గూఢచర్యం

గూఢచర్యం (ఆంగ్లం: Espionage) అంటే ఏదైనా ఒక రహస్య సమాచారం కలిగిన వారి నుంచి వారికి తెలియకుండా దక్కించుకోవడం, లేదా బయలు పరచడం. ఈ పనిని చేసేవారిని గూఢచారులు, లేదా వేగులు అంటారు. వీళ్ళు రహస్య సమాచారాన్ని సేకరించి తమ సంస్థకు చేరవేస్తారు.[1] ఏ ఒక వ్యక్తి అయినా, లేదా బృందం అయినా ఒక ప్రభుత్వం తరఫున, లేదా ఒక సంస్థ తరఫున, లేదా స్వతంత్రంగా గూఢచర్యం చేయవచ్చు. గూఢచర్య కార్యక్రమాలు సాధారణంగా రహస్యంగా, ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి న్యాయ సమ్మతమైనవి, మరికొన్ని సందర్భాల్లో ఇవి చట్టవిరుద్ధమైనవి కూడా. బయటి ప్రపంచానికి తెలియని మూలాలను శోధించి సమాచారాన్ని వెలికితీయడం గూఢచర్యంలో భాగం.

గూఢచర్యం అనేది తరచుగా ప్రభుత్వం లేదా వాణిజ్య సంస్థల సంస్థాగత ప్రయత్నంలో భాగం. ఈ పదాన్ని ఎక్కువగా దేశాలు తమ అనుమానిత లేదా నిజమైన శత్రువుల మీద జరిపే నిఘా కార్యక్రమాలను ఉద్దేశించి వాడుతుంటారు. సంస్థలు నడిపే గూఢచర్యాన్ని పారిశ్రామిక గూఢచర్యం అంటారు.

ఏదైనా సంస్థ నుంచి రహస్యంగా సమాచారం సేకరించాలంటే అందులోకి చొచ్చుకుపోవడం మేలైన పద్ధతి. ఈ పని చేయడం గూఢచారి యొక్క ముఖ్య విధి. తర్వాత వీరు శత్రువుల సంఖ్య, వారి బలాబలాలు లాంటి సమాచారాన్ని సేకరించి పంపుతారు. అంతేకాకుండా సంస్థలో ఉన్న అసమ్మతి వాదుల్ని ఒప్పించి మరింత సమాచారాన్ని రాబడతారు.[2]

చరిత్ర

గూఢచర్యం చేయడం చాలా ప్రాచీనకాలం నుంచి జరుగుతోంది. ఆసియాలో సైనిక పద్ధతులకు ఆద్యుడు అనదగిన చైనా సైన్యాధ్యక్షుడు సన్ జూ రాసిన ది ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకం నేటికీ పాఠకులని ఆకర్షిస్తోంది. ఇందులో సన్ ఎవరైతే తన గురించి, తన శత్రువుల గురించి బాగా తెలుసుకుంటాడో వాడు ప్రమాదంలో పడడు అని చెబుతాడు.[3] ఆ పుస్తకంలో తన గురించి, తన శత్రువుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని చెబుతాడు. గూఢచారి అనేక బాధ్యతలు గుర్తించాడు.

చట్టాలు

దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా గూఢచర్యం చేయడం చాలా దేశాల్లో చట్టరీత్యా నేరం. అమెరికాలో 1917 గూఢచర్య చట్టం దీన్ని వివరిస్తుంది. గూఢచర్యానికి జైలుశిక్ష నుంచి మరణశిక్ష దాకా వివిధ రకాలైన శిక్షలు పడవచ్చు. గూఢచారులు తాము నివసించే దేశ చట్టాలను బట్టి బహిష్కరణకు గురి కావచ్చు, జైలు పాలవచ్చు, లేదా మరణశిక్షనూ ఎదుర్కోవచ్చు.

కాల్పనిక సాహిత్యం, సినిమాలు

గూఢచర్యం నవలా రచయితలకు, సినీనిర్మాతలకు చాలాకాలం నుంచి ఇష్టమైన అంశం.[4] ఆంగ్ల రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన కిమ్ అనే నవల గూఢచర్యం నేపథ్యంలో వచ్చిన తొలితరం రచనల్లో ఒకటిగా పేర్కొనవచ్చు. ఇందులో 19వ శతాబ్దపు మధ్య ఆసియాలో యూకే, రష్యా మధ్య జరిగిన పోరాటాల్లో గూఢచారులకు రహస్య సమాచారం సేకరించేందుకు ఇచ్చే శిక్షణ గురించి రాశాడు.

కోల్డ్ వార్ సమయంలో సృష్టించిన కాల్పనిక జేమ్స్ బాండ్ పాత్ర వ్యాపారాత్మకంగా విజయం సాధించింది. ఈ పాత్ర ప్రధానంగా ఇయాన్ ఫ్లెమింగ్ పలు నవలలు రాయగా వాటిలో చాలా వరకు సినిమాలుగా వచ్చాయి.

మూలాలు