సింధూ నది

ఆసియాకు చెందిన నది

సింధూ నది (సంస్కృతం: सिन्धु ; ఆంగ్లం: Indus River) భారత ఉపఖండంలో ప్రసిద్దమయిన హిమ నది. ఇది హిమాలయాలలోని టిబెట్దేశంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది.[1][2] పాకిస్థాన్లోని అతిపెద్ద, జాతీయ నది సింధు.[3]సింధు నదికి జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ఉపనదులుగా ఉన్నాయి. ప్రవహించే ప్రాంతం అంతా భూమిని అత్యంత సారవంతంగా మారింది. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా ఆనకట్ట, సుక్కూలారు వంతెన, భారతదేశంలోని పంజాబులో సట్లెజు నది మీద భాక్రానంగల్ ఆనకట్ట వంటి భారీ ఆనకట్టలు కట్టి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించడమేకాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. సింధు నది పొడవు 2880 కి.మీ. సింధునది ప్రవాహిత ప్రాంతంలో హరప్పా, మొహంజోదారో నాగరికత వర్ధిల్లింది. సింధు నదీ లోయలో సుమారు 5,000 సంవత్సరాల ఉజ్జ్వలమైన సింధు నాగరికత వెలసి వర్థిల్లింది.

సింధు నది ప్రాంతం.

సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లడాఖు మీదుగా- గిల్గిట్‌ఉ, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారతులోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది.[4] భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.

సింధూ నది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! పాకిస్తాన్లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు. ఈ ఆనకట్టలలో తర్బేల ఆనకట్ట ఒకటి.

శబ్ద ఉత్పత్తి, పేర్లు

ప్రాచీన కాలంలో భారతదేశ ప్రజలు ఈ నదిని సింధు నదిగా వ్యవహరించారు. సింధు అనేది సంస్కృత పదం. సింధు అంటే అతిపెద్ద జల ప్రవాహం, సముద్రం అని అర్ధాలు ఉన్నాయి.[5] సింధ్ ప్రాంతపు భాష, చరిత్ర, సాహిత్య తదితర విషయాలపై పరిశోధన చేస్తున్న ప్రముఖ సింధాలజిస్ట్ అస్కో పర్పోలా ప్రకారం 850-600 బిసి కాలంలో ప్రోటో ఇరానియన్ భాషీయులు "స"ను "హ"గా మార్చి సింధ్ ను హిందుగా వ్యవహరించారు.[6] ఇరాన్ నుంచీ, ఈ పేరు గ్రీకుకు ఇండొస్ గా చేరగా, ప్రాచీన రోమన్లు దానిని ఇండస్ గా వ్యవహరించారు. ఈ నదికి పర్షియన్ భాషలో డర్యా అని పేరు ఉంది.[7] దానికి కూడా అతిపెద్ద జలప్రవాహం లేదా సముద్రం అనే అర్ధమే వస్తుంది.

అయితే కొందరు భాషావేత్తలు మాత్రం సింధు/హిందుకు జలప్రవాహం అని అర్ధం కాదని, సరిహద్దు లేదా ఒడ్డు అని అర్ధం చెబుతారు. సింధు నది ఇరాన్ ప్రజలకూ, ఇండో-ఆర్యన్ ప్రజలకూ మధ్య సరిహద్దుగా నిలిస్తోంది కాబట్టీ ఆ పేరుకు ఆ అర్ధాన్ని అన్వయించడం కూడా జరుగుతుందని వారి అభిప్రాయం.[8][9][10]

సింధు నదిని అస్సిరియన్ భాషలో సింద అని, పర్షియన్ లో అబ్-ఎ-సింద్, పష్టున్ లో అబసింద్, అరబ్ లో ఆల్-సింద్, చైనీస్ లో సింటో, జావనీస్ లో సంత్రి అని పిలుస్తారు.

ఇండస్, ఇండియా

ఇండస్ అనే పేరు గ్రీక్, లాటిన్ నుంచి వచ్చింది. ఇండస్ నది ఉన్న దేశం అని ఈ పదానికి అర్ధం. పాకిస్థాన్లోని సింధ్ ప్రావింసు పేరు కూడా ఈ నది పేరుమీదుగా వచ్చిందే.[11]

మెగస్తనీసు రచించిన ఇండికా పుస్తకం పేరు కూడా ఈ నదికి గ్రీక్ లోని ఇండస్ పేరే. అలెగ్జాండర్ ఈ నదిని దాటి భారతదేశంలోకి వచ్చిన విధానాన్ని అతని సైనికాధికారి నీర్చసు కూడా ఇండికా పేరుతో ఓ పుస్తకం రాశాడు. ప్రాచీన గ్రీకులు భారతీయులను, పాకిస్థానీయులను కలిపి ఇండోయి అని పిలిచేవారు. ఇండోయి అనే పదానికి అచ్చంగా ఇండస్ నదికి చెందిన ప్రజలు అని అర్ధం.[12]

