ప్యాపువా న్యూ గినీ

ప్యాపువా న్యూ గినీ ఓషియానియా భూభాగానికి చెందిన ఒక దేశం. ఇది న్యూ గినీ ద్వీపంలో తూర్పు అర్ధ భాగంలో, ఆస్ట్రేలియాకు ఉత్తరంగా పసిఫిక్ మహాసముద్రానికి నైరుతి దిక్కున ఉన్న మెలనేషియా అనే ప్రాంతంలో కొన్ని దీవుల్లో విస్తరించి ఉంది. దీని రాజధాని ఆగ్నేయ తీరాన విస్తరించి ఉన్న పోర్ట్ మోర్స్‌బై. ఇది 4,62,840 చ.కి.మీ విస్తీర్ణంతో ప్రపంచంలో మూడో అతి పెద్ద ద్వీప దేశం.[1]

పాపువా న్యూ గినీ జెండా

జాతీయ స్థాయిలో ఈ దేశం 1884 నుంచి మూడు వలస రాజ్యాలచేత పరిపాలించబడింది. 1975 నుంచి ఈదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దీనికి మునుపు మొదటి ప్రపంచ యుద్ధ సమయం నుంచి సుమారు అరవై ఏళ్ళ పాటు ఆస్ట్రేలియా పరిపాలనలో ఉంది. అదే సంవత్సరంలో కామన్ వెల్త్ కూటమిలో భాగమైంది. ప్యాపువా న్యూ గినీ ప్రపంచంలోనే అత్యంత భిన్న సంస్కృతులు గల దేశాల్లో ఒకటి. ఇది ప్రధానంగా గ్రామీణ జనాభా కలిగిన దేశం. 2019 నాటికి ఈ దేశ జనాభాలో కేవలం 13.25% మాత్రమే పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారు.[2] ఈ దేశంలో 851 భాషలు ఉనికిలో ఉన్నాయి. ఇందులో 11 భాషలు మాట్లాడేవారు కనుమరుగైపోయారు.[3]

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించింది. ఇక్కడ సుమారు 40 శాతం జనాభా బయటివారి ఆర్థిక సహాయం లేకుండానే స్వయం సమృద్ధి విధానాలతో జీవనం సాగిస్తున్నారు.[4]

మూలాలు