పునరుద్ధరణ జరగడానికి తాకిడి జరిగిన దాదాపు 60 లక్షల సంవత్సరలు పట్టింది. [59]

కోలుకోవడం, విస్తరణ

K-Pg సామూహిక వినాశనం తర్వాత థెస్సిలోసారస్ - కళాకారుడి ఊహా చిత్రం. ఇది బొరియలు తవ్వుకుని తలదాచుకుని బయటపడింది. కానీ త్వరలోనే ఆకలితో అంతరించింది.

K-Pg విలుప్తి ఘటన భూమి పైన జీవ పరిణామంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆధిపత్య క్రెటేషియస్ సమూహాల నిర్మూలన వలన, ఇతర జీవులు వాటి స్థానాన్ని ఆక్రమించుకోవడానికి వీలు కలిగింది. దీని వలన పాలియోజీన్ కాలంలో చెప్పుకోదగిన స్థాయిలో జాతుల వైవిధ్యం ఏర్పడింది. [60] అత్యంత అద్భుతమైన ఉదాహరణ, డైనోసార్ల స్థానంలో వచ్చిన క్షీరదాలు. K-Pg విలుప్తి తర్వాత, డైనోసార్లు ఖాళీ చేసిన స్థానాలను పూరిస్తూ క్షీరదాలు వేగంగా అభివృద్ధి చెందాయి. మరొక ముఖ్యమైన అంశం, క్షీరద జాతులలో, K-Pg సరిహద్దు తర్వాత ఉద్భవించిన కొత్త జాతులు, పాతవాటి కంటే సుమారు 9.1% పెద్దవిగా ఉన్నాయి. [61]

ఇతర సమూహాలు కూడా గణనీయంగా వైవిధ్యభరితంగా విస్తరించాయి. మాలిక్యులర్ సీక్వెన్సింగ్, శిలాజ డేటింగ్ ఆధారంగా, అనేక రకాల పక్షులు (ముఖ్యంగా నియోవేస్ సమూహం) K-Pg సరిహద్దు తర్వాత విస్తరిస్తున్నట్లు కనిపించాయి. [62] [63] వాటి నుంచి శాకాహార గాస్టోర్నిస్, డ్రోమోర్నిథిడే, వేటాడే ఫోరుస్రాసిడే వంటి భారీ, ఎగరని రూపాలను కూడా ఉద్భవించాయి. క్రెటేషియస్ కాలం నాటి బల్లులు, పాములు అంతరించిపోవడంతో ఇగువానాలు, మానిటర్ బల్లులు, బోయాస్ వంటి ఆధునిక సమూహాల పరిణామానికి దారితీసి ఉండవచ్చు. [64] నేలపై, జెయింట్ బోయిడ్, అపారమైన మాడ్ట్సోయిడ్ పాములు కనిపించాయి. సముద్రాలలో, పెద్ద సముద్ర పాములు ఉద్భవించాయి. టెలియోస్ట్ చేపలు విస్ఫోటనం లాగా విస్తరించి విలుప్తిలో ఖాళీ అయిన స్థానాలను పూరించాయి. [65] పాలియోసీన్, ఈయోసిన్ ఇపోక్‌లలో కనిపించిన సమూహాలలో బిల్ ఫిష్, ట్యూనా, ఈల్, ఫ్లాట్ ఫిష్ ఉన్నాయి. పాలియోజీన్ కీటకాల సంఘాలలో కూడా ప్రధానమైన మార్పులు కనిపించాయి. క్రెటేషియస్‌లో అనేక చీమల సమూహాలు ఉండేవి గానీ, ఈయోసిన్‌లో చీమలు పెద్ద కాలనీలతో ఆధిపత్యం వహిస్తూ విస్తరించాయి. సీతాకోకచిలుకలు కూడా వైవిధ్యభరితంగా మారాయి. బహుశా అంతరించిపోవడం వల్ల తుడిచిపెట్టుకుపోయిన ఆకులు తినే కీటకాల స్థానాన్ని అవి ఆక్రమించి ఉండవచ్చు. మట్టిదిబ్బలను నిర్మించే అధునాతన చెదపురుగులు, టెర్మిటిడే కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. [66]

నోట్స్

మూలాలు