ఋగ్వేదంలో సింధు నది ప్రస్తావన

ఋగ్వేదం చాలా పౌరాణిక నదుల గురించి ప్రస్తావించింది. అందులో సింధు నది ఒకటి. అందులో ప్రస్తావించిన ఆ నదే ప్రస్తుతపు ఈ సింధు నది అని నమ్మకం. ఋగ్వేదంలో సింధూ నది ప్రస్తావన దాదాపు 176సార్లు వచ్చింది. బహువచనంలో 95సార్లు సాధారణ అర్ధాలలో ఉపయోగింపబడింది. ఋగ్వేదంలో తరువాతి శ్లోకాల్లో అచ్చంగా నది పేరునే ఎన్నోసార్లు వాడారు. నదిస్తుతి సూక్తంలో కూడా సింధు నదిని పేర్కొనబడింది. ఋగ్వేద శ్లోకాల్లో సహజంగా అన్ని నదులనూ స్త్రీ రూపాలుగా వర్ణిస్తే, ఒక్క సింధు నదిని మాత్రం పురుష రూపంగా వర్ణించబడి ఉంది. ఋగ్వేదం ప్రకారం సింధు నది అంటే యోధుడు, ప్రపంచంలోని అన్ని నదుల కంటే గొప్పది అని అర్ధం.

వివరణ

Babur crossing the Indus River.

సింధు నది పాకిస్థాను ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నీటి వనరులను అందిస్తుంది - ముఖ్యంగా దేశంలోని వ్యవసాయ ఉత్పత్తిలో ఎక్కువ భాగం అందిస్తున్న పంజాబు ప్రావిన్సు బ్రెడు బాస్కెటు (ఆహార పాత్ర)గా భావించబడుతుంది. పంజాబు అనే పదానికి "ఐదు నదుల భూమి"(జీలం, చెనాబు, రవి, బియాసు, సట్లెజు) అని అర్ధం. ఇవన్నీ చివరకు సింధులో సంగమిస్తున్నాయి. సింధు అనేక భారీ పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది. అలాగే పాకిస్తాను ప్రజలకు త్రాగునీటిని ప్రధాన సరఫరాను అందిస్తుంది.

సింధు ప్రధాన మూలం టిబెటులో ఉంది; ఈ నది సెంగ్గే జాంగ్బో, గారు త్సాంగ్పో నదుల సంగమం వద్ద ప్రారంభమవుతుంది. ఇవి నాంగ్లాంగు కాంగ్రీ, గ్యాంగ్డైజు షాను (గ్యాంగు రిన్పోచే, కైలాస పర్వతం) పర్వత శ్రేణులలో ప్రహహించింది. తరువాత సింధు వాయువ్య దిశలో లడఖు, భారతదేశం, బాల్టిస్తాను మీదుగా ప్రవహిస్తూ కరాకోరం శ్రేణికి దక్షిణంగా గిల్గిట్లోకి ప్రవహిస్తుంది. షియోకు, షిగరు, గిల్గిటు నదులు హిమనదీయ జలాలను ప్రధాన నదిలోకి తీసుకువెళతాయి. ఇది క్రమంగా దక్షిణానికి వంగి పాకిస్తానులోని కాలాబాగు వద్ద ఉన్న పంజాబు మైదానంలో దిగువకు ప్రవహిస్తుంది. సింధు నంగా పర్బాటు పర్వతచరియల దగ్గర 4,500–5,200 మీటర్లు (15,000–17,000 అడుగులు) లోతులో ఉన్న అతిపెద్ద గోర్జెసును దాటుతుంది. ఇది హజారా మీదుగా వేగంగా ప్రవహిస్తుంది. టార్బెలా రిజర్వాయరు వద్ద దీనికి ఆనకట్ట ఉంటుంది. అటాకు సమీపంలో అటాకు నది సంగమిస్తుంది. తరువాత సముద్రంలో సంగమించే మార్గంలో పంజాబు వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందిస్తూ ప్రవహిస్తుంది.[13] సింధు మైదానాలలో నదీ ప్రవాహం నెమ్మదిగా, అత్యంత అల్లికగా మారుతుంది. తరువాత మిథనుకోటలోని పంజనాడు చేరుకుంటుంది. ఈ సంగమం దాటిన తరువాత నదికి సత్నాడు నది (సాట్ = "ఏడు", నాడే = "నది") అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈ నదిలో కాబూలు నది, సింధు నది, ఐదు పంజాబు నదుల జలాలు సంగమిస్తాయి. తరువాత ఈ నది జంషోరో మీదుగా వెళుతుంది. ఇది పాకిస్తాన్లోని సింధు ప్రావిన్సులోని తట్టాకు దక్షిణాన ఉన్న పెద్ద డెల్టాలో ముగుస్తుంది.

ప్రపంచంలో రాక్షస అలలతో ప్రవహించే కొన్ని నదులలో సింధు ఒకటి. సింధు వ్యవస్థ ఎక్కువగా హిమాలయాలు, కరాకోరం, టిబెటు, హిందూ కుషు శ్రేణులు, భారతదేశంలోని జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్, పాకిస్తాన్లోని గిల్గిటు-బాల్టిస్తాను ప్రాంతాల మంచు, హిమానీనదాల ద్వారా పోషించబడుతుంది. నది ప్రవాహం ఋతువుల ఆధారంగా నిర్ణయించబడుతుంది - శీతాకాలంలో ఇది బాగా తగ్గిపోతుంది. వర్షాకాలంలో దాని ఒడ్డున జూలై నుండి సెప్టెంబరు వరకు వరదలు వస్తాయి. చరిత్రపూర్వ కాలం నుండి నది మార్గంలో స్థిరమైన మార్పులు జరిగినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి - ఇది 1816 భూకంపం తరువాత రాన్ ఆఫ్ కచ్ ప్రక్కనే ఉన్న బన్నీ గడ్డి భూముల్లోకి ప్రవహించకుండా ప్రవాహదిశను పశ్చిమ దిశగా మార్చుకుంటుంది.[14][15] ప్రస్తుతం సింధు నీరు వరద నదీతీరాలను అధిగమిచి ప్రవహించే సమయంలో రాన్ ఆఫ్ కచ్‌లోకి ప్రవహిస్తుంది.[16]

నది మూలం సెంగే ఖబాబు ("లయన్సు మౌతు"), నిత్య వసంతంగా ఉండే ఇది పవిత్రమైన కైలాషు పర్వతానికి సమీపంలో ఉంది. ఇది టిబెటు కార్టెన్లకంటే దిగువప్రాంతంగా గుర్తించబడింది. సమీపంలో అనేక ఇతర ఉపనదులు ఉన్నాయి. ఇవి సెంగే ఖబాబు కంటే ఎత్తైన ప్రాంతం నుండి ప్రవహిస్తాయి. కానీ సెంగే ఖబాబు మాదిరిగా కాకుండా అన్నీ మంచుకరగడం కారణంగా లభించే నీటి ఆధారంత్ఫ్ ప్రవహిస్తూ ఉంటాయి. లడఖులోని సింధులోకి సంగమిస్తున్న జాన్స్కరు నది, ఆ సమయానికి ముందు సింధు కంటే ఎక్కువ నీటిని కలిగి ఉంటుంది.[17]

చరిత్ర

క్రీ.పూ.3000 నాటి సింధునాగరికత విస్తరించిన ప్రాంతం

ఋగ్వేదం అనేక నదులను వివరిస్తుంది. వీటిలో "సింధు" అనే పేరు ఉంది. ఋగ్వేద "సింధు" ప్రస్తుత సింధునది అని భావిస్తారు. ఇది దాని వచనంలో 176 సార్లు, శ్లోకాలలో 94 సార్లు ధృవీకరించబడింది. చాలా తరచుగా "నది" సాధారణ అర్థంలో ఉపయోగించబడుతుంది. ఋగ్వేదంలో, ముఖ్యంగా తరువాతి శ్లోకాలలో, సింధు నదిని సూచించడానికి ఈ పదానికి అర్ధం ఇరుకైనది, ఉదా. నాడిస్తుతి సూక్తా శ్లోకంలో పేర్కొన్న నదులలో సింధునది ప్రస్తావన ఉంది. ఋగ్వేద శ్లోకాలు బ్రహ్మాపుత్ర మినహా అందులో పేర్కొన్న అన్ని నదులకు స్త్రీ లింగాన్ని వర్తిస్తాయి.

సింధు లోయ నాగరికత ప్రధాన నగరాలలో హరప్ప, మొహెంజో-దారో (క్రీ.పూ 3300 నాటివి) నాగరికతకు చెందిన ప్రాచీన ప్రపంచంలోని అతిపెద్ద మానవ నివాసాలను సూచిస్తాయి. సింధు లోయ నాగరికత ఈశాన్య ఆఫ్ఘనిస్తాను మీదుగా పాకిస్తాను, వాయువ్య భారతదేశం వరకు విస్తరించింది, [18] జీలం నదికి తూర్పు నుండి ఎగువ సట్లెజులోని రోపరుకు చేరుకుంది. తరువాత ఇది పాకిస్తాను, ఇరాను సరిహద్దులోని సుట్కాగను ద్వారం నుండి ఆధునిక గుజరాతు, కచి తీరప్రాంతాలకు విస్తరించింది. ఉత్తర ఆఫ్ఘనిస్తానులోని షార్తుఘై వద్ద అము దర్యా సింధుప్రాంతం ఉంది. హిందను నది వద్ద సింధుప్రాంతం అలంగిర్పూరు ఢిల్లీ నుండి 28 కిమీ (17 మైళ్ళు) దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుత సింధునాగరికతకు చెందిన 1,052 కంటే అధికమైన నగరాలు, స్థావరాలు కనుగొనబడ్డాయి. ఇవి ప్రధానంగా ఘగ్గరు-హక్రా నది, దాని ఉపనదుల సమీపంలో కనుగొనబడ్డాయి. ఈ స్థావరాలకు హరప్పా, మొహెంజో-దారో ప్రధాన పట్టణ కేంద్రాలుగా ఉన్నాయి. అలాగే లోథలు, ధోలావిరా, గణేరివాలా, రాఖీగారి ప్రాంతాలు ఉన్నాయి. సింధు దాని ఉపనదులలో తెలిసిన 800 కంటే ఎక్కువ సింధు లోయ ప్రదేశాలలో 90–96 మాత్రమే కనుగొనబడ్డాయి.[ఆధారం చూపాలి] హరప్పను కాలంలో సింధు ఉపనది అయిన సట్లెజు, ఘగ్గరు-హక్రా నదిలో సంగమిస్తుంది. వీటిలో సింధు వెంట హరప్పను ప్రాంతాలు అధికంగా ఉన్నాయి.

మొహెంజో-దారో, హరప్ప వదిలివేయబడిన తరువాత క్రీ.పూ 1700 నుండి క్రీ.పూ 600 వరకు గాంధారలో ప్రారంభ ఇండో-ఆర్యన్ల గాంధార సమాధి సంస్కృతి స్థావరాలు వృద్ధి చెందాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

హిందూ అనే పదం సింధు నది నుండి వచ్చింది. అందుకే దీనిని ఒకప్పుడు హిందూదేశం అని పిలువబడింది. పురాతన కాలంలో "భారతదేశం" మొదట సింధు తూర్పు ఒడ్డున ఉన్న ప్రాంతాలను సూచించింది. కాని క్రీస్తుపూర్వం 300 నాటికి హెరోడోటసు, మెగాస్టీనెసు వంటి గ్రీకు రచయితలు ఈ పదాన్ని మొత్తం ఉపఖండానికి ప్రతిపాదించారు.[19][20]

సింధు దిగువ మైదానం ఇరానియను పీఠభూమి, భారత ఉపఖండం మధ్య సహజ సరిహద్దును ఏర్పరుస్తుంది; ఈ ప్రాంతం పాకిస్తాను ప్రావింసులోని బలూచిస్తాను, ఖైబరు పఖ్తునుఖ్వా, పంజాబు, సింధు, ఆఫ్ఘనిస్తాను, భారతదేశంలోని అన్ని ప్రాంతాలను తనలో విలీనం చేసుకుంది. అలెగ్జాండరు ఆక్రమణ సైన్యాలు సింధునదిని దాటాయి. కాని ఆయన మాసిడోనియన్లతో పశ్చిమ ఒడ్డును జయించి-హెలెనికు సామ్రాజ్యంలో చేర్చిన తరువాత, అలెగ్జాండరు ఆసియా పోరాటాన్ని ముగించి, వెనుకకు మరిలే ప్రయత్నంలో నది దక్షిణ దిశలో ప్రయాణించారు. తరువాత పర్షియా సామ్రాజ్యం, దాని తరువాత కుషాను సామ్రాజ్యం సింధు మైదానాలలో ఆధిపత్యం వహించాయి. అనేక శతాబ్దాలుగా ముస్లిం సైన్యాలు ముహమ్మదు బిను ఖాసిం, ఘజ్ని మహమూదు, మొహమ్మదు ఘోరి, టామెర్లేను ఈ నదివెంట పయనించారు. బాబరు సింధునదిని దాటి పంజాబు లోపలి ప్రాంతాల మీద దాడి చేసి దక్షిణ, తూర్పు ప్రాంతాలలో పోరాటాలు సాగించారు.

మూలాలు

వెలుపలి లంకెలు